వెస్ట్ బ్యాంక్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు.. ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిచ్చిన యూఎన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలెక్స్ స్మిత్, లూసీ విలియమ్సన్
- హోదా, బీబీసీ న్యూస్, మిడిల్ ఈస్ట్ కరస్పాండెంట్
వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడులు కాస్త తగ్గినప్పటికీ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి.
జెనిన్, తుల్కర్మ్, ఇతర వెస్ట్ బ్యాంక్ నగరాల్లో ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్ ముగియనప్పటికీ తీవ్రత కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది.
ఇజ్రాయెల్ దాడుల్లో 17 మంది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా న్యూస్ ఏజెన్సీ వాఫా తెలిపింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం 12 మంది ‘ఉగ్రవాదులను’ తాము హతమార్చామని ప్రకటించుకుంది. వారిలో అయిదుగురు ‘ఉగ్రవాదులు’ తుల్కర్మ్‌లో ఓ మసీదులో దాక్కుని ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది.
ఇజ్రాయెల్ బలగాలతో తుల్కర్మ్‌లో రాత్రంతా జరిగిన పోరులో మరణించిన పాలస్తీనా పోరాట యోధుడు ముహమ్మద్ జుబ్బర్‌కు పాలస్తీనా ప్రజలు నివాళులర్పిస్తున్నారు.


ముహమ్మద్ జుబ్బర్ మృతి
వెస్ట్ బ్యాంక్, ఇజ్రాయెల్‌లో ముహమ్మద్ జుబ్బర్ పేరు తరచూ వినిపిస్తుంటుంది. ఇజ్రాయెలీలు ఆయన్ను ఉగ్రవాది అని ఆరోపిస్తుంటారు.
ముహమ్మద్ జుబ్బర్... అసలు పేరు గుర్రీ అబు షుజా. నుర్ షామ్స్ శరణార్థి శిబిరంలో ఆయన జన్మించారు. తుల్కర్మ్ బ్రిగేడ్ కమాండర్‌గా ఉన్నారు.
గతంలో పలుమార్లు ఇజ్రాయెల్ చేసిన హత్యాయత్నాల నుంచి జబ్బర్ తప్పించుకున్నారు. నాలుగేళ్లకు పైగా జైలు జీవితం గడిపారు.
ఇటీవలి కాలంలో మీడియాకు అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏప్రిల్‌లో జుబ్బర్ మరణించారని ఇజ్రాయెల్ ప్రకటించింది.
కానీ రెండురోజుల తర్వాత సహచరుడి అంత్యక్రియలకు జుబ్బర్ హాజరు కావడంతో ఇజ్రాయెల్ ప్రకటన నిజం కాదని తేలింది.
జుబ్బర్ మరో నలుగురు ‘ఉగ్రవాదులతో’ కలిసి మసీదులో దాక్కుని ఉండగా హతమార్చామని ఇజ్రాయెల్ బలగాలు తాజాగా ప్రకటించాయి.
ఇజ్రాయెల్ జుబ్బర్‌ను ఉగ్రవాదిగా పేర్కొంటుండగా పాలస్తీనా గ్రూపులు మాత్రం ఆయన్ను అమరవీరుడిగా పిలుస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ దాడులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
ఇజ్రాయెల్ దాడులతో వెస్ట్ బ్యాంక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.
సాధారణ ప్రజల భద్రతపై అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. వెస్ట్ బ్యాంక్‌లో ప్రజల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరింది.
వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న ఆపరేషన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను బీబీసీ పరిశీలించింది.
జెనిన్‌లో చిత్రీకరించిన ఓ వీడియోలో ఒక బుల్డోజర్ నిర్మాణాలను కూల్చివేయడం కనిపించింది.
ఇజ్రాయెల్ బలగాలు జెనిన్‌లో ఒక మసీదులో ప్రవేశించిన ఫుటేజ్‌ను కూడా బీబీసీ పరిశీలించింది.
మసీదులో ప్రవేశించిన తర్వాత ఇజ్రాయెల్ బలగాలు ఏం చేశారన్నదానిపై స్పష్టత లేదు.
తుల్కర్మ్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన ఇళ్లు, భవనాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters
వెస్ట్ బ్యాంక్‌పై వరుస దాడులు
ఇటీవలి నెలల్లో ఇజ్రాయెల్ ఆర్మీ వెస్ట్ బ్యాంక్‌లో దాడులు భారీగా పెంచింది. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటిదాకా 50కి పైగా వైమానిక దాడులు జరిపింది. 2006 నుంచి 2023 మధ్య జరిపిన దాడులు కన్నా ఇవి ఎక్కువ. ఈ 50 దాడుల్లో రెండు గత ఏడాది అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్‌పై జరిపిన దాడి తర్వాత చేసినవి.
జెనిన్, ఆ ప్రాంతానికి దగ్గర ఉన్న శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ ఎక్కువగా వైమానిక దాడులు జరుపుతోంది. ఈ ప్రాంతంపై పాలస్తీనా ఉగ్రవాదులకు గట్టి పట్టుంది.
ప్రస్తుత దాడుల తర్వాత జెనిన్ ప్రభుత్వాసుపత్రి బయట అంబులెన్సులు నిరంతరాయంగా తిరుగుతున్నాయి.
ఆ ప్రాంతాన్ని ఇజ్రయెల్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
జెనిన్‌లోని ఓ శిబిరంలో ప్రార్థనలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్‌పై జరిపిన దాడి తర్వాత వెస్ట్ బ్యాంక్‌లో హింస, ఉద్రికత్తలు పెరిగిపోయాయి. హమాస్ దాడుల్లో 1,200 మంది చనిపోయారు. 250 మందిని హమాస్ బందీలుగా పట్టుకుంది.
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన ప్రతీకార దాడుల్లో 40 వేలమందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు.

ఫొటో సోర్స్, Reuters
వెస్ట్ బ్యాంక్ వివాదం ఏంటి..?
‘ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్’లో ఏళ్లగా ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న దాడులు ఈ ప్రాంతంపై తరచూ అందరి దృష్టీ పడేలా చేస్తున్నాయి.
జోర్డాన్ నదికి పశ్చిమ తీరాన విస్తరించి ఉన్న ప్రాంతం కావడంతో వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తారు. కొంత భూభాగం చుట్టూ ఇజ్రాయెల్ ఉంటుంది.
అంతర్జాతీయంగా పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలుగా పిలిచే తూర్పు జెరూసలేం, గాజాతో కలిపి వెస్ట్ బ్యాంక్‌లో 30 లక్షల మంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారు.
1967 పశ్చిమాసియా యుద్ధంలో ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్‌ను ఆక్రమించుకుంది.
వెస్ట్ బ్యాంక్ పూర్తిగా ఇజ్రాయెల్ ఆధీనంలో ఉండేది. అయితే 1990ల నుంచి వెస్ట్ బ్యాంక్ పట్టణాలు, నగరాలు పాలస్తీనా అధారిటీ(పీఏ)గా పిలిచే పాలస్తీనా ప్రభుత్వం పాలనలో ఉన్నాయి. పాలస్తీనా అధారిటీలో భాగం కాని హమాస్ గ్రూప్ గాజాను నియంత్రిస్తోంది.
వెస్ట్ బ్యాంక్‌లో ఐదు లక్షల మంది యూదుల కోసం ఇజ్రాయెల్ 130కి పైగా సెటిల్‌మెంట్‌లు నిర్మించింది.
ఇజ్రాయెల్ అంగీకరించకపోయినప్పటికీ ఈ సెటిల్‌మెంట్లను అంతర్జాతీయ చట్టం కింద అక్రమ నిర్మాణాలుగా పరిగణిస్తున్నారు.
వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ప్రమేయాన్ని పాలస్తీనియన్లు ఎప్పుడూ వ్యతిరేకిస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా ఈ సంక్షోభం, ఉద్రిక్తత కొనసాగుతున్నాయి.
భవిష్యత్తులో స్వతంత్ర దేశంగా మారడానికి తమకు భూభాగం కావాలని పాలస్తీనియన్లు కోరుకుంటున్నారు. పాలస్తీనా ప్రజలకు అంతర్జాతీయ సమాజం మద్దతు ఎక్కువగా ఉంది.
పాలస్తీనా డిమాండ్‌ను తాము పరిగణనలోకి తీసుకోవడం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. వెస్ట్ బ్యాంక్‌లోని కొంత ప్రాంతాన్ని తమ భద్రత దృష్ట్యా ఎప్పుడూ తమ దగ్గరే ఉంచుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















