‘‘బతికుండగానే అంత్యక్రియల్ని సెలెబ్రేట్ చేసుకోవడం నా అదృష్టం’’

ఫొటో సోర్స్, Cortesía
- రచయిత, జోస్ కార్లోస్ క్యుటో
- హోదా, బీబీసీ ప్రతినిధి
"గత కొన్ని రోజులుగా చాలా వింతగా అనిపిస్తోంది. ఏదో మాయలా ఉంది. చాలా మారిపోయింది. చావుకు దగ్గరవుతున్నప్పుడు దాని గురించి వివరించడం చాలా కష్టం.’’
మరణానికి చేరువ అవుతున్న 44 ఏళ్ల కొలంబియన్ ప్రొఫెసర్ టటియానా ఆండియా చెప్పిన మాటలివి. కష్టమైన భావాలను ఆమె నవ్వుతూ, జోకులు వేస్తూ చాలా సరదాగా మాతో పంచుకున్నారు.
ఏడాది క్రితం ఆమెకు ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నట్టు, అది నయం చేయలేని స్థితిలో ఉన్నట్టు నిర్ధరణ అయింది. అప్పటి నుంచి ఆమె జీవితంలో ఇదే వైఖరిని అలవరుచుకున్నారు.
ఆరోగ్య పరిస్థితి మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఆమె చికిత్స విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. కీమోథెరపీ, సర్జరీలు, ఇంటెన్సివ్ కేర్ సెషన్ల విషయంలో ఒక దృఢ నిర్ణయం తీసుకున్నారు.

‘‘నాకు మిగిలి ఉన్న రోజులు దేని కోసం? హాయిగా ఈ ప్రపంచంలో బతకడానికా? లేక వికారం, వాంతులు, తలనొప్పితో నా వారందరికీ దూరం కావడానికా? నొప్పితో, బాధతో బతకడానికి ఆ రోజుల్ని వాడుకోవాలా? ఎందుకోసం’’ అని రజోన్ పబ్లికా వెబ్‌సైట్‌కు రాసిన తన ఆఖరి కాలమ్‌లో ఆర్థికవేత్త, చరిత్రకారిణి, ఆండీస్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అయిన ఆండియా ప్రశ్నించారు. నెలల తరబడి వ్యాధితో తాను ఎలా జీవించానో ఆమె అందులో పంచుకున్నారు.
ఈ భూమ్మీద తనకు మిగిలి ఉన్న కొద్ది సమయాన్ని ‘సంతోషంగా జీవించడానికే’ వినియోగించుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు.
ఆమె రాసిన కాలమ్‌లు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి.
జీవితాన్ని ఒక వరంగా భావిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత ఎక్కువ కాలం జీవించాలని బలంగా నమ్మే ఒక దేశంలో కూడా ఆమె నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు.

ఫొటో సోర్స్, Cortesía
‘‘అందరూ నాలాగే సంతోషంగా చనిపోవాలని కోరుకుంటున్నా’’
‘‘కొన్ని రోజుల కిందట నాకు మూర్ఛ వచ్చింది. మూర్ఛ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అది మెదడును రీసెట్ చేయడం లాంటిది. అత్యవసర పరిస్థితి కారణంగా అందరూ టెన్షన్ పడ్డారు. నన్ను మరికొన్ని రోజులు బతికించాలని, చక్కగా సాగనంపాలని అనుకున్నారు. కానీ, నన్ను ఐసీయూలో పెట్టడం, ఇన్‌క్యుబేట్ చేయడం వంటివి ఎప్పుడూ ఆలోచించలేదు. అలాంటి చికిత్సల వైపే దృష్టి సారించలేదు.
ఆసుపత్రిలో ఉండకూడదని నేను మొదటే నిర్ణయించుకున్నాను. ఇదే విషయాన్ని మా వాళ్లకు గట్టిగా చెప్పాను. మా నాన్న, నా భర్తనా డాక్టర్లు ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు.
అందుకే, నేను ఇంట్లోనే జీవితాన్ని ఆస్వాదిస్తూ, చక్కని వీడ్కోలు ప్రక్రియను అనుభవిస్తున్నా.
బతికుండగానే అంత్యక్రియలు జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. నన్ను చూడటానికి అందరూ వస్తారు. కబుర్లు చెబుతారు. నాతో మధుర క్షణాలను గుర్తు చేసుకుంటారు.
అందరికీ చివరి రోజులు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటా. వీలైతే అందరూ నాలాగే చాలా సంతోషంగా, ప్రశాంతంగా, హాయిగా చనిపోవాలి. ఇది చాలా ప్రత్యేకం’’ అని ఆండియా వివరించారు.

ఫొటో సోర్స్, Cortesía
‘‘బాధలు అనుభవించడానికే ఈ భూమ్మీదకు వస్తారంటే నేను ఒప్పుకోను’’
మొదటి నుంచి నేను ఒక విషయంలో చాలా స్పష్టతతో ఉన్నా. కీమోథెరపీ వంటి బాధాకరమైన చికిత్సల జోలికి వెళ్లకూడదనుకున్నా. ఎందుకంటే హింస, బాధ కలిగించే విషయాలను నా దగ్గరకు రానివ్వకూడదనేది నా ఉద్దేశం.
కష్టాలు అనుభవించడానికి ఈ భూమ్మీదకు వస్తారనే అంశాన్ని నేను నమ్మను. అది నా జీవిత తత్వం కాదు.
నాకు రాసిపెట్టి ఉన్నంత కాలం నేను బతికే ఉంటా. ఈలోగా హింసను నా దరి చేరనివ్వను.
డాకర్లు మనల్ని రక్షించాలనే ఉద్దేశంతో రకరకాల ప్రత్యామ్నాయ చికిత్సలు, సిఫార్సులు చేస్తారు. అది వారి స్వభావం.
మూర్ఛ వచ్చిందని ఇంట్యూబేట్ చేయడం లేదా ఐసీయూలో ఉంచడం నాకు అమానవీయంగా అనిపించేది.
అయితే, ఏదో ఒకరోజు ఇవన్నీ చేయాల్సిన అవసరం వస్తుందనే సంగతి నాకు తెలుసు.

ఫొటో సోర్స్, Cortesía
‘‘జీవితకాలాన్ని పొడిగించడం కోసం బతకడం నాకిష్టం లేదు’’
నా అంకాలజిస్టు(క్యాన్సర్‌కు చికిత్స చేసే డాక్టర్)లలో కొంతమందితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వారు తమ దృక్పథాలను మార్చుకున్నారు. రోగి వైపు నుంచి ఆలోచించడం మొదలుపెట్టారు.
ఎదుటివారి పట్ల సానుభూతి కలిగి ఉండాలి, వారి వైపు నుంచి ఆలోచించాలి అనే విషయాలు చెప్పడం సులభమే. కానీ, చేయడమే కష్టం.
వారితో నాకున్న ప్రత్యేక అనుబంధం కారణంగా, వారు నా ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏది చేస్తే మంచిదో అదే చేశారు. కానీ, పరిమితులకు లోబడి కాస్త నాకు నచ్చినట్టుగా చేశారు.
కొన్నిరోజులకు మరో స్థాయిలో చికిత్స అందించాల్సి ఉంటుంది. అప్పుడు చేసే ఆ చికిత్స గురించి మీకు తెలుస్తుంది, ఆ చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ ‘‘ఇవన్నీ ఎందుకు, ఎంతకాలం దీన్ని నేను భరించాలి? ఇలా బతకడం ఎందుకోసం?’’ అని ప్రశ్నించుకుంటూనే ఉంటాం.
‘‘ఏం చేసి అయినా ఆయుష్షును పొడిగించాలి’’ అని చెబుతుంటారు. కానీ, ఒక దశకు చేరుకున్నాక ఇలా ఆలోచించడం మానేయాలి. ఎందుకంటే, ‘‘మీకు లభించిన ఆ అదనపు సమయంలో ఏం చేయబోతున్నారో మీకు తెలియనప్పుడు ఆయుష్షును పొడిగించడం ఎందుకు’’ అని ఆండియా అభిప్రాయపడ్డారు.
నా జీవితాన్ని పొడిగించాల్సిన అవసరం లేదు. నా జీవితంలో ఏదో లోటు ఉన్నట్టు నేను భావించడం లేదు. వీలైనంత వరకు నా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాను. నాది అల్పాయుష్షే, కానీ అద్భుతంగా గడిచింది. ఆయుష్షును పొడిగించాలనే కారణంతో భారంగా బతకడం నాకు ఇష్టం ఉండదు.

ఫొటో సోర్స్, Cortesía
నాకు ఈ వ్యాధి ఉన్నట్టు నిర్ధరణ అయినప్పుడు, డాక్టర్లు ఒక ఔషధం గురించి నాకు చెప్పారు. నాకున్న ఈ అరుదైన ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై ఒక ఏడాది కాలం పాటు ఆ ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపారు.
అంతకుముందు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఇలాంటి మందు అందుబాటులో లేదు. ఈ వ్యాధి చాలా దారుణంగా ఉండేది. ఒకసారి వ్యాధి ఉన్నట్టు నిర్ధరణ అయిన కొంతకాలానికి మరణం సంభవించేది. ఈ వ్యాధిని అడ్డుకోవడానికి అప్పట్లో పెద్దగా ఏదీ అందుబాటులో లేదు. ఉన్నదల్లా కీమో థెరపీ ఒక్కటే. కీమో థెరపీ అంటే అన్నింటినీ చంపుకోవడం లాంటిదే.
నాకు సూచించిన చికిత్స టార్గెటెడ్ థెరపీ. ఈ చికిత్స వల్ల మ్యుటేషన్ జరిగి కణాల ఉత్పత్తి వేగంగా జరుగుతుంది. కొంతకాలం పాటు వ్యాధి నిలిచిపోతుంది.
దీనివల్ల ప్రతికూల ప్రభావాలు ఎక్కువ ఉండవు, టాక్సిసిటీ కూడా తక్కువ ఉంటుంది. ఇంట్లోనే మాత్ర రూపంలో ఈ మందును తీసుకోవచ్చు. రోజుకు ఒక మాత్ర వేసుకుంటే సరిపోతుంది.
మెటిమలు రావడం, పొట్టలో కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తవచ్చు. కానీ, ఓవరాల్‌గా ఇది జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఈ మందు తీసుకోవడం వల్లే నేను ప్రయాణాలు, డ్యాన్స్ వంటివి చేయగలిగాను.
ఈ మందు ఒక ఏడాది కాలం పనిచేస్తుందని నాకు చెప్పారు. అయితే, కొందరు రోగుల్లో ఎనిమిదేళ్ల వరకు కూడా పనిచేసినట్టు తెలిపారు.

ఫొటో సోర్స్, Cortesía
ఒక ఏడాది కాలానికి నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. ప్రతీ మూడు నెలలకు వెళ్లాల్సిన ఆసుపత్రి చెకప్‌ల కోసం సిద్ధపడిపోయాను.
‘‘చూడు, నా జీవితం మూడు నెలల చొప్పున ఏడాదిపాటు సాగుతుంది. ఈ మూడు నెలల్లో మనం చేయాల్సినవన్నీ చేద్దాం. వీలైనంత సంతోషంగా ఉండటానికి ప్రయత్నిద్దాం’’ అని నా భర్తకు చెప్పాను.
ఇక, అప్పటినుంచి ప్రయాణించడం మొదలుపెట్టాం. ఇటలీ వెళ్లాం. చాలా ప్రాంతాల్లో పర్యటించాం. స్నేహితుల్ని, సన్నిహితుల్ని కలిశాం.
నేను ఒక టీచర్‌ను, నాకు బోధించడం అంటే ఇష్టం. ఈ కష్టసమయంలో బోధన నన్ను సంతోషంగా ఉంచింది.

ఫొటో సోర్స్, Cortesía
‘‘వాళ్లే నా అభిమానులు’’
అగ్రెసివ్ ట్రీట్‌మెంట్‌లకు దూరంగా ఉండాలని నేను తీసుకున్న నిర్ణయాన్ని నా కుటుంబంలోని ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు.
మా నాన్న ఒక వైద్యుడు. ఆయన సహజ స్వభావం ప్రాణాల్ని కాపాడటం. ఆయన చాలా సున్నిత వ్యక్తి. నా ఆరోగ్యానికి సంబంధించిన చాలా విషయాలపై మేం చాలా చర్చించాం.
నా నిర్ణయాలను మా నాన్న ఎల్లప్పుడూ గౌరవించారు. ఆయనకు నచ్చని నిర్ణయం తీసుకుంటే నాతో వాదిస్తారు కూడా. వాదించి అయినా సరే, నేను అనుకున్నదే చేస్తానని నేనంటే మా నాన్నకు చాలా ఇష్టం.
అన్ని విషయాల్లో నా కుటుంబం నాకు మద్దతుగా నిలిచింది. ఇలాంటి కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. మా కుటుంబంలో అందరి వ్యక్తిత్వాలు వేర్వేరు. కానీ, అందరూ ఒకరికొకరు మద్దతుగా ఉంటారు.

ఫొటో సోర్స్, Cortesía
‘‘క్యాన్సర్‌తో దక్కిన ప్రత్యేక అవకాశం’’
జీవితంలో అన్నింటిలాగే, క్యాన్సర్‌లో కూడా ఒక సానుకూల కోణం ఉంటుందనేది నా నమ్మకం.
జీవితాన్ని సంతృప్తిగా ముగించడానికి ఇదొక ప్రత్యేకమైన అవకాశమని నేను భావిస్తున్నా.
దురదృష్టవశాత్తూ ఏదైనా యాక్సిడెంట్‌లో మరణిస్తే సగంలోనే జీవితం అంతం అవుతుంది.
క్యాన్సర్ కారణంగా మిగిలి ఉన్న రోజుల్లో నేను అనుకున్నవన్నీ పూర్తిచేయడానికి, జీవితాన్ని ఆస్వాదించడానికి, అందరికీ మనస్ఫూర్తిగా గుడ్‌బై చెప్పడానికి అవకాశం దొరికింది.
నాకు లభించిన సంవత్సర కాలం అనేది జీవితాన్ని ఆనందంగా గడపడానికి సరిపడా సమయం.
కొందరికి ఈ భావం వేరేగా అనిపిస్తుండొచ్చు. కానీ, నాకైతే అన్నింట్లోనూ మంచి అనుభూతులే దక్కాయి.

ఫొటో సోర్స్, Cortesía
చివరి రోజులు
రోజులు సమీపిస్తున్న కొద్దీ, నా మెదడు అసాధారణంగా స్పందిస్తోంది.
నిద్రలో కలవరించడం ఎక్కువైంది. కలల్లో అందరికీ గుడ్‌బై చెబుతున్నట్టుగా అనిపిస్తోంది.
చనిపోయే వాళ్లకి ఎలా అనిపిస్తుంటుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే దానికి సంబంధించిన రికార్డులేవీ లేవు.
అందుకే నాకు సంబంధించిన ప్రతీ అంశాన్ని పుస్తకంలో రాయాలని మా నాన్నకు చెబుతున్నా. ఎవరికైనా నా అనుభవాలు పనికొస్తాయని నా ఉద్దేశం.
ఈ మధ్య కాలంలో నా చిన్నతనం, ఆనాటి రోజులు బాగా గుర్తొస్తున్నాయి.
నాకు మూర్ఛ వచ్చిన మరుసటి రోజే, నా చిన్ననాటి స్నేహితులు నేను పిలవకుండానే నన్ను కలవడానికి వచ్చారు.
వారికి నాకు మూర్ఛ వచ్చిన విషయం కూడా తెలియదు. కానీ, ఆరోజు మొత్తం బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలు, కబుర్లతో గడిచిపోయింది.
నా ఇంట్లో, ఈ శాంతియుత మరణ ప్రక్రియలో చాలా మరపురాని క్షణాలు ఉన్నాయి.
నేను ఈ లోకం నుంచి వెళ్లిపోయాక..
నేను ఈ లోకం నుంచి వెళ్లిపోయే క్షణాల గురించి ఆలోచిస్తున్నా. నన్ను ఇష్టపడే వ్యక్తుల దు:ఖాన్ని ఎలా తగ్గించాలి?
అందుకే వారికోసమే నేను కాలమ్‌లు రాయడం మొదలుపెట్టాను.
పిల్లలు లేకపోవడం, వారి ప్రేమకు బందీని కాకపోవడం వంటివి నాకు పెద్ద భయాన్ని తప్పించాయి. పిల్లలు లేకపోవడం వల్ల నేను స్వేచ్ఛగా చనిపోగలను.
నా వయస్సులో ఉండి, నాలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వారు అనుభవించే అతిపెద్ద భయం ఇదే. పిల్లల్ని వదిలి వెళ్లిపోవడం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














