విజయవాడ, ఖమ్మం సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు, పట్టణాలు, పల్లెలు జలమయం

ఏపీ, తెలంగాణల్లో వర్షాలు, వరదలు
ఫొటో క్యాప్షన్, విజయవాడ జలమయం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

కుండపోత వర్షాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి.

కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాలలో అనేక గ్రామాలు, పట్టణాలు వరద ప్రభావానికి లోనయ్యాయి.

విజయవాడలో బుడమేరు పొంగడంతో సింగ్‌నగర్, వాంబేకాలనీ, రాజరాజేశ్వరిపేట సహా అనేక ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి.

కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, జూపూడి, ఫెర్రీ తదితర ప్రాంతాలూ నీట్లో ఉన్నాయి.

పులిగడ్డ, చిరుకుల్లంక, యడ్లలంక తదితర గ్రామాలలోని ప్రజలను ఇప్పటికే పునరావాస శిబిరాలకు తరలించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వరద ప్రభావిత ప్రాంతాలలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే పర్యటించారు.

బాధితుల కోసం హెలికాప్టర్లలో ఆహార పదార్థాలను జారవిడుస్తున్నారు.

కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్‌కు పైనుంచి నీటి రాక భారీగా ఉండడంతో 70 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.

వ్యాన్లపై బోట్లు

విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఇళ్లలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకోసం మచిలీపట్నం నుంచి సుమారు 100 బోట్లు, పడవలను తెప్పించారు. వీటిని రోడ్డు మార్గంలో లారీలు, వ్యాన్లపై తీసుకొచ్చారు.

సహాయ సిబ్బంది ఈ పడవలు, బోట్లలో వెళ్లి బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారు.

విజయవాడలో వరద

తెలంగాణలో..

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎడతెగని వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలు భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ఖమ్మం నగరంలో కొన్ని ప్రాంతాలలో 10 అడుగుల మేర వరద నీరు చేరినట్లు స్థానికులు చెప్తున్నారు.

దీనికి సంబంధించి పెద్దసంఖ్యలో వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

మున్నేరు పొంగడంతో ఖమ్మం నగరం మొత్తం నీటిలో చిక్కుకుంది. నల్గొండ జిల్లాలోనే పలు గ్రామాలు, కాలనీలు నీట్లో చిక్కుకున్నాయి.

వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ వరద నష్టం తీవ్రంగా ఉంది. పలు చోట్ల రైల్వే ట్రాక్‌ల కింద మట్టి కోతకు గురవడంతో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.

ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్‌కు వరదపోటెత్తడంతో, జలాశయం నుంచి నీరు రహదారులపైకి చేరింది. దీంతో రహదారులు కోతకు గురయ్యాయి. కూసుమంచి రహదారి కోతకు గురై పూర్తిగా దెబ్బతింది.

దెబ్బతిన్న రహదారి
ఫొటో క్యాప్షన్, పాలేరు రిజర్వాయర్ వరద బీభత్సానికి కూసుమంచి రహదారి దుస్థితి
దెబ్బతిన్న రహదారి
ఫొటో క్యాప్షన్, పాలేరు రిజర్వాయర్ పొంగి పొర్లడంతో రహదారులు దెబ్బతిన్నాయి
ఖమ్మం నగరంలో ఓ ఇంటి ముందు వరదకు కొట్టుకొచ్చిన వస్తువులు, వ్యర్థాలు
ఫొటో క్యాప్షన్, ఖమ్మం నగరంలో ఓ ఇంటి ముందు వరదకు కొట్టుకొచ్చిన వస్తువులు, వ్యర్థాలు

రెండు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని

భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు.

కేంద్రం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని వారికి హామీ ఇచ్చారు.

తెలంగాణలో వర్షాలకు వాటిల్లిన నష్టం వివరాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారని.. కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటనతో తెలిపారు.

వీడియో క్యాప్షన్, 15 నిమిషాలలో మెడవరకు నీళ్లొచ్చేశాయ్...

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)