విమానం టాయిలెట్‌లో పసిబిడ్డను బంధించిన ఇద్దరు మహిళలు, ఆన్‌లైన్‌లో ప్రజల ఆగ్రహం

విమానం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కెల్లీ ఎన్‌జీ
    • హోదా, బీబీసీ న్యూస్

ఏడుస్తున్న పాపను ఇద్దరు మహిళలు విమానం టాయిలెట్‌లో ఉంచి తలుపు మూసి బంధించిన ఘటన చైనాలో దుమారం రేపుతోంది. బహిరంగ ప్రదేశాల్లో పిల్లలను ఎలా చూసుకోవాలనేదానిపై ఆన్‌లైన్‌లో చర్చ జరుగుతోంది.

ఇద్దరు మహిళల్లో ఒకరైన గొయు టింగ్‌టింగ్ విమానం టాయిలెట్‌లోకి పాపను స్వయంగా తీసుకెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాక చైనీస్ ఇంటర్నెట్‌లో ఈ ఘటన వైరల్‌గా మారింది.

ఇతరులకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఆమె ఆ వీడియో పోస్టు చేశారు. కానీ దానిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

చిన్నారిని సముదాయించడానికి ఆమె అమ్మమ్మ ఇద్దరు మహిళలకు అనుమతిచ్చారని విమానయాన సంస్థ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పాప ఏడుస్తోందని...

చైనాలోని వాయువ్య నగరం గుయియాంగ్ నుంచి షాంఘై వెళ్తున్న జునెయావో ఎయిర్‌లైన్స్ విమానంలో ఆగస్టు 24న ఈ ఘటన జరిగింది.

అమ్మమ్మతో కలిసి ప్రయాణిస్తున్న పాప విమానంలో ఏడవడం మొదలుపెట్టింది.

పాపను ఇద్దరు మహిళలు టాయిలెట్‌లోకి తీసుకెళ్లడానికి ఆ పాప అమ్మమ్మ అంగీకరించారని ఘటన జరిగిన రెండురోజుల తర్వాత ఓ ప్రకటనలో విమానయాన సంస్థ తెలిపింది.

‘ఏడుపు ఆపితేనే నువ్వు ఆ గది నుంచి బయటికొస్తావు’ అంటూ ఆ రెండో మహిళ పాపతో చెబుతున్నవిషయం గొయు పోస్ట్ చేసిన వీడియోలో ఉంది.

పాపకు సంబంధించిన ఏ ఇతర వివరాలూ విమానయాన సంస్థ వెల్లడించలేదు. అయితే పాప వయసు ఏడాది ఉంటుందని స్థానిక మీడియా తెలిపింది.

గొయు వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. గొయుకు జాలి, దయ లేవని, పాపను బెదిరిస్తున్నారని అనేకమంది ఆరోపించారు.

విమర్శలపై గొయు స్పందించారు. ఓ ప్రేక్షకురాలిలా జరుగుతున్నది చూస్తూ ఉండకుండా...కావాల్సిన చర్యలు తీసుకోవడమే తనకు ముఖ్యమని గొయు చెప్పారు.

పాపను సముదాయించాలని, విమానంలోని మిగిలిన వారంతా ఇబ్బంది పడకుండా చేయాలన్నదే తన ఉద్దేశమని ‘దౌయిన్‌’లో ఆమె రాశారు. దౌయిన్ అనేది చైనాలో టిక్‌టాక్ లాంటింది.

పాప ఏడుపు వినలేక కొందరు ప్రయాణికులు విమానంలో వెనకవైపు వెళ్లిపోయారని, మరికొందరు చెవుల్లో టిష్యూ పేపర్లు పెట్టుకున్నారని ఆమె దౌయిన్‌లో తెలిపారు.

ఆ తర్వాత గొయు తన అకౌంట్‌ను ప్రయివేట్ అని సెట్ చేసుకున్నారు.

విమానం

ఫొటో సోర్స్, Getty Images

‘చిన్నప్పుడు నువ్వు ఏడవలేదా?’

‘‘చిన్నపిల్లలు తమ ఎమోషన్లను నియంత్రించుకోలేరు. ఏడవడంలో ఏం తప్పుంది..? నీ చిన్నప్పుడు నువ్వు ఏడవలేదా...? ’’ అని ఓ యూజర్ వీబోలో రాశారు.

టాయిలెట్‌లో బంధించడం వల్ల పాపపై పడే మానసిక ప్రభావం గురించి ఒకరు ఆందోళన వ్యక్తంచేశారు.

‘బహిరంగ ప్రదేశాలను చిన్న పిల్లలకు అనుకూలంగా ఎలా మార్చగలమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి’ అని ఆ యూజర్ అభిప్రాయపడ్డారు.

అయితే గొయును సమర్థించేవారు కూడా కొందరు ఉన్నారు.

పాపను సముదాయించడానికి ఆమె అమ్మమ్మ మహిళలకు అనుమతిచ్చారని వారు అంటున్నారు.

‘‘నిజంగా చెప్పాలంటే ఎంతో కొంత నేర్పించకపోతే కొందరు పిల్లలు ఏమీ చేయలేరు’’ అని ఓ వీబో యూజర్ రాశారు.

బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పెద్దగా అరుస్తూ, ధ్వంసం చేస్తూ, గొడవ చేసే పిల్లలను ఎలా నియంత్రించాలనేదానిపై అంతకంతకూ చర్చ పెరుగుతోంది. ఇలాంటి పిల్లలను చైనాలో ‘‘బేర్ చిల్డ్రన్’’ అని పిలుస్తారు.

కొందరు పిల్లలు చాలా క్రూరంగా ప్రవర్తిస్తారని కొందరు చైనీయులు అనుకుంటారు. బేర్ అన్న పదం వాడకంలో వారి ఉద్దేశం అదే.

చిల్డ్రన్ ఫ్రీ జోన్స్

కొన్ని పబ్లిక్ రైళ్లు పిల్లల కోసం ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌లు ప్రారంభించాయి.

ప్రపంచంలో మిగిలిన చోట్ల దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఉదాహరణకు దక్షిణ కొరియా రెస్టారెంట్లు, మ్యూజియంలు, థియేటర్స్‌లో వందలాది చిల్డ్రన్ ఫ్రీ జోన్‌లు ఏర్పాటుచేసింది.

అయితే తక్కువ జననాల రేటుతో దేశం సతమతమవుతున్న పరిస్థితుల్లో...ఇలాంటి జోన్‌లు పెట్టడం సరికాదని చట్టసభ సభ్యులు అంటున్నారు. పిల్లలను అంగీకరించే సమాజాన్ని తిరిగి సృష్టించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి జోన్‌లు తొలగించివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

టర్కిష్-డచ్ కారియర్ కొరెండన్ ఎయిర్‌లైన్స్, సింగపూర్‌కు చెందిన స్కూట్ సహా కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు, అదనపు చార్జీలతో చైల్డ్ ఫ్రీ జోన్‌లో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)