జీవంజి దీప్తి: పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలుగమ్మాయి - ఇంటలెక్చువల్లీ ఇంపెయిర్డ్ కేటగిరీలో మెడల్ గెలిచిన తొలి భారతీయ అథ్లెట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణకు చెందిన 20 ఏళ్ల దీప్తి జీవంజి, పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించారు.
400 మీటర్ల టీ20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో రేసును ముగించి, మూడో స్థానంలో నిలిచారు.
దీంతో ఇంటలెక్చువల్ ఇంపెయిర్‌మెంట్ విభాగంలో భారత్ నుంచి పతకం గెలిచిన తొలి అమ్మాయిగా దీప్తి నిలిచారు. పారాలింపిక్స్‌లో టీ20 విభాగంలో ‘ఇంటలెక్చువల్లీ ఇంపెయిర్డ్’ అథ్లెట్లే పోటీ పడతారు.
‘‘పారాలింపిక్స్‌లో తొలి పతకం సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను, నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నారు” అని దీప్తి అన్నారు.
రేసు సమయంలో చాలా అలసిపోయినట్లు అనిపించిందని, టైం జోన్‌కు శరీరం అలవాటు పడలేదని ఆమె చెప్పారు.
ఈ రేసులో యుక్రెయిన్‌కు చెందిన యులియా షులియార్ (55.16 సెకన్లు) బంగారు, తుర్కియేకు చెందిన ఐసర్ ఒండర్ (55.23 సెకన్లు) రజత పతకాలను సాధించారు.
2024 మే నెలలో జపాన్‌లోని కోబేలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల టీ-20 విభాగంలో దీప్తి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. ఈ రేస్‌ను ఆమె 55.07 సెకన్లలో పూర్తి చేశారు. దీంతో పారిస్ పారాలింపిక్స్ పోటీలకు ఆమె నేరుగా క్వాలిఫై అయ్యారు.


ఫొటో సోర్స్, deepthijeevanji Instagram
ఎవరీ జీవంజి దీప్తి?
వరంగల్ జిల్లా కల్లెడకు చెందిన జీవంజి దీప్తి భారత మహిళా పారా అథ్లెట్.
2024 మేలో జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో 400 మీటర్ల పరుగుపందెంలో వరల్డ్ రికార్డు నెలకొల్పి బంగారు పతకం సాధించారు.
దీప్తి గ్రహణం మొర్రితో పుట్టారు. ఆపరేషన్ తర్వాత కూడా ఆమె ముఖంపై ఆ ఛాయలు కనిపించేవి. సాధారణ ఆడపిల్లలతో పోలిస్తే ఆమె తల కొంచెం చిన్నగా ఉంటుంది. దీంతో ఆమెను తోటివారు, గ్రామస్తులు ఆటపట్టించేవారు.
‘‘మాది మేనరిక వివాహం. దీప్తి గ్రహణం మొర్రితో పుట్టింది. అందరూ కోతిపిల్లా, కోతిపిల్లా అని గేలి చేస్తుంటే పాప ఏడ్చేది.. అదిచూసి మాకు ఎంతో బాధ కలిగేది’’ అని ధనలక్ష్మి చెప్పారు.
దీప్తి చిన్నప్పటి నుంచి మానసిక ఎదుగుదల సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలూ ఎదుర్కొంటున్నారు.
‘’చిన్ననాటి నుంచే దీప్తి చురుకైన పిల్ల. అయితే, ఏదైనా విషయం వివరించి చెప్పలేదు. క్లుప్తంగా ఒకటి రెండు మాటలే మాట్లాడుతుంది. ఆ తర్వాత మూర్ఛ వ్యాధి వచ్చింది. ఇప్పటికీ ఫిట్స్ వస్తాయి. రెండుమూడు రోజులు కోలుకోలేదు’’ అన్నారు ధనలక్ష్మి.

అథ్లెటిక్స్ వైపు ఎలా వచ్చారు?
“అమ్మా! నన్ను కోతి పిల్ల, కోతి ముఖం అని గేలి చేస్తున్నారు అని బాగా ఏడ్చేది. వారికీ అలాగే అవుతుందిలే అని సర్దిచెప్పేదాన్ని. తనను ఏడిపించిన పిల్లల దగ్గరకు వాళ్ళ నాన్నను తీసుకుపోయి పంచాయితీ పెట్టేది. అమ్మాయి చూస్తే ఇలా ఉంది, అక్కడికి (పోటీలకు) పోయి గెలుస్తుందా? అని ఎగతాళి చేసేవారు. ఆ తర్వాత పరుగుపందాలలో బంగారు పతకాలు తెచ్చే సరికి ఉళ్ళో వారికి దీప్తి అంటే ఏమిటో, ఆమె సామర్థ్యం ఏమిటో అర్థమైంది’’ అని తమ కూతురు దీప్తి ఎదుర్కొన్న పరిస్థితులను బీబీసీకి వివరించారు ఆమె తల్లిదండ్రులు ధనలక్ష్మి, యాదగిరి.
పాఠశాలలో దీప్తి చదువులో కన్నా ఆటల్లో రాణించేవారు. ఆమె ప్రతిభను గుర్తించిన కల్లెడలోని రూరల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (ఆర్డీఎఫ్) స్కూల్ యాజమాన్యం దీప్తిని ప్రోత్సహించింది.
‘స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలనాడు జరిగే పరుగు పందెంలో దీప్తి ప్రతిభను మా వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు గుర్తించారు. ఆ తర్వాత ఆమెను ప్రోత్సహించాం’’ అన్నారు స్కూల్ కరస్పాండెంట్ అశోకాచారి.
‘ఇక్కడ చదువులతో పాటు ఆటలకూ సమ ప్రాధాన్యం ఉంటుంది. గతంలో 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మా స్కూల్ అమ్మాయి వర్దినేని ప్రణీత ఆర్చరీ పోటీల్లో పాల్గొన్నారు’’ అని తెలిపారు అశోకాచారి.
అథ్లెటిక్స్ ఈవెంట్‌లలో పాల్గొనేందుకు తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తమ కూతురు ఆరోగ్య పరిస్థితుల రీత్యా దీప్తి తల్లిదండ్రులు బెంగ పెట్టుకునేవారు.
ఈ కారణాలతోనే దీప్తికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) లో శిక్షణకు అవకాశం వచ్చినా మొదట్లో తిరస్కరించారు. దీని వెనుక ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయని దీప్తి తండ్రి యాదగిరి చెప్పారు.

ఫొటో సోర్స్, deepthijeevanji Instagram
ఉత్త కాళ్లతో పరిగెత్తి, పతకం సాధించి..
తెలంగాణలోని ఖమ్మంలో పాఠశాల స్థాయి పోటీల్లో పాల్గొన్న దీప్తి.. ట్రాక్‌పై షూ లేకుండానే పరిగెత్తి బంగారు పతకం సాధించారు. ఈ ఘటన ‘సాయ్’ కోచ్ నాగపురి రమేష్‌ను ఆకర్షించింది.
దీప్తిని ‘సాయ్’ లో చేర్చాలని పీఈటీ వెంకటేశ్వర్లుకు కోచ్ రమేష్ సూచించారు. కానీ, దీప్తి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.
‘‘ఆడపిల్ల. చన్నీటి స్నానం పడదు. మూర్ఛ వ్యాధి ఉంది. కోచింగ్‌కు పంపలేమని చెప్పాం. పరుగుపందెం అంటే ఇంత పెద్ద స్థాయిలో ఉంటుందని తెలియదు. చిన్నపిల్ల కదా అనుకున్నాం. అందుకే మేం షూ కూడా కొనివ్వలేదు. నిజానికి వేలు ఖర్చుచేసి షూ కొనే స్థోమత కూడా మాకు లేదు’’ అన్నారు దీప్తి తల్లి ధనలక్ష్మి.
‘’నేను సిమెంట్ పైపుల తయారీ ఫ్యాక్టరీలో హెల్పర్‌గా పనిచేస్తాను. టోర్నమెంట్ ఖర్చులకు డబ్బు సర్దుబాటు అయ్యేది కాదు. ఆ సమయంలో ఆర్డీఎఫ్ సంస్థ సహాయం చేసింది. అందరూ చెబుతుంటే అయిష్టంగానే సాయ్ కోచింగ్ కోసం దీప్తిని హైదరాబాద్ బస్సు ఎక్కించాం’’ అని తండ్రి యాదగిరి ఆనాటి తమ కుటుంబ పరిస్థితులను వివరించారు.

సాయ్ కోచింగ్ అనుభవాలు
ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులున్న దీప్తి, హైదరాబాద్ ‘సాయ్’ వాతావరణంలో త్వరగా ఇమడ లేకపోయారు.
‘‘చాలా సార్లు ఫిట్స్ వచ్చాయి. బట్టలు ఉతుక్కోవడం తెలియదు. ఐదేళ్ల పాటు నేనే వారానికి రెండు సార్లు వెళ్లి అమ్మాయి బట్టలు ఉతికి వచ్చేదాన్ని. కేరళలో ప్రత్యేక కోచింగ్‌కు వెళ్ళినప్పుడు, పేరెంట్స్‌కు క్యాంప్‌లో అనుమతి లేదంటే బయట హాస్టల్‌లో ఒంటరిగా ఉన్నాను. ప్రాక్టీస్ సమయానికి దీప్తి పక్కనే ఉండేదాన్ని. భగవంతుడే నా కూతురు లోపల ఉన్నాడేమో... అందుకే పరిగెత్తుతోంది’’ అని పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు ధనలక్ష్మి.

ప్రపంచ రికార్డు
దీప్తి కిందటేడాది చైనాలో హంగ్జౌలో జరిగిన ఆసియన్ పారా గేమ్స్‌లోనూ బంగారుపతకం సాధించారు.
‘‘సినిమాలు చూడదు. షాపింగ్ చేయడం తెలియదు. కావాల్సినవి నేనే కొనిపెడతాను. చికెన్ అంటే ఇష్టం. ఏషియన్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. ఇప్పుడు ఒలింపిక్స్ ఆడుతోంది. కచ్చితంగా నా బిడ్డ దేశానికి గోల్డ్ మెడల్ తెస్తుంది’’ అని నమ్మకం వ్యక్తం చేశారు దీప్తి తల్లి ధనలక్ష్మి.
‘‘దీప్తి మా గ్రామ పరుగుల రాణి’’ అన్నారు గ్రామస్తుడు నాగయ్య.
మగ పిల్లలు లేరని బాధగా ఉండేదని, ఏం పాపం చేశామని ఆ దేవుడు ఇద్దరు ఆడపిల్లలను ఇచ్చాడని మొదట్లో ఏడ్చేవాళ్లమని దీప్తి తల్లిదండ్రులు చెప్పారు. కానీ ఇప్పుడు అలా అనుకోవడం లేదని వారు అంటున్నారు.
“వెక్కిరించిన వారంతా ఈ రోజు ముక్కున వేలేసుకుని ఆశ్చర్యంగా చూస్తున్నారు. నా బిడ్డకు నమస్కారం పెడుతున్నారు. తల్లిదండ్రులుగా అంతకన్నా సంతోషం ఏముంటుంది!?" అన్నారు ధనలక్ష్మి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















