'ఏలియన్' తిలాపియా చేపలపై థాయ్‌లాండ్ యుద్ధం చేస్తోంది, ఈ చేపలు ఎంత ప్రమాదకరమంటే..

ఫొటో సోర్స్, Thai News Pix
- రచయిత, జోయెల్ గింటో, జిరాపోర్న్ శ్రీచామ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
తిలాపియా... ఇవి థాయ్‌లాండ్ స్థానిక జలాల్లోని చేపలు కావు. పశ్చిమ ఆఫ్రికా నుంచి వివిధ జలమార్గాల ద్వారా థాయ్‌లాండ్ జలాల్లోకి ప్రవేశించాయి. ఈ చేపలు చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఇవి పర్యావరణానికి అపారమైన నష్టాన్ని కలిగిస్తాయని థాయ్‌లాండ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే వీటిని ‘ఏలియన్’ చేపలు అంటుంటారు.
వీటిని నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా జనాలు సరస్సుల్లోకి దిగి వాటిని పట్టుకోవడం, వాటికి జన్యుమార్పిడి చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, తిలాపియా చేపలు థాయ్‌లాండ్ జలాల్లోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు 17 ప్రావిన్సుల్లో ఇవి భారీగా వ్యాప్తి చెందాయి.
ఈ చేపలు విస్తరించడానికి కారణాలు, వాటి నిర్మూలనపై థాయ్‌లాండ్ పార్లమెంట్‌లో చర్చ జరిగింది.

విదేశీ చేపలతో పోరాటం
థాయ్‌లాండ్‌లో ఈ చేపల వ్యాప్తిని కట్టడి చేసేందుకు 10 బిలియన్ బాట్లు (సుమారు 24,48,05,50,000 రూపాయలు) ఖర్చవుతుందని బ్యాంకాక్ ఎంపీ నట్టాచా అంచనా వేశారు.
సమస్య ఏమిటంటే, ఈ ఏలియన్ చేపలు ఇతర చిన్నచిన్న చేపలను, రొయ్యలను, నత్తల లార్వాలను తింటాయి. థాయిలాండ్ ఆక్వా ఉత్పత్తులలో ఇవన్నీ ప్రధానమైనవి. అందుకే వీటి వ్యాప్తిని అరికట్టడం చాలా ముఖ్యం.
ఈ చేప పూర్తి పేరు బ్లాక్‌చిన్ తిలాపియా. నదులు, చిత్తడి నేలల ద్వారా థాయ్‌లాండ్ జలాల్లోకి ప్రవేశించిన బ్లాక్‌చిన్ తిలాపియా చేపలను పట్టుకోవాలని ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తోంది.
ఈ చేపలు ఉప్పు నీటిలో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. మంచి నీటిలో కూడా ఇవి జీవించగలవు.
ఈ చేపలను పట్టుకునే వ్యక్తులకు కిలోకు 15 బాట్లు అంటే దాదాపు 37 రూపాయలు చెల్లిస్తోంది థాయ్ ప్రభుత్వం. దీంతో బ్యాంకాక్ శివార్లలో జనం ప్లాస్టిక్ బేసిన్‌లతో మోకాళ్ల లోతు నీటిలో తిలాపియా చేపలను పట్టుకుంటున్నారు.
అలాగే బ్లాక్‌చిన్ తిలాపియా చేపలను తినే ఆసియా సీబాస్, క్యాట్ ఫిష్‌లను కూడా థాయ్ జలాల్లో వదిలిపెట్టారు అధికారులు.
అయితే తిలాపియా చేపలు చాలా వేగంగా వృద్ధి చెందుతాయి. ఆడ తిలాపియా చేపలు ఒకేసారి 500 గుడ్లు పెడతాయి.
అయితే వీటిని నిరోధించే దిశగా ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎంపీ నట్టాచా బీబీసీతో అన్నారు.
"ఈ పోరాటంలో గెలిచేదెవరో?" అని ఆయన అన్నారు.
‘‘ఈ విషయంపై ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలి, వీటి వివారణకు తీసుకుంటున్న చర్యలేంటో తెలుసుకోవాలి. దానికి వారు ఏ విధంగా తోడ్పాటు అందించగలరో ఆలోచించాలి. లేదంటే ఈ విషయం మరుగున పడిపోతుంది. అలా జరిగితే తరువాతి తరం కూడా ఈ చేపల బారిన పడుతుంది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Thai News Pix
ఇవి థాయ్‌లాండ్ జలాల్లోకి ఎలా వచ్చాయి?
ఈ చేపలపై నల్లటి మచ్చలు ఉంటాయి. కాబట్టి, వీటిని గుర్తించడం చాలా సులువు.
పార్లమెంటు పరిశీలించిన ఒక వాదన ప్రకారం, 14 సంవత్సరాల క్రితం ఫుడ్ బెహెమోత్ చారోన్ పోక్‌ఫాండ్ ఫుడ్ (సీపీఎఫ్) సంస్థ చేసిన ప్రయోగం వీటి వ్యాప్తికి కారణమైంది.
పశువుల దాణా ఉత్పత్తి చేసే ఈ సంస్థ రొయ్యలు, పశువుల ఫాంలను కూడా నడుపుతోంది.
2010 చివరలో 2,000 తిలాపియా చేపలను ఈ సంస్థ ఘనా నుంచి దిగుమతి చేసుకుంది.
అయితే అప్పుడు ఆ చేపలన్నీ చనిపోయాయని వాటన్నింటినీ పాతిపెట్టామని ఆ సంస్థ తెలిపింది.
కానీ రెండు సంవత్సరాల తరువాత సీపీఎఫ్ ప్రయోగశాల ఉండే ప్రాంతంతోపాటు థాయ్‌లాండ్ జలాల్లోనూ తిలాపియా చేపలు వ్యాప్తిచెందాయని స్థానిక మీడియా సంస్థ థాయ్ పీబీఎస్ పేర్కొంది.
కానీ ఈ ఆరోపణలను సీపీఎఫ్ ఖండించింది. ఈ విషయంపై "తప్పుడు సమాచారాన్నివ్యాప్తి చేసే వారిపై దావా వేస్తామ’’ని కూడా హెచ్చరించింది.
అయితే, ఈ కంపెనీ బ్లాక్‌చిన్ తిలాపియా చేపల వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడుతున్న స్థానిక ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తోంది.
"ఈ చేపల వ్యాప్తికి మా కంపెనీ కారణం కాదని భావిస్తున్నాం. అలాగే ప్రభుత్వానికి సహకరించడానికి మా కంపెనీ సిద్ధంగా ఉంది’’ అని సీపీఎఫ్ ప్రతినిధి ప్రేమ్‌సాక్ వనుచ్‌సూన్‌టోర్న్ అన్నారు.
కానీ, సీపీఎఫ్ అధికారులు ఒక్కసారి మాత్రమే వ్యక్తిగతంగా పార్లమెంట్ విచారణలకు హాజరయ్యారు. గతంలో లిఖితపూర్వకంగా తమ వివరణను ఇచ్చారు.
బ్లాక్‌చిన్ తిలాపియాను దిగుమతి చేసుకోవడానికి ఒక ప్రైవేట్ కంపెనీ మాత్రమే అనుమతి కోరిందని థాయ్‌లాండ్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ బాంచా సుక్కేవ్ చెప్పారు.
ప్రయోగశాల నుంచి కొన్ని చేపలు తప్పించుకునే అవకాశం ఉందని ఆయన బీబీసీతో అన్నారు.
ఈ చేపలు థాయ్ జలాల్లోకి ఎలా వచ్చాయన్నది కాదు, భవిష్యత్తులో వీటి వ్యాప్తి ఎలా ఉంటుంది? వీటిని ఎలా నియంత్రించాలి? అన్నిది సమస్య. కానీ ఇది సాధ్యమేనా? అన్నదే ప్రశ్న.
ఈ పోరాటంలో ఓడిపోయే అవకాశమే ఎక్కువని నిపుణులు బీబీసీతో చెప్పారు.
"ఈ చేపలను పూర్తిగా నిర్మూలించే అవకాశం నాకు కనిపించడం లేదు. వాటి పరిధిని పరిమితం చేయలేం. అవి నిరంతరం పునరుత్పత్తి చేస్తూనే ఉంటాయి." అని వాలాలక్ విశ్వవిద్యాలయానికి చెందిన జన్యుశాస్త్ర నిపుణుడు డాక్టర్ సువిత్ అన్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చేపలు ఒకసారి వ్యాప్తి చెందడం మొదలైతే, వాటిని నిర్మూలించడం కష్టమని పర్యావరణ నిపుణుడు నాన్ పానిత్వాంగ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














