పినాకిల్ మ్యాన్: కొండ మీద గుహలో ఘనీభవించిన స్థితిలో మృతదేహం.. ఎవరిదో 47 సంవత్సరాల తరువాత ఇప్పుడు తెలిసింది

ఫొటో సోర్స్, Berks County Coroner's Office
- రచయిత, నదీన్ యూసిఫ్
- హోదా, బీబీసీ న్యూస్
పెన్సిల్వేనియాలోని ఒక గుహలో 1977లో గడ్డకట్టిన స్థితిలో దొరికిన ఒక మృతదేహం ఎవరిదనేది 47 సంవత్సరాల తరువాత అధికారులు గుర్తించారు.
ఆ మృతదేహం పెన్సిల్వేనియాలోని ఫోర్ట్ వాషింగ్టన్‌కు చెందిన 27 ఏళ్ల(అప్పటికి) నికోలస్ పాల్ గ్రబ్‌దని బెర్క్స్ కౌంటీ కరోనర్ కార్యాలయం తెలిపింది.
వేలిముద్రల ఆధారంగా ఎట్టకేలకు ఆ మృతదేహం నికోలస్ పాల్ గ్రబ్‌దని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఫిలడెల్ఫియాకు వాయువ్యంగా సుమారు 122 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్బానీ టౌన్‌షిప్‌లో ఒక కొండ శిఖరానికి కొంచెం దిగువన గుహలో గడ్డకట్టిన స్థితిలో గ్రబ్ మృతదేహాన్ని 1977లో గుర్తించారు.
కొండ శిఖరంపై దొరికిన మృతదేహం కావడంతో నికోలస్ పాల్ గ్రబ్‌ను ‘పినాకిల్ మ్యాన్’ అంటున్నారు.

దీంతో సుమారు 50 ఏళ్లుగా ఆచూకీ తెలియని ఒక వ్యక్తికి సంబంధించిన మిస్టరీ ఇప్పుడు వీడినట్లయింది.
ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదికలో ‘పినాకిల్ మ్యాన్’ డ్రగ్స్ ఓవర్‌డోస్ వల్ల చనిపోయినట్లు తేలింది.
అప్పుడు మృతదేహం నుంచి డెంటల్ రికార్డ్స్, ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. కానీ, అవి ఎవరితోనూ సరిపోలలేదు.
సుమారు 50 ఏళ్ల తరువాత మొన్న ఆగస్ట్‌లో పెన్సిల్వేనియా పోలీసు డిటెక్టివ్ ఒకరు ఈ వేలిముద్రలను గుర్తించినట్లు బెర్క్స్ కౌంటీ కరోనర్ కార్యాలయం తెలిపింది.
నేషనల్ మిస్సింగ్ పర్సన్స్ డేటాబేస్ అయిన ‘నేమ్‌అజ్’ (NamUs)కు ఈ వివరాలు అందించారు.
దాంతో ఎఫ్‌బీఐ గంటలో ఆ మృతదేహం గ్రబ్‌దని గుర్తించింది.
గత పదిహేనేళ్లలో సుమారు 10 మంది తప్పిపోయిన వ్యక్తుల వివరాలతో పినాకిల్ మ్యాన్ మృతదేహాన్ని పోల్చినా అవేవీ సరిపోలలేదు.
2019లో డీఎన్ఏ సేకరణకు మృతదేహాన్ని మళ్లీ వెలికితీసినా ఫలితం దక్కలేదని అధికారులు చెప్పారు.
మృతదేహం ఎవరిదనేది ఇప్పుడు తెలిసింది కాబట్టి అప్పుడు తవ్వి బయటకు తీసిన అవశేషాలను తిరిగి పూడ్చేయాలని అధికారులు అనుకుంటున్నారు.
గ్రబ్‌ను కుటుంబసభ్యులు నిక్కీ అని పిలిచేవారు. ఆయన పెన్సిల్వేనియా ఆర్మీ నేషనల్ గార్డ్‌లో పనిచేసేవారని కుటుంబీకులు తెలిపారు.
మృతదేహం గ్రబ్‌దని గుర్తించడంలో సహకరించిన ఆయన కుటుంబీకులను అధికారులు అభినందించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














