ఫిజయోథెరపీ అంటే ఏమిటి? ఈ థెరపీ ఎందుకు చేస్తారు

ఫొటో సోర్స్, Getty Images
ఫిజియోథెరపీ.. ఈ పదం వినగానే చాలా మందికి మసాజ్, ఎక్సర్‌సైజ్‌లు, వివిధ భంగిమలలో శరీరాన్ని కదిలించడం తదితర చిత్రాలు కళ్లముందు కదలాడతాయి.
అసలు ఫిజియోథెరపీ అంటే ఏమిటి? ఈ థెరపీ ఎందుకు చేస్తారు? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? వంటి విషయాలపై చెన్నైలోని ఒమందురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫిజియోథెరపిస్ట్ ఎలిల్‌వాణన్‌తో బీబీసీ మాట్లాడింది.


ఫొటో సోర్స్, Getty Images
ఫిజియోథెరపీ అంటే ఏమిటి?
ఫిజియోథెరపీ అంటే ఏమిటో సరళంగా చెప్పుకోవాలంటే ‘‘అదొక సాంత్వన కలిగించే, నొప్పి నివారణ చికిత్స’’ అని ఎలిల్‌వాణన్ తెలిపారు.
అనారోగ్యం, ప్రమాదాల కారణంగా కదల్లేని పరిస్థితికి చేరుకున్నవారిలో తిరిగి కదలికలు తీసుకువచ్చేలా చేసే ప్రక్రియే ఫిజియోథెరపీ.
శరీరంలోని కొన్ని భాగాలలో నొప్పిని తగ్గించే చికిత్సలు కూడా ఫిజియోథెరపీలో ఉన్నాయి.
‘‘ప్రమాదాలు, గాయాలతో ఏర్పడే అనారోగ్యాలను మందులు మాత్రమే పూర్తిగా నయం చేయలేవు. అవి పూర్తిగా నయం కావడానికి అనుబంధంగా అందించే చికిత్సే ఫిజియోథెరపీ’’ అని ఎలిల్‌వాణన్ చెప్పారు.
ఈ సమస్యలకు దీర్ఘకాలికంగా మందుల వాడకం కిడ్నీ సమస్యలు, గ్యాస్ట్రైటిస్, పేగు పూతకు దారితీస్తుందని, ఒక నిర్దిష్ట సమయం తర్వాత, మందులను తగ్గించాక లేదా పూర్తిగా ఆపేశాక వైద్యులు ఫిజియోథెరపీని సూచిస్తారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిజియోథెరపీ ఎన్ని రకాలు?
ఫిజియోథెరపీకి రెండు ముఖ్యమైన లక్ష్యాలు ఉంటాయని ఎలిల్‌వాణన్ చెప్పారు.
1. ప్రమాదం లేదా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా చలనం కోల్పోయిన అవయవాల్లో కదిలికలు తీసుకురావడం.
2. ఒళ్లు నొప్పులు పోగొట్టడం.
ఇందుకోసం ఫిజియోథెరపీలో రెండురకాల చికిత్సలు ఉంటాయి.
1. ఎక్సర్‌సైజ్ థెరపీ: అవయవాలను కదిలించలేని, నడవలేని వారికి ఎక్సర్‌సైజ్‌ల ద్వారా కదలికలను తిరిగి సాధారణ స్థితికి తేవడం.
ఈ ఎక్సర్‌సైజ్‌లలోనూ మూడు పద్ధతులు ఉన్నాయని ఎలిల్‌వాణన్ చెప్పారు.
డైరెక్ట్ ఎక్సర్‌సైజ్: ఫిజియోథెరపిస్ట్ నేర్పిన వ్యాయామాలను రోగులే నేరుగా చేసుకోవడం.
సహాయ ఎక్సర్‌సైజ్: సొంతంగా ఎక్సర్‌సైజ్‌లు చేసుకోలేనివారికి ఫిజియోథెరపిస్ట్ సాయపడుతూ చేయించడం.
బరువులతో వ్యాయామం: ఈ పద్ధతిలో రోగి చేతులకు, కాళ్లకు బరువులు, స్ప్రింగ్‌లు జతచేసి వాటితోపాటు చేతులు, కాళ్లను పైకి ఎత్తడం లేదా వాటితో పాటు కదిలించడం చేయిస్తారు.
2. ఎలక్ట్రోథెరపీ: దీనిని తీవ్రమైన నొప్పుల నివారణకు లేదంటే శరీరంలోని కొన్ని భాగాలలో నొప్పి నివారణకు ఉపయోగిస్తారు.
ముఖ్యంగా నడుము, మెడ, భుజాలు, ఆర్థరైటిస్ నొప్పులకు ఈ చికిత్సను ఉపయోగిస్తారు.
ఈ విధానంలో వేడి, కాంతి, విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించి చికిత్స చేస్తారు. నొప్పిపై ప్రభావం చూపేలా అల్ట్రాసౌండ్, లేజర్, షార్ట్ వేవ్ డయాథర్మీ విధానాలను ఉపయోగిస్తారు.
ఇవి కండరాల్లో వేడిని సృష్టించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఎలిల్‌వాణన్ చెప్పారు.
‘‘మెడనొప్పి, వెన్నునొప్పితో ఫిజియోథెరపీ కోసం వచ్చే వారికి ఔట్ పేషెంట్లుగా చికిత్స అందిస్తారు. అయితే ఎముకలు విరిగినవారు, బాగా పెద్ద గాయాలైనవారు ఆసుపత్రులలో చేరి సర్జరీలు చేయించుకుంటారు. దీని తరువాత వారు ఫిజియోథెరపీ ద్వారా సాంత్వన పొందుతారు’’ అని ఎలిల్‌వాణన్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిజియోథెరపీ ప్రయోజనాలేంటి?
ప్రమాదాలు లేదా పక్షవాతం లాంటి తీవ్ర అనారోగ్యాల కారణంగా కదల్లేని పరిస్థితికి చేరినవారిని అంటే, కనీసం టాయిలెట్‌కు వెళ్లాలన్నా ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉన్నవారిని వీలున్నంత వరకు ఫిజియోథెరపీ ద్వారా సాధారణ స్థితికి తేవచ్చని ఎలిల్‌వాణన్ చెప్పారు.
ఇలాంటి సమస్యలతో బాధపడేవారు రోజుల తరబడి మంచానికే పరిమితం కావడం వల్ల కండరాలు బలహీనంగా మారతాయి.
కండరాలు తిరిగి బలోపేతం కావడానికి ఫిజియోథెరపీ సహాయపడుతుందని ఆయన చెప్పారు.
ఫిజియోథెరపీ ద్వారా 90 శాతం మంది రోగులను సాధారణ స్థితికి తీసుకురావచ్చని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిజియోథెరపీ ఎంత వేగంగా ప్రభావం చూపుతుందనే విషయంపై ఎలిల్‌వాణన్ మాట్లాడుతూ, ఎముకలు విరగడం, చేతులు, కాళ్లను కదలించలేని, మడవలేని పరిస్థితులలో ఉన్నవారు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయించుకుంటే ఒకట్రెండు నెలల్లోనే ఫలితం కనిపిస్తుందని చెప్పారు.
తలపై దెబ్బతగిలినా, బ్రెయిన్ డ్యామేజ్ అయినా, వెన్నెముక దెబ్బతిన్నా, చేతులు, కాళ్లు సరిగా కదపలేకపోయినా, వాటిని సరిచేయడానికి ఫిజియోథెరపీ వ్యాయామాల ద్వారా 3 నెలల సమయం పడుతుందని ఆయన వివరించారు.
కానీ, ఇదంతా రోగి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడంపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.
‘‘కొన్ని సందర్భాల్లో ఫిజియోథెరపీ వ్యాయామాలు చేసి ఇతర మందులు, ఇతర చికిత్సా పద్ధతులకు మారే ఓపిక రోగులకు ఉండదు. అప్పుడు ఫిజియోథెరపీ ప్రభావవంతంగా ఉండకపోవచ్చు" అని ఎలిల్‌వాణన్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














