ఇజ్రాయెల్ పైకి వందల రాకెట్లను ప్రయోగించిన హిజ్బొల్లా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

ఫొటో సోర్స్, EPA
- రచయిత, జరోస్లోవ్ లుకివ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
లెబనాన్‌లోని హిజ్బొల్లా స్థావరాలపై తమ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
లెబనాన్ కేంద్రంగా పనిచేసే హిజ్బొల్లా వందలాది క్షిపణులు, రాకెట్లతో ఇజ్రాయెల్ మీద దాడి చేసేందుకు యత్నించిందని, అందుకు ప్రతిస్పందనగా ఆ సంస్థ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చెప్పింది.
లెబనాన్‌లో హిజ్బొల్లా కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లోని సామాన్య పౌరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ముందుగానే హెచ్చరించామని ఇజ్రాయెల్ తెలిపింది.


ఫొటో సోర్స్, Getty Images
ప్రతీకార దాడులు..
గత నెలలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హిజ్బొల్లా సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ ఫౌద్ షుకుర్ చనిపోయారు. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన 11 స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 320కి పైగా రాకెట్లను ప్రయోగించినట్లు హిజ్బొల్లా తాజాగా ప్రకటించింది. ఆ ప్రకటన వచ్చిన వెంటనే లెబనాన్ మీద వైమానిక దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.
మరోవైపు, ఇజ్రాయెల్ అంతటా 48 గంటల పాటు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గల్లాంత్ ప్రకటించారు.
ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతంలో రాకెట్ల దాడులు జరగొచ్చనే హెచ్చరికలతో ఆదివారం ఉదయం సైరన్లు మోగాయి. ప్రాణ నష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు.
తాజా పరిణామాలతో అత్యవసరంగా సెక్యూరిటీ కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది.
తమ సీనియర్ కమాండర్ ఫౌద్ షుకుర్‌ను ఇజ్రాయెల్ అత్యంత దారుణంగా చంపేసిందని, అందుకు ప్రతీకారంగానే తాము ఈ దాడులు ప్రారంభించామని హిజ్బొల్లా ఒక ప్రకటన విడుదల చేసింది.
జులైలో లెబనాన్ రాజధాని బేరూత్ శివారు ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఫౌద్ షుకుర్ చనిపోయారు.
2023 అక్టోబర్ నెలలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి లెబనాన్ కేంద్రంగా పనిచేసే హిజ్బొల్లా, ఇజ్రాయెల్ తరచూ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.
హిజ్బొల్లాకు ఇరాన్ మద్దతిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
హిజ్బొల్లా అంటే ఏమిటి?
హిజ్బొల్లా అనేది షియా ముస్లిం సంస్థ. లెబనాన్‌లో రాజకీయంగా చాలా ప్రభావవంతమైనది. లెబనాన్‌లోని అత్యంత శక్తిమంతమైన సాయుధ దళం దీని నియంత్రణలో ఉంది.
ఇది 1980ల ప్రారంభంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా, ఈ ప్రాంతంలోని ఆధిపత్య షియా శక్తి అయిన ఇరాన్ దీనిని స్థాపించింది. లెబనాన్ అంతర్యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌ను ఆక్రమించాయి.
హిజ్బొల్లా 1992 నుంచి లెబనాన్ జాతీయ ఎన్నికలలో పాల్గొంటూ, ప్రధాన రాజకీయ శక్తిగా మారింది. దాని సాయుధ విభాగం లెబనాన్‌లోని ఇజ్రాయెల్, అమెరికా దళాలపై తీవ్రమైన దాడులు చేసేది.
2000 సంవత్సరంలో లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలిగినప్పుడు, తామే వారిని తరిమి కొట్టామని హిజ్బొల్లా చెప్పుకుంది.అప్పటి నుంచి హిజ్బొల్లా దక్షిణ లెబనాన్‌లో వేలాది మంది సిబ్బంది, క్షిపణులతో సహా అనేక రకాల ఆయుధాలను సమకూర్చుకుంటూ, వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఉనికిని వ్యతిరేకిస్తూ వస్తోంది.
పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలు, అరబ్ లీగ్ హిజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి.
2006లో హిజ్బొల్లా సరిహద్దులు దాటి దాడి చేసినప్పుడు హిజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగింది.
హిజ్బొల్లాను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌పై దాడి చేసినా, అది నిలదొక్కుకుని అప్పటి నుంచి తన ఫైటర్ల సంఖ్యను పెంచుకుని, మరింత మెరుగైన ఆయుధాలను సమకూర్చుకుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














