బోయింగ్ స్టార్‌లైనర్: అంతరిక్ష కేంద్రం నుంచి ఖాళీగా వచ్చి క్షేమంగా దిగిన స్పేస్‌క్రాఫ్ట్

ఫొటో సోర్స్, NASA
- రచయిత, రెబెక్కా మోరెల్, అలిసన్ ఫ్రాన్సిస్, మిషెల్ షీల్స్ మెక్ నామీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
బోయింగ్ స్టార్‌లైనర్ ప్రయాణం ముగిసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్) నుంచి బయల్దేరిన ఈ క్యాప్సుల్ ఆరుగంటలు ప్రయాణించి భూమి మీదకు చేరింది.
వ్యోమగాములు ఎవరూ లేకుండానే ఆటోపైలట్ మోడ్‌లో ప్రయాణించిన ఈ అంతరిక్ష నౌక, శనివారం న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ హార్బర్‌లో క్షేమంగా ల్యాండ్ అయింది.
భూవాతావరణంలోకి ప్రవేశించాక, సురక్షితంగా దిగడానికి వీలుగా పారాచూట్లను తెరిచి వేగాన్ని నియంత్రించారు.
జూన్ మొదటివారంలో ఈ నౌక సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్ళింది. ఇప్పుడు వారు లేకుండానే ఖాళీగా భూమికి చేరింది.
నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములను ఐఎస్ఎస్‌లోనే ఉంచడం మేలని నాసా భావించింది.
బోయింగ్ స్టార్‌లైనర్‌కు బదులుగా వారిని స్పేస్-ఎక్స్ డ్రాగన్‌లో భూమి మీదకు తీసుకురావాలని భావించారు. కానీ అది ఫిబ్రవరి వరకు సాధ్యం కాదు.
దీంతో 8 రోజులు అనుకున్న వీరిద్దరి అంతరిక్ష బసను 8 నెలలకు పొడిగించారు.
విల్‌మోర్, సునీతా మానసికంగా దృఢంగా ఉన్నారని, వారి కుటుంబాలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నామని నాసా గతంలో తెలిపింది.
‘వ్యోమగాములిద్దరూ తమ పనిపట్ల నిబద్ధతతో ఉన్నారు’ అని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


ఫొటో సోర్స్, NASA
ఆదిలోనే సమస్యలు..
బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లేలా రూపొందించిన తొలి స్పేస్‌క్రాఫ్ట్. ఈ కొత్త వ్యోమనౌక పనితీరును పరిశీలించడంలో భాగంగా సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లను అంతరిక్షానికి పంపారు.
కానీ జూన్ 5న ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి టేకాఫ్ అయినప్పటి నుంచి అది సమస్యలతో సతమతమైంది. ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి.
బోయింగ్ సంస్థకు చెందిన ఇంజినీర్లు, నాసా అధికారులు ఈ సాంకేతిక సమస్యలను అర్ధం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి ఒక నిర్ణయానికి వచ్చారు.
అయితే, వ్యోమగాములను ఈ నౌక ద్వారా సురక్షితంగా భూమి మీదకు తీసుకురావచ్చని ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు బోయింగ్ సంస్థ వాదించింది.
ఈ సందర్భంగా నాసా, బోయింగ్ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో కొంత ఆందోళన నెలకొందని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ చెప్పారు.
‘స్పేస్ క్రాఫ్ట్‌లో అనిశ్చితి, మోడలింగ్ కారణంగా నాసా బృందానికి నమ్మకం కుదరలేదు’ అని ఆయన చెప్పారు.
మరోపక్క స్పేస్ ఎక్స్ ద్వారా వ్యోమగాములను తిరిగి తీసుకురావాలనే ప్రణాళిక ఆలస్యమవుతోంది.
సెప్టెంబర్ చివరి నాటికి స్పేస్ ఎక్స్ తన వాహనాన్ని సిద్ధం చేస్తుంది. ఆ వాహనంలో నలుగురు వ్యోమగాములను పంపడానికి అవకాశం ఉంది. కానీ ఇద్దరితోనే ప్రయాణించనుంది.
దీంతో వచ్చే ఫిబ్రవరిలో విల్‌మోర్, సునీతా విలియమ్స్ ఈ వాహనంలో భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది.
సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లకు అంతరిక్షంలో ఇప్పటికే రెండుసార్లు సుదీర్ఘ సమయం గడిపిన అనుభవం ఉండటంతో పొడిగించిన మిషన్‌కు వారు అలవాటు పడుతున్నారని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మేనేజర్ డానా వీగెల్ చెప్పారు.
భార రహిత స్థితిలో ఆరోగ్యంగా ఉండటానికి వీరిద్దరూ అవసరమైన ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నారని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, NASA
బోయింగ్‌కు ఊరటే
ఇటీవల జరిగిన విమాన ప్రమాదాలు, ఐదేళ్ల క్రితం జరిగిన రెండు ఘోర ప్రమాదాలతో తన ప్రతిష్ఠను చక్కదిద్దుకోలేక, ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న బోయింగ్ కు స్టార్ లైనర్‌లో సమస్యలు ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. అయితే స్టార్‌లైనర్ ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా ల్యాండ్ కావడం అటు కంపెనీకి, ఇటు నాసాకు ఊరటనిచ్చే విషయమే.
‘‘వాహనం మా దగ్గరకు వచ్చిన తరువాత కొన్నినెలల పాటు పోస్ట్ ఫ్లైట్ విశ్లేషణ చేస్తాం’’ అని స్టీవ్ స్టిచ్ చెప్పారు.
అంతరిక్షానికి వ్యోమగాములను తీసుకువెళ్లేందుకు రెండు అమెరికన్ కంపెనీలు ఉండాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది.
నాసా స్పేస్ షటిల్ ఫ్లీట్ 2011లో రిటైర్ అయిన తరువాత, నాసా తన వ్యోమగాములను, సరుకుల రవాణాకు రష్యాకు చెందిన సోయుజ్ స్పేస్‌క్రాఫ్ట్‌పై దశాబ్దానికిపైగా ఆధారపడింది. ఇది అంత మంచిపని కాదని నాసా అంగీకరించింది.
దీంతో 2014లో వాణిజ్య అంతరిక్ష నౌకల కోసం బోయింగ్, స్పేస్‌ఎక్స్‌కు కాంట్రాక్టులు ఇచ్చింది. బోయింగ్ 4.2 బిలియన్ డాలర్లు, (సుమారు 35వేల 274 కోట్ల రూపాయలు) స్పేస్ ఎక్స్ 2.6 బిలియన్ (సుమారు 21వేల 836 కోట్ల రూపాయలు) కాంట్రాక్టులు దక్కించుకున్నాయి.
ఇప్పటిదాకా స్పేస్ ఎక్స్ నాసా కోసం సిబ్బందితో కూడిన తొమ్మిది విమానాలను, అలాగే కొన్ని వాణిజ్య మిషన్లను అంతరిక్షంలోకి పంపింది. అయితే సిబ్బందితో అంతరిక్ష నౌకను పంపడం మాత్రం బోయింగ్‌కు ఇదే మొదటిసారి.
స్పేస్ క్రాఫ్ట్ అభివృద్ధిలో ఎదురుదెబ్బల కారణంగా స్టార్ లైనర్ ఇప్పటికే చాలా సంవత్సరాలు ఆలస్యమైంది. 2019, 2022 లో సిబ్బంది లేని విమానాలు కూడా సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నాయి.
కానీ, నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాత్రం స్టార్‌లైనర్ మరోసారి సిబ్బందితో గాల్లోకి ఎగురుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














