బ్రూనై: సంపద ఎక్కువ, స్వేచ్ఛ తక్కువ ఉన్న ఈ దేశం ప్రత్యేకతలు ఏంటి?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెబర్ 3, 4న బ్రూనైలో పర్యటించి అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు.
హిందూ మహా సముద్రం ప్రాంతంలో రెండు దేశాల భాగస్వామ్యాన్ని పెంచుకోవడం గురించి చర్చలు జరిపేందుకు మోదీ బ్రూనైలో పర్యటించారు.
బ్రూనై మత వ్యవహారాల మంత్రి పెహిన్ డటో ఉస్తాజ్ హజీ అవంగ్ బరుద్దీన్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.

బ్రూనై, భారత్ భాగస్వామ్యం
ప్రధాని మోదీ పర్యటన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చ మొదలైంది. భారత్, బ్రూనై దేశాల మధ్య సంబంధాలకు దశాబ్దాల చరిత్ర ఉంది.
చమురు అన్వేషణలో భాగంగా 1920లో భారతీయులు తొలిసారిగా బ్రూనై చేరుకున్నారు. ప్రస్తుతం ఆ దేశ జనాభా 4.5 లక్షలకు పైచిలుకు కాగా ఇందులో భారతీయులు సుమారు 14వేల మంది ఉన్నారు.
బ్రూనైలోని విద్య, వైద్య రంగాల సేవలకు సంబంధించి భారతీయుల పాత్ర కీలకమని చెబుతారు.
భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం భారత్, బ్రూనై మధ్య వాణిజ్యం 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2 వేల కోట్లు). ఇందులో హైడ్రో కార్బన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఫొటో సోర్స్, PMO INDIA
బ్రూనై భాగ్యరేఖల్ని మార్చిన చమురు
బ్రూనై ఆసియా ఖండపు దేశం. ఈ చిన్న దేశం భౌగోళికంగా కంబోడియా, ఇండోనేషియా, మలేసియా, సింగపూర్ దేశాల మధ్య ఉంది. ఈ దేశంలోని 4 లక్షల 61 వేల మందిలో మూడింట రెండొంతుల మంది ముస్లింలు.
బ్రూనైలో మలయ్ అధికారిక భాష. బందార్ సిరి బెగావన్ ఈ దేశ రాజధాని.
బోర్నియో ద్వీపంలో ఉన్న ఈ చిన్న దేశాన్ని సుల్తాన్ హసనల్ బోల్కియా పాలిస్తున్నారు.
1880ల నాటికి బ్రూనై బ్రిటిషర్ల పాలనలో ఉంది. 1929లో చమురు వెలికితీతతో ఈ దేశం భాగ్యరేఖలు మారిపోయాయి. చమురు, సహజవాయువు ఎగుమతుల ద్వారా బ్రూనై సంపన్న దేశంగా మారింది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒమర్ అలీ సైఫుద్దీన్-III బ్రూనై సుల్తాన్‌గా బాధ్యతలు చేపట్టారు.
1984లో బ్రూనై స్వాతంత్ర్యం పొందింది.
2014లో షరియా చట్టాన్ని అమలు చేసిన తొలి తూర్పు ఆసియా దేశంగా బ్రూనై గుర్తింపు పొందింది. ఈ నిర్ణయాన్ని అనేక అంతర్జాతీయ సంస్థలు విమర్శించాయి.
హోమో సెక్సువల్స్‌ను రాళ్లతో కొట్టి చంపేలా 2019లో మరో చట్టాన్ని అమలులోకి తెచ్చింది బ్రూనై.
ఈ చట్టం మీద అంతర్జాతీయంగా విమర్శలు చెలరేగడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
బ్రూనై సుల్తాన్ ఆ దేశ పెట్టుబడుల సంస్థకు అధిపతి. లండన్‌లోని డోర్‌చెస్టర్, లాస్ ఏంజెలిస్‌లో బెవర్లీ హిల్స్ హోటల్ సహా ప్రపంచంలోని కొన్ని ప్రముఖ హోటళ్లు ఈ సంస్థ భాగస్వామ్యంతో నడుస్తున్నాయి.
బ్రూనై పాలక రాజకుటుంబానికి పెద్ద ఎత్తున సంపద ఉంది. దేశంలోని చాలామంది ప్రజలు అన్ని ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతారు. వాళ్లు పన్నులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
సంపద ఎక్కువ, స్వేచ్ఛ తక్కువ
2019లో బీబీసీ ప్రతినిధి జొనాథన్ హెడ్ బ్రూనైలో పర్యటించారు. ఆ సమయంలో ఈ చిన్న దేశం ఎలా ఉంది? అక్కడి ప్రజల జీవన విధానం ఎలా ఉందనే దాని గురించి ఆయన వివరించారు.
ప్రణాళిక ప్రకారం నిర్మించిన నగరాలు, అందులో విశాలమైన రహదారులు, రోడ్లకు రెండు వైపులా చెట్లు, ఒక్క మాటలో చెప్పాలంటే చూడగానే ఇదొక సింగపూర్‌లా అనిపిస్తుంది.
బ్రూనైలో మసీదులు చాలా అద్భుతంగా ఉంటాయి. దారులను సూచించే బోర్డుల మీద అరబిక్‌లో రాసిన పదాలు, సుల్తాన్ హసనల్ బోల్కియా చిత్రాలు కనిపిస్తాయి.
రాచరికం అమల్లో ఉన్న కొద్ది దేశాల్లో బ్రూనై ఒకటి. సుల్తాన్‌కు దేశంలోని అన్ని వ్యవస్థల మీద తిరుగులేని, సంపూర్ణమైన అధికారం ఉంది.
బ్రూనై మొదట బ్రిటిష్ వలస రాజ్యం. 1984 వరకు సంరక్షిత ప్రాంతంగా ఉంది. స్వాతంత్ర్యం తర్వాత, మలయ్ ముస్లిం రాజ్యాన్ని స్థాపించాలని సుల్తాన్ భావించారు.
ప్రస్తుతం ఈ దేశం బ్రూనై ఫిలాసఫీ ప్రకారం నడుస్తోంది. “ఇది మలయ్ భాష, సంస్కృతి, సంప్రదాయాలు, ఇస్లామిక్ చట్టాలు, విద్య, రాచరికాల సమ్మేళనం.” అని బ్రూనై ప్రభుత్వం అభివర్ణించింది. ప్రతీ ఒక్కరు దీన్ని ఆచరించాల్సిందే.
బ్రూనైలో అసమ్మతికి తావు లేదు. బ్రూనై వాసులంతా మలయ్ తెగవారు కాదు. ఇక్కడ 80 శాతం మంది ముస్లింలు.
స్వాతంత్ర్యం తర్వాత బ్రూనై సుల్తాన్ పరిపాలనలో ఇస్లాం విధానాలను కఠినంగా అమలు చేశారు.
బ్రూనై, ఇస్లామిక్ వ్యవహారాల నిపుణుడు డొమినిక్ ముల్లర్‌తో బీబీసీ 2019లో మాట్లాడింది.
“గత మూడు దశాబ్దాలలో సుల్తాన్ చాలా వేగంగా మతం వైపు మళ్లుతున్నారు. ప్రత్యేకించి 1987లో ఆయన మక్కా సందర్శన తర్వాత ఎక్కువైంది. అల్లా ఆదేశాల ప్రకారం దేశంలో షరియా చట్టాన్ని తీసుకురావాలని తాను భావిస్తున్నట్లు ఆయన చాలాసార్లు చెప్పారు.’’ అని డొమినిక్ చెప్పారు.
ఇస్లామిక్ అధికారుల ప్రభావాన్ని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. బ్రూనైలో ‘అల్లా చట్టాన్ని’ అమలు చేయాలని ఇస్లామిక్ అధికారులు చాలా కాలంగా సుల్తాన్‌కు, ప్రజలకు చెబుతూనే ఉన్నారని డొమినిక్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతిపక్షం, పత్రికా స్వేచ్ఛ లేని దేశం
స్వాతంత్ర్యం తర్వాత బ్రూనైలో ప్రతిపక్షాన్ని అనుమతించలేదు. అలాగే దేశంలో ప్రభావవంతమైన సామాజిక వ్యవస్థలు కూడా లేవు.
1962లో విధించిన స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని బ్రూనై ఇప్పటికీ అమలు చేస్తుంది. దీని కింద ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛ లేదు.
మీడియా ఇష్టం వచ్చినట్లు రాయడానికి వీలులేదు. పరిధి దాటిన మీడియా సంస్థలను మూసివేయవచ్చు.
బ్రూనై ప్రజలు సహజంగా ఆతిథ్యం, ఇతరులకు సాయం అందించడంలో ముందుంటారు. అయితే షరియా గురించి అధికారికంగా మాట్లాడేందుకు ఎవరూ ఇష్టపడలేదు.
హోమో సెక్సువాలిటీ పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంపై స్థానిక ప్రజల అభిప్రాయం ఏంటి?
“సుల్తాన్ చెప్పిందే చట్టం, ప్రస్తుతానికి చట్టం అమల్లో ఉన్నప్పటికీ మరణశిక్ష విధించడం లేదు. అయితే సమలైంగికుల పట్ల పాలకుల ధోరణిలో ఎలాంటి మార్పు ఉండదు. లెస్బియన్ మహిళలకు ఈ చట్టం వర్తించదని అనుకుంటున్నాను. అయితే ప్రజలకు నా సెక్సువాలిటీ గురించి తెలియడం సేఫ్ అని నేను అనుకోవడం లేదు.” అని ఒక మహిళ 2019లో బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చమురు ఆదాయంలో తగ్గుదల
ఒకప్పుడు బ్రూనైను సంపన్నంగా మార్చిన చమురు ప్రస్తుతం తరిగిపోతోంది.
కొన్నేళ్లుగా బ్రూనై నష్టాలు ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మందగించింది.
ఆర్థిక లోటు కూడా పెరుగుతోంది. నిరుద్యోగిత పెద్ద సమస్యగా మారింది.
మద్యం తాగడానికి, సంగీతం వినడానికి, సిగరెట్లు కోసం ప్రజలు మలేసియాకు చెందిన బోర్నియో ద్వీపంలోని లింబంగ్ నగరానికి వెళుతున్నారు.
బ్రూనైలో ఇలాంటి అలవాట్లపై నిషేధం ఉంది.
ఈ ప్రాంతంలోని ఒక క్లబ్‌లో బ్రూనైకు చెందిన కొంతమంది ముస్లిమేతరులతో బీబీసీ మాట్లాడింది. ‘షరియా వల్ల మీకు అక్కడ సమస్యగా ఉందా’ అని వారిని అడిగింది.
‘‘ఇక్కడకు రావడానికి మాకు అనుమతి ఉన్నంత కాలం, బ్రూనైతో మాకు ఎలాంటి సమస్యా లేదు.’’ అని వారు అన్నారు.
బ్రూనై రాజధాని నుంచి లింబంగ్ నగరం వెళ్లాలంటే గంటన్నర సేపు ప్రయాణించాల్సి ఉంటుంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














