విడాకులు తీసుకుంటున్న హాలీవుడ్ స్టార్స్ జెన్నిఫర్ లోపెజ్, బెన్ అప్లెక్

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, క్రిస్టల్ హేస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ తన భర్త బెన్ అఫ్లెక్ నుంచి విడాకులు కోరుతున్నారు.
బీబీసీ పరిశీలించిన కోర్టు పత్రాల ప్రకారం లాస్ ఏంజెలెస్ కౌంటీ సుపీరియర్ కోర్ట్‌లో మంగళవారం జెన్నిఫర్ విడాకులకు దరఖాస్తు చేశారు.
ఈ జంటను మీడియా తరచుగా ‘బెన్నిఫర్’ అని పిలుస్తుంటుంది.
2022 జులైలో లాస్ వెగాస్‌లో బెన్, జెన్నిఫర్ వివాహం చేసుకున్నారు. నెల తర్వాత జార్జియాలో వారి వివాహ వేడుక వైభవంగా నిర్వహించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
‘20 ఏళ్ల ప్రేమ’
2003లో ‘గిగ్లీ’ సినిమా సెట్‌లో బెన్, జెన్నిఫర్ కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారు ఆ సంవత్సరమే వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ 2004 ప్రారంభంలో రిలేషన్‌షిప్ తెంచుకున్నారు.
దాదాపు 20 సంవత్సరాల తర్వాత జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్‌లు మళ్లీ ఒక్కటయ్యారు. 2022లో లాస్ వెగాస్‌లో వివాహం చేసుకుంటామని ప్రకటించిన తర్వాత జెన్నిఫర్ "ప్రేమ చాలా అందంగా ఉంటుంది. ప్రేమ దయతో ఉంటుంది. ఆ ప్రేమ ఓపికగా మారుతుంది. ఇరవై సంవత్సరాలు ఓపికగా ఉంటుంది" అని అన్నారు.
విడాకులపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి బీబీసీ జెన్నిఫర్, బెన్ ప్రతినిధులను సంప్రదించింది.
వివాహ బంధానికి ముగింపు పలకడానికి జెన్నిఫర్ లేదా ఆమె న్యాయవాది అభ్యర్థన కాపీని తప్పనిసరిగా అఫ్లెక్‌కి అందించాలని కోర్టు డాక్యుమెంట్‌లో ఉంది.
చట్టబద్ధంగా తన ఇంటిపేరును అఫ్లెక్‌గా మార్చుకున్న జెన్నిఫర్, విడాకుల పిటిషన్‌లో వివాహానికి ముందు ఒప్పందం గురించి ఎలాంటి వివరాలను తెలియజేయలేదని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
లాస్ ఏంజెలెస్ సుపీరియర్ కోర్ట్‌లో దాఖలు చేసిన మరో డాక్యుమెంట్ ప్రకారం జెన్నిఫర్ (55), అఫ్లెక్ (52) ఇద్దరూ వారి ప్రస్తుత ఆదాయం, ఖర్చులు, ఆస్తులు, అప్పులు సహా ఆర్థిక సమాచారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
జెన్నిఫర్, అఫ్లెక్ ఇద్దరూ అన్ని ఆర్థిక సమస్యలకు సంబంధించి తుది ఒప్పందం జరిగే వరకు తమ ఆర్థిక విషయాలలో ఎలాంటి మార్పులున్నా తప్పకుండా తెలియజేయాలని కోర్టు డాక్యుమెంట్ పేర్కొంది.
ఆర్థిక వివరాలను సమర్పించడానికి కోర్టు జెన్నిఫర్‌కు 60 రోజుల సమయం ఇస్తుంది. ఆమె ఫైల్ చేసిన తర్వాత అఫ్లెక్ కూడా వివరాలు సమర్పించడానికి 60 రోజుల సమయం ఇస్తారు. వారిలో ఎవరైనా తమ ఆర్థిక సమాచారాన్ని అందించడంలో లేదా అప్‌డేట్ చేయడంలో విఫలమైతే వారు కోర్టుకు పెనాల్టీ కట్టాల్సి రావచ్చు.
జెన్నిఫర్, అఫ్లెక్ బంధంపై కొన్ని నెలలుగా ఊహాగానాలు సాగుతున్నాయి. వారు తమ బెవర్లీ హిల్స్ భవనాన్ని రూ. 545 కోట్లకు అమ్మకానికి పెట్టారని, ఇద్దరూ పెళ్లి ఉంగరాలు లేకుండా విడిగా కనిపించారని పలు కథనాలు వచ్చాయి.
రెండుసార్లు ఆస్కార్ విజేత అయిన అఫ్లెక్ గతంలో నటి జెన్నిఫర్ గార్నర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమెను 2001లో ‘పెరల్ హార్బర్’ సినిమా సెట్‌లో ఆయన కలుసుకున్నారు. పెళ్లయిన పదేళ్ల తర్వాత అంటే 2015లో వారు విడిపోయారు. అఫ్లెక్, గార్నర్ జంటకు ముగ్గురు పిల్లలున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జెన్నిఫర్ లోపెజ్‌కు పిల్లులున్నారా?
నటి, గాయని అయిన జెన్నిఫర్ లోపెజ్ నాలుగు సార్లు వివాహం చేసుకున్నారు.
క్యూబాకు చెందిన వెయిటర్ ఓజానీ నోవాతో 1997లో మొదటి పెళ్లి జరిగింది. ఏడాది తర్వాత విడిపోయారు. అనంతరం ఆమె మాజీ బ్యాకప్ డ్యాన్సర్ క్రిస్ జుడ్‌ను పెళ్లి చేసుకున్నారు. వారు 2003లో విడిపోయారు.
2004లో గాయకుడు మార్క్ ఆంథోనీని జెన్నిఫర్ పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి కవలలు పుట్టారు. 2014లో జెన్నిఫర్, ఆంథోనీ విడిపోయారు. గతంలో న్యూయార్క్ యాన్కీస్ స్టార్ అలెక్స్ రోడ్రిగ్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. అనంతరం 2022లో బెన్ అఫ్లెక్‌తో వివాహమైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














