హరియాణా: ‘మంగళవారం కూడా మాంసం తింటున్నారా అని అడిగారు.. బీఫ్ అనే అనుమానంతో మా బావను కొట్టి చంపారు’
- రచయిత, సత్ సింగ్
- హోదా, బీబీసీ పంజాబీ

హరియాణాలోని చర్కీదాద్రి జిల్లా బాద్రా గ్రామంలో గో రక్షణ కార్యకలాపాలతో సంబంధం ఉన్న కొందరు చెత్త ఏరుకునే ఓ ముస్లిం యువకుడిని కొట్టడంతో ఆయన చనిపోయారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ఆగస్టు 27న జరిగింది.
చనిపోయిన వ్యక్తిని సాబిర్ మలిక్‌గా గుర్తించారు. ఆయన తన కుటుంబంతో కలిసి చర్కీదాద్రిలోని మురికివాడలో నివసించేవారు. ఆయన పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందినవారు.
కొంతమంది యువకులు కర్రలతో 24 ఏళ్ల సాబిర్ మలిక్‌ను కొడుతుంటే, స్థానికులు వారిస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
బాద్రా బస్‌స్టాండ్ ఎదురుగా నివసించే ముస్లింలు బీఫ్ తింటున్నారని గోరక్ష దళాలకు చెందినవారు అనుమానించారు.
ఆగస్టు 27న గోరక్షాదళానికి చెందిన వారు మురికివాడల్లో తిరుగుతూ అక్కడివారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు.
ఆ సమయంలో వారికి ఓ గిన్నెలో మాంసం ముక్క కనిపించింది. దానిని వారు బీఫ్‌గా అనుమానించారు. దీంతో అక్కడే నివసిస్తున్న షాబ్రుద్దిన్ అనే వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా తీశారు.
ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న ప్రకారం సాబిర్ బంధువు షాబ్రుద్దిన్‌ను ఆ మాంసం ముక్క ‘బీఫా?’ అని ప్రశ్నించగా, అది గేదె మాంసం అని ఆయన చెప్పడం ఆ వీడియోల్లో ఉంది.
దీంతో గోరక్షక దళంతో సంబంధం ఉన్న కొందరు అతనిని పట్టుకుని ఆ మాంసం ముక్క ‘బీఫ్’ అని కెమెరాముందు చెప్పించారు.
ఈ విషయంపై గోరక్షకులు బాద్రా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని మాంసం ముక్కను, కొంతమంది వ్యక్తులను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు.

ఫిర్యాదుదారు ఏం చెప్పారు?
సాబిర్ మలిక్ బంధువు సాజుద్దిన్ సర్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరియాణా పోలీసులు కేసు నమోదు చేశారు. తాను, తన బంధువు సాబిర్, బాద్రాలోని జుయి మార్గంలోని మురికివాడలో నివసిస్తున్నట్టు ఆయన చెప్పారు.
సాబిర్ తన సోదరి సకీనాను వివాహం చేసుకున్నారని, ఆయన చెత్త ఏరుకుని జీవిస్తుంటారని చెప్పారు.
‘‘ఆగస్టు 27న కొందరు వచ్చారు. వారు నాతోపాటు చెత్త ఏరుకునే మిగతావారితో మాట్లాడుతూ...మీరంతా మంగళవారం కూడా మాంసంతింటున్నారా అని అడుగుతూ, మేం తింటున్నది బీఫ్ కావచ్చు అని అనుమానించారు. మమ్మల్ని పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. అప్పుడు కొంతమంది మా బావ సాబిర్ మలిక్‌ను బస్‌స్టాండ్ వద్దకు పిలిచారు’ అని చెప్పారు.
‘‘సాబిర్‌ను పిలిచిన కొద్దిసేపటికి అసిరుద్దీన్ అనే మరో వ్యక్తినీ పిలిచారు. అక్కడ నా బావను, అసిరుద్దీన్‌ను కర్రలతో కొట్టారు. అందరి కళ్ల ముందే సాబిర్‌ను మోటారు సైకిల్‌పై తీసుకువెళ్లారు. నేను ఆ వీడియో కూడా చూశాను’’ అని తెలిపారు.
గోరక్షకులు పోలీసు స్టేషన్‌కు వెళ్ళి మురికివాడల్లో నివసిస్తున్నవారిపై కేసు పెట్టాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని అసిరుద్దీన్ చెప్పారు.
సాబిర్ మలిక్‌ను బాద్రా బస్టాండ్ వద్దకు పిలిచిన తరువాత ఆయనను కర్రలతో కొట్టారు. అప్పుడు స్థానికులు జోక్యం చేసుకోవడంతో గోరక్షక దళం ఆయనను మోటారుసైకిల్‌పై తీసుకువెళ్ళింది.
ఎఫ్ఐఆర్ ప్రకారం.. బాంద్వా గ్రామ సమీపంలో గుర్తుతెలియని శవాన్ని కనుగొన్నారు. తరువాత అది సాబిర్ మలిక్‌దిగా గుర్తించారు.
సాజుద్దిన్ ఆగస్టు 28న చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురి వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వీరిపై విచారణ కొనసాగుతోందని చెప్పారు.

మురికివాడలో నివసించే ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేయగా, జరిగిన ఘటనపై భయభ్రాంతులకు గురయ్యామని, ఇక్కడి నుంచి వెళ్లిపోదామనుకుంటున్నామని చెప్పారు.
బీఫ్ వ్యవహారంపై మాట్లాడేందుకు ఎక్కడి నుంచో బతుకుదెరువుకోసం వచ్చిన వారంతా సిద్ధంగా లేరు.
ఆగస్టు 30న వారంతా తిరిగి పశ్చిమబెంగాల్‌కు వెళ్లేందుకు సిద్ధపడినప్పుడు పోలీసులు వారికి సెక్యూరిటీ కల్పించారు.

పోలీసులు ఏం చెప్పారు?
సంఘటన జరిగిన మరుసటిరోజు పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారని,వారిలో ఇద్దరు మైనర్లు తప్ప, మిగిలిన ఐదుగురు పోలీసు రిమాండ్‌లో ఉన్నారని చర్కీదాద్రి ఎస్పీ భరత్ భూషణ్ చెప్పారు.
నిందితులపై విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.
ఈ ఘటనలో ఇంకా ఎవరిపేర్లయినా బయటకు వస్తే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి ధీరజ్ కుమార్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














