జపాన్‌లో దయనీయ స్థితి: ఇళ్లలో ఒంటరిగా మరణిస్తున్న వృద్ధులు, 6 నెలల్లో 40 వేల మంది మృతి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హఫ్సా ఖలీల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జపాన్‌లో 2024 ప్రథమార్థంలో దాదాపు 40,000 మంది ప్రజలు తమ ఇళ్లలో ఒంటరిగా మరణించారు.
జాతీయ పోలీసు ఏజెన్సీ ప్రకారం, చనిపోయినవారిలో దాదాపు 4,000 మందిని ఒక నెల తర్వాత, 130 మృతదేహాలను ఒక ఏడాది తర్వాత కనుగొన్నారు.
ఐక్యరాజ్యసమితి ప్రకారం, జపాన్‌లో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు.
ఈ ఏజెన్సీ నివేదికతో, దేశంలో పెరుగుతున్న వృద్ధుల జనాభా సమస్య, ఒంటరిగా నివసించేవారి సమస్యలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.
2024 తొలి అర్ధభాగానికి సంబంధించిన జాతీయ పోలీసు ఏజెన్సీ డేటా ప్రకారం, ఒంటరిగా ఇంట్లో చనిపోయిన మొత్తం 37,227 మందిలో 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు 70% కన్నా ఎక్కువ మంది ఉన్నారు.

మరణించిన నెల తర్వాత గుర్తింపు
ఇంట్లో ఒంటరిగా చనిపోయినవారిలో 40% మందిని ఒక రోజులోనే కనుగొన్నా, దాదాపు 3,939 మృతదేహాలను నెల తర్వాత కనుగొన్నారు. 130 మృతదేహాలను ఒక సంవత్సరం తర్వాత గుర్తించినట్లు పోలీసు నివేదిక పేర్కొంది.
ఇంట్లో ఒంటరిగా మరణించినవారిలో 7,498 మంది, 85 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు. 75-79 ఏళ్ల వయస్సు మధ్యనున్నవారు 5,920 మంది, 70-74 సంవత్సరాల వయసు మధ్యనున్నవారు 5,635 మంది ఉన్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, జపాన్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసర్చ్, 2050 నాటికి ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల సంఖ్య (65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు) 1.08 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. అదే సమయానికి, ఏకవ్యక్తి కుటుంబాల సంఖ్య 2.33 కోట్లకు చేరుతుందని తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
జపాన్ ప్రభుత్వం, దేశంలో దశాబ్దాలుగా ఉన్న ఒంటరితనం సమస్యను పరిష్కరించే బిల్లును ఏప్రిల్‌లో ప్రవేశపెట్టింది.
తగ్గిపోతున్న జనాభా, వృద్ధాప్య సమస్యను ఎదుర్కోవడానికి జపాన్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది, అయితే ఆ మార్పును తీసుకురావడం దేశానికి కష్టంగా మారింది.
గత సంవత్సరం, ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా మాట్లాడుతూ, జననాల రేటు తగ్గడంతో తమ దేశం ఒక సమాజంగా పనిచేయలేని స్థితికి చేరుకుంటోందని అన్నారు.
కొన్ని పొరుగు దేశాలూ ఇలాంటి జనాభా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
చైనాలో జాతీయ జననరేటు 1961 తర్వాత 2022లో మొదటిసారి తగ్గింది.
దక్షిణ కొరియాలో ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు తరచూ నమోదవుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














