కిరాణా కొట్టు‌కు వచ్చే అబ్బాయిలను మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించిన దుకాణదారు.. మేరఠ్‌లో వీడియోలు వెలుగులోకి రావడంతో బయటపడిన నేరం

మేరఠ్‌లో బాలురపై లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొదట్లో అవమాన భారంతో ఫిర్యాదు చేయడానికి బాధిత కుటుంబాలు ముందుకురాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తరప్రదేశ్‌లో పలువురు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు వెలుగులోకి రావడం కలకలం సృష్టించింది. మేరఠ్‌ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ఆరుగురు పిల్లలపై (వీరిలో ఇద్దరు ఇప్పుడు మేజర్లు) లైంగికంగా వేధింపులకు పాల్పడిన అభియోగాలపై 37 ఏళ్ల వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుడిపై పోక్సో చట్టంలోని సెక్షన్లు కూడా నమోదుచేశారు.

ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని భావిస్తున్నారు.

తెలుగు వాట్సాప్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మేరఠ్‌లో లైంగిక వేధింపులపై బీబీసీ గ్రౌండ్ రిపోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మేరఠ్‌లో లైంగిక వేధింపులపై బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

గదిలో సీసీ కెమెరాలు

మేం ఆ గ్రామానికి చేరుకొని నిందితుడి ఇంటికి వెళ్లాం. ఇంట్లో ఒక మూలన బీరు బాటిళ్లు ఉన్నాయి. ఈ ఇంటి గదిలో ఉన్న సీసీ కెమెరాలను ఉపయోగించి వీడియోలు రికార్డ్ చేశారు. ఈ గది గోడలపై మతపరమైన చిత్రాలు ఉన్నాయి.

"నా కొడుకు ఏం చేశాడో వాడికే తెలుసు. అతను తప్పు చేశాడని మాకెప్పుడూ అనిపించలేదు" అని నిందితుడి తల్లి అన్నారు.

ప్రస్తుతం ఆమె తన కుమారుడి కోసం చట్టపరంగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు.

నిందితుడి ఇంటికి సమీపంలోనే ఒక బాధితుడి ఇల్లు ఉంది, అతన్ని ప్రస్తుతానికి ఇంటి నుంచి పంపేశారు.

‘‘నా బిడ్డకు ఇలాంటిది జరుగుతోందని మాకు తెలియదు. చాలా బాధతో మౌనంగా ఉండేవాడు, అడిగినప్పుడు ఏమీ చెప్పలేదు’’ అని బాధితుడి తల్లి ఏడుస్తూ చెప్పారు. ఈ కుటుంబానికి మూడు నెలల క్రితం లైంగిక వేధింపుల వీడియో చేరింది.

కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలియని నంబర్ నుంచి ఒక వీడియో వచ్చింది, అందులో ఆ అబ్బాయి, నిందితుడితో అసభ్యకరరీతిలో ఉన్నారు. వీడియో వచ్చాక బాలుడు మొదట మౌనంగా ఉన్నాడు, తర్వాత నోరు విప్పాడు. గత కొన్ని నెలలుగా తాను అనుభవిస్తున్న చిత్రహింసల గురించి వివరించాడు.

బాధితుడి తల్లి మాట్లాడుతూ " అబ్బాయి చాలా ఏడ్చాడు. కొన్ని నెలల క్రితం నిందితుడు గదిలోకి తీసుకెళ్లాడని, మత్తు పానీయం తాగించి, లైంగికంగా వేధించాడని చెప్పాడు. ఆపై వీడియో చూపించి, మళ్లీ మళ్లీ అదే పని చేశాడన్నాడు" అని చెప్పారు.

వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తూ, పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి నిందితుడు లైంగికంగా వేధించడమే కాకుండా డబ్బులు కూడా వసూలు చేశాడని బాధితుడి కుటుంబీకులు ఆరోపించారు.

మేరఠ్‌

కేసు ఎప్పుడు కదిలింది?

ఆగస్టు మొదటి వారంలో మరిన్ని వీడియోలు వైరల్ కావడంతో స్థానిక పోలీసులు బాధిత కుటుంబాన్ని సంప్రదించారు. పోలీసులు ధైర్యం చెప్పడంతో వారు ఫిర్యాదు చేయడానికి అంగీకరించారు.

ఆగస్టు 19న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం మిగిలిన బాధితులు ముందుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. నిందితుడిని ఆగస్టు 26న అరెస్టు చేశారు.

నిందితుడు అరెస్టయిన తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని, తాను కూడా గతంలో వేధింపులకు గురైనట్లు చెప్పారని పోలీసులు తెలిపారు.

నిందితుడి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు మేరఠ్‌ ఎస్పీ (రూరల్) రాకేష్ కుమార్ మిశ్రా తెలిపారు. నిందితుడిపై లైంగిక వేధింపులు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని ఆధారాలు దొరికితే ఇతర సెక్షన్లు కూడా పెడతామని చెప్పారు.

ఇప్పటివరకు ఒక్కరినే అరెస్టు చేసినట్లు, వేరేవాళ్ల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.

ఈ గ్రామానికి చెందిన అభిషేక్ అనే యువకుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు మొదటి వారం నుంచి గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. చాలామంది పిల్లల వీడియోలు బయటికొచ్చాయి. దీంతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కేసు పెట్టేందుకు ఏ కుటుంబమూ ధైర్యం చేయలేకపోయింది.

నిందితుడు ఇక్కడ కిరాణా షాపు నడిపేవాడని, పిల్లలు ఆయన దగ్గరికి వెళ్లేవారని అభిషేక్ చెప్పారు.

రాకేష్ కుమార్ మిశ్రా
ఫొటో క్యాప్షన్, మేరఠ్‌ ఎస్పీ (రూరల్) రాకేష్ కుమార్ మిశ్రా

12 నుంచి 23 ఏళ్ల లోపు వారే..

ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు బాధితులు ముందుకు వచ్చారు. వారి వయస్సు 12 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉంది. బాధితులలో నలుగురు మైనర్లు.

వీళ్లంతా ఏం జరిగిందనేది బీబీసీకి చెప్పారు. అందరూ ఒకే రకంగా చెప్పారు.

ముందుగా నిందితుడు ఏదో ఒక సాకుతో ఇంటికి పిలిపించి మత్తు పానీయాలు ఇచ్చేవాడని.. వారితో లైంగిక సంబంధం పెట్టుకుని, వీడియో ఆధారంగా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడని వారు చెప్పారు.

ఓ మైనర్ బాధితుడి తల్లి మాట్లాడుతూ.. ‘‘మూడు నెలల క్రితం నొప్పి గురించి చెప్పగానే డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లాను. రక్తం కారుతోంది. ఏదో జరిగిందని డాక్టర్‌ పదే పదే అంటున్నా పిల్లాడు మౌనంగా ఉండిపోయాడు" అని అన్నారు.

బాధితుడి తల్లి గత కొన్నేళ్లుగా పైసాపైసా కూడబెట్టి, కూతురి పెళ్లి కోసం రూ. 25 వేలు దాచుకున్నారు. నిందితుడు బ్లాక్ మెయిల్ చేయడంతో బాలుడు ఆ డబ్బును దొంగిలించి అతనికి ఇచ్చేశాడు.

"అతను నాకు ఫోన్ చేసినప్పుడల్లా, ఇంటి నుంచి కొంత డబ్బు దొంగిలించి ఇచ్చేవాడిని. అలా ఇచ్చినంత కాలం మళ్లీ నాతో ఏ తప్పు చేయలేదు" అని మరొక మైనర్ చెప్పారు.

మేరఠ్‌
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

‘ఊరు వదిలి వెళ్లిపోయా’

మరో బాధితుడు (మైనర్‌గా ఉన్న సమయంలో) తనకు జరిగిన దాని నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ 20 ఏళ్ల యువకుడు గ్రామం వదిలి వెళ్లారు, నగరంలో ఉద్యోగం చేస్తున్నారు.

“నేను నిందితుడితో స్నేహం చేసి ఆయన ఇంటికి వెళ్లడం ప్రారంభించినప్పుడు నాకు బహుశా 13, 14 సంవత్సరాలు. ఓ రోజు నాకు మత్తు పదార్థాలు ఇచ్చి నాతో చెడు పనులు చేసి తన మొబైల్‌లో వీడియో తీశాడు. వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తూ, కొన్నేళ్లుగా నన్ను లైంగికంగా వేధించాడు. గత ఆరేళ్లుగా నేను సంపాదించినదంతా ఆయనకు ఇచ్చాను. నేను విసిగిపోయి, ఊరు వదిలి వెళ్లాను. అయినా కూడా పదే పదే కాల్ చేసేవాడు. వేరే నంబర్ల నుంచి కూడా కాల్ చేసేవాడు’’ అని తెలిపారు.

“ఏప్రిల్‌లో నా యజమాని నుంచి అడ్వాన్స్ తీసుకొని నిందితుడికి 50 వేల రూపాయలు ఇచ్చాను. నేను అప్పుల్లో ఉన్నాను, ఎక్కువ డబ్బు చెల్లించే స్తోమత లేదు. గత నెల డబ్బులు ఇవ్వకపోవడంతో నిందితుడు కంట్రీ మేడ్ పిస్టల్‌తో నన్ను కొట్టాడు. నా కన్ను వాచిపోయింది. నాపై జరుగుతున్న అకృత్యాల గురించి మా కుటుంబానికి చెప్పలేకపోయాను’’ అని యువకుడు తెలిపారు.

వీడియో బయటికి వచ్చే వరకు, ఈ యువకుడు వేధింపుల గురించి ఎవరికీ చెప్పలేదు. ఒంటరిగా కుమిలిపోతూ జీవనం సాగించాడు.

"నేను ఇప్పటివరకు లక్షల రూపాయలు ఇచ్చాను. నిందితుడు ఎప్పుడూ ఆన్‌లైన్‌లో డబ్బు తీసుకోలేదు. నగదు రూపంలో తీసుకున్నాడు" అని బాధిత యువకుడు చెప్పారు.

సాక్షి వైష్
ఫొటో క్యాప్షన్, ‘‘నిందితుడు ఆనందం కోసం ఇలా చేయడం లేదు, డబ్బు కూడా తీసుకుంటున్నాడు, ఇది నేరపూరిత ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది’’ అని క్రిమినాలజీలో పీహెచ్‌డీ చేసిన సాక్షి వైష్ పేర్కొన్నారు.

‘కావాలని చేసిన నేరమే’

బాధితుల స్టేట్‌మెంట్స్ తీసుకున్నామని ఎస్పీ రాకేశ్ తెలిపారు. కోర్టు నుంచి సూచనలు వస్తే పిల్లలకు కౌన్సెలర్‌ను నియమిస్తామని జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ అతుల్ సోనీ చెప్పారు.

క్రిమినాలజీలో పీహెచ్‌డీ చేసిన సాక్షి వైష్ ఈ కేసుపై స్పందించారు.

“బాధితులు చెప్తున్న సమాచారం ప్రకారం చూస్తే నిందితుడు పీడోఫిల్(చిన్నారులతో సెక్స్ చేసేవారు) కాదని సూచిస్తున్నాయి. పీడోఫిల్ సాధారణంగా 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు పిల్లలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇక్కడ బాధితులు 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు. నిందితుడు నిర్దిష్ట వయస్సు పిల్లలను దోపిడీ చేయడం ద్వారా, వారిపై తన అధికారాన్ని చూపించాలనుకున్నాడని ఇది చూపిస్తుంది’’ అని సాక్షి తెలిపారు.

‘‘నిందితుడు ఆనందం కోసం ఇలా చేయడం లేదు, డబ్బు కూడా తీసుకుంటున్నాడు, ఇది నేరపూరిత ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది’’ అని సాక్షి పేర్కొన్నారు.

ఘటనలు బాధితులందరిపై తీవ్ర ప్రభావం చూపాయని, వారిలో భయాందోళనలు సృష్టించాయని అందుకే నిందితుడు ఇంతకాలం ఇదంతా చేయగలిగారని సాక్షి చెప్పారు.

ఈ కేసులో బాధితులంతా పేద కుటుంబాలకు చెందిన వారే.

‘‘నిందితుడు బాధితులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాడు, ప్రతిఘటించే అవకాశం తక్కువగా ఉన్న పిల్లలను టార్గెట్ చేశాడు. నిందితుడు తన ప్రతి కదలికను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఈ ఘటనలకు పాల్పడ్డాడు’’ అని సాక్షి చెప్పారు.

ఇంతకాలం ఈ ఘటనలు వెలుగులోకి రాకపోవడానికి గ్రామంలోని వాతావరణం కూడా ఒక కారణమని సాక్షి అభిప్రాయపడ్డారు.

"ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం" అని పోలీసు సూపరింటెండెంట్ రాకేష్ మిశ్రా అన్నారు.

ఈ కేసులో మరికొంత మంది చిన్నారులు కూడా బాధితులుగా ఉండొచ్చనే చర్చ కూడా గ్రామంలో జరుగుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)