అహ్మదీయ ముస్లింలు: పాకిస్తాన్ నుంచి హిందూ మెజారిటీ నేపాల్‌కు ఎందుకు పారిపోయి వస్తున్నారు? ఇక్కడికొచ్చాక వాళ్ల బాధలేంటి...

ఫొటో సోర్స్, BBC/SHARAD KC
అన్వర్ హుస్సేన్ ఒకప్పుడు కరాచీ నగరంలోని మంజూర్ కాలనీలో ఉండేవారు. ఉదయం పిల్లలను స్కూల్‌లో దింపడానికి వెళ్లేటప్పుడు తనకు, తన పిల్లలకు ఏదైనా ప్రమాదం ఉందా అని జాగ్రత్తగా గమనిస్తూ వెళ్లేవారు.
“నా మోటార్‌సైకిల్‌ను స్టార్ట్ చేయడానికి ముందు, చుట్టుపక్కల మారణాయుధాలున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని గమనించేవాడిని.’’ అని అన్వర్ తెలిపారు.
అయితే, కొన్నాళ్ల తర్వాత ఆయన పాకిస్తాన్ నుంచి బయటకు రావడంతో ఆ భయం పోయింది. గత 11 సంవత్సరాలుగా ఆయన నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో ఉంటున్నారు.
పాకిస్తాన్‌లో దాదాపు ప్రతిరోజూ అహ్మదీయ ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
అహ్మదీయ ముస్లింలు అన్న కారణంతో కరాచీలో తాము నివసించిన మంజూర్ కాలనీలోనే 14 , 15 మందిని హత్య చేశారనీ, మిగిలిన వారు భయం నీడలో బతుకుతున్నారని అన్వర్ హుస్సేన్ చెప్పారు.


‘అల్లాకు ఫిర్యాదు’
ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్ నుంచి హిందూ మెజారిటీ దేశమైన నేపాల్‌కు పారిపోయి వచ్చిన పాకిస్తానీ అహ్మదీయ ముస్లిం అన్వర్ హుస్సేన్ ఒక్కరే కాదు.
దాదాపు188 మంది పాకిస్తానీ శరణార్థులు కాఠ్‌మాండూలో నివసిస్తున్నారు. వారిలో ఎక్కువమంది అహ్మదీయ ముస్లింలే.
పాకిస్తాన్‌కు చెందిన చాలామంది అహ్మదీయ ముస్లింలు ఇలా అక్రమంగా నేపాల్‌కు చేరుకుని కాఠ్‌మాండూలో ఉంటున్నారు.
పదకొండేళ్ల కిందట పాకిస్తాన్‌ను వదిలేసి వచ్చినప్పటి నుంచి అన్వర్ హుస్సేన్ నేపాల్‌లో ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ, మాతృదేశం వదిలి రావాల్సిన పరిస్థితులను తలచుకుని ఆయన ఇప్పటికీ బాధపడుతుంటారు. ఆయన బంధువులంతా పాకిస్తాన్‌లోనే ఉన్నారు.
“నన్ను కలవడం తన జీవితంలో చివరి కోరికని అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మ గత రెండేళ్లుగా చెబుతోంది. కానీ, అది ఇంత వరకు నెరవేరలేదు.’’ అన్నారు అన్వర్ హుస్సేన్.
‘‘మా మత నిబంధనల ప్రకారం అల్లాకు ఎవరి మీదా ఫిర్యాదు చేయకూడదు. కానీ, నా దగ్గర అల్లాకు ఫిర్యాదు చేయడానికి చాలా విషయాలున్నాయి.’’ అన్నారు అన్వర్.

ఫొటో సోర్స్, BBC/SHARAD KC
బంధువుల నుంచి విడిపోయిన బాధ
పాకిస్తాన్ నుంచి వచ్చిన కొందరు యువకులు తమ బాధలను మాకు చెప్పే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపించారు.
‘‘నా సోదరికి క్యాన్సర్ ఉంది. అది తలచుకుంటే మాకు రాత్రంతా నిద్ర పట్టదు. మా ఇంట్లో చాలామంది డిప్రెషన్ తగ్గించుకోవడం కోసం మందులు వాడుతున్నారు.’’ అని షాహిద్ మక్బూల్ అనే యువకుడు వాపోయారు.
మేం షాహిద్ ఇంటికి వెళ్లాం. ఇంట్లో కరెంట్ లేదు. క్యాన్సర్ వ్యాధిగ్రస్థురాలైన ఆయన సోదరి ఫరీదా అహ్మద్ మంచం మీద పడుకుని ఉన్నారు. 2013 జూలై 9వ తేదీ రాత్రి తాము పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చామని షాహిద్ చెప్పారు.
‘‘ప్రాణాలు కాపాడుకోవడానికి మేం ఇక్కడికి వచ్చామని అనుకున్నా. కానీ, ఇక్కడ మేం ప్రతిరోజూ చస్తూనే ఉన్నాం.’’ అని ఫరీదా అన్నారు.
కుటుంబాన్ని పోషించడానికి తన భర్త అస్గర్ కాఠ్‌మాండూలో కూలీగా పని చేస్తున్నారని, కానీ, వచ్చే డబ్బు కుటుంబానికి ఏ మాత్రం సరిపోవడం లేదని ఆమె అన్నారు.
‘‘ఒకరోజు కోసం వండుకున్న అన్నం రెండు రోజులు తినడానికి ప్రయత్నిస్తుంటాం. ఎన్నో రాత్రులు ఆకలితో గడిపాం. కానీ, ఎవరికీ చెప్పుకోలేదు.’’ అని ఆమె అన్నారు.
గదిలో నేలను చూపిస్తూ, ‘‘చలికాలంలో కిందనే పడుకుంటాం. మా పిల్లలకు సరైన దుస్తులు కూడా లేవు. రాత్రంతా వణుకుతూనే ఉంటారు.’’ అని అన్నారామె.
క్యాన్సర్ చికిత్స కోసం ఫరీదాకు కొన్నేళ్ల కిందట సర్జరీ చేశారు. కానీ, ఇప్పుడామెకు వ్యాధి తిరగబెట్టింది.
కీమోథెరపీ చేయించుకోవాలని డాక్టర్లు ఫరీదాకు సూచించారు. కానీ ఆమె అందుకు భయపడుతున్నారు. ‘‘కీమోథెరపీ సమయంలో నాకేమైనా జరిగితే నా పిల్లలను ఎవరు చూసుకుంటారు?" అన్నారామె.
శరణార్థుల పిల్లలు కాఠ్‌మాండూలోని స్కూళ్లకు వెళతారు. వారికి ఫీజులను యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ (యూఎన్‌హెచ్‌సీఆర్) సంస్థ చెల్లిస్తుంది.
“స్కూలు ఇక్కడికి చాలా దూరంలో ఉంది. నేపాలీ పిల్లలు వాహనాలలో వెళుతుంటే, మమ్మల్నెందుకు అందులో తీసుకెళ్లరు అని మా పిల్లలు అడుగుతుంటారు. బస్సులో పంపడానికి మా దగ్గర డబ్బుల్లేవు.’’ అని ఫరీదా అన్నారు.
‘‘మా పిల్లలు అడిగేవాటికి చాలా అబద్ధాలు చెప్పాలి.’’ అని ఫరీదా భర్త అస్గర్ అన్నారు.

ఫరీదా చివరి కోరిక
పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందన్న భరోసా ఇచ్చే ప్రాంతంలో తాను ఉండాలని కోరుకుంటున్నట్లు ఫరీదా చెప్పారు. అలాంటి భద్రమైన జీవితం దొరికే ప్రదేశం కెనడా అని, కానీ రెండుసార్లు కెనడియన్ వీసా వచ్చినప్పటికీ, తాము నేపాల్ నుంచి అక్కడికి వెళ్లలేకపోయామని ఫరీదా అన్నారు.
నేపాల్ చట్టాల ప్రకారం, ఒక వ్యక్తి తనకు ఇచ్చిన వీసా గడువుకంటే ఎక్కువ రోజులు ఆ దేశంలో ఉంటే, జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా రోజుకు 8 డాలర్లు. జరిమానా చెల్లించలేకపోవడంతో ఫరీదా కుటుంబానికి రెండుసార్లు వీసా అవకాశం వచ్చినా వెళ్లలేకపోయింది. కెనడా వీసా గడువు ముగిసిపోయింది.
అయితే, యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ సంస్థ వీరికి జరిమానా మాఫీ చేయాలని కోరింది. 90 మంది పేర్లతో అలాంటి వారి జాబితాను ఆ సంస్థ తమకు పంపిందని నేపాలీ అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/SHARAD KC
ప్రభుత్వం ఏం చెబుతోంది?
విదేశీ శరణార్థులకు విధించిన జరిమానాను రద్దు చేస్తూ గతేడాది అక్టోబర్‌లో జరిగిన నేపాల్ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ జరిమానాను పూర్తిగా రద్దు చేస్తే తమ దేశంలో శరణార్థుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా నేపాల్ ప్రభుత్వానికి ఉంది.
ఇతర దేశాల నుండి కొందరు తరచూ శరణార్థులను నేపాల్‌కు పంపుతున్నారని అధికారులు చెప్పారు.
నేపాల్‌లో ఉంటున్న శరణార్థులను కెనడా, యూరోపియన్ దేశాలకు పంపుతామంటూ మోసం చేసిన వ్యక్తులను అరెస్టు చేశామని ఒక పోలీస్ అధికారి బీబీసీతో అన్నారు.
శరణార్థుల ముసుగులో దేశం నుంచి మానవ అక్రమ రవాణా పెరగకుండా చూసేందుకు నేపాల్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తోందని ఆ అధికారి వెల్లడించారు.
‘‘వెయ్యిమందికి విధించిన జరిమానాను రద్దు చేయడం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు. కానీ, ఇది ఇంతటితో ఆగిపోతుందన్న గ్యారంటీ లేదు.’’ అని నేపాల్ హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు బీబీసీతో అన్నారు.
‘‘మా దేశాన్ని శరణార్థుల గమ్యస్థానంగా వాడుకోకూడదని మేం కోరుకుంటున్నాం.’’ అని నేపాలీ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి నారాయణ్ ప్రసాద్ భట్టారాయ్ అన్నారు.

పాక్ శరణార్థులకు నేపాల్ ఎందుకు ఇష్టం?
పాకిస్తాన్ శరణార్థులు చాలామంది తమకు నేపాల్ మంచి ఆప్షన్ అని చెబుతున్నారు. ఎందుకంటే వాళ్లకు వీసా ఆన్ అరైవల్ (ఆ దేశానికి చేరుకున్నాక దొరికే వీసా) లభిస్తుంది.
ఇంతకుముందు, పాకిస్తాన్‌లోని అహ్మదీయ ముస్లింలు తరచూ శ్రీలంకకు శరణార్థులుగా వెళ్లేవారు. అయితే అక్కడి ప్రభుత్వం 'వీసా ఆన్ అరైవల్'ను నిలిపేసింది. దీంతో ఇప్పుడు నేపాల్ వైపు చూస్తున్నారు.
నేపాల్‌లోని అహ్మదీయ కమ్యూనిటీ నేతలు తమ మతస్థులకు కాఠ్‌మాండూలో సరైన శ్మశాన వాటిక కూడా లేదని అన్నారు.
నేపాల్‌లో దాదాపు 10 నుంచి 12 వేల మంది అహ్మదీయ ముస్లింలు ఉన్నారని స్థానిక నాయకుడు సలీం అహ్మద్ అన్నారు.
కాఠ్‌మాండూలో ఒక అహ్మదీయ ముస్లిం వ్యక్తి మరణిస్తే, అంత్యక్రియలు నిర్వహించడానికి 130 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుందని ఆయన వెల్లడించారు.
"ఏడేళ్ల కిందట ఒక పాకిస్తానీ అహ్మదీయ శరణార్థి కాఠ్‌మాండూలో మరణించినప్పుడు, అతని అంత్యక్రియలు నిర్వహించడానికి పర్సా జిల్లాకు వెళ్లాల్సి వచ్చింది." అని ఆయన గుర్తు చేసుకున్నారు.
తన తల్లి 2016లో మరణించారని, ఆమె కోరిక మేరకు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కాఠ్‌మాండూ నుంచి పాకిస్తాన్‌కు పంపించామని, ఇందుకు ఏడు రోజులు పట్టిందని, పాక్ రాయబార కార్యాలయం కూడా సహాయం చేయలేదని మరో శరణార్థి యమీన్ అహ్మద్ చెప్పారు.
నేపాల్ చట్టం ప్రకారం, అక్రమంగా ప్రవేశించిన శరణార్థులు దేశంలో పనిచేయడంపై నిషేధం ఉంది. అయితే, చాలామంది రహస్యంగా పని చేస్తూ డబ్బులు సంపాదించుకుంటారు. కొంతమంది నేపాలీ పేర్లతో వ్యాపారాలు నడుపుతుంటారు.
“మేం ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడకు వచ్చాం. కానీ ఇక్కడ కూడా మా సమస్యలకు పరిష్కారం దొరకలేదు. మా పిల్లల భవిష్యత్తు నాశనమవుతోంది.’’ అని పాకిస్తాన్ శరణార్థి ఖలీద్ నూర్ అన్నారు.
నేపాల్ ఇమ్మిగ్రేషన్ విభాగం కొన్నేళ్లుగా అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను దేశం నుండి బయటకు పంపిస్తోంది.
‘‘గత ఏడేళ్లలో సుమారు 3 వేల మంది విదేశీయులను దేశం నుండి తిప్పి పంపించాం.’’ అని ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ కోష్ హరి నిరౌలా అన్నారు.
నేపాల్ నుంచి బహిష్కృతులైనవాళ్లు సొంత దేశాల్లో ప్రాణహానిని ఎదుర్కొంటున్నారని యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ సంస్థ తెలిపింది.
పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి నేపాల్‌కు వచ్చిన మహమూద్ రషీద్ సుప్రీంకోర్టులో ఈ విషయమై పిటిషన్ వేయగా, విదేశీయులను దేశం నుంచి పంపించి వేయకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది.
మహమూద్ రషీద్ ఏప్రిల్ 5, 2004న నేపాల్‌కు వచ్చి ఆ మరుసటి రోజే అక్కడ ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 27 సెప్టెంబర్ 2006న ఆయన అప్లికేషన్‌ను ఆమోదించారు. నేపాల్‌లోనే ఉండేందుకు ఆయనకు అనుమతి లభించింది.
పాకిస్తాన్‌లోని సున్నీ ముస్లింల నుంచి తాము చిత్రహింసలను ఎదుర్కొన్నామని, వాటిని తట్టుకోలేక తాను ఇద్దరు సోదరులతో కలిసి నేపాల్ వచ్చినట్లు రషీద్ కోర్టుకు తెలిపారు.
దరఖాస్తుదారులను పాకిస్తాన్ తిప్పి పంపలేమని, వారి దరఖాస్తుపై మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది.
నేపాల్‌లో పాకిస్తానీ పౌరులు ఆశ్రయం పొందుతున్న విషయంపై మాట్లాడేందుకు కాఠ్‌మాండూలోని పాక్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, స్పందన రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














