‘పసికందుపై వేడి కాఫీ పోసి పరారయ్యాడు’

ఫొటో సోర్స్, Queensland Police
- రచయిత, హన్నా రిచీ
- హోదా, బీబీసీ న్యూస్, సిడ్నీ
బ్రిస్బేన్‌లో ఒక చిన్నారిపై మరుగుతున్న కాఫీని పోసి, ఆ తరువాత దేశం విడిచిపెట్టి పారిపోయినట్లు భావిస్తున్న ఒకరిని పట్టుకునేందుకు ఆస్ట్రేలియా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వారు ఇతర దేశాల పోలీసులతో కలిసి పనిచేస్తున్నారు.
గత నెలలో జరిగిన ఈ ఘటనలో 9 నెలల చిన్నారి ముఖం, ఇతర శరీర భాగాలు తీవ్రంగా కాలిపోయాయి.
హాని కలిగించే ఉద్దేశ్యంతోనే చిన్నారిపై భౌతిక దాడి చేశారంటూ 33 ఏళ్ల వ్యక్తిపై క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
ఈ నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది.
అయితే, ఈ ఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి సిడ్నీ విమానాశ్రయం నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు.
చిన్నారిపై వేడి కాఫీ పోసిందెవరో తాము గుర్తించడానికి 12 గంటల ముందే నిందితుడు పారిపోయినట్లు పోలీసులు సోమవారం చెప్పారు.

ఆగస్ట్ 31న ఓ జంట తమ చిన్నారితో కలిసి సబర్బన్ పార్క్‌లో విహారయాత్రకు వచ్చారు. అయితే, ఓ వ్యక్తి హఠాత్తుగా వచ్చి ఆ చిన్నారిపై ఫ్లాస్క్‌లోని వేడి కాఫీ పోసి పరారయ్యాడు.
వెంటనే ఆ చిన్నారికి ప్రథమ చికిత్స చేశారు. వెంటనే సమీపంలోని ఓ నర్స్(డ్యూటీలో లేరు) తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి చల్లని నీటితో కాలిన గాయాలను కడిగారు.
అయినప్పటికీ చిన్నారికి తీవ్ర గాయాలున్నాయని, సర్జరీ అవసరమని.. కోలుకోవడానికి ఏడాది పడుతుందని తల్లిదండ్రులు చెప్పారు.
నిందితుడు ఎందుకు ఇలా చేశాడన్నది తెలియదని డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ పాల్ డాల్టన్ మీడియాతో చెప్పారు.
తన కెరీర్‌లోని సంక్లిష్టమైన కేసుల్లో ఇది కూడా ఒకటని డాల్టన్ చెప్పారు.
నిందితుడు ఏ దేశానికి పారిపోయాడో, అతని పేరేమిటో కూడా పోలీసులకు తెలుసని.. కానీ, ఇప్పుడు ఆ వివరాలన్నీ చెప్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని డాల్టన్ అన్నారు.
పని కోసం వివిధ దేశాలకు తిరిగే నిందితుడు 2019 నుంచి ఆస్ట్రేలియాకు పలుమార్లు వచ్చినట్టు దర్యాప్తు అధికారులు చెప్తున్నారు.
న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా ప్రాంతాల్లో ఆయనకు చిరునామాలు ఉన్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, Queensland Police
పోలీసులు ఎలా వ్యవహరిస్తారో నిందితుడికి తెలుసని, అందుకే వారి నుంచి తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని డాల్టన్ అన్నారు.
నిందితుడు దేశం విడిచి పారిపోయినట్లు తెలియడంతో వేదనకు గురయ్యామని చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు.
‘నిందితుడిని త్వరలోనే పట్టుకుంటాం అని పోలీసులు చెబుతున్నారు.. కానీ, మా బాబుకు ఎప్పటికి న్యాయం దొరుకుతుందో ఎవరికి తెలుసు? అప్పటివరకు మేం ఎదురుచూడవలసిందే" అని ఆ చిన్నారి తల్లి ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌తో అన్నారు.
‘చికిత్సకు త్వరగా స్పందిస్తున్నాడు. కానీ ఇంకా స్కిన్ గ్రాఫ్ట్ సర్జరీలు చేయాల్సి రావచ్చు’ అని చిన్నారి తండ్రి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














