తుర్కియేకు పర్యటకుల రాక ఎందుకు తగ్గింది, ఆ దేశంలో ఏం జరుగుతోంది?
ఓజాజ్ ఓజ్డెమిర్
బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి సంవత్సరం వేసవిలో తుర్కియే బీచ్‌లలో చాలా రద్దీ ఉంటుంది. ఆ సమయంలోఅక్కడ ఒడ్డున తువ్వాలు పరుచుకుని సేదతీరేందుకు కాసింత స్థలం కూడా దొరకదు.
కానీ ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం,ఈ ఏడాది రెండో త్రైమాసికంలో పర్యటకం ద్వారా లాభాలు పెరిగాయి.గతేడాదితో పోలిస్తే లాభం 12 శాతం, పర్యటకుల సంఖ్య 15 శాతం పెరిగాయి.
కానీ తుర్కియే పర్యటక రంగ పరిస్థితి ఈ ప్రభుత్వ డేటాకు పూర్తి భిన్నంగా ఉంది.తుర్కియేకి వచ్చే పర్యటకుల సంఖ్య తగ్గిపోయింది.
"జులై నెలలో హోటల్ గదులు ఖాళీగా ఉండటం ఇన్ని సంవత్సరాలలో ఇదే మొదటిసారి" అని టూకోన్‌ఫెడ్ అనే పర్యటక సంస్థకు చెందిన మెహ్మెట్ జెమ్ చెప్పారు.

పర్యటకుల సంఖ్య ఎంత తగ్గింది?
హోటళ్లలోని మొత్తం గదుల్లో ఈసారి గరిష్ఠంగా 60 శాతం మాత్రమే బుక్ అయ్యాయని జెమ్ చెబుతున్నారు.
మామూలుగా సీజన్‌లో తుర్కియో హోటల్ గదులలో 95 శాతం బుక్ అవుతాయి.
కరోనా తర్వాత ప్రపంచ దేశాలలో పర్యటకుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత విదేశీ పర్యటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది.
కానీ తుర్కియే విషయంలో అలా జరగడం లేదు.
మధ్యధరా తీరంలోని ఇతర పర్యటక ప్రదేశాలతో పోలిస్తే,తుర్కియేని సందర్శించే పర్యటకుల సంఖ్య చాలా తక్కువ.
విదేశీ పర్యటకులు తక్కువ ఖర్చుతో కూడిన ఇతర ప్రాంతాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
తుర్కియేలో ద్రవ్యోల్బణంపై అదుపు లేకుండా పోవడం, కనీసం స్థానికులు కూడా దేశంలోని ఇతర ప్రాంతాలను సందర్శించడానికి ఇష్టపడకపోవడం హోటళ్ళ నష్టానికి ఒక కారణం.
సెప్టెంబర్ వరకు ఇంతేనా?
తుర్కియేకి పశ్చిమాన చెజ్మే అనే పేరు గల ప్రదేశం ఉంది.నూర్ దామన్ ఇక్కడ ఓ హోటల్ యజమాని.
“నా హోటల్ సముద్ర తీరంలో ఉంది కాబట్టి పర్యటకులు బుక్ చేసుకుంటున్నారు. ఖాళీగా ఉండడంలేదు.కానీ నగరానికి మధ్యలో ఉన్న ఇతర హోటళ్ల యజమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.మేమందరం గదుల అద్దెను తగ్గించుకోవాల్సిన పరిస్థితి. ఇంకోవైపు కరెంటు బిల్లులు,ఇతర ఖర్చులు చాలా పెరిగాయి" అని నూర్ దామన్ అన్నారు.
అధికారిక గణాంకాల ప్రకారం తుర్కియే ద్రవ్యోల్బణం రేటు 61.8శాతం.
యూరప్‌లో ఉంటున్న తుర్కియే నివాసితులు కూడా ఈసారి సెలవులు గడిపేందుకు స్వదేశానికి నూర్ అభిప్రాయపడ్డారు.
ఐరోపాలో క్రీడలకు సంబంధించిన అనేక పెద్ద ఈవెంట్‌లు,టోర్నమెంట్‌లు జరిగినందువల్ల,తుర్కియేకి వచ్చే వారి సంఖ్య ఈ ఏడాది తగ్గిందని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు.
యూరో 2024,యూఈఎఫ్ఓ యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు జర్మనీ ఆతిథ్యం ఇవ్వనుంది.దీంతో ఆరు లక్షల మంది విదేశీ పర్యటకులు అదనంగా వస్తారని అంచనా వేస్తున్నారు.
పారిస్‌లో ఒలింపిక్స్ మూడు వారాల పాటు కొనసాగాయి.దీంతో 11 మిలియన్లమందికి పైగా పర్యటకులు పారిస్‌ను సందర్శించారు.
సెప్టెంబర్ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని,తర్వాత క్రమంగా పర్యటకుల సంఖ్య పెరుగుతుందని తుర్కియే సాంస్కృతిక,పర్యటక శాఖ మంత్రి నూరి ఎర్సోయ్ చెప్పారు.
‘‘తుర్కియేకు వచ్చే పర్యటకుల సంఖ్య పెరుగుతుంది. ఈ ఏడాది చివరకు ఆరు కోట్ల మంది పర్యటకుల రాకపోకలు సాగించేలా విధించుకున్న లక్ష్యాన్నిసాధిస్తామని ప్రస్తుత గణాంకాలు సూచిస్తున్నాయి’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గ్రీస్‌పై ఆకర్షణ
తుర్కియే పౌరులకు గ్రీస్ వీసా పరిమితులను సడలించడం వల్ల హోటళ్లు కూడా నష్టపోతున్నాయని ఎర్సోయ్ చెప్పారు.
ఈ ఏడాది ప్రారంభంలో గ్రీస్ ప్రభుత్వం వీసా ఎక్స్‌ప్రెస్ పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం ద్వారా,తుర్కియే పౌరులు గ్రీస్‌లోని దీవులను సందర్శించడానికి వచ్చినప్పుడు వీసా ఆన్ అరైవల్ కింద వీసా ఇచ్చే సౌకర్యం కల్పించారు.
దీంతో స్థానికులు కూడా ఈ ప్రాంతాల పట్ల ఆకర్షితులయ్యారు.తుర్కియే కంటే చౌకగా గ్రీస్ దీవులను సందర్శించవచ్చని సోషల్ మీడియాలో చాలా మంది పర్యటకులు పేర్కొన్నారు.
తుర్కియేలోని ఎర్డోగాన్ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
తుర్కియే టూరిజం అసోసియేషన్ టుర్సాబ్ హెడ్ ఫిరూజ్ బగలికాయ మాట్లాడుతూ,‘‘జీవన వ్యయం కంటే, ఎక్స్‌ఛేంజ్ రేటు వేగంగా పెరిగింది.ఈ కారణంగా,ప్రయాణం,హోటల్ గదుల రేట్లు ఖరీదైనవిగా మారాయి.
ఇస్తాంబుల్‌లోని హోటల్ యజమాని తార్కాన్ అక్యుజ్,హోటల్ యజమానుల సంఘం నేత.
"అరబ్ దేశాలు,బాల్కన్ల నుండి వచ్చే పర్యటకులు తుర్కియే కంటే గ్రీస్‌ను ఎంచుకుంటున్నారు" అని తార్కాన్ చెప్పారు.ఎందుకంటే తుర్కియేలో బట్టలు,ఆహారం చాలా ఖరీదైనవి అని వారు చెబుతారని ఆయన అన్నారు.
"మా సంపాదన సరిగా లేదు,"మా ఖర్చుల వరకైనా సంపాదిస్తే చాలనుకుంటున్నాం.గత సంవత్సరంతో పోలిస్తే,మా ఖర్చులు మూడు రెట్లు పెరిగాయి కానీ మా ఆదాయం మాత్రం అలాగే ఉంది ఆయన చెప్పారు.
తుర్కియే టూరిజంపై ఆధారపడిన వారందరూ ఇప్పుడు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియా ప్రభావం
సోషల్ మీడియా లో నెటిజన్లు గ్రీస్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు తుర్కియే కంటే చాలా చౌకగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతోపాటు గ్రీస్‌ను సందర్శిస్తే అయ్యే ఖర్చులను,అలాగే తుర్కియే పర్యటనకు అయ్యే ఖర్చులను బిల్లులతో సహా వివరించారు.
తుర్కియే రిసార్ట్‌లో ఒక రోజు ఉండే డబ్బుతో గ్రీస్‌లో నాలుగు రోజులు ఉండవచ్చని ఎక్స్‌లో ఒక పర్యటకుడు పేర్కొన్నారు.
తుర్కియేతో పోల్చి చూస్తే గ్రీస్ వెళ్లడానికి చాలా తక్కువ డబ్బు ఖర్చవుతుంది నన్ను నమ్మండి అని మరో పర్యటకుడు వివరించారు.
తుర్కియేలోని బోడ్రమ్‌లో ఖర్చు చేసిన మొత్తం గ్రీస్‌లోని సమోస్ ద్వీపంలో ఖర్చు చేసిన మొత్తానికి రెండింతలు.ఇది మన దేశానికి బాధాకరమైన విషయం అని ఒక తుర్కియే నటుడు ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈజిప్ట్,మొరాకో,ట్యునీషియా,దుబాయ్ వంటి ప్రదేశాలు కూడా విదేశీ పర్యటకుల రాకతో ప్రసిద్ధి చెందాయి.దీని వెనుక ఉన్న కారణాలలో తుర్కియే ద్రవ్యోల్బణం ఒకటి అని పర్యటక నిపుణులు అంటున్నారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం,కొన్ని నగరాల్లో పర్యటక మోసాల నివేదికలు కూడా విదేశీ పర్యటకుల సంఖ్యను తగ్గించాయి.
దీనికి సంబంధించి గత నెలలో వివాదం చెలరేగింది.
తుర్కియేలోని ఓ హోటల్‌లో రెండు గ్లాసుల దానిమ్మ రసానికి 1200 లీరాస్ అంటే సుమారు మూడు వేల రూపాయలు వసూలు చేశారు.స్థానిక పరిపాలన జోక్యం తరువాత,పర్యటకులకు డబ్బు తిరిగి ఇచ్చారు.
హోటల్ యజమాని తార్కాన్ మాట్లాడుతూ ఈ సంఘటనలు ప్రతిష్టను దిగజార్చాయి అని అన్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ నిషేధించడం కూడా సమస్యలను సృష్టిస్తోంది అన్నారు.
ఇప్పటి వరకూ మంచి భవిష్యత్తును ఊహించగలిగాం, కానీ ఇప్పుడు ఆందోళన చెందుతున్నాం అన్నారు తార్కాన్.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














