వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు? వాతావరణ శాఖ ఇచ్చే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లకు అర్థం ఏమిటి?

విజయవాడ వద్ద పరుగులు పెడుతున్న కృష్ణా నది
ఫొటో క్యాప్షన్, విజయవాడ వద్ద కృష్ణా నదిలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది
    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో తడిసి ముద్దయ్యాయి. విజయవాడ నగరంలో ఆగస్టు 31వ తేదీన 136 మిల్లీ మీటర్ల (మి.మీ) వర్షం, ఇబ్రహీంపట్నంలో 120 మి.మీ వర్షం కురిసినట్టు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఆధ్వర్యంలోని వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వెల్లడించింది.

అయితే సరిగ్గా 136 మిల్లీ మీటర్లు, 120 మిల్లీ మీటర్ల వర్షపాతం అని ఎలా కొలుస్తారు? దేని ఆధారంగా ఈ లెక్కలు వేస్తారు? అసలు వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు?

అలాగే మోస్తరు వర్షం, భారీ వర్షం, అతిభారీ వర్షం, కుంభవృష్టి అంటే ఏమిటి? వీటి వర్గీకరణకు ప్రాతిపదిక ఏమిటి? ఎంత వాన పడితే మోస్తరు వర్షం అవుతుంది? కుంభవృష్టి అనాలంటే ఎంత వానపడాలి? వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం.

బీబీసీ వాట్సాప్ ఛానల్
వర్షంలో మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

వేల ఏళ్లుగా..

వర్షపాతంపై అంచనాలు ఆధునిక ప్రపంచానికి మాత్రమే తెలుసని అనుకుంటే పొరపాటే. వీటి మూలాలు క్రీ.పూ. 3,000 ముందు నుంచే ఉన్నాయని చెబుతూ, అప్పట్లో వర్షపాతాన్ని ఎలా అంచనా వేసేవారో ‘ఆపరేటింగ్ ప్రొసీజర్ హైడ్రోమెట్రొలాజికల్ సర్వీసెస్ ఇండియా’ అనే నివేదికలో ఐఎండీ పేర్కొంది.

‘‘క్రీ.పూ. 3000 ఏళ్లకు ముందు రాసిన చందోయా ఉపనిషత్‌లో మేఘాల నిర్మాణం, వర్షాలు, సూర్యుడి చుట్టూ భూమి తిరిగే క్రమంలో ఏర్పడే రుతువుల గురించి పేర్కొన్నారు.’’

‘‘క్రీ.శ. 500 సమయంలో వరాహమిహిర రాసిన ‘బృహత్‌ సంహిత’ను పరిశీలిస్తే వాతావరణంపై అప్పటివారికి స్పష్టమైన అవగాహన ఉందని తెలుస్తుంది.

కౌటిల్యుడి అర్థశాస్త్రంలోనూ వర్షపాతాన్ని కొలిచే విధానాలను పేర్కొన్నారు. కాళిదాసు రాసిన ‘మేఘదూత్’లో అయితే మధ్య భారత దేశంలో వర్షాలు రుతుపవనాలు ఎప్పుడు మొదలవుతాయో కూడా అంచనాలు వేశారు. దీన్ని ఏడో శతాబ్దంలో రాశారు. రుతు పవనాల ఆగమనాన్ని కూడా దీనిలో పేర్కొన్నారు.’’

క్రీ.పూ. 3,000 ముందు నుంచే వర్షపాతంపై అంచనాలు ఉన్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రీ.పూ. 3,000 ముందు నుంచే వర్షపాతంపై అంచనాలు ఉన్నాయి

17వ శతాబ్దంలో ఆధునికంగా..

ప్రస్తుతం ఐఎండీ నుంచి మనకు అందుతున్న ఆధునిక వర్షపాత అంచనాలకు పునాదులు 17వ శతాబ్దంలోనే పడ్డాయి.

థర్మోమీటర్, బారోమీటర్‌ ఆవిష్కరణతోపాటు వాతావరణంలోని వాయువుల స్థితిగతులపై అవగాహనతో మెరుగైన అంచనాలు మనకు అందుబాటులోకి వచ్చాయి.

ప్రపంచంలో అత్యంత పురాతన వాతావరణ కేంద్రాల్లో కొన్ని భారత్‌లోనూ ఉన్నాయి.

ఉదాహరణకు 1785లో కలకత్తాలో, 1796లో మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీ వాతావరణ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఐఎండీని 1875లో ఏర్పాటు చేశారు.

ఆధునిక వర్షపాత అంచనాలకు పునాదులు 17వ శతాబ్దంలోనే పడ్డాయి

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఆధునిక వర్షపాత అంచనాలకు పునాదులు 17వ శతాబ్దంలోనే పడ్డాయి

ఇంతకీ అంచనాలు ఎలా వేస్తారు?

వర్షపాతానికి సంబంధించి ఐఎండీ ప్రధానంగా రెండు రకాల అంచనాలు విడుదల చేస్తుంది. వీటిలో మొదటిది దీర్ఘకాల అంచనాలు. రెండోది రోజువారీ అంచనాలు.

రుతుపవన కాలంలో ఒక ప్రాంతంలో నిర్ణీత సమయంలో వర్షపాతం ఎలా ఉండబోతోందనేది దీర్ఘకాలిక అంచనాలో తెలుస్తుంది. దీన్ని లాంగ్ రేంజ్ ఫోర్‌కాస్టింగ్ (ఎల్‌ఆర్ఎఫ్) అంటారు.

ఎల్‌ఆర్ఎఫ్‌ను నేషనల్ క్లైమేట్ సెంటర్ (ఎన్‌సీసీ) సిద్ధంచేస్తుంది. దీర్ఘకాల వర్షపాత సగటు, ఉష్ణోగ్రత, తేమ, గాలుల ఆధారంగా ఈ అంచనాలు వెలువరిస్తారు. ఇవి సాధారణంగా 30 రోజులతో మొదలుపెట్టి మొత్తం కాలానికి జారీచేస్తారు.

దీన్ని ప్రాంతాల వారీగా విడుదల చేస్తారు. ఈ అంచనాలతో పోలిస్తే రోజువారీ అంచనాలు చాలా భిన్నమైనవని విశాఖపట్నంలోని సైక్లోన్ వార్నింగ్ సెంటర్ హెడ్ ఎస్ నంద గతంలో బీబీసీకి చెప్పారు. రోజువారీ అంచనాలతో ఒక నిర్దుష్ట ప్రాంతంలో ఒక నిర్దుష్ట సమయంలో ఎంత వర్షపాతం పడుతుందో కాస్త ఎక్కువ కచ్చితత్వంతో తెలుసుకోవచ్చని ఆమె అన్నారు.

బారోమీటర్

ఫొటో సోర్స్, STEPHEN SPEED

ఇలా కొలుస్తారు..

ఎంత వర్షపాతం కురుస్తుందో అంచనా వేసేందుకు ఐఎండీ థర్మోమీటర్, బారోమీటర్, రెయిన్ గేజ్ లాంటి పరికరాలను ఉపయోగిస్తుంది.

ఈ అంచనాల కోసం భారత్‌లో 650కి పైగా అబ్జర్వేటరీలను ఏర్పాటుచేశారు. ఇవి నిత్యం సమాచారాన్ని సేకరించి నేషనల్ క్లైమేట్ సెంటర్‌కు పంపిస్తాయి.

‘‘ఏదైనా ప్రాంతంలో ఎంత వర్షపాతం కురుస్తుందో అంచనా వేయడంలో ‘పీడనం’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ పీడనం ఏర్పడటంలో ఉష్ణోగ్రత కీలకంగా మారుతుంది. ఈ రెండింటినీ బారోమీటర్(పీడనం), థర్మోమీటర్ (ఉష్ణోగ్రత)లతో కొలుస్తాం’’ అని నందా చెప్పారు.

థర్మో మీటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, థర్మో మీటర్

‘మేం సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయాలకు పంపిస్తాం. వర్షపాతం కురిసేందుకు ఎక్కడ అవకాశముందో అక్కడ అంచనావేస్తారు. దీని కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ), మోడల్ ఫోర్కాస్ట్(ఎంఎఫ్) లాంటి విధానాలను అనుసరిస్తారు.’’

‘‘ఒక నిర్దిష్ట ప్రాంతంలో పీడనానికి సంబంధించి అప్పర్ లెవల్ చార్ట్‌ కూడా మాకు అందుబాటులో ఉంటుంది. దీని సాయంతో ఒక్కోసారి మేం మాన్యువల్‌గా కూడా అంచనాలను వెల్లడిస్తుంటాం’’అని ఆమె చెప్పారు.

భారీ గాలులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెడ్ అలర్ట్ అంటే.. వచ్చే 24 గంటల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని అంచనా

రెడ్ అలర్ట్ అంటే ఏంటి?

ఈ అంచనాల ఆధారంగా ఐఎండీ ప్రాంతీయ కార్యాలయాలు హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. ఈ హెచ్చరికలు ప్రధానంగా నాలుగు రకాలు (గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్).

రెడ్ వార్నింగ్ అంటే.. వచ్చే 24 గంటల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని అంచనా. అంటే ఆ నిర్దుష్ట ప్రాంతంలో 200 మి.మీ.కుపైనే వర్షపాతం కురవొచ్చు.

ఐఎండీ రెడ్ వార్నింగ్ జారీచేస్తే, ‘‘పోలీసులు, మున్సిపల్ అధికారులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్) అధికారులు చర్యలు మొదలుపెట్టాలి.

అంటే అధికారులకు చర్యలు తీసుకోవాలని చెప్పడంతోపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించేందుకు రెడ్ వార్నింగ్‌ను ఐఎండీ జారీచేస్తుంది.

ఒక మోస్తరు వర్షపాతం అంటే - 15.6 మిల్లీ మీటర్ల నుంచి 64.4 మి.మీ. వరకు

భారీ వర్షం అంటే - 64.5 మి.మీ. నుంచి 115.5 మి.మీ. వరకు

అతి భారీ వర్షం అంటే - 115.6 మి.మీ. నుంచి 204.5 మి.మీ. వరకు

కుంభవృష్టి అంటే - 204.5 మీ.మీ కంటే ఎక్కువ

ఏ అలర్ట్ ఏం చెబుతుంది?

భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ఆరెంజ్ అలర్టు జారీ చేస్తారు. ‘‘అధికారులు సిద్ధంగా ఉండాలి’’అని చెప్పడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించేందుకు ఈ అలర్టులు జారీచేస్తారు.

పరిస్థితులను జాగ్రత్తగా గమనించాలని చెప్పేందుకు ఎల్లో అలర్టును జారీచేస్తారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నప్పుడు ఈ అలర్టును జారీచేస్తారు.

గ్రీన్ అలర్టును ‘‘నో వార్నింగ్’’గా చెబుతారు. అంటే తేలికపాటి జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నప్పుడు ఈ అలర్టులు జారీచేస్తారు. ఈ పరిస్థితుల్లో అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

వర్షపాతం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వర్షపాత అంచనాలను విధాన నిర్ణయాల రూపకల్పనకూ పరిగణనలోకి తీసుకుంటారు

అంచనాల తరువాత..

అంచనాల అనంతరం ఎంత వర్షపాతం కురిసిందో కూడా ఐఎండీ వెల్లడిస్తుంది. ప్రధానంగా రెయిన్ గేజ్ సాయంతో ఈ వర్షపాతం కొలుస్తారు.

దేశ వ్యాప్తంగా వర్షపాతాన్ని కొలిచే రెయిన్ గేజ్ స్టేషన్లు 6,000కుపైనే ఉన్నాయి. కొన్నిసార్లు వర్షపాతాన్ని కొలిచేందుకు రెయిన్ గేజ్‌లతోపాటు మాన్యువల్ విధానాన్ని కూడా అనుసరిస్తామని నందా చెప్పారు.

‘‘వర్షం నేరుగా పడే ప్రాంతాల్లో రెయిన్ గేజ్‌లను ఏర్పాటుచేస్తాం. ముఖ్యంగా పరిసరాల్లో చెట్లు లేదా ఇతర అడ్డంకిలేవీ ఉండకుండా చూస్తాం. దీనిలో నమోదయ్యే రీడింగ్‌తో ఒక ప్రాంతంలో ఎంత వర్షపాతం కురిసిందో మిల్లిమీటర్లలో వెల్లడిస్తాం.’’

ఈ వర్షపాత అంచనాలను వ్యవసాయంతో మొదలుపెట్టి మౌలిక వసతుల నిర్మాణం వరకు ప్రధాన రంగాల్లో విధాన నిర్ణయాల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు.

వర్షంలో తడుస్తున్న వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

వంద శాతం కచ్చితత్వమా?

ఐఎండీ అంచనాలు చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉందని సైన్స్‌ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం అభిప్రాయపడింది.

‘‘ఇటీవల కాలంలో ముంబయి, చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో వరదలు విపరీతంగా పెరిగాయి. అయితే, ఈ విపత్కర పరిస్థితులు అంచనాల్లో ఎందుకు కనిపించడంలేదో అర్థం కావడం లేదు’’అని స్థాయీ సంఘం వ్యాఖ్యానించింది.

మరోవైపు దివంగత కార్టూనిస్టు ఆర్‌కే లక్ష్మణ్ కూడా ఐఎండీ రుతుపవన అంచనాలపై ఎప్పటికప్పుడే వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు.

అయితే, ఎంత ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకున్నప్పటికీ, ఏ అంచనాలూ వంద శాతం కచ్చితత్వంతో పనిచేయలేవని ఇటీవల ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహపాత్రా వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో ఐఎండీ అంచనాల్లో కచ్చితత్వం పది రెట్లకుపైనే పెరిగిందని ఆయన వివరించారు.

(గమనిక: 2021లో ప్రచురితమైన కథనాన్ని అప్‌డేట్ చేశాం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)