బ్లాక్ ట్యాక్స్: సంపాదించిన డబ్బు ఇంటికి పంపబోమంటున్న యువత, ఏమిటీ ఆచారం, ఎందుకీ వ్యతిరేకత...

ఫొటో సోర్స్, AFP
- రచయిత, డానై నెస్టా కుపేంబా
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘ఇంట్లో వాళ్లకు, సమీప బంధువులకు డబ్బు పంపించడం ఆఫ్రికాలో సర్వసాధారణం. కానీ, ఈ పద్ధతిని నేను చాలా ద్వేషిస్తా.’’ అని కెన్యా ఇన్‌ఫ్లూయెన్సర్ ఎల్సా మాజింబో టిక్‌టాక్‌లో చెప్పారు. తర్వాత సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర చర్చ మొదలవ్వడంతో ఆ వీడియోను తొలగించారు.
ఎల్సా మాజింబో (23) కరోనా మహమ్మారి సమయంలో కామెడీ వీడియోలతో సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. ఆమెకు 18 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. తన ఫాలోయర్లతో ‘బ్లాక్ ట్యాక్స్’ గురించి చర్చిస్తూ దీనిపట్ల తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
స్వదేశంలో లేదా విదేశాలకు వెళ్లి జీవితంలో ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న నల్లజాతి ఆఫ్రికన్లు, ఆర్థికంగా వెనుకబడిన తమ కుటుంబసభ్యులకు అండగా నిలవాల్సి ఉంటుంది. ఇలా డబ్బు ఇచ్చే ఆచారాన్ని లేదా పద్ధతిని అక్కడివారు ‘బ్లాక్ ట్యాక్స్’ గా వ్యవహరిస్తారు.
‘తిరిగి ఇవ్వడం’ అనే అంశం ఆఫ్రికాలోని ఉబుంటు ఫిలాసఫీలో ఒక భాగం. సమాజం, మానవత్వాన్ని చాటుకోవడం వంటి అంశాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పే నైతిక, సామాజిక తత్వమే ఉబుంటు ఫిలాసఫీ.

వ్యక్తి కంటే కుటుంబం, సమాజానికి ఉబుంటు తత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది.
బ్లాక్ ట్యాక్స్ అనేది అనవసర భారమా? లేక ఇతరులను పైకి తీసుకురావడంలో సహాయపడాలనే సామాజిక బాధ్యతలో భాగమా అనేది చాలామంది ఆఫ్రికన్లలో ఉన్న ప్రశ్న.
ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఎల్సా మాత్రం ఈ పద్ధతిని వ్యతిరేకిస్తున్నారు.
తన తండ్రి చాలా ఏళ్ల పాటు తమ సమీప బంధువులను ఆర్థికంగా ఆదుకున్నారని, ఇప్పుడు వారంతా సహాయం కోసం తనవైపు చూస్తున్నారని టిక్‌టాక్ వీడియోలో ఎల్సా చెప్పారు. తమ బంధువుల్లో ఒక వ్యక్తిపై ఆమె మరింతగా విరుచుకుపడ్డారు. కానీ, ఆ బంధువు పేరును ఆమె ప్రస్తావించలేదు.
‘‘నేను పుట్టకముందు నుంచి మీరు మా నాన్నను డబ్బు అడుగుతున్నారు. నేను పుట్టాక, ఎదిగే సమయంలోనూ, నేను పెరిగిన తర్వాత కూడా మీరు మా నాన్న నుంచి డబ్బు తీసుకున్నారు. ఇప్పుడు నన్ను డబ్బు అడుగుతున్నారు. మీరు చాలా బద్ధకస్తులు. నేను మీ సోమరితనాన్ని ప్రోత్సహించను.’’ అని ఆమె సదరు బంధువుపై కోపగించుకున్నారు.

ఫొటో సోర్స్, Sandra Ajalo
కొందరు ఆమె వైఖరిని సమర్థించగా, మరికొందరు వ్యతిరేకించారు. టిక్‌టాక్ నుంచి ఆ వీడియోను ఎందుకు తొలగించారో తెలియదు. దీనిపై ఎల్సా సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ బృందాన్ని బీబీసీ ప్రశ్నించగా వారు స్పందించలేదు.
కానీ, చాలామందికి వ్యక్తిగతంగా ఈ పద్ధతి నచ్చినా, నచ్చకపోయినా తాము పెరిగిన సమాజం కారణంగా బంధువులకు సహాయం చేయడాన్ని వారు కాదనలేరు.
ఈ సహాయం అనేది వారికి భారంగా మారినా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడాన్ని, బంధువులకు అండగా నిలవడాన్ని గర్వంగా భావిస్తారు.
జింబాబ్వేకు చెందిన ఒక మాజీ టీచర్ వయస్సు 50 ఏళ్లు. ఆమె తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. 30 ఏళ్ల క్రితం తనకు వచ్చిన తొలి జీతం 380 జింబాబ్వే డాలర్ల (88 రూపాయలు)లో దాదాపు మొత్తం డబ్బును తన తొమ్మిది మంది తోడబుట్టినవాళ్లకే ఇచ్చేశానని చెప్పారు.
‘‘మా వాళ్లకు స్కూల్ యూనిఫామ్‌లు, దుస్తులు, సరుకులు కొన్న తర్వాత నా దగ్గర 20 డాలర్లు (రూ.4) మాత్రమే మిగిలాయి.’’ అని కాస్త గర్వం, కాస్త చికాకు కలగలిసిన గొంతుతో బీబీసీకి చెప్పారు.
తర్వాత అప్పు చేసి ఫుడ్ కొనుక్కోవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. ఇంట్లో పెద్ద అమ్మాయిగా, సంపాదన మొదలుపెట్టిన క్షణం నుంచి ఆర్జించిన డబ్బును ఇంట్లో వాళ్లకే ఇచ్చేయాల్సి ఉంటుందని ఆమె చెప్పారు.
ఆమెకు వచ్చిన జీతం ఆమెది మాత్రమే కాదు, కుటుంబానిది కూడా.
పెళ్లి అయ్యాక ఆమె బాధ్యతలు మరింత పెరిగాయి. ఒకానొక సందర్భంలో బ్యాంకులో చెక్‌ను డిపాజిట్ చేయడానికి వెళ్తుండగా ఎవరో దాన్ని కొట్టేయడంతో ఆమె తన మరిది ట్యూషన్ ఫీజు చెల్లించడం కోసం అప్పు చేయాల్సి వచ్చింది. అప్పు తీర్చడానికి రెండేళ్లు పట్టింది.
శాండ్రా అజాలో వయస్సు 28 ఏళ్లు. యుగాండాలో హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నారు. తాను ఎదిగే సమయంలో తమ కుటుంబానికి బంధువులు చేసిన సాయం పట్ల ఆమె కృతజ్ఞతతో ఉన్నారు.

ఫొటో సోర్స్, Gabe Mutseyekwa
శాండ్రాకు ముగ్గురు తోబుట్టువులు. వారిని తల్లే పెంచి పెద్ద చేశారు. ఈ క్రమంలో శాండ్రా తల్లిని ఆమె సమీప బంధువులు స్కూలు ఫీజులు కట్టడం నుంచి సరుకులు, వైద్య ఖర్చులు చెల్లించడం వరకు చాలా విషయాల్లో ఆదుకున్నారు.
‘‘ఇది భారం కాదు, ఒక రకమైన సహాయం.’’ అని బీబీసీతో అన్నారు శాండ్రా .
‘‘ఇది కాస్త కష్టంగా ఉండొచ్చు. కాస్త చికాకు తెప్పించొచ్చు. కానీ, ఇలా చేయడం అవసరం. ప్రతీ ఒక్కరూ ఏదో సమయంలో ఇతరులపై ఆధారపడతారు. కాబట్టి వీలైనంత వరకు మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.’’ అంటారు శాండ్రా.
వలసవాద కాలం నాటినుంచే బ్లాక్ ట్యాక్స్ సంప్రదాయం పాతుకుపోయిందని అమెరికాలోని వెల్లెస్లీ కాలేజీ ఆఫ్రికన్ స్టడీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిపో డెండ్రెరి తెలిపారు.
వలసవాద శక్తుల చేతుల్లో లేదా కొంతమంది సెటిలర్ల చేతుల్లో వనరులు కేంద్రీకృతం అయ్యేలా చేసిన ఆనాటి అణచివేత వ్యవస్థ, చాలామందికి ఆస్తుల్ని దూరం చేసిందని, ఫలితంగా చాలా నల్లజాతి కుటుంబాలకు తరతరాల సంపద లేకుండా పోయిందని ప్రొఫెసర్ చిపో చెప్పారు.
స్వతంత్రం వచ్చాక కూడా అసమానతలు తొలగిపోకపోగా, ఇంకా పునరావృతం అయ్యాయి.
బ్లాక్ ట్యాక్స్ చెల్లించడం అనేది ఒక అంతులేని ప్రక్రియగా మారిపోయిందని చిపో అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇలా కుటుంబీకులు పంపించే డబ్బు తాత్కాలికంగా వారిని ఆదుకుంటోందని, తర్వాత మళ్లీ డబ్బు సమస్య అలాగే ఉంటోందని ఆయన అన్నారు.
ఇంకో విషయం ఏంటంటే, ధనిక దేశాల తరహాలో కాకుండా చాలా ఆఫ్రికన్ దేశాలు ఆరోగ్య సంరక్షణలో ప్రాథమికమైన సదుపాయాలకు మించి చెల్లించలేకపోతున్నాయి. పెన్షన్, ట్యూషన్ ఫీజుల్ని ఇవ్వలేకపోతున్నాయి. ఫలితంగా కుటుంబంలో కాస్త ఎక్కువ సంపాదించేవారిపైనే ఈ భారం పడుతోందని ఆయన వివరించారు.
‘‘ఉబుంటు సంప్రదాయం కారణంగా మేం బ్లాక్ ట్యాక్స్ ఇస్తున్నాం. మేం ఒకరినొకరు ఆదుకోవాల్సి ఉంటుంది.’’ అని చిపో అన్నారు.
ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ ప్రకారం, 2023లో ఆఫ్రికన్ వలసదారులు స్వదేశానికి పంపిన మొత్తం 95 బిలియన్ డాలర్లు (రూ. 7.96 లక్షల కోట్లు). ఇది దాదాపు కెన్యా ఆర్థిక వ్యవస్థ సైజుకు సమానం.

ఫొటో సోర్స్, AFP
విదేశాలకు వెళ్లిన వారిపై ఈ ఒత్తిడి మరింత ఎక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్లిన వారు బాగా సంపాదిస్తారని భావిస్తూ బంధువులు వారి నుంచి ఎక్కువగా ఆశిస్తుంటారు. ఈ ఆశలే వారిపై ఒత్తిడికి కారణం అవుతుంటాయి.
జింబాబ్వేకు చెందిన 35 ఏళ్ల గాబే ముత్సేయెక్వా అయిదేళ్లుగా జర్మనీలో ఉంటున్నారు. తన భవిష్యత్ కోసం ఆదా చేసుకోలేకపోతున్నందున ఇకనుంచి నెలవారీగా ఇంటికి డబ్బులు పంపించడం మానేస్తానని తన కుటుంబానికి గాబే చెప్పారు.
ఆయన కుటుంబానికి మొదట ఇది నచ్చలేదు. కానీ, తర్వాత వారు దీనికి ఒప్పుకున్నారు.
‘‘నాకోసం నేను కూడబెట్టుకోవాల్సిన అవసరం ఉందని వాళ్లు కూడా అర్ధం చేసుకున్నారు.’’ అని ఆయన చెప్పారు.
ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు, పార్ట్‌టైమ్ జాబ్ చేసేవారు. అప్పుడు ఒకసారి కుటుంబంలో అత్యవసర పరిస్థితి తలెత్తితే ఆయన 2,200 డాలర్ల (రూ. 1.84 లక్షలు)ను ఇంటికి పంపించారు.
‘‘ఆర్థిక భద్రతకు, బాధ్యతకు మధ్య సమతుల్యం ఉండాల్సిన అవసరం ఉంది.’’ అని బీబీసీతో ఆయన అన్నారు.
కుటుంబ సభ్యులు మీ డబ్బును తమ హక్కుగా భావిస్తారని ఆఫ్రికాలో పలువురు చెబుతుంటారు. ముఖ్యంగా ఆ వ్యక్తి ధనవంతుడు అయినప్పుడు ఇలా జరుగుతుందని వారంటారు.
ఈ అంశం నైజీరియా మాజీ ఫుట్‌బాలర్ మైకెల్ జాన్ ఓబీకి కోపం తెప్పించింది. నిరుడు రియో ఫెర్డినాడ్ పోడ్‌కాస్ట్‌లో ఆయన బ్లాక్ ట్యాక్స్ గురించి మాట్లాడారు.
‘‘మీరు ఆఫ్రికా నుంచి వచ్చిన వారైతే, డబ్బు సంపాదిస్తున్నట్లయితే అది మీ డబ్బు కాదు. మీకు మాత్రమే చెందే డబ్బు కాదు. ఎందుకంటే మీకు బంధువులు, కజిన్లు ఉంటారు.’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తమ బంధువులకు చాలామంది పిల్లలు ఉన్నారని, వారందరినీ తాను జాగ్రత్తగా చూసుకోవాలని బంధువులంతా ఆశిస్తారని ఆయన చెప్పారు.
ఎల్సా వ్యాఖ్యలతో అందరూ ఏకీభవించనప్పటికీ, కొందరికి మాత్రం ఆమె మాటలు రుచించినట్లే ఉన్నాయి. ముఖ్యంగా యువ తరానికి..
ఆఫ్రికాను నిజంగా అభివృద్ధి చేయకపోతే, బ్లాక్ ట్యాక్స్ అనేది అక్కడ శాశ్వతంగా ఉండిపోతుందని ప్రొఫెసర్ చిపో అన్నారు.
(అదనపు రిపోర్టింగ్ టోనీ వినోయ్)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














