న్యూజీలాండ్: కేర్ సెంటర్లలో అత్యాచారాలు, విద్యుత్ షాక్‌లు.. దశాబ్దాలుగా సాగిన వేధింపులపై బాధితులు ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కేథరిన్ ఆర్మ్‌స్ట్రాంగ్, జోయెల్ గ్వింటో
- హోదా, బీబీసీ ప్రతినిధులు
న్యూజీలాండ్‌లో గత 70 ఏళ్లలో ప్రభుత్వ, మత సంస్థల సంరక్షణ గృహాలలో ఉన్న దాదాపు 2 లక్షల మంది పిల్లలు, యువత, వృద్ధులు ఏదో ఒక రకమైన వేధింపులకు గురయ్యారని ఒక పరిశోధనలో వెల్లడైంది.
‘అబ్యూజ్ ఇన్ కేర్ రాయల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ’ నివేదిక ప్రకారం, 1950 నుంచి 2019 వరకు ఇలా ప్రభుత్వ, మత సంస్థల సంరక్షణలో ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు అత్యాచారం, విద్యుత్ షాక్, బలవంతపు చాకిరీలాంటి ఏదో ఒక రూపంలో వేధింపులకు గురయ్యారు.
దాదాపు 3,000 మంది వ్యక్తుల అనుభవాలపై ఆరేళ్లపాటు జరిపిన విచారణ తర్వాత కమిషన్ ఇటీవల తుది నివేదికను వెల్లడించింది.
న్యూజీలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ ఈ నివేదికపై దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. "న్యూజీలాండ్ చరిత్రలో ఇది చీకటి రోజు, దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నాను" అని ఆయన అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
వేధింపులకు గురైన వారిలో ఎక్కువ మంది మావోరీ, పసిఫిక్ తెగల ప్రజలు, అలాగే వైకల్యం ఉన్నవారు, వెనుకబడిన లేదా అట్టడుగు వర్గాలకు చెందినవాళ్లు.
మత సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే సంరక్షణ గృహాలలో, ప్రభుత్వ కేర్ సెంటర్లలో కంటే ఎక్కువ లైంగిక వేధింపులు జరుగుతున్నాయని విచారణలో వెల్లడైంది.
అయితే దీనిని కప్పిపుచ్చేందుకు వాటి నిర్వాహకులు బాధితులను ఇతర ప్రదేశాలకు తరలించడం, నేరారోపణలను నిరాకరించడం చేస్తుండగా, విచారణకు ముందే చాలా మంది బాధితులు చనిపోతున్నారని నివేదిక పేర్కొంది.
2018 నుంచి నిర్వహించిన ఈ బహిరంగ విచారణలో 100 రోజుల పాటు బాధితులను విచారించారు. 2,300 కంటే ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడినవాళ్లు ఈ విచారణలో తమ అనుభవాలను పంచుకున్నారు. చాలా సందర్భాలలో వారిపై వేధింపులు మొదటి రోజు నుంచే మొదలయ్యాయని గుర్తించారు.

ఫొటో సోర్స్, Reuters
ఇలాంటి వేధింపుల నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో అన్నా థాంప్సన్ ఒకరు. మత సంస్థల ఆధ్వర్యంలో నడిచే ఆశ్రమంలో తనను శారీరకంగా, మానసికంగా ఎలా వేధించారో ఆమె కమిషన్‌కు చెప్పుకున్నారు.
"రాత్రిళ్లు మత సన్యాసినులు నా బట్టలు విప్పి, నన్ను బెల్టుతో కొట్టేవారు. దాంతో నా చర్మం కమిలిపోయి, నేను కొన్ని వారాలపాటు కూర్చోలేకపోయాను" అని ఆమె నివేదికలో ప్రచురించిన వాంగ్మూలంలో చెప్పారు.
తనకు ఎనిమిదేళ్ల వయసులో ఆక్లాండ్‌లోని ఒక రెసిడెన్షియల్ పాఠశాల సిబ్బంది తనను కొట్టి, తనపై అత్యాచారానికి పాల్పడ్డారని మరో బాధితుడు జెస్సీ కెట్ తెలిపారు. ఇతర సిబ్బంది దీన్ని మౌనంగా చూసేవాళ్లని ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
మోయాపులు ఫ్రాన్సిస్ తగలోవా అనే బాధితురాలు తనకు అయిదేళ్ల వయసు నుంచి రెండేళ్లపాటు ఒక మతాధికారి వేధించారని తెలిపారు.
"అతను పిల్లలపై లైంగిక అకృత్యాలకు పాల్పడేవాడు. దురదృష్టం ఏంటంటే... నాలాగే ఇంకా చాలామంది అమ్మాయిలూ అతని బారిన పడ్డారు" అని తగలోవా వెల్లడించారు.
మావోరీ, పసిఫిక్ తెగల ప్రజలు ఎక్కువగా శారీరక వేధింపులను ఎదుర్కొన్నారని, "వాళ్ల జాతి, చర్మం రంగు కారణంగా వారు మరిన్ని బాధలను ఎదుర్కొన్నారు" అని నివేదిక వెల్లడించింది.
"ప్రభుత్వం, మత సంస్థల సంరక్షణలో ఉన్న లక్షల మంది పిల్లలు, యువజనులు, వృద్ధులు ఇలా వేధింపులకు, నిర్లక్ష్యానికి గురి కావడం మన జాతికే అవమానకరం" అని నివేదిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
"బాధితుల విషయంలో మేము మరిన్ని మెరుగైన చర్యలు తీసుకొని ఉండాల్సింది. బాధితుల అసాధారణ శక్తికి, వారి ధైర్యానికి, నిజాయితీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ వల్ల మాకు మీరు అనుభవించిన బాధలు, గాయాల గురించిన నిజాలు తెలిశాయి" అని ప్రధాని లక్సన్ అన్నారు.
ప్రభుత్వం బాధితులకు ఎంత పరిహారం చెల్లించేది త్వరలో వెల్లడిస్తామని ఆయన అన్నారు. ఈ వేధింపులపై నవంబర్ 12న అధికారికంగా బాధితులకు క్షమాపణలు చెబుతానని ఆయన అన్నారు.
నివేదికను రూపొందించడంలో పాలు పంచుకున్న మాజీ ఉప ప్రధాని గ్రాంట్ రాబర్ట్‌సన్ బీబీసీతో మాట్లాడుతూ, చాలా మంది న్యూజీలాండ్‌వాసుల మాదిరిగానే, తననూ అపరాధ భావం వెంటాడుతోందని అన్నారు.
బుధవారం ఈ నివేదిక విడుదలకు ముందు డజన్ల కొద్దీ బాధితులు పార్లమెంటు వద్ద జరిగిన ప్రదర్శనలో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వేధింపుల నుంచి ప్రాణాలతో బయటపడిన టోని జార్విస్ రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "దశాబ్దాలుగా మేము ఇలాంటి వాటిని కల్పించి చెబుతున్నామని అన్నారు. అందుకే ఈ రోజు చరిత్రాత్మకమైనది. మా బాధలు, కష్టాలు అన్నీ నిజమే అని ఈ రోజు ప్రపంచం గుర్తించింది’’ అన్నారు.
ఈ విచారణలో సాక్షిగా ఉన్న విద్యావేత్త డాక్టర్ రావిరి వారెటిని-కరీనా బాలల సంరక్షణా గృహంలో తాను చిన్నతనంలో అనుభవించిన వేధింపుల గురించి విచారణలో చెప్పారు. ఆయన పదేళ్లు జైలులో గడిపారు. సంరక్షణ గృహాలలో పరిస్థితుల వల్ల చాలా మంది జైళ్లకు వెళుతుంటారని ఆయన తెలిపారు.
"నేను యుక్తవయసులో మొదటిసారి జైలుకు వెళ్లినప్పుడు, అక్కడ 80% మంది నాకు తెలిసిన వాళ్లే కనిపించారు. మేమంతా ప్రభుత్వ సంరక్షణలో కలిసి పెరిగిన వాళ్లమే" అని ఆయన అన్నారు.
"సంరక్షణ గృహాల నుంచి జైలుకు దారి ఉందని నాకు అప్పుడే తెలిసింది. దశాబ్దాలుగా మావోరీ పిల్లలను ప్రభుత్వ సంరక్షణ నుంచి జైలుకు పంపే దారి ఇదే" అన్నారాయన.
"మన చర్యలకు మనమే బాధ్యత వహిస్తాము. అయితే మనం జన్మించిన వాతావరణంలో పనిచేసే యంత్రాంగానికి, ఒకరి శ్రేయస్సు కోసం మరొకరిని బలి పెట్టడానికి మనం బాధ్యత వహించము అని రాయల్ కమిషన్ నివేదిక చాటుతోంది’’ అని డాక్టర్ వారెటిని-కరీనా అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














