గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్: రహస్య కెమెరాల కలకలంతో విద్యార్థుల ఆందోళన – అదుపులో అనుమానితుడు

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ దగ్గర విద్యార్థుల నిరసన
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో హిడెన్ కెమెరాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

గురువారం రాత్రి మొదలైన విద్యార్థుల ఆందోళన శుక్రవారం రాత్రి వరకు కొనసాగుతోంది. అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్‌లలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు రికార్డ్ చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో అలజడి రేగింది.

విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ విద్యార్థులంతా ధర్నా చేపట్టారు.

విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్రను అక్కడికి పంపించారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు.

అయితే హిడెన్ కెమెరాలున్నాయనేది తప్పుడు ప్రచారమంటూ జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ రావు తొలుత ప్రకటన చేయడాన్ని విద్యార్థులు తప్పుపడుతున్నారు.

విద్యార్థులు ఆందోళన విరమించాలని మంత్రి కొల్లు రవీంద్ర నచ్చజెప్పే యత్నం చేశారు. కానీ వారు మాత్రం నిందితులను అరెస్ట్ చేసేవరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు.

అదే కాలేజీకి చెందిన ఒక విద్యార్థిని ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

ఆయనతో పాటు ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సీ చెప్పారు.

దర్యాప్తు కోసం ఐదుగురు మహిళా పోలీస్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని నియమించినట్టు వెల్లడించారు.

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్,హిడెన్ కెమెరాలు
ఫొటో క్యాప్షన్, గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్

అసలేం జరిగింది..

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో విద్యార్థుల హాస్టల్ గదుల్లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.

ఐదు రోజుల కిందటే కాలేజ్ యాజమాన్యానికి కూడా ఫిర్యాదు చేసినట్టు ఇక్కడి విద్యార్థినులు బీబీసీకి తెలిపారు.

"కొంతకాలంగా ఇది జరుగుతోంది. మా క్యాంపస్‌లోనే కొందరి మొబైల్స్‌లో వీడియోలు షేర్ అవుతున్నట్టు ఇటీవల మాకు తెలిసింది. వెంటనే కాలేజ్ మేనేజ్‌మెంట్‌ను కలిశాం. కానీ స్పందన లేదు. నిన్న సాయంత్రం చాలామందికి ఈ విషయం తెలిసింది. అయినా అనుమానితుల మీద చర్యలు తీసుకోలేదు. దాంతో ఆందోళన చేస్తున్నాం. దాన్ని కూడా ఫేక్ అంటూ పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు" అంటూ కాలేజీకి చెందిన అమృత అనే విద్యార్థిని బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కంగారుపడుతున్న తల్లిదండ్రులు

విద్యార్ధినుల ఆందోళనల విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కూడా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. కాలేజీ యాజమాన్యం స్పందన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మా పిల్లల వీడియోలు తీసి ప్రచారం చేస్తున్నారని తెలిసింది. దాని వెనుక బలమైన వ్యక్తులున్నారని ప్రచారం సాగుతోంది. మా బిడ్డ అయితే ఒకటి.. వాళ్లకయితే ఒకటా. వాళ్లను కఠినంగా శిక్షించాలి. మంచి కాలేజీ అని ఇక్కడ చేర్చాం. తీరా ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది" అంటూ మైలవరానికి చెందిన పద్మ అనే మహిళ వాపోయారు.

తన కుమార్తె ఈ కాలేజీలో చదవడంతో ఆందోళన గురించి తెలిసి అక్కడికి వచ్చానని ఆమె బీబీసీకి తెలిపారు.

ప్రతిపక్షనేతలు, విద్యార్థులు

హిడెన్ కెమెరాలను గుర్తించేందుకు తనిఖీలు

కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న గుడ్లవల్లేరు కాలేజ్‌లో హిడెన్ కెమెరాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అయితే హిడెన్ కెమెరాలు ఉన్నట్లు ఇంతవరకు తేలలేదని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. తమకు ఫిర్యాదులు రాగానే వెంటనే తనిఖీ చేశామని, ఎక్కడా అలాంటివి దొరకలేదని కాలేజీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా విద్యార్థుల ఆందోళనకు మద్ధతుగా ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, మహిళా మోర్చా వంటి వివిధ సంఘాలు నిరసనల్లో పాల్గొన్నాయి. వైఎస్సార్సీపీ నేతలు కూడా స్పందించారు. నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని విపక్ష నేతలు ఆరోపించారు.

మరోవైపు విద్యార్థుల ఆందోళన తర్వాత రంగంలో దిగిన పోలీస్ బృందాలు కెమెరాల కోసం వెతుకున్నాయి.

ఇప్పటికే అనుమానితుల మొబైల్స్, ల్యాప్ ట్యాప్‌లు సహా వివిధ డివైస్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఎలక్ట్రానిక్ డివైస్‌లను పూర్తిగా పరిశీలించాల్సి ఉందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ రావు తెలిపారు.

విచారణ కోసం గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ.రమణమ్మ ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు.

ఆమెతో పాటు సాంకేతిక పరిజ్ఞానం గల ఐటీ కోర్ ఎస్సై మాధురి, కమ్యూనికేషన్స్ విభాగ పోలీస్ సిబ్బంది నలుగురు ఈ బృందంలో ఉంటారని తెలిపారు.

"విచారణ పారదర్శకంగా జరుగుతుంది. కేసులో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి సెల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నాం. దాంట్లో ప్రతి చిత్రాన్ని, డాక్యుమెంట్‌ను టెక్నికల్‌గా పరిశీలిస్తాం " అని ఎస్పీ గంగాధర్ తెలిపారు.

విచారణలో భాగంగా ఎన్ఎల్‌జేడీ( నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్) పరికరం ద్వారా క్షుణ్ణంగా పరిశీలించబోతున్నట్టు తెలిపారు. నేరం రుజువైతే తప్పుచేసినవారిని వదిలిపెట్టబోమన్నారు.

సీఎం చంద్రబాబు

3 గంటలకోసారి నాకు నివేదిక ఇవ్వండి: చంద్రబాబు

విద్యార్థినుల ఆందోళనను, ఆవేదనను పరిగణనలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రహస్య కెమెరాలతో వీడియోల చిత్రీకరణ జరిగిందన్న విషయంలో నేరం రుజువైతే అందుకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

"మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో...అంతే సీరియస్‌గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలి. ఆందోళనలో ఉన్న వారికి భరోసా కల్పించాలి. విద్యార్థుల ఫిర్యాదును యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపైనా విచారణ చేయాలి. కాలేజీ యాజమాన్యం, అధికారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది" అంటూ సీఎం హామీ ఇచ్చారు.

విద్యార్థినుల వద్ద ఆధారాలు ఉంటే...నేరుగా తనకే పంపాలని ఆయన కోరారు. స్టూడెంట్స్ ఎవరూ అధైర్య పడవద్దని, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ప్రతి మూడు గంటలకు ఒక సారి తనకు ఘటనపై రిపోర్ట్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ వ్యవహారంపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)