బలూచిస్తాన్: బస్సు, ట్రక్కుల నుంచి ప్రయాణికులను దింపి కాల్చి చంపిన సాయుధులు, 39 మంది మృతి

బలూచిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫరహత్ జావేద్
    • హోదా, ఇస్లామాబాద్ నుంచి బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో సాయుధుల కాల్పుల్లో 39 మంది మరణించారు. ట్రక్కులు, బస్సుల నుండి ప్రయాణీకులను దింపిన కొందరు మిలిటెంట్లు వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. బలూచ్ జాతికి చెందని వారిని కాల్చి చంపారు.

ఈ దాడులకు తామే బాధ్యులమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి తమ ప్రావిన్స్‌లోకి ప్రవేశించే రహదారులను దిగ్బంధించామని పేర్కొంది.

పంజాబ్ ప్రావిన్స్ నుంచి వస్తూ, బలూచిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలకు వెళుతున్న వారిని ఈ సాయుధ మిలిటెంట్ గ్రూప్ టార్గెట్‌గా చేసుకుంది.

ఈ ఘటన బలూచిస్తాన్‌లోని ముసాఖెల్ జిల్లాలో జరిగింది.

బలూచీలు కానివారిని కాల్చి చంపడంతోపాటు పలు వాహనాలను కూడా ఈ గ్రూపు దగ్ధం చేసింది. గడచిన 24 గంటల్లో పోలీసు స్టేషన్లు, భద్రతా దళాల శిబిరాలతో సహా పలు ప్రభుత్వ వ్యవస్థలపై బీఎల్ఏ వరుస దాడులు చేసిందని అధికారులు వెల్లడించారు.

ముసాఖెల్ అసిస్టెంట్ కమిషనర్ నజీబ్ ఈ సంఘటనను ధ్రువీకరించారు. బీబీసీతో మాట్లాడుతూ ‘‘ఈ సంఘటన ముసాఖెల్ జిల్లాలోని రారా హషీమ్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో నిన్న రాత్రి కాల్పుల ఘటన కూడా జరిగింది.’’ అని ఆయన అన్నారు.

ఈ కాల్పుల ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారని, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.

ఈ దాడిని ఖండించిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

మిలిటెంట్ దాడులు

ఫొటో సోర్స్, Getty Images

భద్రతా దళాల ప్రతిదాడులు

మరోవైపు బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో మిలిటెంట్ల దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్‌లో ఇప్పటి వరకు 12 మంది సాయుధులను హతమార్చినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి.

ఈ ఆపరేషన్‌లో అనేకమంది మిలిటెంట్లు గాయపడ్డారని పాకిస్తాన్ ప్రభుత్వ మీడియా కథనాలు ప్రసారం చేసింది. ఈ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

అంతకు ముందు కలాత్ సిటీ సమీపంలో జరిగిన దాడిలో నగర అసిస్టెంట్ కమిషనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. జియునిలోని పోలీస్ స్టేషన్ బయట ఉన్న మూడు వాహనాలను మిలిటెంట్లు తగలబెట్టారు.

బలూచిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

నిరంతర దాడులు

జాతి, మతపరమైన మైనారిటీలు లక్ష్యంగా దాడులు జరిగే పాకిస్తాన్‌లో ఇటువంటి సంఘటనలు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి చాలా దాడులు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో బలూచిస్తాన్‌లో జరిగిన ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులను బస్సు నుంచి దించి, వారి ఐడీలను తనిఖీ చేసి తర్వాత కాల్చి చంపారు.

శని, ఆదివారం మధ్య రాత్రి, బలూచిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలలో బాంబు పేలుళ్లు జరిగినట్లు రిపోర్టులు వచ్చాయి.

మస్తుంగ్ జిల్లాలో కూడా ఖాడ్ కోచా ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌పై గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు దాడి చేశారు.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)