బ్లాక్‌మెయిల్ స్కాండల్: 32 ఏళ్ళ తరువాత నిందితులకు జైలుశిక్ష , బాధితులు ఏమంటున్నారంటే..?

ఫొటో సోర్స్, Santosh Gupta
- రచయిత, చెరిలాన్ మోలాన్
- హోదా, బీబీసీ న్యూస్, ముంబయి
‘‘నా మనసులో చెప్పలేనంత బాధ ఉంది. ఆనాటి ఘటన నా జీవితాన్ని ఎలా నాశనం చేసిందో తలుచుకుంటే ఇప్పటికీ దు:ఖం ఆగదు.’’
అది 1992. అప్పుడు సుష్మ (పేరు మార్చాం) వయస్సు 18 ఏళ్లు. పరిచయస్థుడైన ఒక వ్యక్తి తనను ఒక పాడుబడిన గోదాముకు తీసుకెళ్లినట్టు ఆమె చెప్పారు.
అక్కడ ఆరు నుంచి ఏడుగురు వ్యక్తులు ఆమెను కట్టేసి, అత్యాచారం చేసి, ఫోటోలు తీశారు.
వారంతా అజ్మీర్‌లో పేరుపొందిన, ధనిక కుటుంబాలకు చెందినవారు. అజ్మీర్ రాజస్థాన్‌లోని ఒక నగరం.
‘‘రేప్ చేసిన తర్వాత, వారిలో ఒకరు నాకు 200 రూపాయలు ఇచ్చి లిప్‌స్టిక్ కొనుక్కోమన్నాడు. నేను ఆ డబ్బు తీసుకోలేదు’’ అని సుష్మ చెప్పారు.
ఇది జరిగిన 32 ఏళ్ల తర్వాత, అంటే గత వారం ఈ కేసులో నిందితులను దోషులుగా తేల్చుతూ కోర్టు జీవితఖైదు విధించింది.

‘‘ఇప్పుడు నాకు 50 ఏళ్లు. ఈరోజు నాకు న్యాయం జరిగినట్టుగా అనిపిస్తోంది. కానీ, నేను పోగొట్టుకున్నదంతా ఈ తీర్పుతో తిరిగి రాలేదు’’ అని ఆమె అన్నారు.
తనపై జరిగిన అత్యాచారం కారణంగా ఏళ్ల పాటు సమాజం నుంచి అవహేళనలు, అవమానాలు ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు.
తన గతం గురించి తెలిసి మొదటి భర్త, తర్వాత రెండో భర్త తనకు విడాకులు ఇచ్చారని ఆమె తెలిపారు.
పలుకుబడి కలిగిన ఓ పురుషుల బృందం, 1992లో కొన్ని నెలల పాటు అజ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థినులను అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చేసింది. అలాంటి 16 మంది బాధితుల్లో సుష్మ కూడా ఒకరు. అప్పట్లో ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
కోర్టు గత వారం 18 మంది నిందితుల్లో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. నఫీస్ చిస్తీ, ఇక్బాల్ భట్, సలీమ్ చిస్తీ, సయేద్ జమీర్ హుస్సేన్, నసీమ్, సుహైల్ ఘనీలకు ఈ శిక్ష పడింది.
నిందితులు నేరాన్ని అంగీకరించలేదని, ఈ తీర్పును హైకోర్టులో అప్పీలు చేస్తామని వారి తరఫు న్యాయవాదులు చెప్పారు.

ఫొటో సోర్స్, Santosh Gupta
మిగతా 12 మంది ఏమయ్యారు?
1998లో ఎనిమిది మంది నిందితులకు జైవిత ఖైదు విధించగా, అందులో నలుగురిని పైకోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. మిగతా వారి శిక్షను జీవిత ఖైదు నుంచి పదేళ్లకు తగ్గించింది.
మిగిలిన నలుగురిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. మరొకరికి 2007లో జీవిత ఖైదు విధించగా, ఆరేళ్ల తర్వాత ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. ఇంకొక వ్యక్తి, దీనికి సంబంధించిన ఒక చిన్న కేసులో దోషిగా తేలాడు. తర్వాత ఆయనను కూడా నిర్దోషిగా విడుదల చేశారు. నిందితుల్లో ఒకరు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు.
‘‘ఆగస్ట్ 20 నాటి తీర్పును న్యాయం జరిగినట్లు పరిగణించవచ్చా? తీర్పు అనేది న్యాయం కాదు’’ అని ఈ కేసు గురించి కథనాలు రాసిన జర్నలిస్ట్ సంతోష్ గుప్తా అన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున ఆయన సాక్షిగా హాజరయ్యారు.
‘‘న్యాయాన్ని ఆలస్యం చేయడమంటే, న్యాయాన్ని తిరస్కరించడమే’’ అని సూచించే మరో కేసు ఇది అని సుప్రీం కోర్టు న్యాయవాది రెబెక్కా జాన్ వ్యాఖ్యానించారు.
‘‘న్యాయవ్యవస్థను దాటి విస్తరించిన ఒక సమస్యను ఇది సూచిస్తుంది. ఆలోచనా ధోరణిలో మార్పు రావడం అవసరం. దీనికి ఇంకా ఎంత సమయం పడుతుంది?’’ అని రెబెక్కా ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Santosh Gupta
పార్టీకి పిలిచి, తాగించి..
నిందితులు తమ అధికారాన్ని, పలుకుబడిని బాధితులను బెదిరించేందుకు, మోసగించేందుకు ఉపయోగించారని ప్రాసిక్యూషన్ లాయర్ వీరేంద్ర సింగ్ రాథోడ్ తెలిపారు.
బాధితులను ఫోటోలు, వీడియోలు తీసి వాటిని బ్లాక్‌మెయిల్ చేసేందుకు, వారు నోరు మెదపకుండా చేసేందుకు నిందితులు ఉపయోగించారని చెప్పారు.
‘‘ఒకానొక సందర్భంలో ఒక నిందితుడు, తనకు తెలిసిన ఒక వ్యక్తిని పార్టీకి ఆహ్వానించి బాగా తాగించారు. తర్వాత, అతని పరువుకు భంగం కలిగించే ఫోటోలు తీశారు. అతని స్నేహితురాళ్లను తమ వద్దకు తీసుకురాకపోతే ఆ ఫోటోలను బహిర్గతం చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారు. ఇలా చాలామంది వారికి బాధితులుగా మారారు’’ అని ఆయన వివరించారు.
నిందితులకు బలమైన సామాజిక, రాజకీయ సంబంధాలు ఉన్నాయి. నిందితుల్లో కొందరికి నగరంలోని ఒక ప్రముఖ దర్గాతో సంబంధాలు ఉన్నాయి.
‘‘అప్పట్లో చిన్నపట్టణంగా ఉన్న ఊళ్ళో వాళ్లు కార్లు, బైకుల మీద తిరిగారు. వీరిని చూసి కొంతమంది భయపడేవారు. కొంతమంది వారికి దగ్గరవ్వాలని అనుకునేవారు. కొంతమంది వారిలా ఉండాలనుకునేవారు’’ అని సంతోష్ గుప్తా అన్నారు.
వాళ్లకున్న పలుకుబడి, సంబంధాల కారణంగా నెలల పాటు ఈ కేసు బయటకు రాలేదని ఆయన చెప్పారు. అయితే, కొంతమందికి మాత్రం అసలు అక్కడ ఏం జరుగుతోందనే అంశంపై అవగాహన వచ్చింది. కొంతమంది పోలీసు అధికారులు, ఫోటో స్టూడియోలలో ఫోటోలను డెవలప్ చేసే వ్యక్తులు ఏం జరుగుతోందో అర్థం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజస్థాన్ అంతటా ఆగ్రహం
నిందితులు తీసిన ఫోటోలు ఒకరోజు జర్నలిస్ట్ సంతోష్ గుప్తాను చేరాయి. వాటిని చూసి ఆయన కలత చెందారు.
‘‘నగరంలోని కొంతమంది పలుకుబడి కలిగిన వ్యక్తులు అమాయకులు, యువతులపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. వాటికి సంబంధించిన రుజువులు కూడా ఉన్నాయి. కానీ, దీనిపట్ల ప్రజల్లో, పోలీసుల్లో పెద్ద స్పందన లేదు’’ అని ఆయన చెప్పారు.
ఈ కేసు గురించి ఆయన కొన్ని రిపోర్టులు రాశారు. కానీ, అవి పెద్దగా ప్రభావం చూపలేదు.
ఒకరోజు ఆయన పనిచేసే పేపర్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది.
అర్ధనగ్నంగా ఉన్న ఒక యువతి, ఇద్దరి పురుషుల మధ్య నలిగిపోతున్నట్టుగా, ఆమె రొమ్ములను వారు తాకుతున్నట్టుగా కనిపిస్తున్న ఫోటోను ప్రచురించింది. ఫోటోలోని ఒక వ్యక్తి కెమెరాను చూస్తూ నవ్వుతున్నట్లుగా ఉంది. ఫోటోలో ఆ యువతి ముఖాన్ని పూర్తిగా కనిపించకుండా చేసి ఆ ఫోటోను ప్రచురించారు.
ఈ వార్తా కథనం నగరంలో ప్రకంపనలు రేపింది. ప్రజలు కోపంతో ఊగిపోయారు. రోజుల తరబడి జరిగిన నిరసనలతో నగరం స్తంభించిపోయింది. రాజస్థాన్ అంతటా ఈ కోపాగ్ని వ్యాపించింది.
‘‘చివరకు, ప్రభుత్వం చర్యలకు దిగింది. నిందితులపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్ కేసును నమోదు చేసిన పోలీసులు, దాన్ని సీఐడీకి అప్పగించారు’’ అని రాథోడ్ చెప్పారు.
నిందితుల అరెస్టుల్లో జాప్యం, డిఫెన్స్ న్యాయవాదుల వ్యూహాలు, న్యాయవ్యవస్థలోని వ్యవస్థాగత సమస్యలు, ప్రాసిక్యూషన్ వద్ద సరిపడా నిధులు లేకపోవడం వంటి అనేక కారణాలతో ఈ కేసు విచారణ 32 ఏళ్ల పాటు కొనసాగిందని రాథోడ్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘బాధితులకు శిక్షే’
1992లో పోలీసులు ఈ కేసులో ప్రాథమిక అభియోగాలు నమోదు చేసినప్పుడు ఆరుగురు నిందితులు పరారీలో ఉండటంతో వారి పేర్లు చేర్చలేదు. దీన్ని రాథోడ్ తప్పుబట్టారు. ఆ ఆరుగురికే గత వారం కోర్టు శిక్ష విధించింది.
ఈ ఆరుగురిపై 2002లో పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఆ సమయంలో కూడా వారు పరారీలోనే ఉన్నారు. వారిలో ఇద్దరిని 2003లో అరెస్ట్ చేశారు. మరొకరిని 2005లో, ఇంకో ఇద్దరిని 2012లో, చివరి వ్యక్తిని 2018లో అరెస్ట్ చేశారు.
నిందితులను అరెస్ట్ చేసిన ప్రతిసారి మళ్లీ కేసును కొత్తగా విచారించారు.
‘‘చట్టం ప్రకారం, సాక్షులు సాక్ష్యం చెప్పేటప్పుడు నిందితుడికి కోర్టులో హాజరయ్యే హక్కు ఉంటుంది. సాక్షుల్ని క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు డిఫెన్స్ వారికి ఉంటుంది’’ అని రాథోడ్ వివరించారు.
తమకు జరిగిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోవడం బాధితుల్ని భయానక పరిస్థితుల్లోకి నెట్టింది.

ఫొటో సోర్స్, iStock
బాధితుల ఆక్రందనలు
ఇప్పుడు 40, 50 ఏళ్ల వయస్సుల్లో ఉన్న బాధితులు, అత్యాచారానికి గురైన ఏళ్ల తర్వాత కూడా తమను ఎందుకు ఇంకా కోర్టుకు లాగుతున్నారంటూ న్యాయమూర్తిపై అరిచేవారని రాథోడ్ గుర్తు చేసుకున్నారు.
కాలం గడిచినకొద్దీ, సాక్షులను వెతకడం పోలీసులకు కూడా సవాలుగా మారింది.
‘‘జీవితంలో చాలా మారిపోయినందున, ముందుకు సాగుతున్నందున చాలామంది ఈ కేసుకు దూరంగా ఉండాలని అనుకున్నారు’’ అని రాథోడ్ చెప్పారు.
‘‘ఇప్పటికీ, నిందితుల్లో ఒకరు పరారీలోనే ఉన్నారు. ఒకవేళ అతను అరెస్ట్ అయితే, లేదా నిందితుల్లో ఎవరైనా తీర్పుపై హైకోర్టుకు వెళితే బాధితుల్ని, సాక్షుల్ని మళ్లీ సాక్ష్యం చెప్పడం కోసం పిలుస్తారు’’ అని ఆయన వివరించారు.
తాజాగా ఆరుగురు నిందితుల్ని దోషులుగా నిర్థరించడంలో ముగ్గురు బాధితులు ఇచ్చిన సాక్ష్యం కీలకంగా మారింది. ఆ ముగ్గురు బాధితుల్లో సుష్మ ఒకరు.
‘‘నేనేప్పుడు కథను మార్చలేదు. నాపై వీళ్లు అఘాయిత్యం చేసినప్పుడు నేను చాలా చిన్నదాన్ని, అమాయకురాల్ని. ఆ ఘటన తర్వాత నేను అంతా కోల్పోయాను. ఇక కోల్పోవడానికి నా దగ్గర ఏమీ లేదు’’ అని సుష్మ చెప్పారు.
(భారతీయ చట్టాల ప్రకారం, అత్యాచార బాధితురాలి గుర్తింపును వెల్లడించకూడదు. అందుకే ఈ కథనంలో ఆమె పేరు మార్చాం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














