రుచికరమైన పులస చేప భారత్‌, బంగ్లాదేశ్‌ సంబంధాలను చేదెక్కిస్తోందా?

పులస, pulasa,

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిస్వాస్, ఎతిరాజన్ అన్బరసన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

పులస.. ఈ పేరు వింటేనే గోదావరి జిల్లాలు సహా తెలుగు ప్రజల్లో చాలామందికి నోరూరిపోతుంది.

బంగాళాఖాతంలోంచి గోదావరిలోకి ఎదురీదుతూ వచ్చే పులస చేపకు విపరీతమైన గిరాకీ.

ముఖ్యంగా వినాయక చవితికి ముందు గోదావరి నదిలో దొరికే పులసకు మరింత క్రేజ్.

తెలుగు రాష్ట్రాలలో పులసగా పిలిచే ఈ చేపను ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో హిల్సా అంటారు.

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లోనూ దీన్ని హిల్సా అనే పిలుస్తారు.

బంగ్లాదేశ్‌లోని కొత్త ప్రభుత్వం ఇప్పుడు అక్కడి పులసను భారత్‌కు రాకుండా అడ్డుకుంటోంది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హిల్సా చేప

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశీ మార్కెట్‌లో హిల్సా చేపలు

దసరా సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రజలు హిల్సా చేపలను ఎంతో ఇష్టంగా తింటుంటారు.

కానీ, ఈసారి ఆ చేపలు దొరకడం కష్టంగా మారేలా ఉంది. ఎందుకంటే హిల్సా చేపలను భారత్‌కు అధికంగా ఎగుమతి చేసే బంగ్లాదేశ్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది.

బంగ్లాదేశ్‌‌లో నూతన ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇది ఒకటి. ఈ నిర్ణయం వల్ల బంగ్లాదేశ్‌లోని ప్రజలకు హిల్సా చేపలు ఇక నుంచి విరివిగా దొరుకుతాయని బంగ్లాదేశ్ మత్స్య‌శాఖ సలహాదారు ఫరిదా అక్తర్ అన్నారు.

సాధారణంగా నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ భారీ స్థాయిలో భారత్‌కు ఈ చేపలు ఎగుమతి అవుతూనే ఉంటాయి.

కానీ, ఈసారి హిల్సా బంగ్లా సరిహద్దులు దాటకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఫరీదా అక్తర్ బీబీసీతో చెప్పారు.

భారత్-బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హిల్సా చేప వంటకాలను బెంగాలీలు ఇష్టంగా తింటారు.

షేక్ హసీనా ‘హిల్సా రాయబారం’ ఇక చరిత్రేనా?

హిల్సాను బంగ్లాదేశ్ జాతీయ చేపగా పిలుస్తుంటారు. వీటి ధర కూడా చాలా ఎక్కువ. పేదలు కొనలేరు. మధ్యతరగతి, ధనికులకు మాత్రమే వీటిని కొనే శక్తి ఉంటుంది.

బంగ్లాదేశ్‌లో హిల్సా చేప ఎగుమతిపై ఎప్పటికప్పుడు ఆంక్షలు ఉంటున్నప్పటికీ, గతంలో ప్రభుత్వాలు దసరా సందర్భంగా హిల్సా చేపలపై నిషేధాన్ని ఎత్తివేసేవి. దీనిని బెంగాల్ ప్రజలకు గిఫ్ట్ అని చెప్పుకునేవారు.

‘‘ఈ సంవత్సరం ఈ గిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం మాకు లేదు. ఎందుకంటే అలా ఇస్తే మా దేశ ప్రజలకు ఈ చేప విరివిగా దొరకదు’’ అని ఫరిదా అక్తర్ అన్నారు.

గతంలో షేక్ హసీనా భారత్‌తో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు దసరా పండుగ సమయంలో భారత్‌కు హిల్సా చేపల ఎగుమతిని అనుమతించేవారు. దీనిని ‘హిల్సా రాయబారం’గా చెప్పుకునే వారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షేక్ హసీనా అనేక సందర్భాల్లో హిల్సా చేపను బహుమతిగా పంపించారు. 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి 30 కేజీల హిల్సా చేపను బహుమతిగా పంపారు షేక్ హసీనా.

ఐతే, ఈ ఏడాది ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో చెలరేగిన ఆందోళనలు, అల్లర్ల కారణంగా హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆమెకు రాజకీయ శరణార్థిగా భారత ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చింది.

హిల్సా చేప
ఫొటో క్యాప్షన్, కోల్‌కతాలోని ఓ హోల్‌సేల్ చేపల మార్కెట్‌లో హిల్సా చేపలు

హిల్సా విషయంలో బంగ్లా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, గతంలో భారత్‌కు అనుకూలంగా షేక్ హసీనా అనుసరించిన ‘హిల్సా డిప్లొమసీ’ని పూర్తిగా పక్కనబెట్టే నిర్ణయంలా కనిపిస్తోంది.

పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌తో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడం భారత్‌కు కీలకం. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో సరిహద్దులు పంచుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతల దృష్ట్యా భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంతో సామరస్యంగా ఉండాలని ఆలోచిస్తోంది. కానీ, ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్రం ఆలోచనలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

‘‘భారత్‌తో సఖ్యంగా ఉండటానికి మేం అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తాం. కానీ మా సొంత ప్రజల ఆంకాంక్షలకు విరుద్ధంగా మాత్రం ముందుకెళ్లలేం’’ అని అక్తర్‌ మీడియాతో అన్నారు.

బంగ్లాదేశ్, హిల్సా డిప్లొమసీ, షేక్ హసీనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హిల్సా చేపల ఫ్రై బెంగాల్‌లో చాలా ఫేమస్

ఒక కేజీ హిల్సా ధర ఎంత?

హిల్సా చేపలు పెరిగే దేశాల్లో బంగ్లాదేశ్‌దే అగ్రస్థానం. ఈ చేప బంగాళాఖాతంలో లభించే హెర్రింగ్ జాతితో దగ్గరి సంబంధం ఉన్నది. నదులలో కూడా ఈ చేపలు ఉంటాయి.

బంగ్లాదేశ్‌లో ఉత్పత్తి అవుతున్న చేపల్లో హిల్సా వాటా 12 శాతం. దేశ జీడీపీలో దీని వాటా ఒక శాతం. ఏటా 6 లక్షల టన్నుల హిల్సా చేపలను మత్య్సకారులు పడుతుంటారు.

ఇంత ప్రత్యేకమైన ఈ చేప 2017లో జియోగ్రాఫికల్ ఇండికేటర్-జీఐ గుర్తింపు కూడా పొందింది.

ఏటా దుర్గా పూజ ఉత్సవాల సమయంలో భారత్‌కు 3 నుంచి 5 వేల టన్నుల హిల్సా చేపలు ఎగుమతి చేసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతించేదని బంగ్లాదేశ్ మత్స్యశాఖ‌కు చెందిన సీనియర్ అధికారి నృపేంద్ర‌నాథ్ బిస్వాస్ ‘ది డైలీ స్టార్’ వార్త పత్రికతో చెప్పారు.

భారత్‌కు ఎగుమతి తగ్గిస్తే బంగ్లాదేశ్ మార్కెట్‌లో డిమాండ్‌కు తగినట్లుగా హిల్సా చేపలు లభ్యమవుతాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ పరిస్థితుల్లో చేప ధరలు తగ్గాలి. కానీ, ప్రస్తుతం అక్కడ మార్కెట్లలో ధరలు పెరిగిపోయాయని బంగ్లాదేశ్ మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తున్నాయి.

ఒక కేజీ హిల్సా ధర 1,500 టాకాలు( సుమారు రూ.1050). గతేడాదితో పోల్చితే కేజీ మీద 150 నుంచి 200 టాకాలు ( సుమారు రూ.100-140) పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

ఐతే, వాతావరణ మార్పుల కారణంగా మూడు నెలలుగా సముద్రంలో హిల్సా చేపలు పట్టడం కష్టంగా మారిందని, అందుకే ధరలు పెరిగాయని బంగ్లాదేశ్ మత్య్సకారుడు హుస్సేన్ చెప్పారు.

బంగ్లాదేశ్,భారత్

ఫొటో సోర్స్, Getty Images

‘హిల్సా: ది డార్లింగ్ ఆఫ్ వాటర్స్’

బెంగాలీ వంటకాల్లో హిల్సా‌కు ప్రత్యేక స్థానం ఉంది. రుచికి రుచితోపాటు అనేక రకాలుగా దీనిని వండుకోవచ్చు. ఈ చేపను బెంగాలీ ఫుడ్‌కు ఓ చిహ్నంగా చెబుతారని బెంగాలీ-అమెరికన్ రచయిత చిత్రా బెనర్జీ అన్నారు.

‘‘ఈ చేపను డార్లింగ్‌ ఆఫ్ వాటర్స్, ప్రిన్స్ ఎమాంగ్ ఫిష్‌గా పలువురు రచయితలు అభివర్ణిస్తుంటారు’’ అని చిత్రా బెనర్జీ వెల్లడించారు.

ఇంత ప్రత్యేక స్థానం ఉన్న హిల్సా చేపపై నిషేధాజ్ఞలు విధించడం సరిహద్దులకు రెండువైపులా ఉన్న బెంగాలీలలో అసహనం కలిగిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)