టెలిగ్రామ్: మీ జేబులో ఒక డార్క్‌వెబ్, ఓ మాఫియా కేంద్రం

టెలిగ్రామ్
ఫొటో క్యాప్షన్, డ్రగ్ చానల్ కోసం ఓ సభ్యుడు పోస్ట్ చేసిన ఫోటో
    • రచయిత, జోయ్ టిడీ
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

ఓ కథనాన్ని పరిశోధిస్తున్న క్రమంలో తొమ్మిది నెలల క్రితం నేనొక విషయం గుర్తించాను. మాదకద్రవ్యాలు అమ్మే ఓ పెద్ద టెలిగ్రామ్ చానల్‌లో నేను యాడ్ అయి ఉండడం గమనించాను.

హ్యాకింగ్, క్రెడిట్ కార్డులు దొంగలించే గ్రూపుల్లో కూడా నేను యాడ్ అయి ఉన్నాను.

నేనేమీ చేయాల్సిన అవసరం లేకుండా, నాకేమాత్రం సంబంధం లేకుండా కొందరు తమ చానల్స్‌లో నన్ను యాడ్ చేసుకునే అవకాశం నా టెలిగ్రామ్‌ సెట్టింగ్స్ వల్ల కలుగుతోందని నాకు అర్ధమైంది. లింకులు, స్పామ్ వంటివాటిని నాకు కనిపించకుండా చేస్తుండడం ద్వారా ఇది సాధ్యమవుతోందన్న విషయం నాకర్ధమయింది.

అసలేం జరుగుతుందో చూద్దామని నేను టెలిగ్రామ్ సెట్టింగ్స్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా అలాగే ఉంచాను. కేవలం కొన్ని నెలల్లోనే...నా ప్రమేయమేమీ లేకుండానే అనేక రకాల గ్రూపుల్లో నా పేరు చేరిపోయింది.

దీనికి అడ్డుకట్టవేయాలని నిర్ణయించుకుని సెట్టింగ్స్ మార్చివేశాను. అయితే నేను లాగాన్ అయిన ప్రతిసారీ పెద్దసంఖ్యలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అనేక గ్రూపుల నుంచి నాకు వేలాది కొత్త మెసేజ్‌లు వస్తుంటాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సోషల్ మీడియా
ఫొటో క్యాప్షన్, కార్డ్ స్వైపర్స్ గ్రూప్(15,700 మంది సభ్యులు)- క్లోన్ చేసిన క్రెడిట్ కార్డులు అమ్ముతారు.
సోషల్ మీడియా
ఫొటో క్యాప్షన్, డ్రగ్స్ గార్డెన్స్ అఫీషియల్(9,119 మంది సభ్యులు)-మారివానా కుకీలు, మారివానా బాల్స్ అమ్మకం
సోషల్ మీడియా
ఫొటో క్యాప్షన్, మెమరీస్ అండ్ డ్రగ్స్(6,253మంది సభ్యులు)- టెలిగ్రామ్ చానల్స్ ద్వారా డ్రగ్స్ అమ్మకాలపై ప్రచారం
సోషల్ మీడియా
ఫొటో క్యాప్షన్, కాంట్రబాండ్ నెట్‌వర్క్(5,084 మంది సభ్యులు)-డ్రగ్స్, దొంగలించిన క్రెడిట్ కార్డులు, గన్‌లు సహా అన్నీ అమ్మే గ్రూప్
సోషల్ మీడియా
ఫొటో క్యాప్షన్, గిఫ్ట్ కార్డ్స్ ఫోరమ్(23,369 మంది సభ్యులు)-ఫేక్ వోచర్లు, గిఫ్ట్ కార్డులు అమ్మే మార్కెట్‌ప్లేస్
సోషల్ మీడియా
ఫొటో క్యాప్షన్, న్యూ డాన్ మార్కెట్(222 మంది సభ్యులు)- హ్యాకింగ్ ట్యుటోరియల్స్, ప్రమాదకర సాఫ్ట్‌వేర్ అమ్మే మార్కెట్ ప్లేస్

టెలిగ్రామ్ సీఈవో అరెస్టుకు కారణమేంటి....?

టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌ను ఫ్రాన్స్‌లో అరెస్టు చేయడంతో ఆ యాప్ నియంత్రణ గురించి అంతటా చర్చ జరుగుతోంది. అక్రమ లావాదేవీలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మోసం, చిన్నారులపై లైంగిక వేధింపుల ఫోటోలు షేర్ చేయడం వంటివాటిని తమ యాప్‌లో అనుమతించడంలో ఆయన పాత్రపై అభియోగాలు నమోదయ్యాయి.

ఇతర సోషల్ నెట్ వర్క్ గ్రూపుల్లోనూ నేరాలు జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సైట్లు నిబంధనలు పాటించకపోవడంపై ఏళ్లగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది ఎంత తీవ్రమైన సమస్యగా ఉందో నా అనుభవం మరోసారి రుజువుచేసింది.

నన్ను యాడ్ చేసిన కొన్ని గ్రూపులను గమనిస్తే...ఎలాంటి అక్రమ వస్తువుల కొనుగోలుకైనా నా టెలిగ్రామ్ యాప్ దగ్గర అవకాశం ఉన్నట్టు అర్ధమయింది. కొత్త అమ్మకందార్ల కోసం నేను ఏమాత్రం వెతకకపోయినా ఇలా జరిగింది.

ఆ వస్తువులకు సంబంధించిన చిత్రాలన్నీ గ్రూపుల్లో పోస్టు చేసి ఉన్నాయి. అయితే వాటిని అడ్వర్టైజ్ చేయకుండా ఈ కథనంలో మేం ఆ చానల్స్ పేర్లు మార్చి రాశాం.

ఇవన్నీ పరిశీలించిన తర్వాత, సైబర్ సెక్యూరిటీ పాడ్‌కాస్టర్ పాట్రిక్ గ్రేతోపాటు మరికొందరు కొన్ని నెలలుగా టెలిగ్రామ్‌ను మన జేబులో ఉన్న డార్క్ వెబ్‌ అని ఆరోపించడం నాకు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు.

దురోవ్‌ను అరెస్టు చేయడంపై తన పాడ్‌కాస్ట్ ‘రిస్కీ బిజినెస్‌’లో గ్రే స్పందించారు. చాలా కాలంగా టెలిగ్రామ్ యాప్ నేరాలకు స్వర్గధామంలా ఉందని ఆయన అన్నారు.

సోషల్ మీడియా
ఫొటో క్యాప్షన్, నేరస్థులు కస్టమర్లను ఆకర్షించడానికి అత్యంత అనువైన వేదికగా మారిన టెలిగ్రామ్

నేరాల అడ్డా

‘‘పిల్లలపై లైగింక వేధింపుల గురించి మనం మాట్లాడుకుంటుంటాం. మాదకద్రవ్యాల అమ్మకాల గురించి మాట్లాడుకుంటుంటాం. నేరాల్లో డార్క్ వెబ్ గురించి మనం కచ్చితంగా చర్చిస్తుంటాం. వీటన్నింటినీ టెలిగ్రామ్ ఏమాత్రం నియంత్రించదు.’’ అని ఆయన అన్నారు.

డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్‌లో ఓ భాగం. ప్రత్యేక సాఫ్ట్‌వేర్, అందుకు సంబంధించిన అవగాహన ఉన్నవారే అది ఉపయోగించగలరు. 2011లో సిల్క్ రోడ్డు మార్కెట్ ప్లేస్ ప్రారంభించిన దగ్గరి నుంచి...అక్రమ వస్తువుల అమ్మకం, సర్వీసులు అందించే వెబ్‌సైట్‌లు పెరిగిపోయాయి.

డార్క్‌వెబ్ వంటివాటిలో నేరాలకు పాల్పడేవారి వివరాలను రహస్యంగా ఉంచే అవకాశం ఉండడం, ఇంటర్నెట్ వినియోగం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పెరుగుతుండడంతో యూజర్ల లొకేషన్లు గుర్తించడం, అసలా యూజర్లనేమ్‌ల వెనక ఎవరు ఉన్నారో తెలుసుకోవడం అతిపెద్ద సవాలుగా మారింది.

అలాంటి నేరగాళ్లు కూడా టెలిగ్రామ్‌ను ఇష్టపడుతున్నారని తాజా పరిణామాలతో తెలుస్తోంది.

‘‘టెలిగ్రామ్ లేనిరోజుల్లో డార్క్ వెబ్ సర్వీసులను ఉపయోగించి ఆన్‌లైన్ మార్కెట్లు ఈ కార్యకలాపాలు కొనసాగించేవి. అయితే అవి ఈ స్థాయిలో ఉండేవి కాదు. తక్కువ నైపుణ్యమున్న సైబర్ నేరగాళ్లకు టెలిగ్రామ్ సులభమైన యాప్‌గా మారిపోయింది.’’ అని సైబర్ -సెక్యూరిటీ కంపెనీ ఇంటెల్1471లో పరిశోధకులు తెలియజేశారు.

హ్యాకర్ గ్రూప్ కిలిన్ ఈ వేసవి ప్రారంభంలో యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ ఆస్పత్రుల నుంచి దొంగలించిన రక్త పరీక్షల సమాచారాన్ని తన డార్క్‌వెబ్ వెబ్‌సైట్ కన్నా ముందు టెలిగ్రామ్ చానల్‌లో పబ్లిష్ చేయాలని భావించింది. స్పెయిన్‌, దక్షిణ కొరియాలో స్కూలు పిల్లల నకిలీ నగ్న చిత్రాలు సృష్టించేందుకు డీప్‌ఫేక్ సర్వీసు టెలిగ్రామ్‌ను ఉపయోగించింది. టెలిగ్రామ్‌కు డబ్బులు చెల్లించి మరీ ఇలాంటివి సృష్టిస్తోంది.

ముందే చెప్పినట్టు మిగిలిన గ్రూపుల్లో కూడా ఇలాంటి నేరాలు జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

నన్ను యాడ్ చేసిన టెలిగ్రామ్ క్రిమినల్ చానల్స్‌ కొన్ని స్నాప్ చాట్‌లోనూ ఉండడం నేను గమనించా. డ్రగ్ డీలర్లు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఉంటారు. ఒప్పందాలన్నీ ప్రయివేట్ చాట్స్‌లో జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

డ్రగ్ డీలర్లు యూజర్లను ఆకర్షించడానికి తమ టెలిగ్రామ్ చానల్స్‌ గురించి ఇతర సైట్లలో తరచుగా ప్రకటనలు ఇస్తుంటారు.

సోషల్ మీడియా
ఫొటో క్యాప్షన్, దురోవ్‌ను విడుదల చేయాలని ఆన్‌లైన్‌లో ప్రచారం

తన ప్లాట్‌ఫామ్‌పై ఏం జరుగుతోందో పట్టించుకోని టెలిగ్రామ్

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించడంలో భాగంగా చాట్ యాప్స్‌ను ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు లాత్వియా పోలీసులు జనవరిలో ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేశారు. టెలిగ్రామ్ వ్యవహారంపై అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు.

తమ కంట్రోల్ సిస్టమ్ ఈ పరిశ్రమ నియమనిబంధనల పరిధిలోనే ఉందని టెలిగ్రామ్ చెబుతోంది. కానీ పిల్లలపై లైంగిక వేధింపుల సమాచారానికి సంబంధించిన ఆధారాలను మేం ఈ వారంలోనే చూశాం. ఇలాంటి తీవ్రమైన నేరానికి సంబంధించిన సమాచారం అంత ఎక్కువగా ఎక్కడా దొరకదు. (ఈ సమాచారం కోసం నేను వెతకలేదు).

పోలీసులు, చారిటీ సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు, సలహాలకు టెలిగ్రామ్ స్పందించలేదని బీబీసీకి తెలిసింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన చిత్రాలు, దృశ్యాల వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉద్దేశించిన కార్యక్రమాల్లో సైతం టెలిగ్రామ్ పాల్గొనడం లేదు.

తప్పిపోయిన, మోసపోయిన పిల్లలను సంరక్షించే జాతీయ సెంటర్‌లోనూ, ఇంటర్‌నెట్ వాచ్ ఫౌండేషన్‌లోనూ టెలిగ్రామ్‌కు సభ్యత్వం లేదు. అలాంటి సమాచారాన్ని గుర్తించి, తొలగించేందుకు ఈ రెండు సంస్థలు అన్ని ప్రముఖ సోషల్ నెట్‌వర్క్స్‌తో కలిసి పనిచేస్తున్నాయి.

పిల్లలపై లైంగిక వేధింపుల సమాచారం(సీఎస్‌ఏఎమ్)కు సంబంధించి పోలీసులకు తగిన రీతిలో సహకరించడం లేదన్నది ఫ్రెంచ్ న్యాయవాదులు టెలిగ్రామ్‌పై చేస్తున్న ప్రధాన ఆరోపణల్లో ఒకటి.

టెలిగ్రామ్ నిర్వహణపై నియంత్రణ లేకపోవడం, సమన్వయం లేకపోవడం, ప్రత్యేకించి పిల్లలపై జరిగే నేరాలను అడ్డుకునేలా ఎలాంటి చర్యలూ లేకపోవడమే ఈ కేసుకు అసలు కారణమని ఫ్రెంచ్ పిల్లల సంరక్షణ ఏజెన్సీ ఓఫ్మిన్ సెక్రటరీ జనరల్ జీన్-మైఖేల్ బెర్నిగాడ్ లింక్డిన్‌లో తెలిపారు.

పిల్లలపై లైంగిక ఆరోపణల సమాచారం సహా ఇతర అక్రమ కార్యకలాపాల నియంత్రణకు తమ సైట్‌లో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టెలిగ్రామ్ బీబీసీతో తెలిపింది. ఒక్క ఆగస్టులోనే 45,000 గ్రూపులపై కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పింది.

ఈ ఆర్టికల్‌కు సంబంధించి ఇతర ప్రశ్నలు, సమాచారంపై టెలిగ్రామ్ ఆఫీసు స్పందించలేదు.

టెలిగ్రామ్ వల్ల ఏర్పడుతున్న సమస్యల్లో నియంత్రణ లేకపోవడం అన్నది ఓ భాగం. చట్టవిరుద్ధ సమాచారం తొలగించాలని పోలీసుల నుంచి అందిన విజ్ఞప్తులు, సూచనల విషయంలో టెలిగ్రామ్ అనుసరించిన వైఖరి, ఆధారాలను పట్టించుకోకపోవడం వంటివి ఆ యాప్‌పై మరిన్ని విమర్శలకు కారణమైంది.

సోషల్‌మీడియా
ఫొటో క్యాప్షన్, పావెల్ దురోవ్

టెలిగ్రామ్ సీఈవో అరెస్టుపై మిశ్రమ స్పందన

‘‘టెలిగ్రామ్ వ్యవహారం ఓ స్థాయిలో ఉంది. దశాబ్దం పాటు ఆ గ్రూప్ ఐసిస్‌కు ప్రధాన హబ్‌గా ఉంది. పిల్లలపై లైంగిక వేధింపుల సమాచారం గురించి పట్టించుకోలేదు. చట్టపరిధిలో నిర్వర్తించాల్సిన బాధ్యతను ఏళ్లపాటు నిర్లక్ష్యం చేసింది. సమాచార నియంత్రణపై పెద్దగా దృష్టిపెట్టకపోవడం మాత్రమే కాదు. మొత్తంగా ఆ గ్రూప్ పద్ధతే భిన్నమైనది’’ అని సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ ‘సిండర్’ సహ వ్యవస్థాపకులు బ్రియాన్ ఫిష్‌మాన్ పోస్టు చేశారు.

టెలిగ్రామ్ ప్రైవసీ ఫీచర్ ప్రకారం ఆ కంపెనీకి ఇలాంటి కార్యకలాపాలపై పోలీసులకు తెలియజేసేంత సమాచారం అందుబాటులో లేదని కొందరు వాదించారు. సిగ్నల్, వాట్సాప్ వంటి ప్రయివేట్ యాప్స్‌లాంటిదే ఇదన్నారు.

యూజర్లు ‘‘సీక్రెట్ చాట్’’ అన్న ఆప్షన్ ఎంచుకుంటే టెలిగ్రామ్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానంలో సేవలందిస్తుంది. వాట్సాప్, సిగ్నల్ యాప్‌లు కూడా ఇలాగే పనిచేస్తాయి. అంటే సంభాషణల్లో ఏముంటుందన్నది పూర్తి రహస్యంగా ఉంటుంది. ఆ సమాచారాన్ని టెలిగ్రామ్ సైతం తెలుసుకోలేదు.

అయితే టెలిగ్రామ్‌లో ఈ విధానం డీఫాల్ట్‌గా లేదు. నన్ను యాడ్ చేసిన అక్రమ్ చానల్స్ సహా ఈ యాప్‌లో కార్యకలాపాలన్నీ ‘సీక్రెట్’ అని సెట్ చేసి లేవు.

టెలిగ్రామ్ చేయాలనుకుంటే తన యాప్‌లో ఉన్న సమాచారం మొత్తాన్ని చదివి, అభ్యంతరకరమైనదాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. అయితే తమ నిబంధనలు ఇందుకు అంగీకరించబోవని ఆ కంపెనీ చెబుతోంది.

‘‘అన్ని టెలిగ్రామ్ చాట్‌లు, గ్రూప్ చాట్‌లు రహస్యంగా ఉంటాయి. ఆ చాట్ చేసిన వారికే వాటి గురించి తెలుస్తుంది. వాటికి సంబంధించిన సమాచారం గురించి మేం ఏమీ చేయలేం.’’ అని కంపెనీ నియమనిబంధనల్లో రాసి ఉంది.

చట్టాన్ని అనుసరించడంలో టెలిగ్రామ్ అనుసరిస్తున్న విధానం పోలీసు అధికారులకు ఆగ్రహం కలిగిస్తోంది.

న్యాయపరమైన విజ్ఞప్తులపై ఫ్రాన్స్, బెల్జియంలో టెలిగ్రామ్ నుంచి అసలేమాత్రం స్పందన లేదని దురోవ్‌ మీద ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని ఫ్రెంచ్ అధికారులు తమ స్టేట్‌మెంట్‌లో తెలియజేశారు.

అక్రమ సమాచారాన్ని తొలగించే విషయంలో టెలిగ్రామ్ నుంచి ఎలాంటి సహకారం లేదని జర్మనీ సహా ఇతర దేశాల్లో అధికారులు అంటున్నారు.

సమాచార నియంత్రణలో టెలిగ్రామ్ పద్ధతిపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ దురోవ్‌ను అరెస్టు చేయడం సమస్యలు తెచ్చిపెడుతుందని కొందరు భావిస్తున్నారు.

డిజిటల్ రైట్స్ ఆర్గనైజేషన్ ‘యాక్సెస్ నౌ’ దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. పరిణామాలను గమనిస్తున్నామని తెలిపింది.

కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీకి టెలిగ్రామ్ ఒక ఉదాహరణ కానే కాదని గతంలోనూ పలుమార్లు టెలిగ్రామ్‌పై విమర్శలు చేసింది యాక్సెస్ నౌ.

అయితే, ‘ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే, ప్రశాంతంగా మాట్లాడుకునే, మానవ హక్కులకు ప్రాతినిధ్యం కల్పించే ప్లాట్‌ఫామ్‌కు చెందిన ఉద్యోగులను నిర్బంధించడం పరిమితికి మించిన సెన్సార్‌షిప్‌కు దారితీస్తుందని, ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది’’ అని కూడా యాక్సెస్ నౌ హెచ్చరిస్తోంది.

ఒక ప్లాట్‌ఫామ్‌ను దుర్వినియోగం చేశారన్న నేరానికి ఆ సంస్థను, లేదా దాని యజమానిని బాధ్యులను చేయడం అసంబద్ధమైనదని టెలిగ్రామ్ కూడా పదేపదే చెబుతోంది.

ఎక్స్(ట్విట్టర్)యజమాని, ఎలాన్ మస్క్ టెలిగ్రామ్ సీఈవో అరెస్టును ఖండించారు. భావప్రకటననా స్వేచ్ఛపై దాడిగా ఈ అరెస్టును మస్క్ అభివర్ణించారు. దురోవ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నేను ఇప్పుడు మెంబర్‌గా ఉన్న టెలిగ్రామ్ గ్రూపుల్లో కొందరు నేరగాళ్లు కూడా ఉన్నారు. ‘ఫ్రీ దురోవ్’ అని ఇంగ్లీషులో, రష్యన్‌లో రాసి ఉన్న ఫోటో విస్తృతంగా షేర్ అవుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)