లెబనాన్‌-ఇజ్రాయెల్: ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తుందా, ఆపడానికి మధ్యవర్తులు ఏం చేస్తున్నారు?

బేరూత్‌లో స్థానికులు
ఫొటో క్యాప్షన్, పరిస్థితులు చక్కబడతాయని స్థానికులు ఆశిస్తున్నారు
    • రచయిత, ఆర్లా గెరిన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మిడిల్ఈస్ట్‌లో నెలకొన్న తీవ్ర సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో, లెబనాన్-ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధ నివారణకు అంతర్జాతీయ దౌత్యవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనని లెబనాన్ ప్రజలు నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

లెబనాన్-ఇజ్రాయెల్‌ల మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందా? గాజా శిథిలాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సాధ్యమేనా? బేరూత్, తెహ్రాన్‌లలో జరిగిన హత్యలకు ఇరాన్, హిజ్బుల్లాలు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటాయా? సంయమనం పిలుపును అవి పాటిస్తాయా? అనేవి చర్చనీయాంశంగా మారాయి.

బీబీసీ న్యూస్ వాట్సాప్ చానల్
బీరూట్‌లో ఒక బిల్‌బోర్డు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, "మేము అలసిపోయాము... లెబనాన్ యుద్ధం కోరుకోవడం లేదు" అని రాసిన బేరూత్ లోని ఒక బిల్‌బోర్డ్

లెబనాన్‌లో ఉత్కంఠ పరిస్థితులు

బేరూత్‌ ఆకాశంలో ఎగురుతున్న ఇజ్రాయెలీ యుద్ధ విమానాలు భారీ శబ్దాలు చేస్తున్నాయి.

ఇప్పటికే చాలామంది విదేశీ పౌరులు తమ ప్రభుత్వాల సలహాలను పాటించి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. చాలామంది లెబనీస్ సైతం దేశం విడిచిపోయారు.

అయితే, ఇక్కడ ఒక హిప్ కేఫ్‌లో పనిచేసే ఓ మహిళా షెఫ్‌లాగా (ఆమె తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు) చాలామంది నగరాన్ని, దేశాన్ని వదిలి వెళ్లలేకపోతున్నారు.

"బేరూత్‌లో నివసించడం అంటే మీరు తప్పించుకోలేని విషకూపంలో చిక్కుకుపోవడం లాంటిది." అని ఆమె అన్నారు.

“ఈ నగరంతో నాకు ఎమోషనల్ బాండింగ్ ఉంది. నా కుటుంబం విదేశాల్లో ఉంది. నేను వెళ్లిపోవచ్చు. కానీ, అది నాకు ఇష్టం లేదు. మేం రోజులు లెక్కపెట్టుకుంటూ జీవిస్తున్నాం. మేము ఈ పరిస్థితుల గురించి జోకులు వేసుకుంటాం’’ అని ఆమె అన్నారు.

తాను వ్యాపారంలో నష్టపోయానని, తనకు పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉందని ఆమె తెలిపారు. "ఇది నాకు ప్రచ్ఛన్న యుద్ధం లాంటిది" అని ఆమె అన్నారు.

అయితే, ఈ పరిస్థితి తొందర్లో మెరుగు పడుతుందని ఆమె భావిస్తున్నారు.

అమెరికా రాయబారి అమోస్ హోస్టెయిన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడం లేదని అమెరికా రాయబారి అమోస్ హోస్టెయిన్ అంటున్నారు.

మధ్యవర్తుల పైనే ఆశలు

ఈ ప్రాంతంలో అంతర్జాతీయ మధ్యవర్తులు ఆ దేశం నుంచి ఈ దేశానికి, ఈ దేశం నుంచి ఆ దేశానికి వస్తూ, పోతూ రెండు దేశాల మధ్య సంఘర్షణను నివారించే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో అమెరికా రాయబారి అమోస్ హోస్టెయిన్ ఒకరు.

"లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి యుద్ధాన్ని ఎవరూ నిజంగా కోరుకోవడం లేదు. ఈ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమని మేం అనుకుంటున్నాం." అని ఆయన అన్నారు.

హిజ్బుల్లా సన్నిహితుడు, పార్లమెంట్ స్పీకర్ నబీహ్ బెర్రీని కలిసిన తర్వాత ఆయన గత బుధవారం బేరూత్‌లో మాట్లాడారు.

యుద్ధాన్ని నివారించవచ్చా అన్న ప్రశ్నకు "అది జరుగుతుందనే అనుకుంటున్నా’’ అన్నారు హోస్టెయిన్.

అయితే, కాలం గడిచే కొద్దీ ప్రమాదాలు, పొరపాట్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

ఇజ్రాయెల్, హిజ్బుల్లాల మధ్య చివరిసారి 2006లో యుద్ధం జరిగినప్పుడు, అది ఆరు వారాల పాటు కొనసాగింది.

ఆ యుద్ధంలో లెబనాన్‌లో 200 మంది వరకు హిజ్బుల్లా సభ్యులతోపాటు 1,000 మందికి పైగా లెబనీస్ పౌరులు మరణించారు. ఇజ్రాయెల్‌లో 160 మంది మరణించగా, వారిలో ఎక్కువ మంది సైనికులు.

ఇప్పుడు మళ్లీ యుద్ధం జరిగితే దాని ఫలితాలు మరింత తీవ్రంగా, విధ్వంసకరంగా ఉంటాయని అన్ని పక్షాలు అంగీకరిస్తున్నాయి.

లెబనాన్‌లో చాలామంది యుద్ధం వల్ల కలిగే నష్టాలను భరించలేమని అంగీకరిస్తున్నారు.

ఇప్పటికే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. రాజకీయ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నగరాలలో కనీసం వీధి లైట్లు వెలగడం లేదు.

బేరూత్‌లోని కొలను దగ్గర చేపలు పడుతున్న ఓ నడివయసు మహిళ హిబా మస్కీని యుద్ధం గురించి అడిగినప్పుడు ‘‘యుద్ధం జరగదని నేను అనుకుంటున్నా. లెబనాన్ దాన్ని భరించలేదు." అన్నారు.

"వివేకం కలిగిన వ్యక్తులు పైచేయి సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. పరిస్థితులు చేయి దాటితే మనం వాటిని నియంత్రించలేము." అని చెప్పారు.

పైన ఆకాశంలో ఇజ్రాయెల్ విమానం వెళ్లిన ప్రతిసారీ ఆమె, " వాటి శబ్ధం వింటే ఆందోళనకు గురవుతున్నాను. వాళ్లు (ఇజ్రాయెల్ దళాలు) మా ఇంటి పైనో, విమానాశ్రయం మీదో బాంబు దాడి చేస్తారని భయపడుతున్నాను" అని చెప్పారు.

జీవనోపాధి కోసం పెర్‌ఫ్యూమ్‌లు అమ్మే హిబా, లెబనాన్ ఇప్పటికే చాలా నష్టపోయిందని అన్నారు.

"వ్యాపారం చేద్దామంటే భయంగా ఉంది. యుద్ధం ఎప్పుడు వచ్చి పడుతుందో తెలియదు." అని అన్నారు.

ఫువాద్ షుకర్ మరణం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హిజ్బుల్లా కమాండర్ ఫువద్ షుకర్‌ను చంపిన ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను ఎదుర్కొంటోంది

గత అక్టోబరులో హమాస్ దళాలు గాజా నుంచి దాడి చేసి దక్షిణ ఇజ్రాయెల్‌లో దాదాపు 1,200 మందిని హతమార్చడంతో, ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. చనిపోయిన వారిలో చాలామంది సాధారణ పౌరులు.

ఈ ఘర్షణలో తానూ చేరి, లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌లోకి కాల్పులు జరిపింది హిజ్బుల్లా.

షియా సాయుధ బృందం, రాజకీయ పార్టీ కూడా అయిన హిజ్బుల్లాను బ్రిటన్, అమెరికాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. తాము పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఇస్తున్నట్లు హిజ్బుల్లా చెప్పుకుంటుంది.

అక్టోబరు నుంచి హిజ్బుల్లా, ఇజ్రాయెల్ పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. దీని కారణంగా సరిహద్దుకు ఇరువైపులా వేలమంది పారిపోయారు.

లెబనాన్‌లో 500 మందికి పైగా మరణించారు. వారిలో ఎక్కువమంది హిజ్బుల్లా ఫైటర్లే. ఇజ్రాయెల్ తమవైపు 40 మంది మరణించినట్లు చెబుతోంది. వారిలో 26 మంది సైనికులు.

జులై చివరలో బేరూత్‌లో ఇజ్రాయెల్ దాడి చేసి సీనియర్ హిజ్బుల్లా కమాండర్‌ ఫువాద్ షుకర్‌ను చంపడంతో రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు ఆవరించాయి.

సిరియాలోని ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌పై రాకెట్ దాడిలో 12 మంది పిల్లలను చంపింది ఆ కమాండరే అని ఇజ్రాయెల్ ఆరోపించింది.

దీనికి ప్రతీకారంగానే ఆయనను అంతమొందించామని తెలిపింది.

హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఇజ్రాయెల్ ఇప్పటివరకు గాజాలో 40,000 మంది పాలస్తీనియన్లను చంపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ సంఖ్య నిజమే అని నిర్ధరించింది.

ఐమాన్ సక్ర్‌ అనే ట్యాక్సీ డ్రైవర్‌ ముందు యుద్ధం ప్రస్తావన తెచ్చినప్పుడు లెబనాన్ దానిని ఎదుర్కొంటుందని దీమా వ్యక్తం చేశారు.

"మాకు కొంత ఆందోళన ఉంది. కానీ ఎదుర్కొంటాం. మమ్మల్ని మేం రక్షించుకుంటాము. మేం చనిపోయినా ఫరవాలేదు.’’ అన్నారు.

ఆయన ఇజ్రాయెల్ చేతుల్లో మరణించిన వందలాది హిజ్బుల్లా దళ సభ్యులకు, ఆ సాయుధ సంస్థ నాయకుడికి నివాళులర్పించారు.

"నేను అరబ్బులందరినీ గర్వించేలా చేసిన హసన్ నస్రల్లాకు సెల్యూట్ చేస్తున్నాను. అందరూ ఇజ్రాయెల్ గురించి ఆందోళన చెందుతున్నారు. కానీ, ఇజ్రాయెల్ చంపిన 39,000 మంది సంగతేమిటి?’’ అని ఆయన ప్రశ్నించారు.

ఐదుగురు పిల్లల తండ్రి అయిన ఐమాన్, "ప్రతిరోజూ పిల్లలు, మహిళలు, వృద్ధులను కెమెరాల ముందు హత్య చేయడాన్ని ప్రపంచం చూస్తోంది. కానీ ఎవరూ మాట్లాడరు. నిశ్శబ్దంగా ఉన్నవాళ్లంతా వాళ్లకు సహకరిస్తున్నట్లే.” అన్నారు.

పూర్తిస్థాయి యుద్ధాన్ని నివారించవచ్చని హిబా ఇప్పటికీ భావిస్తున్నారు.

"సంస్థలు కావచ్చు, పార్టీలు కావచ్చు, సైన్యం కావచ్చు - ఎవరిని చంపే హక్కూ ఎవరికీ లేదు. కొత్త తరం ముందు తరంకంటే తెలివైనదని నేను అనుకుంటున్నాను.’’ అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

వీడియో క్యాప్షన్, కాల్పుల విరమణ ఒప్పందంపైనే ఆశలంటున్న లెబనాన్ పౌరులు..

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)