‘జపాన్ గగనతలంలోకి చైనా గూఢచర్య విమానం’

విమానం

ఫొటో సోర్స్, Japan Air Self-Defense Force

ఫొటో క్యాప్షన్, తమ గగనతలాన్నిచైనా ఉల్లంఘించిందన్న జపాన్
    • రచయిత, జోయెల్ గ్వింటో, నిక్ మార్ష్
    • హోదా, బీబీసీ న్యూస్

చైనాకు చెందిన గూఢచర్య విమానం తమ గగనతలాన్ని ఉల్లంఘించిందని జపాన్ ఆరోపించింది.

చైనా ఇలా నేరుగా జపాన్ గగనతల ఉల్లంఘనకు పాల్పడటం ఇదే తొలిసారి.

సోమవారం స్థానిక సమయం 11.29 నిమిషాలకు రెండు నిమిషాల పాటు డాంజో దీవుల్లో తమ ప్రాదేశిక గగనతలాన్ని చైనా వై-9 నిఘా విమానం ఉల్లంఘించిందని జపాన్ ఆరోపించింది. తరువాత తమ ఫైటర్ జెట్స్ రంగంలోకి దిగి చైనా విమానాన్ని వెనక్కు పంపాయని జపాన్ పేర్కొంది.

ఇలా గగనతల ఉల్లంఘనకు పాల్పడటం అసలు ఆమోదించదగినది కాదని, దీనికి నిరసనగా టోక్యోలో ఉన్న చైనా రాయబార కార్యాలయానికి జపాన్ చీఫ్ కేబినెట్ సెక్రటరీ సమన్లు జారీ చేశారు.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం పెరిగింది.

సోమవారం చొరబాటు సమయంలో చైనీస్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు జపాన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారని, కానీ దానిపై ఆయుధాలేమీ ప్రయోగించలేదని జపాన్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే తెలిపింది.

ఈ చొరబాటును తీవ్రంగా నిరసిస్తూ దౌత్య మార్గాల ద్వారా బీజింగ్‌ను సంప్రదించినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది.

భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని జపాన్ ప్రభుత్వం డిమాండ్ చూసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘ఏ దేశపు గగనతలాన్ని కూడా ఆక్రమించుకోవాలన్న ఉద్దేశం మాకు లేదు, ఏం జరిగిందో తెలుసుకునేందుకు సంబంధిత విభాగాలు ప్రయత్నిస్తున్నాయి’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్‌ చెప్పినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది.

తూర్పు చైనా సముద్రంలో ఉన్న సెంకాకు దీవుల్లో చైనీస్ నౌకలు తిరుగుతున్నట్లు టోక్యో ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దీవులు తమవని చైనా చెప్పుకుంటోంది. వీటిని బీజింగ్ డియోయు దీవులు అని పిలుస్తోంది.

ఈ దీవులలో జనావాసాలు లేవు. కానీ, చమురు, గ్యాస్ నిల్వలు బాగా ఉన్నాయి. బీజింగ్, దాని పక్క దేశాల(వాటిల్లో చాలా వరకు అమెరికా మిత్రదేశాలు) మధ్య ఘర్షణలకు ప్రధాన కారణాలలో ఇవి ఒకటి.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా అతిపెద్ద సైనిక స్థావరం జపాన్‌లోని ఒకినావా దీవిలో ఉంది. తైవాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియాలోనూ అమెరికా బలగాలున్నాయి.

‘‘జపాన్ గగనతలంలోకి నేరుగా ప్రవేశించేందుకు చైనా సాహసించనందున ఈ తాజా చొరబాటు కాస్త ఆందోళనకరంగా అనిపించవచ్చు’’ అని సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీకి చెందిన చైనా విదేశీ పాలసీ నిపుణులు ప్రొఫెసర్ ఇయాన్ చాంగ్ అన్నారు.

తైవాన్, ఫిలిప్పీన్స్‌ విషయంలో చైనా ప్రవర్తిస్తున్న తీరుకు ఇది అనుగుణంగా ఉంది.

గత నెలలో ఒక్క రోజులోనే ‘మధ్య రేఖ’ను దాటి చైనా సైనిక విమానాలు 66 సార్లు చొరబాటుకు పాల్పడ్డాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

తైవాన్ జలసంధిలో రెండు పక్షాల మధ్య అనధికారిక విభజనరేఖ ఇది.

ఈ మధ్య రేఖను అసలు బీజింగ్ గుర్తించడం లేదని తైవాన్ చెబుతోంది. గత రెండేళ్లలో వందలసార్లు ఆ దేశ విమానాలు ఈ రేఖను ఉల్లంఘించాయని ఆరోపించింది. ఆగ్నేషియాలో శాంతికి చైనా అతిపెద్ద విఘాతం అని ఫిలిప్పీన్స్ అంటోంది.

‘‘చైనా నుంచి ఇలాంటి రకమైన ప్రవర్తనను మనం అంచనావేయాలి. ఎందుకంటే, ఇది ఆందోళనకరమైన విషయం’’ అని ఫిలిప్పీన్స్ రక్షణ కార్యదర్శి గిల్బెర్టో టియోడోరో అన్నారు.

‘‘మేం పదేపదే చెబుతున్నట్లు చట్టవిరుద్ధంగా చైనా జరిపే ఈ రకమైన చర్యలను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి’’ అని సోమవారం అన్నారు.

అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ జేక్ సులివన్ ఈ వారంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ లీతో చర్చలు జరపనున్నారు.

(అదనపు సమాచారం: టోక్యో నుంచి చికా నకయామా)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)