‘35 చిన్న కథ కాదు’ సినిమా రివ్యూ: లెక్కల్లో సున్నా మార్కులు తెచ్చుకునే అబ్బాయికి అమ్మ గురువైంది.. ఆ తరువాత ఏమైందంటే

35 చిన్న కథ కాదు

ఫొటో సోర్స్, Facebook/SureshProductions

    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

పాజిటివిటీ, ఫ్రెష్‌నెస్ ఉన్న కథాంశంతో నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ముఖ్య తారాగణంగా వచ్చిన సినిమా ‘35 చిన్న కథ కాదు’.

తిరుపతిలోని ఒక కుటుంబం, ఒక స్కూల్ కేంద్రంగా ఉండే కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకువెళ్లే సినిమా ఇది.

లెక్కల్లో ఫండమెంటల్స్‌ని ఎప్పుడూ ప్రశ్నించే పిల్లవాడు అరుణ్. వాటికి ఏ ఉపాధ్యాయుడూ సరైన సమాధానాలు ఇవ్వకపోవడం వల్ల లెక్కల పరీక్షల్లో సున్నా మార్కులు తెచ్చుకుంటుంటాడు.

ఈ పరిస్థితుల్లో టెన్త్ ఫెయిల్ అయిన తల్లి తన కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారారు? ఆ పిల్లవాడి సందేహాలు తీరాయా? లేదా? అనేదే ఈ సినిమా..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
35 చిన్న కథ కాదు

ఫొటో సోర్స్, Facebook/Sureshproductions

కథ ఏంటి?

ఈ సినిమా అంతా తిరుపతి నేపథ్యంతో సాగుతుంది. డివోషనల్ ఎలిమెంట్‌ను స్ట్రాంగ్‌గా పట్టుకున్న కథ ఇది.

అందుకే ఈ సినిమాలో తిరుపతి ఒక ప్రాంతంలా మాత్రమే కాకుండా సినిమాకు ఒక డివోషనల్ డెస్టినేషన్‌లా ఉంటుంది. తిరుపతి ప్రాంతానికి తగ్గ డైలాగులు, భక్తి వాతావరణం ఈ సినిమాలో చూపించారు.

సరస్వతి (నివేద థామస్), ప్రసాద్ (విశ్వదేవ్ ) భార్యాభర్తలు. వారికి ఇద్దరు కొడుకులు అరుణ్, వరుణ్.

ఈ కుటుంబం చుట్టూ ఒక వైపు కథ నడుస్తూ ఉంటే, ఈ పిల్లలు చదివే స్కూల్‌లో ఉండే మ్యాథ్స్ టీచర్ చాణక్య వర్మ (ప్రియదర్శి)కి అరుణ్‌కి మధ్య ఉండే కనపడని సంఘర్షణతో ఆ కథ రెండో వైపు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది.

35 చిన్న కథ కాదు

ఫొటో సోర్స్, Facebook/Sureshproductions

తల్లి ఒడి.. తొలి బడి

కాన్సెప్ట్ పరంగా మంచి కథ ఇది. అలాగే ఫ్రెష్‌నెస్ ఉన్న కథ. తల్లి సెంటిమెంట్ స్ట్రాంగ్ కమర్షియల్ ఎలిమెంట్‌గా అల్లిన కథ.

ఈ కథలో ముఖ్య పాత్ర ‘అరుణ్’ అనే పిల్లవాడిది. అతను తెలివి తక్కువ వాడేం కాదు. చదువులో ప్రతిభ ఉన్నవాడు. లెక్కలు తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకుంటుంటాడు.

తన ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదు కాబట్టి, లెక్కల పట్ల ఆసక్తి కనబరచడు.

నిజానికి సినిమాకు అరుణ్ పాత్రే ప్రాణం. ఇంత తెలివైన పిల్లవాడిని ఒక్క సీనులో కన్విన్స్ చేయడం, అది కూడా లాజికల్ గ్రౌండ్స్‌లో కాకపోవడం సినిమా తేలిపోయేలా చేసింది.

స్కూల్‌లో పిల్లల పాత్రల్లో సహజత్వం ఉండటం ఇలాంటి కథలు డిమాండ్ చేసే ముఖ్య అంశం. కానీ ఈ కథలో స్కూల్‌లో జరిగే కొన్ని సంఘటనలు కూడా కృతకంగా అనిపించాయి. అవి హ్యాపీ ఎండింగ్ కోసం డిజైన్ చేసినట్లున్నాయే తప్ప సహజంగా లేవు.

‘తల్లి ఒడి బిడ్డలకు తొలి బడి.’ ఈ సినిమాలో ఈ అంశం మొదటి నుంచి కనిపించదు. సెకండ్ హాఫ్‌లో కనిపించినా, చాలా రొటీన్‌గా తల్లి నేర్పడం, పిల్లవాడు నేర్చుకోవడం జరిగిపోతుంది.

కథ అక్కడ కొంత ఉత్కంఠ కలిగిస్తుందని ఎదురుచూసే ప్రేక్షకుడికి నిరాశనే మిగులుస్తుంది.

మరోవైపు అరుణ్‌ని ‘జీరో’ అని పిలుస్తారు. ఆ ‘జీరో మార్కు ముద్ర’ ను చెరిపేసి తనదైన వినూత్న ప్రతిభ ప్రదర్శించే స్కోప్ కూడా ఈ సినిమాలో లేదు.

అందుకే మిగిలిన విద్యార్థుల పాత్రల్లో ఒకరిగా మాత్రమే అరుణ్ కనిపిస్తాడు. అది కూడా సినిమాకు మైనస్ పాయింట్.

35 చిన్న కథ కాదు, Nivetha Thomas

ఫొటో సోర్స్, Facebook/Sureshproductions

ఫొటో క్యాప్షన్, అరుణ్ తల్లిగా, ప్రసాద్ భార్యగా సరస్వతి కేరెక్టర్‌లో నివేద థామస్ ఒదిగిపోయారు.

ఎవరెలా చేశారు?

పిల్లల కేంద్రంగా మాత్రమే ఉంటే కమర్షియల్ స్పేస్ తక్కువ అవుతుందేమోనని, కొంత కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కథ సాగడంతో మెయిన్ స్టోరీ డైవర్ట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.

నటన విషయానికి వస్తే.. అరుణ్ తల్లిగా, ప్రసాద్ భార్యగా సరస్వతి కేరెక్టర్‌లో నివేద థామస్ ఒదిగిపోయారు.

విశ్వ ప్రసాద్ ఆమెకు జంటగా చక్కగా నటించారు. చాణక్య వర్మగా ప్రియదర్శి నటన బాగుంది. గౌతమి స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా కథకు ఊతమిచ్చే బలమైన పాత్రలో కనిపించారు.

విద్యా వ్యవస్థ గురించి, బాల్యంలో విద్యార్ధుల స్నేహాలు, మార్కుల కోసం పడే తపన, టీచర్స్‌తో ఉండే అనుబంధం గురించి చెప్పే కథ ఇది.

సినిమా ముగింపులో పరీక్ష రాసే సన్నివేశానికి ఉండే నేపథ్యం అసహజంగా ఉంది. ఇలా కథలో ప్రేక్షకులను కన్విన్స్ చేయకుండా ఎన్నో విషయాలు ముందుకు కదిలిపోతూ ఉంటాయి.

35 చిన్న కథ కాదు

ఫొటో సోర్స్, Facebook/Sureshproductions

తారే జమీన్ పర్ గుర్తుకొచ్చేలా

సినిమాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా దర్శకుడు చెప్పాల్సిన ముఖ్యమైన అంశమే ప్రేక్షకుడికి ఎక్కువ కనబడాలి.

దర్శకుడు నందకిశోర్ ఇమాని ఈ విషయంలో అంతగా ఆకట్టుకోలేకపోయారు. అందుకే కథలో ముఖ్య పాత్ర అయిన అరుణ్ ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేసే ఎమోషన్స్ పండించే పాత్రగా ఎక్కువసేపు కనిపించడు.

బాలుడు తెలివితేటలు ప్రదర్శించే సన్నివేశాలు ఉన్నా, అక్కడి నుంచి అతను మామూలుగా మారిపోవడం, మధ్యలో జరిగే డ్రామా వల్ల స్టోరీ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.

చదువుకునే దశలో పిల్లలు ఎదుర్కొనే సమస్యల బ్యాక్‌డ్రాప్‌తో తారే జమీన్ పర్ సినిమా వచ్చింది. అది సీరియస్ స్టయిల్‌లో ఉండే కథ. ఈ సినిమా మొదలు కాగానే ప్రేక్షకులు మనసుల్లో అదే సినిమా మెదులుతుంది కూడా.

అలాగే కొంత కమర్షియల్ స్పేస్‌ను సినిమాలో క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా కొంత బాపు సినిమా జాడలు కూడా కలపడం, స్కూల్లో సహజంగా కాకుండా కొన్ని ‘చైల్డ్ హీరోయిక్ ఎలిమెంట్స్’ పెట్టడం వంటివి కొంతవరకు సినిమా కథ ఆత్మను దెబ్బ తీశాయి.

స్టోరీ పరంగా ఇన్ని గ్యాప్స్ ఉన్నా నివేద థామస్ అభినయం, తిరుపతి ప్రాంతంతో ఎమోషన్, పిల్లలు స్క్రీన్ మీద కనిపిస్తూ ప్రేక్షకులను వారి బాల్యంలోకి తీసుకు వెళ్లగలగడం వంటి అంశాల వల్ల ఫరవాలేదనిపించిన సినిమా ఇది.

ప్లస్‌లు - మైనస్‌లు

ప్లస్ పాయింట్స్:

  • పాజిటివిటీ ఉన్న స్టోరీ
  • నివేద థామస్ నటన
  • సెకండ్ హాఫ్‌లో తల్లి కొడుకుల అనుబంధం

మైనస్ పాయింట్స్ :

  • పాత్రల చిత్రీకరణలో అసంపూర్ణత
  • పాఠశాల వాతావరణంలో కొన్ని సన్నివేశాల్లో అసహజంగా సాగే కథ
  • లాజికల్‌గా కథ కన్విన్స్ చేయలేకపోవడం
  • కొన్ని అంశాల్లో ఒరిజినాలిటీ లోపించడం

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)