కోవిడ్ సమయంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎకనమిక్ టాస్క్‌ఫోర్స్ ఏం పని చేసింది?

కోవిడ్ సంక్షోభం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కరోనా మహమ్మారి సమయంలో వలస కార్మికులు పెద్దయెత్తున తరలివెళ్లారు (ఫైల్ ఫోటో)
    • రచయిత, జుగల్ పురోహిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''కోవిడ్ సంక్షోభం అణుబాంబు విధ్వంసం లాంటిది. జపాన్‌లోని హిరోషిమా, నాగాసాకి ప్రజలు కోలుకోవడానికి ఎన్నేళ్లు పట్టింది? అలాగే, కోవిడ్ సంక్షోభం ముగిసిన తర్వాత కూడా నా వంటి వ్యాపారవేత్తలు దాని నుంచి కోలుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు.'' ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎఫ్ఐఎస్ఎంఈ) అధ్యక్షుడిగా పనిచేసిన 63 ఏళ్ల మోహన్ సురేశ్ వ్యాఖ్యలివి.

ఈ ఫెడరేషన్‌లో 700లకు పైగా సంఘాలున్నాయి. మోహన్ సురేశ్ టెక్నోస్పార్క్ అనే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నడుపుతున్నారు. దాని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.

తన కంపెనీ బ్రోషర్ మొదటి పేజీలో 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వర విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లండన్‌లో ఆవిష్కరిస్తున్న చిత్రం ఉంది. ఈ విగ్రహాన్ని టెక్నోస్పార్క్ సంస్థ తయారుచేసింది. గ్రానైట్‌ కళాఖండాల తయారీ పరిశ్రమల్లో భారత్‌లో తమ సంస్థ నంబర్ వన్ అని ఆ కంపెనీ చెబుతోంది.

కానీ, ప్రస్తుతం ఆయన కంపెనీ బ్యాంకు ఖాతా లావాదేవీలపై నిషేధం ఉంది. బ్యాంకు ఆయన ఖాతాను నిరర్థక ఆస్తి (నాన్ పెర్ఫామింగ్ అస్సెట్ - NPA)గా ప్రకటించినట్లు సురేశ్ తెలిపారు.

ఫ్యాక్టరీలో మేం ఆయన్ను కలిసినప్పుడు, "మా సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదు. దాదాపు 30 శాతం చిన్న, మధ్య తరహా కుటీర పరిశ్రమల పరిస్థితి దారుణంగా ఉంది. చాలా వరకు మూతపడ్డాయి. ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి మాపై శ్రద్ధ వహించాలని కోరుతున్నా'' అన్నారు.

కోవిడ్ సంక్షోభం
ఫొటో క్యాప్షన్, మోహన్ సురేశ్ ఫ్యాక్టరీ

ముంబయిలో ఉదిత్ కుమార్(పేరు మార్చాం)ను కలిసేప్పటికి రాత్రి 8 గంటలైంది. ఆయన తన పని ముగించుకుని అప్పుడే ఇంటికి వచ్చారు. కోవిడ్ సంక్షోభానికి ముందు ఉదిత్ కుమార్ ఒక బార్ అండ్ రెస్టారెంట్ యజమాని. కానీ, ఇప్పుడు ఆయన ఫుట్‌పాత్‌పై ఒక చిన్న స్థలంలో, ఆమ్లెట్లు అమ్ముతున్నారు.

''కోవిడ్ సమయంలో సామాన్యులు, వ్యాపారవేత్తలకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం అమలు చేసిన విధానాలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అసలు సంబంధం లేకపోవడం వల్లే నేను ఈ పరిస్థితికి వచ్చా. అప్పట్లో నా దగ్గర 12 మంది పనిచేసేవారు. ఏ బ్యాంకూ నాకు సాయం చేయలేదు. ఎందుకంటే, నా బార్ అండ్ రెస్టారెంట్ అద్దె భవనంలో ఉండేది, అందువల్ల మీకు సాయం చేయలేమని చెప్పారు. దీంతో నేను ఎక్కువ వడ్డీకి అప్పులు చేయాల్సి వచ్చింది. కానీ, కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత నేను తిరిగి కట్టలేకపోయాను.'' అని ఉదిత్ చెప్పారు.

ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (కేఎఫ్‌సీసీఐ) అధ్యక్షుడు రమేశ్ చంద్ర లోహతి మాట్లాడుతూ, కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రభుత్వం మద్దతుగా నిలిచింది, కానీ ''2022 తర్వాత, నాలుగో వంతు సంస్థలు సంక్షోభాన్ని అధిగమించేందుకు కష్టపడుతున్న సమయంలో ఆ ప్రయత్నాలన్నీ దాదాపుగా ఆగిపోయాయి.'' అని చెప్పారు.

కోవిడ్ సంక్షోభం
ఫొటో క్యాప్షన్, ఫుట్‌పాత్‌పై ఉదిత్ కుమార్(పేరు మార్చాం) ఆమ్లెట్ దుకాణం

సురేశ్, ఉదిత్ వంటి వారి పరిస్థితి ఇలా ఎందుకైంది?

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందే ఆర్థిక మంత్రి నేతృత్వంలో కోవిడ్ - 19 ఎకనమిక్ రెస్పాన్స్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. 2020 మార్చి 19న ఈ ప్రకటన వెలువడింది.

టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తూ, ''రాబోయే రోజుల్లో ఈ టాస్క్‌ఫోర్స్ అందరు స్టేక్‌హోల్డర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వారి సూచనల మేరకు పరిస్థితులను అంచనా వేసి ఆర్థిక ఇబ్బందులను నివారించేందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. తద్వారా సమర్థవంతమైన చర్యలు చేపట్టవచ్చు.'' అని ఆయన చెప్పారు.

అయితే, బీబీసీ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఈ టాస్క్‌ఫోర్స్ ఏవైనా చర్యలు తీసుకుందా? లేదా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిందా? లేదా ప్రభుత్వానికి ఏదైనా నివేదికను అందజేసిందా? అనే విషయాలను పరిశీలించినప్పుడు అందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రధాన మంత్రి ప్రకటనతో ఈ టాస్క్‌ఫోర్స్ ఎందుకు ఏర్పాటు చేశారనేది అర్థమవుతుంది.

ఈ టాస్క్‌ఫోర్స్ లేకపోవడంతో, కోవిడ్ సంక్షోభ సమయంలో భారత్ విధానాలు, నేటికీ వాటి ప్రభావాలపై నిపుణులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

సమాచార హక్కు చట్టం 2005 కింద, 2020 - 2023 మధ్య ఈ కింది సమాచారం కావాలని బీబీసీ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కోరింది.

  • టాస్క్‌ఫోర్స్ సమావేశాల వివరాలు, సమావేశాలు జరిగిన తేదీలు, వాటిలో పాల్గొన్న వారి పేర్లు.
  • టాస్క్‌ఫోర్స్ సూచనలకు సంబంధించిన నిబంధనలు
  • టాస్క్‌ఫోర్స్ సమర్పించిన తుది నివేదిక
  • దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్ సూచించిందా?
  • లాక్‌డౌన్‌‌కి ముందు, తర్వాత ప్రభుత్వ విధానాలకు సంబంధించి టాస్క్‌ఫోర్స్ చేసిన సిఫార్సులు ఏమిటి?

అయితే, ఈ ప్రశ్నలకు సంబంధించిన దరఖాస్తులను ప్రధాన మంత్రి కార్యాలయం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించింది.

కోవిడ్

ఫొటో సోర్స్, RTI ONLINE SCREENSHOT

ఈ దరఖాస్తును ఆర్థిక శాఖ కార్యదర్శి, వ్యయ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్, ఇతర మంత్రిత్వ శాఖలకు పంపినట్లు సమాచార హక్కు చట్టం వెబ్‌సైట్ చూపిస్తోంది.

కోవిడ్

ఫొటో సోర్స్, RTI ONLINE SCREENSHOT

ఆ తర్వాత, టాస్క్‌ఫోర్స్ గురించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని ఆర్ధిక శాఖ నుంచి మాకు సమాధానం వచ్చింది.

దీని తర్వాత, మళ్లీ కొన్ని దరఖాస్తులు చేశాం. వాటిలో ఒక విజ్ఞప్తికి ప్రతిస్పందిస్తూ, మీరు అడుగుతున్న సమాచారానికి సంబంధించి మా వద్ద ఎలాంటి వివరాలు లేవని ఆర్థిక మంత్రిత్వ శాఖ మరోసారి తెలిపింది.

కోవిడ్

ఫొటో సోర్స్, RTI ONLINE SCREENSHOT

కోవిడ్

ఫొటో సోర్స్, RTI ONLINE SCREENSHOT

అదే సమయంలో, టాస్క్‌ఫోర్స్ సమావేశాలకు ప్రధాన మంత్రి హాజరు గురించి సమాచారం అడిగినప్పుడు కూడా మాకు ఎలాంటి సమాధానం రాలేదు.

కోవిడ్

ఫొటో సోర్స్, RTI ONLINE SCREENSHOT

టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ప్రకటన తర్వాత, దానికి సంబంధించిన కొంత సమాచారం బీబీసీ వద్ద ఉంది.

''వివిధ స్థాయిల్లో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ తన పని చేస్తోంది. క్షేత్రస్థాయిలో చిన్నచిన్న సమూహాల నుంచి ఫీడ్‌బ్యాక్ అందుతోంది. ప్రతి అంశాన్ని సంబంధింత శాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది, వాటికి అందించాల్సిన ఆర్థిక సాయం(ప్యాకేజీ)పై పనిచేస్తున్నారు.'' అని మార్చి 24న ఆర్థిక మంత్రి చెప్పారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, చిన్న, మధ్య తరహా కుటీర పరిశ్రమల శాఖ, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ వంటి స్టేక్‌హోల్డర్స్ (భాగస్వామ్య సంస్థల)తో సంప్రదింపులు జరపకుండానే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఎలా విధించారో 2021లో బీబీసీ ఇన్వెస్టిగేషన్‌లో మనం చూశాం.

కోవిడ్ సమయంలో ఆర్థిక నిర్ణయాలు ఎలా తీసుకున్నారు?

ప్రొఫెసర్ ఆషిమా గోయల్, 2020లో ప్రధాన మంత్రికి ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్(ఆర్థిక సలహా మండలి)లో సభ్యురాలు.

ఆమె మాట్లాడుతూ, ''నేను టాస్క్‌ఫోర్స్‌ వ్యవహారాల్లో పాల్గొనలేదు. కాబట్టి దానిపై నేనేం చెప్పలేను. కానీ, ఆర్థిక మండలి సభ్యురాలిగా, ఈ-మెయిల్స్ ద్వారా, నేరుగా సమావేశమైనప్పుడు కొన్ని సూచనలు చేశాం. సమావేశాలు తరచూ జరిగేవి. కోవిడ్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులతో, కోవిడ్ సంక్షోభం సుదీర్ఘ కాలం కొనసాగుతుందని ప్రభుత్వానికి అర్థమైంది. పారిశ్రామికవేత్తలు, నిపుణుల గ్రూపులతో చర్చించి, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ప్రారంభించిందని భావిస్తున్నా. మేం అనుసరించిన విధానాలు ప్రభావవంతంగా పనిచేశాయని అనుకుంటున్నా.'' అని అన్నారు.

తన ఆర్థిక సలహాదారులను తొలగించి కొత్త బృందాన్ని పెట్టుకోవాలని భారత మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం ప్రధాని మోదీకి అప్పట్లో విజ్ఞప్తి చేశారు.

''టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ప్రకటన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు'' అని ఆయన నాతో చెప్పారు. కానీ, ''ఆర్థిక రంగంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని గుర్తించా. ప్రభుత్వ చర్యలతో ఏమాత్రం ఉపయోగం లేదు. ప్రభుత్వం పూర్తిగా సిద్ధం కాలేదు'' అని అన్నారు.

కోవిడ్ తర్వాత చిన్న, మధ్య తరహా కుటీర పరిశ్రమలు వేల సంఖ్యలో మూతపడ్డాయి. ప్రభుత్వం వారికి ఆర్థిక సహకారం అందించలేకపోవడమే దానికి కారణం. కంపెనీల మూసివేత కారణంగా భారీ సంఖ్యలో ఉద్యోగాలు కూడా పోయాయి.

2022 మార్చిలో ఈ రంగానికి సంబంధించిన పథకాలను ప్రకటించినప్పుడు, చిన్న మధ్య తరహా కుటీర పరిశ్రమల్లో ఉద్యోగాలకు సంబంధించిన డేటా అందుబాటులో లేదని ప్రభుత్వం అంగీకరించింది.

కోవిడ్
ఫొటో క్యాప్షన్, సురేఖ మోహన్

'ఆత్మహత్య చేసుకోమంటారా?'

సురేఖ మోహన్ తన భర్తతో కలిసి బెంగళూరులోని టెక్నోస్పార్క్‌లో పనిచేస్తున్నారు.

''లాక్‌డౌన్ సమయంలో కూడా మా ఉద్యోగులకు జీతాలు ఆపకుండా ఇచ్చినందుకు గర్వపడుతున్నాం. ఈరోజు బ్యాంకులకు కోవిడ్ సంక్షోభం గురించి, ఆ తర్వాత యుక్రెయిన్ - రష్యా యుద్ధం గురించి తెలుసు. వాటి వల్ల వ్యాపారాలు ఎలా దెబ్బతిన్నాయో తెలుసు. కానీ, బ్యాంకులు లోన్ల గురించి ఆందోళన చెందుతున్నాయి. పెట్టుబడికి నిధులు ఇచ్చినందుకు వడ్డీలు చెల్లిస్తున్నాం. పని జరుగుతూ ఉండాలంటే బయటి నుంచి కూడా డబ్బులు తెచ్చిపెట్టాల్సి వస్తోంది. కానీ, ఇలా ఇంకెంతకాలం? మేం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలని అనుకుంటున్నారా? అని బ్యాంకును అడిగా'' అని రుణం తీసుకున్న బ్యాంకుతో ఇటీవల జరిగిన సంభాషణను సురేఖ గుర్తు చేసుకున్నారు.

ఆమె వ్యాఖ్యలు ప్రమాదకర పరిస్థితికి సంకేతంగా కనిపిస్తోంది. ఆత్మహత్యలకు సంబంధించిన గణాంకాలు కూడా దానిని నిర్ధరిస్తున్నాయి. కోవిడ్ సంక్షోభ సమయంలో భారత్‌లో ఆత్మహత్యల రేటు వేగంగా పెరిగింది. నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలపై బీబీసీ విశ్లేషణ స్పష్టం చేస్తోంది.

కోవిడ్
ఫొటో క్యాప్షన్, ఆత్మహత్యల పెరుగుదల

ప్రభుత్వం ఎలాంటి సన్నాహాలూ చేయలేదు - ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్

కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకోవడంలో టాస్క్‌ఫోర్స్ కారణంగా ఏం తేడా వచ్చిందని అడిగినప్పుడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థిక వేత్త రఘురాం రాజన్ మాట్లాడుతూ, ''ఏవైనా చర్యలు చేపట్టినప్పుడు వాటికి అయ్యే ఖర్చులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి ఇది మాకు సాయపడిందని భావిస్తున్నా. దానిని విస్తృత కోణంలో చూడాలి. విషయాలపై సమగ్ర అవగాహన ఉంటే, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చు'' అన్నారు.

''ఒకసారి వెనక్కితిరిగి చూసుకుంటే, ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోని రంగాలు చాలా ఉన్నాయి. అది వాస్తవం'' అని అన్నారాయన.

''ఉదాహరణకు, వలస కార్మికులపై పడిన ప్రభావం. చాలా తక్కువ సమయమిచ్చి లాక్‌డౌన్ విధింపు, దాని కొనసాగింపు ఆర్థిక కార్యకలాపాలకు కూడా తీవ్ర అంతరాయం కలిగించింది. ఆ నిర్ణయం కారణంగా తలెత్తే పరిణామాలకు సంబంధించి ఎలాంటి ముందస్తు చర్యలూ లేవు. కాబట్టి, ఈ నిర్ణయానికి ముందు ఏం ఆలోచించారో, చర్చించారో అర్థం చేసుకోవడం ముఖ్యం.'' అని ఆయన వ్యాఖ్యానించారు.

దర్యాప్తు జరిపితే ఏం చేసిందీ? ఏం చేయలేదనేది తెలుస్తుందని రఘురాం రాజన్ అన్నారు. నిర్ణయాలు జీడీపీ రేటుకి ఎంత నష్టం చేశాయో ప్రభుత్వ అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. 2020-21 మొదటి త్రైమాసికంలో దాదాపు 23.9 తగ్గుదల నమోదైంది. మొత్తం ఏడాదికి కలిపి 6.6 శాతం తగ్గుదల కనిపించింది.

కోవిడ్ సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు, ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి రంగానికీ, ప్రతి వ్యక్తికీ చేరువైనట్లు ప్రభుత్వం చెప్పింది.

రఘురాం రాజన్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, రఘురాం రాజన్

ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు..

పేద, బలహీన వర్గాలకు పరిమిత కాలం పాటు ఉచిత రేషన్‌ పంపిణీ, నేరుగా నగదు బదిలీ వంటి కార్యక్రమాలను మోదీ ప్రభుత్వం అమలు చేసింది. వ్యాపారవేత్తలకు సులభంగా రుణాలు పొందే అవకాశంతో పాటు రుణాలకు హామీ వంటి అనేక సౌకర్యాలు కల్పించింది.

ఈఎంఐల చెల్లింపుల నుంచి కొద్దినెలలు మినహాయింపు ఇవ్వడంతో పాటు పన్ను రాయితీ వంటివి ప్రభుత్వం ప్రకటించింది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల రుణ పరిమితిని కూడా పెంచారు.

2021లో వార్షిక బడ్జెట్ సమర్పించే సమయంలో, ప్రభుత్వ రిలీఫ్ ప్యాకేజీ 'ఐదు మినీ బడ్జెట్‌'లకు సమానమని ఆర్థిక మంత్రి అన్నారు.

ఇప్పుడు 2024 - 2029 లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మోదీ ప్రభుత్వం చెబుతోంది. ''రాబోయే ఐదేళ్లలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది'' అని ఇటీవల మోదీ దీమాగా చెప్పారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం, భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి 2020 నుంచి 9.7 శాతానికి పుంజుకుంది. ఆ తర్వాత 7.8 శాతానికి తగ్గింది.

ప్రస్తుత జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా అంచనా వేసింది. హెచ్చరిక చేస్తూనే భారత దేశ వృద్ధి రేటుని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది.

‘‘ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ వేగవంతమైన వృద్ధి రేటు నమోదు చేస్తుందని అంచనా వేసింది. అయితే, కోవిడ్ సంక్షోభం తర్వాత భారత్ ఆర్ధిక వ్యవస్థ రికవరీ రేటు కాస్త నెమ్మదిగా ఉంటుందని పేర్కొంది.''

'నా జీవితాన్ని ఎలా మార్చేసిందో మీరు చూడొచ్చు'

కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రభుత్వం చేసిన దాని ప్రకారం చూస్తే, క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి ప్రభుత్వానికి సరైన ఫీడ్‌బ్యాక్ రాలేదని తెలుస్తోందని టెక్నోస్పార్క్‌కి చెందిన మోహన్ సురేశ్ అభిప్రాయపడ్డారు.

ముంబయిలోని వీధి వ్యాపారి ఉదిత్ కుమార్ కూడా దీనితో ఏకీభవించారు. ''ప్రభుత్వానికి సమాచారం అందించిన టాస్క్‌ఫోర్స్ బాగా పనిచేసి ఉంటే, బహుశా ఇప్పటికీ నా బార్ అండ్ రెస్టారెంట్ ఉండి ఉండేది. విమానాల్లో తిరిగేవాడిని. ఇప్పుడు రైల్లో మాత్రమే వెళ్లగలుగుతున్నా. ఆ చార్జీలే భరించగలను. అది కూడా ఖాళీ దొరికినప్పుడు మాత్రమే. అది నా జీవితాన్ని ఎలా మార్చేసిందో మీరు చూడొచ్చు.''

ఇతర భాగస్వాముల నుంచి వచ్చిన సమాచారంతో పనిచేయాల్సిన టాస్క్‌ఫోర్స్ లేకపోవడం వల్ల, ఆర్థిక వ్యవస్థ ఇప్పటి వరకూ సాధించిన రికవరీ రేటు ఎంత?

ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యురాలు ప్రొఫెసర్ గోయల్ అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ''విధాన రూపకర్తలుగా, విధానాలు నిర్ణయించే కౌన్సిల్‌గా మేం చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాం. అమెరికా చేస్తున్నట్లుగా భారత్ చేయాలి, అంటే బ్యాంకుల ద్వారా అందరికీ నిధులు పంపిణీ చేయాలి. అయితే, అది భారీ నష్టాలకు దారితీయడంతో పాటు మన అప్పులు ఇంకా పెరిగిపోతాయని మీకు తెలుసు'' అని ఆమె అన్నారు.

''ఆ సమయంలో భారత్ అనుసరించిన మాక్రో (స్థూల) విధానం బాగా పనిచేసిందని, ఆర్థిక వ్యవస్థ అత్యధిక వృద్ధి రేటు సాధించడానికి, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి దోహదం చేసినట్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అందువల్ల, ఫలితాల ఆధారంగానే ఆ విధానాలు ఎలాంటివో తెలుస్తుందని నేను భావిస్తా. ఫలితాలు ఉత్తమంగా ఉన్నాయంటే, మనకు లభ్యమైన సమాచారం ప్రకారమే విధానాలున్నాయని అర్థం చేసుకోవచ్చు'' అన్నారామె.

మోహన్ సురేశ్
ఫొటో క్యాప్షన్, మోహన్ సురేశ్

అయితే, డాక్టర్ రఘురాం రాజన్ దీనిపై భిన్నమైన అభిప్రాయంతో ఉన్నారు.

''వృద్ధి రేటు ఆరు శాతం (2016 నుంచి) కొనసాగించినట్లయితే.. మనం సాధించగలిగే వృద్ధి ఎక్కువగా ఉండేది. దానికి, ఈరోజు మనం సాధించిన వృద్ధికి మధ్య చాలా తేడా ఉంది. ఈ తేడా కేవలం వృద్ధి రేటుకి సంబంధించనది మాత్రమే కాదు, జీడీపీది కూడా. మన ఆర్థిక వృద్ధి నిలకడగా లేకపోవడం జీడీపీపై కూడా ప్రభావం చూపుతుంది. మనకు పరిహారం ఇస్తే సరిపోతుందా? సంపన్న దేశ నిర్మాణానికి అది సరిపోతుందా? ఇదే రేటుతో అయితే మనకు చాలా సమయం పడుతుంది.'' అని ఆయన అన్నారు.

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) తన తాజా నివేదిక ''భారత్‌లో ఉపాధి అవకాశాల పరిస్థితి ఇప్పటికీ అధ్వానం'' అని పేర్కొంది.

సుదీర్ఘ కాలంగా అమలైన విధానాలను పరిశీలిస్తే, ''2000-19 మధ్య కాలంలో తక్కువ ఉత్పాదకత కలిగిన వ్యవసాయ రంగాల నుంచి ఎక్కువ ఉత్పాదకత కలిగిన వ్యవసాయేతర రంగాలకు ఉపాధి అవకాశాలు మారాయి. ఆ తర్వాత ఇది మందగించింది. 2019 నుంచి 2022 మధ్య పూర్తిగా పరిస్థితి మారిపోయింది. కోవిడ్ సంక్షోభం, ఆర్థిక మాంద్యం దీనికి కారణమని చెప్పొచ్చు.'' అని నివేదిక పేర్కొంది.

యువతలో నిరుద్యోగ రేటు గురించి చూస్తే, "ఉన్నత చదువులు పెరిగాయి. బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువులు చదివిన పురుషులు ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్నారు. వారికంటే మహిళలు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.'' అని వెల్లడించింది.

నేను సురేఖను అడిగా. మీరు ప్రధాన మంత్రి, లేదా ఆర్థిక మంత్రికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అని.

''తీసుకున్న అప్పులు తీర్చలేక మేం పారిపోవడం లేదు. ముందు బతకనివ్వండి. మేం అభివృద్ధి చెందితేనే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది.'' అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)