హైదరాబాద్: గోమాంసం తరలిస్తున్నారంటూ ఇద్దరు యువకులపై దాడి, వీడియో వైరల్

వైరల్ దృశ్యాలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, వైరల్ వీడియో
    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో ఇద్దరు ముస్లింలను కొందరు వ్యక్తులు చుట్టుముట్టి దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టిక్ టాక్‌లో అప్‌లోడ్ అయిన ఆ వీడియోలో, ‘‘ఆవును చంపిన వారిని చంపాలి’’ అంటూ వెనుక నుంచి పాట కూడా వినిపిస్తోంది.

అయితే, తాము ఆవును వధించలేదని, గోమాంసాన్ని తరలించలేదని వారు చెబుతున్నారు. పోలీసులు కూడా మొదట వారిని అదుపులోకి తీసుకొని, తరువాత మాంసంతో పాటు వారిని కూడా విడిచిపెట్టారు.

అకారణంగా తమపైన దాడి చేశారని, ఇప్పుడు తమ ముఖాలు కనిపించేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, దాని వల్ల భవిష్యత్తులో కూడా తమకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆ యువకులు భయపడుతున్నారు.

ఇదే ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఇతర వీడియోలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిని ఎవరు తీశారు, ఆ తరువాత వాటిని ఎవరు ఎడిట్ చేశారు అనే దానిపై స్పష్టత లేదు.

ఆ వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం... బైక్‌పైన వెళ్తున్న ఇద్దరు ముస్లింలను ఓ వ్యక్తి ఆపి వాళ్లు తీసుకెళుతోన్న బ్యాగ్‌ని తెరిచి చూపించమంటారు. అందులో మాంసం కనిపిస్తుంది.

దాంతో ఓ గుంపు వచ్చి వాళ్లను చుట్టుముట్టి అక్కడి నుంచి కదలనీయకుండా అడ్డుకుంటుంది. ఆ తరువాత పోలీసులు వచ్చి ఆ ఇద్దరినీ కొట్టిన దృశ్యాలు అందులో కనిపించాయి.ఆపైన పోలీసులు ఆ ముస్లిం వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిపైనా గ్రామస్థులు కూడా దాడికి పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు.

“వాళ్లిద్దరూ ఆ ఏరియా వాళ్లు కాదు. వాళ్లు భువనగిరి నుంచి ఘట్‌కేసర్ మీదుగా నగరంలోకి వెళ్తున్నారు. ఆ ఇద్దరూ మాంసం తీసుకెళుతుండడంతో కొందరు వ్యక్తులు వారిని ఆపి కొట్టారు. వాళ్లు ఏం తీసుకెళ్తున్నారనే దాంతో సంబంధం లేదు. కానీ వారు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. ఇంత దూరం ప్రయాణించడానికి తగిన కారణం కూడా లేదు. లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు వారి మీదా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు గ్రామస్థుల మీదా కేసులు పెట్టాం’’ అని ఘట్‌కేసర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పి.రఘువీర్ రెడ్డి తెలిపారు.

పోలీస్ కానిస్టేబుల్ ఆ ఇద్దరినీ కొట్టడంపై విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

గోమాంసం పేరుతో దాడి

ఫొటో సోర్స్, UGC

కావాలనే పెద్దది చేశారు

ఆ వీడియోలో కనిపించిన వ్యక్తులతో బీబీసీ న్యూస్ మాట్లాడింది. వారిలో ఒకరైన హఫీజ్ అబ్దుల్ అలీం ఆయన కజిన్‌తో కలిసి మాంసం తేవడానికి హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్లినట్లు తెలిపారు.

“మేం బేగంపేటలో ఉంటాం. మాది పెద్ద కుటుంబం. రంజాన్ మాసం కావడంతో మాంసం తేవడానికి వెళ్లాం. భువనగిరిలో ప్రభుత్వం సర్టిఫై చేసిన దుకాణంలోనే మాంసం కొన్నాం. మేం తిరిగి ఇంటికి వచ్చే దారిలో, పోలీసు చెక్ పోస్టులను తప్పించుకోవడం కోసం గల్లీల గుండా ప్రయాణించాం.

అప్పుడే ఘట్‌కేసర్ దగ్గర గ్రామస్థులు మమ్మల్ని ఆపి ప్రశ్నించారు. తరువాత మమ్మల్ని కొట్టారు. పోలీసులు కూడా వచ్చి మమ్మల్నే కొట్టారు. మేం ఏ మాంసం తీసుకెళ్తున్నామో చెప్పాలని కోరారు. అది గోమాంసం కాదని చెబుతున్నా వినకుండా దాడి చేశారు. మమ్మల్ని స్టేషన్‌కి తీసుకెళ్లి, మా బండ్లను సీజ్ చేశారు. ఒక గంట తరువాత మమ్మల్ని మాంసం తీసుకుని ఇంటికి వెళ్లడానికి అనుమతించారు” అని హఫీజ్ వివరించారు.

“మా ముఖాలను చూపిస్తూ మేం ఆవులను చంపిన వాళ్లమంటూ ఒక వీడియో వైరల్ చేశారు. మేం ఏ ఆవునీ చంపలేదు. మేం తినే ఆహారం ఆధారంగా మమ్మల్ని లక్ష్యంగా చేసుకోవడమేంటి? మా ఆహారపు అలవాట్ల ఆధారంగా మమ్మల్ని అవమానిస్తున్నారు. నాతో పాటు నా తమ్ముడి భద్రత దృష్ట్యా సోషల్ మీడియా నుంచి ఆ వీడియోలు తొలగించాల్సిందిగా పోలీసులను కోరుతున్నాం. భవిష్యత్తులో వాటి ఆధారంగా మాపైన దాడి జరిగే ప్రమాదముంది’’ అన్నారు హఫీజ్.

అయితే ఈ ఇద్దరు యువకులను ఆపిన వారు ఆరెస్సెస్‌కు అనుబంధంగా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరెస్సెస్ కార్యకర్తలు ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. ఏప్రిల్ 9న ట్విట్టర్లో ఫ్రెండ్స్ ఆఫ్ ఆరెస్సెస్ పేరిట కొన్ని ఫొటోలు పెట్టారు. అందులో ఖాకీ ప్యాంట్లు, తెల్ల చొక్కాలు వేసుకుని లాఠీలు పట్టుకున్న కొందరు వ్యక్తులు గస్తీ కాస్తూ కనిపిస్తున్నారు. "ఆరెస్సెస్ వలంటీర్లు యాదాద్రి జిల్లా చెక్ పోస్టు దగ్గర రోజుకు 12 గంటల చొప్పున పోలీసులకు సాయం చేస్తున్నారు. #RSSinAction" అని ఆ ట్వీటులో పేర్కొన్నారు.

అయితే, ఘట్‌కేసర్ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆరెస్సెస్ చెబుతోంది. ''ఆరెస్సెస్‌ ఇలా చట్టాన్ని ఎప్పుడూ చేతుల్లోకి తీసుకోదు. ఆ దాడితో మాకు సంబంధం లేదు'' అని తెలంగాణ రాష్ట్ర ఆరెస్సెస్ మీడియా వ్యవహారాల ఇన్‌ఛార్జ్ నడింపల్లి ఆయుష్ తెలిపారు.

యాదాద్రి చెక్‌పోస్ట్ ఘటన విషయానికి వస్తే, ''ఆరెస్సెస్ స్వయం సేవకులు అధికారులు, పోలీసుల పనిలో ఎప్పుడూ కల్పించుకోరు. స్థానిక పాలకులు, అధికారుల అనుమతి తీసుకున్న తరువాతే వాళ్లు ఏ పనైనా చేస్తారు'' అని ఆరెస్సెస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

అయితే ఈ ఘటనను కొందరు కావాలనే పెద్దది చేసే ప్రయత్నం చేశారని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘‘వాళ్లు లాక్‌ డౌన్‌ను ఉల్లంఘించారనే విషయం కంటే, మాంసాన్ని తీసుకెళ్తోన్న విషయానికే ప్రాధాన్యమిచ్చి దాన్ని పెద్దది చేయాలని చూశారు. కానీ, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వాళ్లను అక్కడి నుంచి తప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు’’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)