భవిష్యత్తులో ఉద్యోగాలొచ్చే ఐదు రంగాల్లో రాణించాలంటే ఎలాంటి నైపుణ్యాలు ఉండాలంటే...

ఉద్యోగాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రొఫెషనల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రానున్న రోజుల్లో కొత్త ఉద్యోగాలకు అనుగుణంగా నైపుణ్యాలనూ పెంచుకోవాలి
    • రచయిత, ఒలెగ్ కార్పిక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉద్యోగాలు, పని స్వరూపాన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో చాలా వరకు రానున్న రోజుల్లో కనిపించకపోవచ్చు.

నూతన సాంకేతికత, ఆటోమేషన్ వాడకం పెరగడం, పర్యావరణ హిత ఆర్థిక వ్యవస్థ, సుస్థిరత వైపు ప్రపంచం మొగ్గు చూపడమనే రెండు కీలక అంశాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతున్నట్టు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తాజా అధ్యయనం తేల్చింది.

డేటా సేకరణ, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి అధునాతన నూతన సాంకేతికతలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెచ్చిన కొత్త టెక్నాలజీ వల్ల కార్మిక రంగంలో పెనుమార్పులు రావచ్చని భావిస్తున్నారు.

శుభవార్త ఏమిటంటే ఈ కొత్త సాంకేతికత రాకవల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. దీని వల్ల కొన్ని ఉద్యోగాలు అంతరించినా, కొత్తవి వస్తాయి. తక్కువ వనరులతో వ్యాపారాలు పుంజుకుంటాయి కాబట్టి సహజంగానే కొత్త సాంకేతికత విస్తరిస్తుంది.

రానున్న ఐదేళ్లలో ప్రస్తుతం ఉన్న వృత్తులలో మూడొంతులు మారిపోతాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం పరిశోధకులు చెప్పారు. ఉద్యోగాల మార్కెట్‌లో పోటీని తట్టుకుని విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ తరచుగా కొత్త నైపుణ్యాల్ని నేర్చుకుంటూ, సామర్థ్యాలకు పదును పెట్టుకోవాల్సి ఉంటుంది.

బీబీసీ
ఫ్యాక్టరీలు, ఉద్యోగాలు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రానున్న రోజుల్లో స్టెమ్( STEM) ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉంటుంది.

ముఖ్యమైన నైపుణ్యాలు

ఉద్యోగాల మార్కెట్‌లో పోటీ పడి నిలవాలంటే సాంకేతిక అక్షరాస్యత (టెక్నికల్ లిటరసీ)లో పట్టు ఉండాలి. దీనర్థం అందరూ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలుసుకోవాలని లేదా మెషీన్ లెర్నింగ్‌లో చిక్కుల్ని అర్థం చేసుకోవాలని కాదు.

భవిష్యత్‌లో ‘స్టెమ్’ (STEM) ఉద్యోగాలకు డిమాండ్ భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్‌‌ను సూచించే పదం.

దీంతో స్కూల్లో మీ పిల్లవాడిని మేథమేటిక్స్, కంప్యూటర్ సైన్స్, సామాన్య శాస్త్రం అనేవాటిపై దృష్టి పెట్టమని అడగొచ్చు.

రానున్న రోజుల్లో విశ్లేషణాత్మకంగా ఆలోచించడం ఓ కీలక నైపుణ్యంగా మారనుంది. దీన్ని మెరుగుపరచుకునేందుకు మేధో సామర్థ్యం అవసరం. అంటే ఏదైనా అంశాన్ని, సంఘటనను విశ్లేషించే సామర్థ్యం చాలా ముఖ్యం.

అయితే ఈ సామర్థ్యాన్నిఅందిపుచ్చుకోవాలంటే ఏకాగ్రత అవసరం. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ గేమ్స్, వ్యాపార ప్రకటనలు మన దృష్టిని ఆకర్షిస్తుంటాయి. వీటిని చూడకపోతే ఏదో కోల్పోయామనే భావనను కలిగిస్తుంటాయి. వీటి బారినపడకుండా ఉండాలంటే ఏకాగ్రతను అభ్యసించడం ముఖ్యం.

పర్యావరణంపై ఆసక్తి, సొంతంగా నేర్చుకోవడం, ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ,ఎప్పటికప్పుడు మెరుగుపడటం కూడా విశ్లేషణాత్మక నైపుణ్యం కిందకు వస్తుంది.

యంత్రాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, టెక్నాలజీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యాంత్రీకరణ ఎంతగా పెరిగినా మనుషుల అవసరం ఎప్పుడూ ఉంటుంది.

1.ఇంగ్లీషు, సృజనాత్మకత

రానున్న రోజుల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఇంగ్లీష్ మాట్లాడటం ముఖ్యమైన నైపుణ్యంగా భావిస్తారు. దీంతో పాటు సైన్స్‌, ఇంజనీరింగ్, డిజైన్ రంగాల్లో సృజనాత్మకతనూ మెరుగుపరుచుకోవాలి.

సాంకేతిక పరిజ్ఞానానికి సృజనాత్మకత తోడైతే భవిష్యత్‌లో బంగారు అవకాశాలు తలుపుతట్టే పరిస్థితి వస్తుంది. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో సమాచార నైపుణ్యం, జ్ఞాన నైపుణ్యం చాలా ముఖ్యమైనవి.

మెషీన్లు ఎంతగా విస్తరించినా వాటిని నడిపించడానికి మనుషుల అవసరం ఎప్పుడూ ఉంటుంది. అందుకే టీమ్ వర్క్, ఇతరులు చెప్పింది వినడం, కథలు చెప్పడం, సేవ, సహకారం లాంటి నైపుణ్యాలు ఎవరికైనా చాలా ముఖ్యమైనవి.

ప్రస్తుతం ఉద్యోగాల మార్కెట్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమైనవని సోషల్ మీడియా సైట్ లింక్డిన్ 2020లో ప్రచురించిన నివేదికలో పేర్కొంది.

“పని చేసే ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వాడకం పెరిగింది. టెక్నాలజీ ఆధారంగా ఇప్పుడు అనేక మంది ఇంటినుంచే పని చేస్తున్నారు. టెక్నాలజీ ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసింది. నిజం చెప్పాలంటే అన్నీ మారుతున్నాయి. మనం మాట్లాడటం, వినడం, ఇతర వ్యక్తులతో సంభాషించడం చాలా ముఖ్యం” అని వర్క్‌ప్లేస్ టాలెంట్ అండ్ ఎంగేజ్‌మెంట్ నిపుణుడు డాన్ నిగ్రోని చెప్పారు.

టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానం, సమాచార విప్లవం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త టెక్నాలజీలను అర్థం చేసుకునే వ్యక్తుల అవసరం ఉంది.

2. కొత్త సాంకేతికత

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీలు రానున్న రోజుల్లో ముఖ్యమైన రంగాలుగా మారనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వల్ల అనేక కొత్త ఉద్యోగాలు వస్తాయి.

ఈ రంగంలో ప్రాంప్ట్ ఇంజనీర్ ఉద్యోగం ప్రముఖంగా నిలవనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కమ్యూనికేషన్ నిపుణుడిగా పేరుపొందిన వ్యక్తిని ప్రాంప్ట్ ఇంజనీర్ అని పిలుస్తున్నారు.

ప్రాంప్ట్ ఇంజనీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనుషుల మధ్య ఓ లింక్‌లా వ్యవహరిస్తారు. వర్క్ ఏరియాలో ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కరిస్తారు.

దీంతో పాటు, సెక్యూరిటీ ఇంజనీర్లు, యంత్రాలు, మనుషుల మధ్య సరైన పరస్పర చర్య కోసం సులువైన ఇంటర్‌ఫేస్‌ను అభివృద్ధి చేయడం కూడా ఈ రంగంలో అవకాశాల్ని కల్పిస్తుంది.

కృత్రిమ మేధస్సును పోటీదారుగా కాకుండా భాగస్వామిగా చూడాలి. దానికి ఎలా సహకరించాలో అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి.

బిగ్ డేటా అనాలిసిస్ విభాగంలోనూ అనేక అవకాశాలు రానున్నాయి. ఇందులో భాగంగా కంట్రోల్ సిస్టమ్, హార్డెన్ కొలైడర్ లేదా నెట్‌ఫ్లిక్స్ వంటి వెబ్‌సైట్ల ద్వారా సమాచారాన్ని సేకరించే అవకాశాలు కూడా ఉంటాయి.

రానున్న సంవత్సరాల్లో సైబర్ సెక్యూరిటీ టెక్నీషియన్లకు ఉద్యోగాల కొరత ఉండదు. ఎందుకంటే సున్నితమైన సమాచారం ప్రతి మూలకూ చేరుతుంది. అలాగే ఆర్థిక రంగంలో సాంకేతిక నిపుణులు, వ్యాపార విశ్లేషకులు, బ్లాక్‌చెయిన్ సిస్టమ్ డెవలపర్ల అవసరమూ ఎక్కువగా ఉంటుంది.

బిజినెస్, సైన్స్, పాలిటిక్స్, పర్యావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్రీన్ జాబ్స్ పెరుగుతాయి.

3. పర్యావరణహిత ఉద్యోగాలు

వివిధ రంగాలలో, పరిశ్రమలలో గ్రీన్ జాబ్స్ డిమాండ్ వేగంగా పెరుగుతోందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 2023 ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణహిత వ్యవస్థ వైపు మారడంలో భాగంగా క్లీన్ ఎనర్జీ, తక్కువ ఉద్గారాలను వెలువరించే టెక్నాలజీ రంగాలు 3 కోట్ల ఉద్యోగాలు సృష్టించగలవని ఆ నివేదిక పేర్కొంది.

సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ, బిజినెస్ కన్సల్టింగ్, న్యాయ సలహాలు, పర్యావరణ పరిరక్షణ తదితరాలు ఉపాధి కల్పనా రంగాలుగా అవతరించవచ్చు.

దీంతో పాటు రానున్న రోజుల్లో అర్బన్ ప్లానర్స్, ఆర్కిటెక్టులు, డిజైనర్లు, స్మార్ట్ హోమ్ డెవలపర్లు లాంటి రంగాల్లోనూ అవకాశాలు పెరగవచ్చు.

వైద్యం, ఆరోగ్యం, వృద్ధులు, జనాభా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జనాభా పెరగడం వల్ల రానున్న రోజుల్లో ఆరోగ్యరంగ నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి.

4. ఆరోగ్య రంగ నిపుణులు

ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతూ ఉండటంతో, జీవిత కాలం కూడా పెరుగుతోంది. దీంతో వృద్ధుల పట్ల నిరంతర శ్రద్ధ, వారికి ఆరోగ్య భద్రత కావాలి.

అందువల్ల భవిష్యత్‌లో ఆరోగ్య రంగంలో పని చేసే నిపుణులకు డిమాండ్ భారీగా పెరగనుంది. వృద్ధులు, రోగులకు మందులు అందించడంతో పాటు నైతికంగా అండగా నిలిచే హెల్త్ వర్కర్లకు రానున్న రోజుల్లో గిరాకీ పెరగనుంది.

ఈ రంగంలోనూ డాక్టర్లు, ఆరోగ్య రంగ నిపుణులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రోగ నిర్ధరణ, చికిత్స చేయవచ్చు.

ఫిజియోథెరపిస్టులు, వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణులు, స్పిరిచ్యువల్ ట్రైనర్లకు కూడా డిమాండ్ పెరుగుతుంది.

వృత్తి నిపుణులు, కార్మికులు, ఫ్యాక్టరీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మారుతున్న పరిస్థితులను బట్టి కార్మికులు కూడా నైపుణ్యాలను పెంచుకోవాలి.

కార్మికులకు డిమాండ్

పైన పేర్కొన్న రంగాల్లో పెరుగుదల వల్ల మెకానిక్స్, ఎలక్ట్రీషియన్లు, బిల్డర్లు, ఇతర వృత్తి నిపుణులకు కూడా భవిష్యత్‌లో అవకాశాలు పెరగనున్నాయి.

వివిధ విభాగాల్లో చిన్న చిన్న పనులు, నైపుణ్యం అవసరమైన పనులతోపాటు, యంత్రాల వాడకం సాధ్యం కాని చోట మనుషుల సేవలు అవసరమవుతాయి.

మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా వీరు నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. కొత్త విషయాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్‌డేట్ కావాలి.

ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతోంది. దీంతో ఆహారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందువల్ల వ్యవసాయరంగంలో కొత్త వ్యాపారాలకు అవకాశాలు పెరుగుతాయి.

రచయితలు, కవులు, డైరెక్టర్లు, నటులు, కమెడియన్లు, కళాకారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కథలు చెప్పేవారికి డిమాండ్ పెరుగుతుంది.

5. కథలు చెప్పడం

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం భవిష్యత్‌లో చాలా ముఖ్యంగా మారనున్న మరో వృత్తి కథలు చెప్పడం

వెయ్యి సంవత్సరాల కిందట మీ అనుభవాలకు కొంత సృజనాత్మకత జోడించి చెప్పడం చాలా కీలకంగా ఉండేది. ఇది రానున్న రోజుల్లో ముఖ్యాంశంగా మారనుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటికీ, రచయితలు, కవులు, డైరెక్టర్లు, నటులు, కమెడియన్లు, కళాకారులు, సంగీత విద్వాంసులు భారీ మొత్తంలో సమాజానికి అవసరం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్‌తో కొన్ని ఉద్యోగాలు కనిపించకుండా పోతాయంటున్న నిపుణులు

ఈ ఉద్యోగాలు కనిపించవా?

రానున్న రోజుల్లో గిరాకీ ఉన్న ఉద్యోగాల గురించి చూశాం. అవి అందుబాటులోకి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయే ఉద్యోగాలేంటో చూద్దాం. ఆటోమేషన్ వల్ల రానున్న రోజుల్లో కొన్ని ఉద్యోగాలు కనిపించకుండా పోవచ్చు.

వాటిలో కొన్ని

కస్టమర్ సర్వీస్ ( క్యాషియర్లు, సేల్స్ పర్సన్స్, కన్సల్టెంట్లు మొదలైనవి)

ఆఫీస్ మేనేజ్‌మెంట్( వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు పెరుగుతున్నాయి)

డేటా ఎంట్రీ (సెక్షన్, గణాంకాలు, టైపిస్టు, టెక్నికల్ ట్రాన్స్ లేటర్)

అకౌంటింగ్ బుక్

ఒకే పని తరచుగా చేసే ఫ్యాక్టరీ కార్మికుల ఉద్యోగాలు

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)