శుభాంశు శుక్లా: అంతరిక్ష యాత్రకు వెళుతున్న రెండో భారత వ్యోమగామి

శుభాంశు శుక్లా

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, శుభాంశు శుక్లా

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లే రెండో భారత వ్యోమగామిగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా నిలిచే అవకాశం ఉంది. ఇస్రో, నాసా సంయుక్తంగా నిర్వహించే అంతరిక్ష యాత్రకు ఆయన ఎంపికయ్యారు.

కెప్టెన్ శుక్లా అంతరిక్షంలోకి వెళితే, గత 40 ఏళ్లలో ఈ ఘనత సాధించిన రెండో భారతీయ వ్యోమగామిగా నిలుస్తారు. ఇంతకు ముందు రాకేష్ శర్మ 1984లో సోవియట్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు.

కెప్టెన్ శుభాంశు శుక్లా (39)తో పాటు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ (48)ను కూడా ఇస్రో ఈ యాక్సియమ్-4 మిషన్ కోసం ఇటీవల ఎంపిక చేసింది.

శుక్లాకు బ్యాకప్ వ్యోమగామిగా నాయర్ ఎంపికయ్యారు. ఏదైనా కారణంతో శుక్లా వెళ్లలేకపోతే ఆయన స్థానంలో నాయర్ అంతరిక్షంలోకి వెళతారు.

ఈ సందర్భంగా శుక్లా, నాయర్‌లకు భారత వైమానిక దళం ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలిపింది.

వాట్సాప్
ఇస్రో

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, ఇస్రో ప్రకటన

గగన్‌యాన్‌కు కూడా ఎంపిక

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో "ఇస్రో-నాసా సంయుక్త ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఇస్రోకు చెందిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (హెచ్ఎస్ఎఫ్సీ) నాసా ద్వారా గుర్తింపు పొందిన యాక్సియమ్ స్పేస్ (అమెరికా)తో యాక్సియమ్ 4 మిషన్ కోసం అంతరిక్ష విమాన ఒప్పందం (ఎస్ఎఫ్ఏ)పై సంతకం చేసింది’’ అని తెలిపింది.

"ఒక జాతీయ మిషన్ అసైన్‌మెంట్ బోర్డు ఈ మిషన్ కోసం ఇద్దరిని ప్రైమ్, బ్యాకప్ మిషన్ పైలట్‌లుగా సిఫార్సు చేసింది. వీరు కెప్టెన్ శుభాంశు శుక్లా (ప్రైమ్), కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ (బ్యాకప్)" అని ఇస్రో తెలిపింది.

వ్యోమనౌక వ్యోమగాములనే కాకుండా ఇతర సామగ్రిని కూడా తీసుకువెళుతుంది.

శుక్లా, నాయర్‌లు గగన్‌యాన్‌లో కూడా భాగం. మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి భారత్ చేపడుతున్న మొదటి అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌.

గగన్‌యాన్ మిషన్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన నలుగురిని ఎంపిక చేశారు. అయితే, ఈ మిషన్ ద్వారా వచ్చే ఏడాది అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.

కెప్టెన్ శుభాంశు శుక్లా, కెప్టెన్ బాలకృష్ణన్ నాయర్‌లు 8 వారాల పాటు మిషన్‌కు సంబంధించిన శిక్షణ పొందుతారని ఇస్రో ప్రకటించింది.

యాక్సియమ్ మిషన్

ఫొటో సోర్స్, AXIOM

శుక్లా ఎవరితో వెళ్లబోతున్నారు?

మిషన్ యాక్సియమ్-4 అనేది ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అయిన యాక్సియమ్ స్పేస్ నాలుగో మిషన్. నాసా సహకారంతో ఈ మిషన్ ముందుకు వెళుతోంది.

ఈ వ్యోమనౌకను స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకోనున్న ఈ వ్యోమనౌకలో శుక్లాతో పాటు పోలండ్, హంగేరీ, అమెరికాలకు చెందిన వ్యోమగాములు కూడా ఉంటారు.

గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ మిషన్‌కు ఒప్పందం కుదిరింది.

నాసా యాక్సియమ్ -4 మిషన్‌కు తేదీని నిర్ణయించలేదు, అయితే దాని వెబ్‌సైట్ ప్రకారం 2024లోనే ఇది జరగనుంది.

పీఎంతో గగన్‌యాన్ వ్యోమగాముల కరచాలనం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లనున్న వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. శుభాంశు శుక్లా కుడివైపున నిలబడి ఉన్నారు.

కెప్టెన్ శుభాంశు శుక్లా ఎవరు?

శుభాంశు శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ నివాసి. ఆయన 2006లో భారత వైమానిక దళంలో చేరారు. ఆయనకు 2,000 గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది.

భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 ఎంకేఐ, ఎంఐజీ -21ఎస్, ఎంఐజీ-29ఎస్, జాగ్వార్, హాక్స్ డోర్నియర్స్, ఎన్-32 వంటి యుద్ధ విమానాలను నడిపారు.

ఇక నాయర్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 'స్వోర్డ్ ఆఫ్ హానర్' అందుకున్నారు. ఆయన 1998లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికయ్యారు. నాయర్ కేటగిరీ-వన్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్, టెస్ట్ పైలట్.

నాయర్‌కు 3,000 గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది. ఆయన యునైటెడ్ స్టేట్స్ స్టాఫ్ కాలేజీలో చదువుకున్నారు. సుఖోయ్ 30 విమానాలను నడిపించే గ్రూపునకు నాయర్ కమాండర్.

గగన్‌యాన్ మిషన్ ప్రారంభం కావడానికి ముందే శుక్లా, నాయర్‌లను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పంపడం వెనుక మరో ఉద్దేశం ఏమిటంటే, వారు ముందుగానే ఆ ప్రదేశం గురించి నేరుగా తెలుసుకుంటారు. ఇది గగన్‌యాన్ మిషన్‌లో ఉపయోగపడనుంది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)