హిజ్బుల్లా పేజ‌ర్లు: ఇవి ఎలా పనిచేస్తాయి? ఎందుకు పేలిపోయాయి

పేజర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పేజర్
    • రచయిత, శ్రీకాంత్ బక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లెబనాన్‌ రాజధాని బేరూత్ సహా పలు ఇతర ప్రాంతాల్లో పేజర్లు పేలిన ఘటనల్లో 12 మంది మృతి చెందగా, 3వేల మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు లెబనాన్ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్ దౌత్య రాయబారి కూడా గాయపడినట్లు కూడా చెబుతున్నారు.

లెబనాన్ నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో అక్కడి స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఈ పేలుళ్లు జరిగాయి.

ఈ నేపథ్యంలో నేటి తరానికి పెద్దగా పరిచయం లేని పేజర్ గురించి చర్చ మొదలైంది.

దాదాపు పాతికేళ్ల కిందట, మొబైల్ ఫోన్‌లు రావడానికి ముందు పేజర్ల వాడకం విరివిగా ఉండేది. ఇప్పుడా టెక్నాలజీ పాతబడిపోవడంతో పేజర్‌లు కనుమరుగయ్యాయి.

మరి లెబనాన్ దేశంలో ఇవి పెద్ద సంఖ్యలో ఎందుకు వాడుతున్నారు? వీటిలో ఉండే టెక్నాలజీ ఏంటి? ఎలా వాడేవారు? ఇప్పుడు వాటి అవసరం ఎవరికి? తెలుసుకుందాం...

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇజ్రాయెల్, మొసాద్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బేరూత్ మెడికల్ సెంటర్ బయటి దృశ్యం

‘పుష్ప’ సినిమాలో పేజర్ ఎలా ఉపయోగించారు..?

సెల్‌ ఫోన్లలో సిమ్ కార్డ్‌కి నెంబర్లున్నట్లుగానే పేజర్లకు కూడా ప్రత్యేకమైన పేజర్ నెంబర్ ఉంటుంది. దానిని డయల్ చేయడం, లేదా కంప్యూటర్లో ఎంటర్ చేసి మెసేజ్ పంపించడం, లేదా పేజర్ కంపెనీకి ల్యాండ్‌లైన్ ద్వారా ఫోన్ చేసి సమాచారం చెప్పినా వారు ఆ నెంబర్ పేజర్‌కి సదరు సందేశాన్ని పంపేవారు.

ఇటీవల పుష్ప సినిమాలో కూడా పేజర్ ద్వారా డేంజర్ అన్న సందేశం హీరోకి పంపించినట్లు చూపించారు.

కొన్ని పేజర్లు కేవలం సిగ్నళ్లు రిసీవ్ చేసుకుంటాయి. అంటే దానికి వచ్చిన సమాచారం కేవలం చదువుకోడానికే వీలవుతుంది. కానీ తర్వాత కాలంలో టూ వే పేజర్లు అభివృద్ధి చేశారు. అంటే వీటి ద్వారా మనం సమాచారం తీసుకోవడంతో పాటు, దానికి తిరిగి సమాధానం కూడా ఇవ్వవచ్చు.

ఇజ్రాయెల్, మొసాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పేజర్ ఫైల్ ఫోటో

అసలేంటి పేజర్?

పేజర్ ద్వారా ఆల్ఫాన్యూమరిక్ టెక్ట్స్, లేదా చిన్నపాటి వాయిస్ మెసేజ్‌లు షేర్ చేసుకోవచ్చు. స్థూలంగా ఒక కమ్యూనికేషన్ పరికరం. 1950-60 మధ్య కాలంలో వీటిని తయారు చేసినా, 1980 తర్వాత వీటి వాడకం గణనీయంగా పెరిగింది.

2000 నాటికి ప్రపంచం వ్యాప్తంగా చాలా దేశాల్లో పేజర్ల వాడకం ఎక్కువగా ఉండేది. కానీ ఆ తర్వాత సెల్యూలార్ సేవలు ప్రారంభమవడంతో పేజర్ల వాడకం గణనీయంగా తగ్గిపోయింది.

సెల్యూలార్ ఫోన్లు వ్యక్తులతో నేరుగా మాట్లాడేందుకు వీలు కల్పించడంతో పేజర్లు మరుగున పడిపోయాయి. ఇక స్మార్ట్ ఫోన్ల రాకతో పేజర్ల వాడకం దాదాపుగా కనుమరుగైపోయింది.

కానీ హిజ్బుల్లా ఇప్పటికీ తమ కమ్యూనికేషన్ కోసం పెద్ద ఎత్తున పేజర్ల మీదనే ఆధారపడుతూ వస్తోంది.

తాజా దాడుల తర్వాత హిజ్బుల్లా తమ సభ్యులకు పేజర్లు వాడొద్దని, వీటి ద్వారా ఇజ్రాయెలీ భద్రతా దళాలు ట్రాక్ చేయొచ్చనీ హెచ్చరించింది.

ఇజ్రాయెల్, మొసాద్

ఫొటో సోర్స్, Reuters

పేజర్ ఎలా పనిచేస్తుంది?

పేజర్లు రేడియో తరంగాల మీద పనిచేస్తాయి. ట్రాన్స్‌మిటర్ నెట్‌వర్క్ ఆధారంగా వీటికి సమాచారం పంపించవచ్చు. వీటికి ఒక పేజింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఏర్పాటు చేస్తారు. అంటే సెల్యూలార్ సేవలు అందించే కంపెనీల మాదిరిగానే అప్పట్లో పేజర్ సర్వీసులు ఉండేవి.

అయితే సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ అందించే వైశాల్యం‌కన్నా ఒక పేజర్ ట్రాన్స్‌మిటర్ మరింత విస్తృతంగా రేడియో సిగ్నళ్లను పంపుతుంది.

తొలినాళ్లలో కేవలం నెంబర్లు మాత్రమే పేజర్లకు పంపగలిగేవారు. ఆ తర్వాత కాలంలో నెంబర్లతో పాటు, ఆల్ఫా న్యూమరిక్ మెసేజ్‌లు అంటే టెక్ట్స్ మెసేజ్‌లు కూడా పంపించేవారు. వీటి ద్వారా చిన్నచిన్న సందేశాలు అందేవి. వీటినే షార్ట్ మెసేజ్‌లు అనేవారు.

దీని ఆధారంగానే ఎస్సెమ్మెస్ అన్న పదం పుట్టింది. ఈ సేవలు అందించడాన్ని షార్ట్ మెసేజింగ్ సర్వీస్ అనేవారు.

పేజర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొదట్లో పేజర్ల ద్వారా చిన్న చిన్న సందేశాలు పంపేవారు.

పేజర్లు ఎన్ని రకాలు...?

తొలినాళ్లలో ఆసుపత్రులు, మిలటరీ, ఇతర అత్యవసర విభాగాలు ఒకేసారి ఎక్కువ మందికి ఒకే సమాచారం అందించేందుకు ఈ పేజర్లను ఉపయోగించుకునేవారు. అంటే ఒక సంస్థలో పనిచేసే వ్యక్తులందరి దగ్గరా పేజర్లు ఉంటే, వాటన్నింటికీ నిర్దిష్టమైన రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇలా ఒకే రేడియో ఫ్రీక్వెన్సీ ఉన్న పేజర్లకు బేస్ స్టేషన్ నుంచి ఒకేసారి ఒకే సందేశాన్ని, లేదా వరుస సందేశాలను పంపించవచ్చు.

పేజర్ టవర్లు పంపించే రేడియో సిగ్నళ్లు చాలా దూరం వరకూ వెళ్తాయి. వీటి బ్యాటరీ బ్యాకప్ కూడా వారాల తరబడి వస్తుంది. సిగ్నల్ అంతరాయాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.

లెబనాన్ మొస్సాద్ ఇజ్రాయెల్ పేజర్

ఫొటో సోర్స్, SocialMedia

ఫొటో క్యాప్షన్, లెబనాన్‌లో పేలిన పేజర్

హిజ్బుల్లా ఇప్పటికీ పేజర్లు ఎందుకు వాడుతోంది?

5జీ దాటి 6జీ వైపు పరుగులు తీస్తున్న ప్రపంచంలో ఇప్పటికీ హిజ్బుల్లా పేజర్లనే వాడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. అయితే దీని వెనుక పెద్ద కారణమే ఉంది.

హిజ్బుల్లా ఎక్కువగా తమ గ్రూప్ కమ్యూనికేషన్ కోసం పేజర్ల మీదనే ఆధారపడుతోంది. మొబైల్ ఫోన్లు వాడితే వాటి సిగ్నళ్ల ఆధారంగా తమ కదలికలను గుర్తించవచ్చన్న అనుమానంతో హిజ్బుల్లా పేజర్లకు ప్రాధాన్యతనిస్తోంది.

1996లో హమాస్ బాంబ్ తయారీ నిపుణుడు యాహ్యా అయ్యాష్‌ని ఇజ్రాయెల్ హత్య చేయడంతో సెల్‌ఫోన్ల వాడకం ప్రమాదకరమని గుర్తించి, వాటి వాడకాన్ని చాలా పరిమితం చేసింది హిజ్బుల్లా. దీంతో గ్రూప్ కమ్యూనికేషన్ కోసం పేజర్లపైనే ఆధారపడుతోంది.

అయితే తాజాగా హిజ్బుల్లా సభ్యులు వాడుతున్న ఈ పేజర్లు ఒక కొత్త బ్రాండ్‌కి చెందినవని, వాటిని గతంలో హిజ్బుల్లా ఎప్పుడూ వాడలేదని ఆ సంస్థకు చెందిన అధికారి ఒకరు ఏపీ వార్తా సంస్థకు తెలిపారు.

పైగా పేజర్ల వాడకం చాలా సులువు. ఒక్కసారి రీచార్జ్ చేస్తే వీటి బ్యాటరీ బ్యాకప్ వారాల తరబడి వస్తుంది. ఎడారులు, అడవులు వంటి సంక్లిష్ట ప్రాంతాల్లో కూడా పేజర్లు సమర్థంగా పనిచేస్తాయి.

తొలితరంలో తయారైన ఒక పేజర్ ట్రాన్స్‌మీటర్, 40 కిలోమీటర్ల పరిధి వరకూ పేజర్లకు సందేశాలను పంపించగలిగేది. చెట్లు, నిర్మాణాలు వంటి అడ్డంకుల్ని కూడా దాటుకుని ఈ సిగ్నళ్లు సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి.

అందుకే హిజ్బుల్లా సహా కొన్ని దేశాల్లో అవసరాన్ని బట్టి ఈ పేజర్లను ఇప్పటికీ వాడుతున్నారు.

పేజర్

ఫొటో సోర్స్, EPA

పేజర్లు ఎలా పేలుతాయి?

తొలినాళ్లలో వాడే పేజర్లలో సాధారణ ట్రిపుల్ A బ్యాటరీలను వాడేవారు. ఆ తర్వాత పేజర్ తయారీ సంస్థలు వాటి పరిమాణాన్ని తగ్గించడానికి వీటిలో చిన్న పరిమాణంలో ఉండే బ్యాటరీలను వాడటం మొదలు పెట్టాయి.

పేజర్లు ఫస్ట్ జనరేషన్ సెల్‌ఫోన్లతో పోలిస్తే చాలా తక్కువ విద్యుత్‌ని వాడతాయి. ఒక బ్యాటరీ వేస్తే దాని బ్యాకప్ వినియోగాన్ని బట్టి వారాల తరబడి వస్తుంది. అయితే తొలినాళ్లలో లిథియం అయాన్ బ్యాటరీలు వీటిల్లో ఎక్కువగా వాడేవారు కాదు.

కానీ ఇటీవలి కాలంలో కొత్తగా తయారు చేస్తున్న పేజర్లలో చిన్న పరిమాణంలో ఉండే లిథియం అయాన్ బ్యాటరీలు వాడుతున్నారు.

అయితే, లిథియం అయాన్ బ్యాటరీలు ప్రమాదకరం.

సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైకుల్లో లిథియం అయాన్ బ్యాటరీలు వాడకం విరివిగా ఉంటోంది. సరైన రీతిలో చార్జింగ్ చెయ్యకపోయినా, లేక బ్యాటరీలపై భౌతికంగా ఒత్తిడి పెంచినా, అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ లిథియం బ్యాటరీలు పేలిపోయే ప్రమాదముంది.

చిన్న బ్యాటరీ పేలినా దాని నుంచి పెద్ద ఎత్తున పొగ, మంటలు చెలరేగుతాయి. ఫోన్ బ్యాటరీ పేలి వ్యక్తులు మరణించిన వార్తలు తరచూ మనం చూస్తూనే ఉంటాం. ఇక ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లలో ఈ లిథియం బ్యాటరీలు పేలడం వల్ల భారీ ప్రమాదాలే సంభవించిన ఘటనలు చాలానే ఉన్నాయి.

ఈ లిథియం బ్యాటరీలున్న ఎలక్ట్రానిక్ పరికరాలను తీవ్రంగా వాడినప్పుడు ఆ బ్యాటరీల్లో ఉష్ణోగ్రత 50 డిగ్రీల వరకూ పెరుగుతుంది. ఒకవేళ ఆ బ్యాటరీ పేలినప్పుడు సుమారు 400 డిగ్రీల సెల్సియస్ వరకూ తీవ్రమైన ఉష్ణోగ్రతతో అవి మండుతాయి. బ్యాటరీ పరిమాణం బట్టి దాని పేలుడు తీవ్రత ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)