కోవిడ్-19కు ఎంపాక్స్‌కు ఐదు తేడాలు ఇవి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డోర్కస్ వాంగిరా, కరోలిన్ కియాంబో
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఎంపాక్స్‌ను రెండేళ్లలో రెండోసారి ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించినప్పుడు, చాలామంది ఆందోళన చెందారు.
కోవిడ్-19 నాటి పరిస్థితులు మళ్లీ వస్తాయా అని కొందరు భయపడ్డారు.
అయితే, ఎంపాక్స్ కోవిడ్-19 లాంటిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ, దానిపై వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘‘ఎంపాక్స్ కోవిడ్ కొత్త వేరియంట్ కాదు. సామాన్య ప్రజలకు దీని ముప్పు కాస్త తక్కువగానే ఉంటుంది’’ అని యూరప్‌కు డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ హాన్స్ క్లూగే చెప్పారు.
‘‘ఎంపాక్స్‌ను ఎలా నియంత్రించాలో మాకు తెలుసు. యూరప్‌లో ఈ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఎలా నిరోధించాలో మాకు అవగాహన ఉంది’’ అని అన్నారు.
కరోనా, ఎంపాక్స్ రెండూ కూడా వైరస్ ద్వారానే సోకుతున్నాయి. కానీ, రెండింటి లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి. ఈ వ్యాధులు వ్యాపించే తీరు భిన్నంగా ఉంది.
‘‘ఈ రెండు వ్యాధులకు సారూప్యతల కంటే తేడాలు ఎక్కువగా ఉన్నాయి’’ అని కెన్యా అగ ఖాన్ యూనివర్సిటీ కన్సల్టెంట్, ఇన్‌ఫెక్షస్ డిసీజ్ స్పెషలిస్ట్, ప్రొఫెసర్ రాడ్ని ఆడమ్ అన్నారు.
కరోనాకు, ఎంపాక్స్‌కు మధ్య ఉన్న ఐదు తేడాలను ఇప్పుడు చూద్దాం.


ఫొటో సోర్స్, AFP
1. ఎంపాక్స్ కొత్త వైరస్ కాదు
ఎంపాక్స్ కొత్త వైరస్ కాదు. ఎంపాక్స్‌ను అంతకుముందు మంకీపాక్స్‌గా పిలిచేవాళ్లు.
సుమారు 1958 నుంచే ఈ వ్యాధి ఉంది. డెన్మార్క్‌లో తొలుత కోతులలో ఈ వ్యాధిని గుర్తించారు.
ఎంపాక్స్ తొలుత మనుషుల్లో 1970ల్లో డీఆర్ కాంగోలో బయటపడింది. అప్పటి నుంచి ఈ వైరస్ పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో వ్యాపించింది.
ఇప్పటి వరకు 70 దేశాల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. 2022లో ఎంపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా డబ్ల్యూహెచ్ఓప్రకటించింది.
ఇక కోవిడ్-19 తొలి కేసు 2019లో చైనాలోని వూహాన్ పట్టణంలో నమోదైంది. ఆ తర్వాత, కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
ఈ రెండు వైరస్‌లను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా గుర్తించారు వైద్య నిపుణులు.
2. ఎంపాక్స్, కోవిడ్-19 అంత తీవ్రమైన అంటువ్యాధి కాదు
కోవిడ్19 మాదిరిగా ఎంపాక్స్ తీవ్రమైన అంటువ్యాధి కాదు.
రెండూ కూడా వ్యాధి సోకిన వ్యక్తికి దగ్గర ఉండటం వల్లే సోకుతాయి. కానీ ఈ విషయంలో కొన్ని తేడాలు ఉన్నాయి.
కరోనా ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాపించింది. ఎందుకంటే, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటి తుంపరల ద్వారా కూడా కోవిడ్ సోకింది.
కానీ, వ్యాధి సోకిన వ్యక్తికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఎంపాక్స్ ఇతరులకు సోకుతుంది.
ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ముట్టుకోవడం లేదా వ్యాధి సోకిన వ్యక్తి బెడ్‌పై పడుకున్నప్పుడు లేదా వారి బట్టలను వాడినప్పుడు ఇది సోకుతుంది.
ఎక్కువ సేపు వ్యాధి సోకిన వ్యక్తితో ఉన్నప్పుడు ఎంపాక్స్ వస్తుంది.
జ్వరం, జలుబు, గొంతునొప్పి కరోనా లక్షణాలు అయితే.. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, దద్దుర్లు ఎంపాక్స్ లక్షణాలు.
డబ్ల్యూహెచ్ఓ డేటా ప్రకారం 2019 డిసెంబర్ నుంచి 2023 ఆగస్ట్ వరకు సుమారు 76 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదైతే.. 2022 మే నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ కేసులు సుమారు లక్ష నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
3. టీకా
ఎంపాక్స్ టీకా ఇప్పటికే అందుబాటులో ఉంది.
కానీ కరోనా సమయంలో టీకా లేకపోవడం అతిపెద్ద సవాలు.
తొలుత టీకాలను సిద్ధం చేసి, ఆ తర్వాత వాటిని వివిధ దశల్లో పరీక్షించి, నియంత్రణా సంస్థల అనుమతులతో కోవిడ్ టీకాలు మార్కెట్లోకి తీసుకువచ్చారు.
కానీ, ఎంపాక్స్ వ్యాధి స్మాల్‌పాక్స్(చికెన్‌పాక్స్)కు చెందినది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిని 1980ల్లో వ్యాక్సినేషన్ ద్వారా అరికట్టారు.
స్మాల్‌పాక్స్‌పై పనిచేసిన టీకాలు, మంకీపాక్స్ నుంచి కూడా రక్షణ కల్పించాయి. ముఖ్యంగా 2022లో మంకీపాక్స్ వచ్చినప్పుడు ఇవి సాయపడ్డాయి.
‘‘ఇవి 100 శాతం రక్షణ కల్పించవు. కానీ, 2022లో ఈ వ్యాధి యూరప్, నార్త్ అమెరికాలకు విస్తరించినప్పుడు, పెద్దవారిలో దీని ప్రమాదం తక్కువగా కనిపించింది. ఎందుకంటే, వాళ్లు అప్పటికే స్మాల్‌పాక్స్ టీకా వేయించుకుని ఉన్నారు’’ అని ప్రొఫెసర్ ఆడమ్ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
4. కరోనా మాదిరిగా త్వరగా రూపాలు మార్చుకోదు
కొన్ని వైరస్‌లు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. కరోనా లాంటి కొన్ని వైరస్‌లు చాలా వేగంగా మ్యుటేట్ అవుతాయి. కానీ, ఎంపాక్స్ అలా కాదు.
ఎంపాక్స్ వ్యాధి డీఎన్ఏ వైరస్ ద్వారా వస్తుంది. అదే కరోనా వ్యాధి ఆర్ఎన్ఏ వైరస్ ద్వారా సోకుతుంది.
ఆర్ఎన్ఏ వైరస్‌లతో పోలిస్తే డీఎన్ఏ వైరస్‌లు అంత వేగంగా మ్యుటేట్ కావని అమెరికా సొసైటీ ఆఫ్ మైక్రోబయాలజీ చెబుతోంది.
క్లేడ్ 1, క్లేడ్ 2 అనే రెండు రకాల ఎంపాక్స్‌లున్నాయి. అదే కరోనా వైరస్‌లో 20కి పైగా రకాలున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
5. లాక్‌డౌన్ పెట్టే అవకాశం లేదు
ఎంపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన తర్వాత 2020 నాటి పరిస్థితులు మళ్లీ వస్తాయా అని కొందరు భయపడ్డారు.
ఆ సమయంలో కరోనా వైరస్ విస్తరించకుండా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు విధించారు.
ఎంపాక్స్ విషయంలో అయితే ఇప్పటి వరకు అలాంటిది జరగలేదు.
గత రెండేళ్లలో ఎంపాక్స్ వైరస్ 16 ఆఫ్రికా దేశాలకు వ్యాపించింది. కానీ, ఇప్పటి వరకు సరిహద్దులు ముూసేయడం లేదా లాక్‌డౌన్‌లు విధించడం ఎక్కడా జరగలేదు.
ప్రజల రాకపోకలు, వస్తువుల రవాణాపై ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని ఆఫ్రికా సీడీసీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జీన్ కసేయా అన్నారు. ఈ వ్యాధిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోవడం ద్వారా ఎంపాక్స్ వైరస్‌ను నియంత్రించవచ్చని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ ప్రొగ్రామ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మైక్ ర్యాన్ అన్నారు.
ఎంపాక్స్ అనేది మధ్యస్థ వైరస్. రెండు నుంచి నాలుగు వారాల్లో ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చు.
అయితే, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ల ఆరోగ్యం క్షీణిస్తోంది. వాళ్లు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎంపాక్స్ సోకకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాధి సోకిన వ్యక్తికి, వారి వస్తువులకు దూరంగా ఉండాలి.
ఒకవేళ వారి గాయాలు లేదా దద్దుర్లు ముట్టుకుంటే, వెంటనే చేతులు కడుక్కోవాలి.
ఈ వ్యాధి సోకకుండా శానిటైజర్ వాడాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
(గమనిక - ఈ కథనం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు, సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















