రైలులో ముస్లిం వృద్ధుడిపై దాడి కేసు: అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, social media
- రచయిత, చందన్ కుమార్ జజ్వేర్
- హోదా, బీబీసీ కోసం
బీఫ్ తీసుకెళ్తున్నారన్న అనుమానంతో రైలులో ప్రయాణిస్తున్న ఒక ముస్లిం వృద్ధుడిపై తోటి ప్రయాణికులు దాడి చేశారు. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఇగత్‌పురి దగ్గర ఈ ఘటన జరిగింది.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని రైల్వే పోలీసులు ధ్రువీకరించారు.
వైరల్ అవుతున్న వీడియోలో, ఓ వృద్ధుడిని అతనితోపాటు రైలులో ప్రయాణిస్తున్న 12 మంది యువకులు తిడుతూ, ఆయనపై దాడి చేస్తున్నారు.
జల్‌గావ్ జిల్లాకు చెందిన హజీ అష్రఫ్ మనియార్ అనే వ్యక్తి కల్యాణ్‌లోని కూతురు ఇంటికి వెళ్తున్నారు. రైలు ఇగత్‌పురి దగ్గర ఉన్న సమయంలో అష్రఫ్ బీఫ్ తీసుకెళ్తున్నారని అనుమానిస్తూ...తోటి ప్రయాణికులు ఆయన్ను కొట్టారు.


ఫొటో సోర్స్, Getty Images
72ఏళ్ల వృద్ధునిపై దాడి
పలువురు యువకులు వృద్ధుడి చుట్టూ కూర్చుని ఆయన్ను తిడుతూ, కొడుతూ ఉన్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.
అంతేకాకుండా వాళ్లు దాడిని ఫోన్‌లలో వీడియో తీస్తూ వృద్ధుడిని బెదిరించారు.
ఈ ఘటనపై ఆగస్టు 31న ఫిర్యాదు అందిందని రైల్వే పోలీసులు బీబీసీకి చెప్పారు. ‘‘హజీ అష్రఫ్ మనియార్‌పై పోకిరీలు ఇగత్‌పురి దగ్గర రైలులో దాడి చేశారని ఆ ఫిర్యాదులో ఉంది.’’ అని పోలీసులు తెలిపారు.
జల్‌గావ్ చెందిన 72ఏళ్ల హజీ అష్రఫ్ అనే వ్యక్తి ధులే-సీఎస్‌ఎమ్‌టి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించినట్టు రైల్వే పోలీసులు గుర్తించారు.
అష్రఫ్‌పై దాడి చేసిన వారు మొదట సీటుకోసం ఆయనతో వాగ్వాదానికి దిగినట్టు తెలిసిందని రైల్వే పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, GRP
బాధితుడు ఏం చెబుతున్నారు?
హజీ అష్రఫ్, ఆయన కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు ఆధారంగా రైల్వే పోలీసులు ఈ కేసులో ఐదారుగురు అనుమానితులను గుర్తించారు. వారిలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని సెంట్రల్ రైల్వే డీసీ మనోజ్ నానా పాటిల్ చెప్పారు.
అనుమానితులను ధులేలో అదుపులోకి తీసుకున్నామని, వారిని ఠాణెకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక బృందాన్ని పంపామని రైల్వే పోలీసులు బీబీసీతో చెప్పారు.
రైల్వే పోలీసులు తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు.
ఫిర్యాదు అందిన తర్వాత చాలిస్‌గావ్ రైల్వేస్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
తనపై దాడి జరిగిందన్న అవమానంతో వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ మరో వీడియో ద్వారా సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయడానికి కొందరు ప్రయత్నించారు. అయితే, వృద్ధుడు క్షేమంగా ఉన్నారని రైల్వే పోలీసులు బీబీసీతో చెప్పారు. ఎవరూ ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరారు.
తాను క్షేమంగా ఉన్నానని అష్రఫ్ చెబుతున్న ఓ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. తనపై జరిగిన దాడిపై ఫిర్యాదుచేసిన తర్వాత అష్రఫ్ ఈ వీడియో విడుదల చేశారు.
‘‘నా పేరు అష్రఫ్ అలీ సయ్యద్ హుస్సేన్. నేను బతికే ఉన్నాను. నా క్షేమం గురించి ఆందోళన చెందిన వారందరికీ కృతజ్ఞతలు. మీరెవరూ తప్పులు చేయవద్దని నేను కోరుతున్నా.’’ అని ఆయన వీడియోలో తెలిపారు.

బీఫ్ తీసుకెళ్తున్నారా...లేదా..?
అష్రఫ్‌పై దాడికి సంబంధించిన వీడియోను ఫాక్ట్ చెకర్ మొహమ్మద్ జుబైర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కూతురుని చూసేందుకు వెళ్తున్న హజీ అష్రఫ్‌ను పోకిరీలు తీవ్రంగా కొట్టారని, దూషించారని జుబైర్ రాశారు.
ఏఐఎంఐఎం సీనియర్ నాయకుడు ఇంతియాజ్ జలీల్ దీనిపై స్పందించారు. ‘‘మనం మౌన ప్రేక్షకుల్లా ఉండలేం. ఇలాంటివారిని ఓడించేందుకు లౌకికవాదులందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం వచ్చేసింది. ఈ ప్రజల మధ్య ఎంత విద్వేషం వ్యాపింపచేశారు? తమ తాత వయసున్న వ్యక్తితో ఆ యువకులు ఇలా ఎలా ప్రవర్తించారు?’’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఇంగ్లిష్ న్యూస్ పేపర్ ది హిందూ ప్రకారం, వృద్ధుడిపై దాడి ఘటన ఆగస్టు 28న జరిగింది. 72 ఏళ్ల హజీ అష్రఫ్ ధులే-ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా పోకిరీలు ఆయన్ను కొట్టారు. వృద్ధుడు గేదె మాంసం తీసుకెళ్తున్నారని, మహారాష్ట్రలో ఆ మాంసం తినడంపై నిషేధం లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఈ ఘటనలో ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ధులే నుంచి ఠాణెకు తరలించారు.
నిందితులు రైలులో అదే కోచ్‌లో ప్రయాణిస్తూ ధులేకు తిరిగివస్తుండగా పోలీసులు వారిని గుర్తించి కస్టడీలోకి తీసుకున్నట్టు సమాచారం.
దాడిలో పాల్గొన్నది ఈ వ్యక్తులే అని తేలితే..వారి అరెస్టును ముంబై రైల్వే పోలీసులు అధికారికంగా ప్రకటించనున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














