18 మంది పిల్లలున్న గదిలో భయంకరమైన నిశ్శబ్దం, ఏడవడానికీ శక్తి లేనంత బలహీనం

అఫ్గానిస్తాన్, పోషకాహార లోపం

ఫొటో సోర్స్, BBC/Imogen Anderson

ఫొటో క్యాప్షన్, బీబీసీ జలాలాబాద్ ఆసుపత్రిని సందర్శించినప్పుడు బేబీ బీబీ హజీరా ప్రాణాల కోసం పోరాడుతోంది.
    • రచయిత, యోగితా లిమయే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

(గమనిక: ఈ కథనంలోని అంశాలు, ఫొటోలు మనసును కలచివేయొచ్చు)

‘ఇది నాకు చివరి రోజు లాంటిది. నాకు చాలా బాధగా ఉంది. నా పిల్లలు చనిపోతుంటే చూస్తూ ఉండటం నాకు ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా?” అని అమినా అడిగారు.

ఆమె ఆరుగురు పిల్లలు చనిపోయారు. వారిలో ఎవరూ మూడేళ్లకు మించి బతకలేదు. మరో బిడ్డ ప్రాణాల కోసం పోరాడుతోంది.

ఏడు నెలల బీబీ హజీరాను చూస్తుంటే అప్పుడే పుట్టిన శిశువు సైజులో ఉంది. ఆమె తీవ్రమైన పోషకాహార లోపంతో బాధ పడుతోంది.

హజీరా అఫ్గానిస్తాన్‌లోని జలాలాబాద్ ప్రాంతంలో ఉన్న ఓ ఆసుపత్రి వార్డులో బెడ్ మీద ఉంది.

‘పేదరికం వల్ల నా పిల్లలు చనిపోతున్నారు. నేను వాళ్లకు ఇవ్వగలిగిన ఆహారం ఎండిపోయిన రొట్టె, ఎండలో వేడి చేసిన నీళ్లు మాత్రమే” అని అమినా చెప్పింది.

ఆమె మాటలు బాధతో అరుస్తున్నట్లుగా ఉన్నాయి.

బీబీసీ
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అఫ్గానిస్తాన్, జలాలాబాద్, ఆసుపత్రులు

ఫొటో సోర్స్, BBC/Imogen Anderson

ఫొటో క్యాప్షన్, ఈ ఆసుపత్రిలో ఏడు బెడ్ల మీద 18 మంది శిశువులు ఉన్నారు.

అఫ్గానిస్తాన్‌లో తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న 32 లక్షల మందిలో బీబీ హజీరా ఒకరు.

పోషకాహార లోపం అనేది అఫ్గానిస్తాన్‌ను దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న సమస్య. 40 ఏళ్ల యుద్ధం, తీవ్రమైన పేదరికం, మూడేళ్ల తాలిబాన్ పాలన వంటి అనేక అంశాలు దీనికి కారణమయ్యాయి.

ప్రస్తుతం ఇది మరింత తీవ్రమైన స్థాయికి చేరింది.

32 లక్షల మంది పిల్లలు ఇలా ఉన్నారని ఊహించడం చాలా కష్టం. ఈ చిన్న ఆసుపత్రి గదిలోని పిల్లల కష్టం రానున్న విపత్తుకు ఒక ఉదాహరణ.

జలాలాబాద్‌లోని ఈ ఆసుపత్రిలో ఏడు బెడ్ల మీద 18 మంది శిశువులు ఉన్నారు.

అంతమంది పిల్లలున్న ఆ గదిలో ఏడుపు అనేదే వినిపించడం లేదు. అక్కడ ఆవరించిన భయంకరమైన నిశ్శబ్దాన్ని పల్స్ రేట్ మానిటర్ చేస్తున్న ‘బీప్ బీప్’ శబ్దాలు మాత్రమే భగ్నం చేస్తున్నాయి.

అక్కడున్న పిల్లల్లో చాలామంది ముఖాలకు ఆక్సిజన్ మాస్క్‌లు లేవు, నిద్రపుచ్చే మందులూ ఇవ్వలేదు. కానీ, వారెవరూ శబ్దం చేయడం లేదు.

అటూఇటూ కదలడానికి, శబ్దం చేయడానికి కూడా శక్తి లేనంత బలహీనంగా ఉన్నారు.

బీబీ హజీరాతో బెడ్‌ను పంచుకుంటున్న మూడేళ్ల సనా ఎరుపు రంగు గౌను ధరించి ఉంది. ఆమె చిన్న చెయ్యి తన మొహాన్ని కవర్ చేస్తోంది.

ఆమె తల్లి మరో బిడ్డకు జన్మనిస్తూ కొన్ని నెలల కిందట చనిపోయారు. ప్రస్తుతం సనా బాధ్యత ఆమె పిన్ని లైలా చూసుకుంటున్నారు.

లైలా పరిస్థితేమీ భిన్నం కాదు. ఆమె నా చేతిని తాకుతూ ఏడు వేళ్లను చూపించారు.

అది ఆమె కోల్పోయిన బిడ్డల సంఖ్య.

ఆ పక్కనే ఉన్న బెడ్ మీద మూడేళ్ల ఇల్హామ్ ఉన్నాడు. చూస్తుంటే మూడేళ్ల పిల్లాడిలా లేనేలేడు. చాలా చిన్నగా కనిపిస్తున్నాడు. చేతులు, కాళ్లు, మొహంపై ఉన్న చర్మం పట్టుకుంటే ఊడిపోయేలా ఉంది. మూడేళ్ల కిందట అతని అక్క పోషకాహార లోపంతోనే చనిపోయింది. అప్పటికి ఆమె వయసు రెండేళ్లే.

ఏడాది వయసున్న ఆస్మా వైపు చూస్తుంటేనే బాధ కలుగుతోంది. ఆమెకు అందమైన మెరుస్తున్న కళ్లు, పొడవాటి కనుబొమ్మలు ఉన్నాయి. కానీ, కళ్లు అలా తెరుచుకునే ఉన్నాయి. ఆమె మొహం అంతటినీ కవర్ చేస్తూ ఆక్సిజన్ మాస్క్ ఉంది. శ్వాస పీల్చుకోవడానికే కష్టపడుతున్న ఆ చిన్నారి శక్తి లేక అప్పుడప్పుడూ కనురెప్పలు ఆర్పుతోంది.

అఫ్గానిస్తాన్, జలాలాబాద్, పోషకాహార లోపం

ఫొటో సోర్స్, BBC/Imogen Anderson

ఫొటో క్యాప్షన్, బేబీ ఆస్మా

ఆస్మా బెడ్ పక్కనే నిల్చున్న డాక్టర్ సికందర్ ఘని తల అడ్డంగా ఊపుతూ ‘ఆమె బతుకుతుందనుకోను’ అన్నారు.

ఆస్మా చిన్న శరీరం అప్పటికే సెప్టిక్ షాక్‌లోకి జారుకుంది. సెప్టిక్ షాక్ అంటే ఇన్ఫెక్షన్‌లు వంటివి సోకిన తరువాత రక్తపోటు బాగా తగ్గిపోవడం.

గదిలో వైరాగ్యం పరుచుకున్న పరిస్థితుల మధ్య కూడా నర్సులు, తల్లులు పిల్లలకు ఆహారం తినిపిస్తున్నారు, ఓదారుస్తున్నారు. కానీ, అదంతా ఒక్కసారిగా ఆగిపోయింది. అందరి మొహాల్లో ఒక్కసారిగా బాధ అలముకుంది.

ఆస్మా తల్లి నసిబా ఏడుస్తున్నారు. ఆమె తన మొహం మీద ముసుగు తొలగించి తన బిడ్డను ముద్దు పెట్టుకునేందుకు కిందకు వంగారు.

“నా ఒంట్లో నుంచి మాంసం కరిగిపోతున్నట్లుగా ఉంది. పాప బాధను చూడలేకపోతున్నాను’ అంటూ ఆమె ఏడుస్తున్నారు. నసిబా ఇప్పటికే ముగ్గురు పిల్లలను కోల్పోయారు.

“నా భర్త కూలీ. ఆయనకు పని దొరికితేనే, మాకు ఆహారం లభిస్తుంది”

ఆస్మాకు ఏ క్షణాన్నైనా గుండెపోటు రావచ్చు అని డాక్టర్ ఘనీ చెప్పారు. మేం ఆ గది నుంచి బయటకు వచ్చిన గంట తర్వాత ఆమె చనిపోయింది.

ఈ ఆసుపత్రిలో గత ఆరు నెలల్లో 700 మంది చిన్నారులు చనిపోయారు. రోజుకు ముగ్గురికి పైనే చనిపోయినట్లు నాంగర్హర్‌లోని తాలిబాన్ ప్రజారోగ్య విభాగం బీబీసీతో చెప్పింది.

ఈ సంఖ్య చాలా పెద్దది, అయితే యునిసెఫ్ అందిస్తున్న నిధుల సాయంతో ప్రపంచ బ్యాంకు ఈ ఆసుపత్రిని నిర్వహిస్తూ ఉండకపోయుంటే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది.

2021 ఆగస్ట్ వరకు, అఫ్గానిస్తాన్‌లోని అన్ని ప్రభుత్వాసుపత్రులకు అప్పటి ప్రభుత్వం అంతర్జాతీయ నిధులను నేరుగా అందించేది.

తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత, అంతర్జాతీయ ఆంక్షల కారణంగా నిధులు నిలిచిపోయాయి. దీంతో ఆరోగ్యవ్యవస్థ కుప్పకూలింది. దీంతో అత్యవసర తాత్కాలిక సాయం కోసం సహాయ సంస్థలు రంగంలోకి దిగాయి.

అఫ్గానిస్తాన్, జలాలాబాద్, డాక్టర్ ఘనీ

ఫొటో సోర్స్, BBC/Imogen Anderson

ఫొటో క్యాప్షన్, డాక్టర్ ఘనీ

బయట నుంచి అందే సహాయం అనేది ఆధారపడదగిన పరిష్కారం కాదు. చాలా ప్రపంచ దేశాలు ఇప్పుడు అనేక సమస్యల్లో ఉన్నాయి. దీంతో అఫ్గానిస్తాన్‌కు వచ్చే సాయం తగ్గిపోయింది. దీనికి తోడు తాలిబాన్ ప్రభుత్వ విధానాలు, మహిళలపై ఆంక్షలు వంటి కారణాలతో కొన్ని దేశాలు నిధులు నిరాకరిస్తున్నాయి.

‘పేదరికం, పోషకాహారలోపం మాకు వారసత్వంగా వచ్చింది. వాతావరణ మార్పుల వల్ల వస్తున్న వరదలు, ప్రకృతి విపత్తులతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అంతర్జాతీయ సమాజం మానవీయ సాయాన్ని పెంచాలి. వాళ్లు దీన్ని రాజకీయాలు, మా అంతర్గత వ్యవహారాలకు ముడిపెట్టకూడదు” అని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిరాత్ బీబీసీతో చెప్పారు.

గత మూడేళ్లలో మేం పదుల సంఖ్యలో ఆరోగ్య కేంద్రాలను సందర్శించాం. పరిస్థితి దారుణంగా దిగజారిపోవడాన్ని చూశాం. మేం గతంలో ఆసుపత్రులను సందర్శించినప్పుడల్లా పిల్లలు చనిపోవడాన్ని ప్రత్యక్షంగా గుర్తించాం.

సకాలంలో చికిత్స అందితే పిల్లల ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేది. మేం జలాలాబాద్ ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడ దయనీయమైన స్థితిలో ఉన్న బీబీ హజీరా ఇప్పుడు కోలుకుందని, ఆమెను డిశ్చార్జ్ చేశామని డాక్టర్ ఘనీ మాకు ఫోన్ చేసి చెప్పారు.

‘మా దగ్గర మరిన్ని ఔషధాలు, వైద్య వసతులు, సిబ్బంది ఉంటే మరికొందరు చిన్నారులనూ కాపాడగలిగేవాళ్లం. మా వైద్య సిబ్బంది కృత నిశ్చయంతో ఉన్నారు. విరామం లేకుండా పని చేస్తున్నాం. ఇంకా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని ఆయన మాతో చెప్పారు.

“నాకు కూడా పిల్లలు ఉన్నారు. ఒక పిల్లవాడు చనిపోయినప్పుడు, మాకు కూడా ఆవేదన కలుగుతుంది. పిల్లల తల్లిదండ్రులు హృదయ వేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు” అని ఘనీ బాధపడ్డారు.

అఫ్గానిస్తాన్, జలాలాబాద్, పిల్లల ఆసుపత్రి

ఫొటో సోర్స్, BBC/Imogen Anderson

ఫొటో క్యాప్షన్, చిన్నారి బీబీ ఉమ్రా, ఈ ఫొటో తీసిన రెండు రోజులకు ఉమ్రా చనిపోయారు.

మరణాలు పెరగడానికి పోషకాహార లోపం ఒక్కటే కారణం కాదు. ఇతర వ్యాధుల కారణంగానూ పిల్లలు చనిపోతున్నారు. అయితే, అవి నయం చేయదగ్గ, నివారించదగ్గ వ్యాధులే.

పోషకాహార లోపంతో బాధ పడుతున్న చిన్నారులకు చికిత్స అందిస్తున్న వార్డు పక్కన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంది. అందులో న్యూమోనియాతో బాధ పడుతున్న ఆరు నెలల చిన్నారి ఉమ్రా ఉంది. ఉమ్రా తల్లి నస్రీన్ ఆమె పక్కనే కూర్చుని ఉన్నారు. ఆమె కళ్ల నుంచి జారుతున్న కన్నీరు చెంపలపై ధార కట్టింది.

“నా పాపకు బదులు నేను చనిపోతే బావుండు. నాకు చాలా భయంగా ఉంది” అని ఆమె చెప్పారు. మేం ఆసుపత్రి సందర్శించిన రెండు రోజుల తర్వాత ఉమ్రా చనిపోయిందని తెలిసింది.

ఇవి ఆసుపత్రిలో చేరిన వారి, రాగలిగిన వారి కథలు. ఆసుపత్రులకు వచ్చే పరిస్థితుల్లో లేని వారి సంఖ్యకు లెక్కే లేదు. చికిత్స అవసరమైన ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే జలాలాబాద్ ఆసుపత్రికి రాగలుగుతున్నారు.

ఆస్మా చనిపోయిన తర్వాత హాస్పిటల్ మీద ఒత్తిడి మరింత పెరిగింది. ఆస్మా ఉన్న బెడ్‌ ఖాళీ అయిన కాసేపటికే అక్కడకు మూడు నెలల ఆలియాను తీసుకొచ్చారు.

అక్కడ ఏం జరిగిందో గమనించేందుకు ఆ గదిలో ఉన్న ఎవరికీ తీరిక లేదు. అక్కడ విషమంగా ఉన్న మరో బిడ్డకు చికిత్స అందించాల్సి ఉంది.

జలాలాబాద్ ఆసుపత్రి 5 ప్రావిన్స్‌లకు చెందిన ప్రజలకు సేవలు అందిస్తోంది. ఈ ఐదు ప్రావిన్సుల్లో 50 లక్షల మంది ప్రజలు ఉంటారని తాలిబాన్ ప్రభుత్వం అంచనా. ఇప్పుడు ఆ ఆసుపత్రి మీద ఒత్తిడి పెరుగుతోంది. నిరుడు పాకిస్తాన్ తిప్పి పంపిన 7 లక్షల మందికిపైగా అఫ్గానిస్తాన్ శరణార్థులు నాంగర్హర్‌లోనే ఉంటున్నారు.

అఫ్గానిస్తాన్‌లోని అయిదేళ్లలోపు చిన్నారుల్లో 45 శాతం మంది ఎదుగుదల లోపంతో ఉన్నారని.. వారు ఉండాల్సిన ఎత్తు కంటే తక్కువ ఎత్తు ఉన్నారని ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది.

ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్న సమూహాలకు చెందిన పిల్లల్లో ఇలాంటి పరిస్థితి మేం చూశాం.

అఫ్గానిస్తాన్, జలాాలాబాద్,

ఫొటో సోర్స్, BBC/Imogen Anderson

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ ఇకపై ఎప్పటికీ నడవకపోవచ్చని రొబినా ఆందోళన చెందుతున్నారు.

రొబినా రెండేళ్ల కుమారుడు మొహమ్మద్ ఇప్పటికీ నిలబడలేడు. అతను ఉండాల్సిన దాని కంటే తక్కువ ఎత్తున్నాడు.

“అతనికి మూడు నుంచి ఆరు నెలల పాటు చికిత్స అందిస్తే ఆరోగ్యం మెరుగవుతుందని డాక్టర్ చెప్పారు. అయితే మాకు ఆహారమే దొరకడం లేదు. చికిత్స కోసం డబ్బులు ఎక్కడ నుంచి తేవాలి” అని రొబినా ప్రశ్నించారు.

ఆమె, ఆమె కుటుంబం నిరుడు పాకిస్తాన్‌ను వదిలేసి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం షేక్ మిస్రీ ప్రాంతంలో దుమ్ము, ధూళితో నిండిన ఒక ఆవాసంలో ఉంటున్నారు. జలాలాబాద్ నుంచి ఈ ప్రాంతం చాలా దగ్గర్లో ఉంది.

“బాబుకు వైకల్యం వస్తుందేమోనని, ఎప్పటికీ నడవలేడేమోనని నేను చాలా భయపడ్డాను” అని రొబినా చెప్పారు.

“పాకిస్తాన్‌లోనూ మా జీవితం చాలా కష్టంగా ఉండేది. అయితే అక్కడ మాకు పని దొరికేది. ఇక్కడ నా భర్త కూలీగా పని చేస్తున్నారు. కానీ పని అరుదుగా దొరుకుతుంది. మేం పాకిస్తాన్‌లోనే ఉండి ఉంటే బాబుకు చికిత్స చేయించగలిగేవాళ్లం” అని చెప్పారు.

అఫ్గానిస్తాన్, జలాలాబాద్

ఫొటో సోర్స్, BBC/Imogen Anderson

ఫొటో క్యాప్షన్, షేక్ మిస్రీ ప్రాంతంలో ఇటుక, మట్టితో నిర్మించిన ఇళ్లు

శారీరక ఎదుగుదల లేకపోవడం తీవ్రమైన, కోలుకోలేని శారీరక, మానసిక నష్టాన్ని కలిగిస్తుందని.. దీని ప్రభావం జీవితకాలం ఉంటుందని.. తర్వాత తరాలపైనా ఇది ప్రభావం చూపుతుందని యునిసెఫ్ చెబుతోంది.

“అఫ్గానిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. భవిష్యత్ తరంలో ఎక్కువ మంది శారీరకంగా, మానసికంగా వైకల్యం బారిన పడితే ఈ సమాజం వారికి ఎలాంటి సాయం అందించగలుగుతుంది? అని డాక్టర్ ఘనీ ప్రశ్నించారు.

మొహమ్మద్‌కు సకాలంలో వైద్యం అందించి ఉంటే శాశ్వత నష్టం కలగకుండా కాపాడగలిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆలస్యం అయింది.

అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, జలాలాబాద్

ఫొటో సోర్స్, BBC/Imogen Anderson

ఫొటో క్యాప్షన్, ఆహార పొట్లాలు తన చిన్న కుమారుడు ముజిబ్( ఒళ్లో కూర్చున్న బాలుడు) కోలుకోవడానికి సాయపడ్డాయని చెబుతున్న సర్దార్ గుల్

షేక్ మిస్రీలో మేం పోషకాహారలోపంతో బాధపడుతున్న, ఎదుగుదల లేని చిన్నారుల్ని కలిశాం.

సర్దార్ గుల్ ఇద్దరు పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. మూడేళ్ల ఉమర్, ఎనిమిది నెలల ముజిబ్ పోషకాహార లోపం బారిన పడ్డారు.

“నెల రోజుల క్రితం ముజిబ్ బరువు మూడు కిలోల కంటే తగ్గిపోయింది. మేం అతడి పేరుని ఒక సహాయ సంస్థలో రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత మాకు ఆహార పొట్లాలు అందాయి. అవి అతను కోలుకోవడానికి సాయపడ్డాయి” అని సర్దార్ గుల్ చెప్పారు.

ముజిబ్ ప్రస్తుతం ఆరు కిలోల బరువు ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ఉండాల్సిన బరువు కంటే అది రెండు కేజీలు తక్కువ. అయితే అతనిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది.

సమయానికి స్పందిస్తే పిల్లల్ని మరణాలు, వైకల్యం నుంచి కాపాడవచ్చని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.

(అడిషనల్ రిపోర్టింగ్: ఇమోజెన్ అండర్సన్, సంజయ్ గంగూలీ)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)