మంచు వరద: హిమాలయాల్లోని ఈ పర్వతారోహకుల గ్రామం కొట్టుకుపోయింది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హఫ్సా ఖలీల్
- హోదా, బీబీసీ న్యూస్
నేపాల్‌లోని ఎవరెస్ట్ ప్రాంతంలో ఉన్న షెర్పా గ్రామం ఒకటి మంచు వరదలో మునిగిపోయిందని అధికారులు చెప్పారు.
3,800 మీటర్ల ఎత్తులో ఉన్న థామె గ్రామం సమీపంలోని మంచు సరస్సు కట్టలు తెంచుకోవడంతో మునిగిపోయి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.
వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ ప్రాంతంలోని హిమనీనదాలు ప్రమాదకరస్థాయిలో కరిగిపోతున్నాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
కాగా ఈ మంచు సరస్సు గ్రామాన్ని ముంచేసిన ఘటనలో ప్రాణ నష్టం లేనప్పటికీ పెద్ద సంఖ్యలో భవనాలు, ఆవాసాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
శుక్రవారం నాటి ఈ మంచు వరద కారణంగా అక్కడి స్కూల్, హెల్త్ క్లినిక్ పూర్తిగా దెబ్బతిన్నాయి.
పర్వతారోహణలో రికార్డులు స్థాపించిన అనేకమంది షెర్పాలకు పుట్టినిల్లు ఈ థామె గ్రామం.
పర్వతరోహకుడు ఎడ్మండ్ హిల్లరీతో కలిసి మౌంట్ ఎవరెస్ట్‌ను ఎక్కిన తొలి షెర్పా టెన్జింగ్ నార్గేది ఈ ఊరే.
తెల్లని పాల నురుగు లాంటి మంచు.. బురద, శిథిలాలతో ముదురు గోధుమ రంగులోకి మారిన వరద నీరు గ్రామంలోంచి పారుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

15 ఇళ్లు ఈ వరదలో కొట్టుకుని పోయాయని, సహాయక బృందాలు స్థానిక ప్రజల రక్షించేందుకు సాయపడుతున్నాయని నేపాలీ ఆర్మీ అధికార ప్రతినిధి గౌరవ్ కుమార్ కేసీ తెలిపారు.
వరదల పరిస్థితిని సమీక్షించేందుకు హెలికాప్టర్లు వాడేందుకు అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితులు సహకరించలేదని స్థానిక అధికారులు చెప్పారు.
వరదలకు కారణమేంటో ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ , మంచు సరస్సు తెగడంతోనే వచ్చుంటాయని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్‌మెంట్(ఐసీఐఎంఓడీ)లో పనిచేసే వాతావరణ మార్పుల నిపుణుడు అరుణ్ భక్త శ్రేష్ఠ తెలిపారు.
వాతావరణ మార్పుల వల్లే హిమాలయాల్లోని హిమానీనదాలు కరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
ఇటీవల దశాబ్దాల్లో హిమాలయాల్లో కరిగిపోతున్న హిమానీనదాల కారణంగా వందలాది మంచు సరస్సులు ఏర్పడుతున్నాయి.
ఐసీఐఎంఓడీ 2020 రిపోర్టు ప్రకారం, నేపాల్‌లో 2070 హిమానీనదాలపై రూపొందించిన డాక్యుమెంట్‌లో 21 హిమానీనదాలు ప్రమాదకరంగా ఉన్నాయని తేలింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














