బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గ్రహీత శీతల్ దేవి: పుట్టుకతోనే రెండు చేతులు లేవు, కానీ బాణం పట్టిందంటే గురి పతకం మీదనే...

శీతల్ దేవి

ఫొటో సోర్స్, Abhilasha Chaudhary

    • రచయిత, ఆయుష్ మజుందార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆర్చర్ శీతల్ దేవి విల్లు తీసుకొని 50 మీటర్ల దూరంలోని లక్ష్యంపైకి బాణాన్ని గురిపెట్టి వదిలారు. ట్రైనింగ్ అకాడమీలో ప్రాక్టీస్ గేమ్‌లో శీతల్‌తో పోటీ పడుతున్న ఆమె ప్రత్యర్థి కూడా అలాగే గురిపెట్టారు.

కానీ, ఇద్దరికీ తేడా ఏమిటంటే.. శీతల్ చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్నారు.

ఆమె తన కుడి కాలుతో విల్లును పైకెత్తి, కుడి భుజాన్ని ఉపయోగించి తీగను వెనక్కి లాగి, దవడ బలాన్ని ఉపయోగించి బాణాన్ని వదులుతున్నారు.

జమ్ముకు చెందిన శీతల్, ఫోకోమెలియా అనే అరుదైన రుగ్మతతో జన్మించారు.

“నేను గెలిచిన పతకాలను చూసినప్పుడల్లా మరిన్ని గెలవాలనే స్ఫూర్తి కలుగుతుంది. నేను ఇప్పుడే మొదలుపెట్టాను" అని ఆమె అన్నారు.

మూడేళ్ల కాలంలో ఆమె సాధించిన విజయాలు చూస్తే... 2024 పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం, 2022 ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణ పతకాలు, ఒక రజతం, వరల్డ్ పారా ఆర్చరీ చాంపియన్ షిప్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు.

శీతల్ దేవీ
ఫొటో క్యాప్షన్, బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకుంటున్న శీతల్ దేవి

భారత్ తరఫున పారాలింపిక్స్‌లో మెడల్ సాధించిన అతిపిన్న వయస్కురాలిగా నిలిచిన 18 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవీ 'బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు'ను గెలుచుకున్నారు.

వాట్సాప్
శీతల్ దేవి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శీతల్ 2023లో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచారు

శీతల్‌కు ఆర్చరీ ఎలా పరిచయమైంది?

శీతల్ గురించి తెలిసిన వారు ఆమె బాగా ఆడాలని, గెలవాలని కోరుకుంటున్నారు.

"శీతల్ విలువిద్యను ఎంచుకోలేదు, విలువిద్యే ఆమెను ఎంచుకుంది" అని శీతల్ ఇద్దరు జాతీయ కోచ్‌లలో ఒకరైన అభిలాష చౌదరి చెప్పారు.

ఒక చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శీతల్, 15 ఏళ్ల వయసు వరకు విల్లు, బాణం పట్టలేదు.

తెలిసిన వ్యక్తి సూచన మేరకు 2022లో ఆమె ఇంటికి దాదాపు 200 కి.మీ. దూరంలో ఉన్న కత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయం నిర్వహించే బోర్డ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ని సందర్శించారు. ఆ తర్వాత శీతల్ జీవితం మారిపోయింది.

ఆమె అక్కడ అభిలాష చౌదరి, మరో కోచ్ కుల్దీప్ వెద్వాన్‌లను కలుసుకున్నారు. శీతల్‌కు విలువిద్యను వెద్వాన్‌ పరిచయం చేశారు.

శీతల్ వెంటనే కత్రా నగరంలోని శిక్షణ శిబిరానికి మారారు. ఆమె సంకల్పానికి కోచ్‌లు ముగ్ధులయ్యారు.

శీతల్ కాళ్లు, శరీరం పైభాగంలోని బలాన్ని ఉపయోగించి బాణం సంధించడంపై కోచ్‌లు దృష్టి పెట్టారు. చివరికి విజయం సాధించారు.

శీతల్ దేవి, కోచ్ కుల్దీప్ వెద్వాన్

ఫొటో సోర్స్, Abhilasha Chaudhary

ఫొటో క్యాప్షన్, శీతల్ కోసం విల్లు తయారుచేసే బాధ్యత కోచ్ వెద్వాన్ తీసుకున్నారు.

ఆర్చరీ ప్రయాణం ఎలా సాగింది?

స్నేహితులతో కలిసి రాయడం, చెట్లను ఎక్కడం వంటి పనులకు పాదాలను ఉపయోగించడం వల్ల అంత శక్తి వచ్చిందని శీతల్ చెప్పారు.

అయినా, విలువిద్యలో కెరీర్ ప్రయత్నించాలనే నిర్ణయంపై ఆమెకు సందేహాలు ఉండేవి. "ఇది అసాధ్యం అనుకున్నా. నా కాళ్లలో నొప్పిగా ఉండేది, అయినా చేసేశాను" అని శీతల్ అన్నారు.

అమెరికన్ ఆర్చర్ ‘మాట్ స్టట్జ్‌మాన్’ నుంచి శీతల్ ప్రేరణ పొందారు. ఆయన కస్టమైజ్ పరికరాన్ని ఉపయోగించి పాదాలతోనే గురిపెడతారు.

శీతల్ కుటుంబం ఇలాంటి మెషీన్ కొనలేకపోయింది, దీంతో శీతల్ కోసం విల్లు తయారుచేసే బాధ్యత కోచ్ వెద్వాన్ తీసుకున్నారు. స్థానికంగా లభించే మెటీరియల్‌తో అక్కడి దుకాణంలో శీతల్ శరీరానికి అనుగుణంగా దానిని తయారు చేయించారు.

ఇందులో శరీరం పైభాగాన బిగించడానికి ఒక పట్టీ, బాణాన్ని వదలడంలో సాయపడేలా శీతల్ నోటితో పట్టుకోవడానికి ఒక చిన్న పరికరం ఉన్నాయి.

స్థిరమైన విలువిద్య టెక్నిక్ కోసం శీతల్ తన కాళ్లను మాత్రమే ఉపయోగించకుండా ఒక మార్గాన్ని కనుగొనడం కోచ్‌లకు ప్రధాన సవాలు.

"శీతల్‌కు బలమైన కాళ్లు ఉన్నాయి, కానీ షూట్ చేయడానికి ఆమె తన వీపును ఎలా ఉపయోగించవచ్చో మేం కనిపెట్టాలి" అని అన్నారు.

ఆమె కాళ్లలో బలాన్ని బ్యాలెన్స్ చేసి, దానిని టెక్నికల్‌గా ఉపయోగించడానికి ప్లాన్ చేసినట్లు అభిలాష వివరించారు.

ఇద్దరు కోచ్‌లతో కలిసి శీతల్ రోజువారి శిక్షణ మొదలుపెట్టారు. శీతల్ విల్లుకు బదులుగా రబ్బరు బ్యాండ్ ఉపయోగించి కేవలం 5 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గురిపెట్టడంతో శిక్షణ ప్రారంభించారు. నాలుగు నెలల్లోనే శీతల్ నిజమైన విల్లును ఉపయోగించడం ప్రారంభించారు. 50 మీటర్ల దూరం (కాంపౌండ్ ఓపెన్ కేటగిరీ పోటీ ప్రమాణం)లో లక్ష్యాలపై బాణం ఎక్కుపెట్టారు.

శీతల్ 2023లో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచారు. ఆమె ఫైనల్‌లో ఆరుసార్లు 10 చొప్పున పాయింట్లు సాధించారు. ఆ పోటీలలో ఒక్క షాట్‌లో ఆర్చర్ సాధించే గరిష్ట పాయింట్ల సంఖ్య 10.

‘రెండేళ్లు ఇంటికెళ్లలేదు’

"నేను తొమ్మిదికి షూట్ చేస్తే, తదుపరి షాట్‌లో దానిని పదికి ఎలా మార్చగలనని ఆలోచిస్తుంటాను" అని శీతల్ చెప్పారు. ఆమె కష్టపడి ఇంత దూరం రావడమే కాదు. ఈ దారిలో శీతల్ చాలా త్యాగాలు చేశారు.

శిక్షణ కోసం రెండేళ్లు ఇంటికి కూడా వెళ్లకుండా కత్రాలోనే ఉన్నానని శీతల్ గతంలో బీబీసీతో చెప్పారు.

"నేను ఎవరికీ పరిమితులు ఉండవనుకుంటా, నీకు కావాల్సింది కోరుకోవడం దాని కోసం కష్టపడటమే మనం చేయాల్సింది" అని ఆమె బీబీసీతో అన్నారు.

"నేను చేయగలిగితే, ఎవరైనా చేయగలరు" అని శీతల్ అన్నారు.

వీడియో క్యాప్షన్, అర్చర్ శీతల్ దేవి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)