మావోరి: ఈ తెగకు నాయకత్వం వహించడానికి వచ్చిన కొత్త మహారాణి ఎన్‌గా వాయ్ ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలీ అబ్బాస్ అహ్మదీ, కేటీ వాట్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
న్యూజీలాండ్‌లోని మావోరి తెగకు కొత్త మహారాణి వచ్చారు. తండ్రి కియింగి తుహీటియా పొటాటౌ టి వీరోవీరో-VII మరణించడంతో ఆయన వారసురాలిగా 27 ఏళ్ల ఎన్‌గా వాయ్ హోనో ఐ టె పొ తెగకు మహారాణిగా బాధ్యతలు స్వీకరించారు.
ఎన్‌గా వాయ్ మావోరి తెగ ఎనిమిదో తరం అధినేత్రి.
మావోరి భాషలో రాణిని కుయిని అంటారు. న్యూజీలాండ్ ఉత్తర ఐలాండ్‌లో జరిగిన వేడుకలో మావోరి అధినేతల కౌన్సిల్ ఎన్‌గా వాయ్‌ను మహారాణిగా ప్రకటించింది.
మావోరి మహారాణి అయిన రెండో మహిళ ఎన్‌గా వాయ్. ఆమె నాయనమ్మ అరికినుయ్ డేమ్ మావోరి తెగ మొదటి మహారాణి.
తుహీటియా పిల్లలందరిలో ఎన్‌గా వాయ్ హోనో చిన్నవారు. తుహీటియా 69 ఏళ్ల వయసులో గత శుక్రవారం మరణించారు.


ఫొటో సోర్స్, Getty Images
కొత్త తరం నాయకురాలు
1858లో తొలి మావోరి రాజు ప్రమాణస్వీకారం సమయంలో ఉపయోగించిన బైబిల్‌తోనే కొత్తరాణిని ఆశీర్వదించారు. రాణి సంప్రదాయ వస్త్రాలు ధరించి తండ్రి శవపేటిక ముందు కూర్చున్నారు. ఖననానికి ముందు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
వారసురాలి ప్రకటన అనంతరం రాజు భౌతిక కాయాన్ని వాకాగా పిలిచే యుద్ధ పడవల్లో సంప్రదాయ విధానంలో మౌంట్ తౌపిరికు తరలించారు. అక్కడే రాజుకు అంత్యక్రియలు నిర్వహించారు.
రాజుగా బాధ్యతలు చేపట్టి 18సంవత్సరాలు పూర్తయిన వేడుకను చేసుకున్న కొన్ని రోజులకే కియింగి తుహీటియా గుండె సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరారు. గుండె ఆపరేషన్ అనంతరం ఆస్పత్రిలో కోలుకుంటున్నసమయంలోనే ఆయన చనిపోయారు.
ఎన్‌గా వాయ్ రాణిగా బాధ్యతలు చేపట్టడం ఒక మార్పుగా ఈ తెగకు చెందిన స్థానికులు పరిగణిస్తున్నారు. యువ మావోరి తెగ సభ్యులపై రాణి ఎంపిక సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
రాణి ఎన్‌గా వాయ్ మావోరి కల్చరల్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు . కాపా హాకా అనే సబ్జెక్ట్ బోధిస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలను మావోరి తెగ భాషలో కాపా హాకా అంటారు.
కియింగి తుహీటియా అంత్యక్రియల కార్యక్రమంలో హాకా నృత్యం కూడా ఓ భాగం. ఈ నృత్యం తర్వాత రాజు శవపేటికను పడవల్లో వైకటో నదిలో తిప్పారు. అనంతరం మౌంట్ తౌపురికి రాజు భౌతికకాయాన్ని తరలించారు.
కియింగి తుహీటియా మరణం తర్వాత వారం రోజులుగా జరుగుతున్న సంప్రదాయ కార్యక్రమాలు అంత్యక్రియలతో ముగిశాయి.

ఫొటో సోర్స్, Getty Images
రాజు అంత్యక్రియలకు హాజరుకాని ప్రధాని
రాజు కియింగి తుహీటియా మరణం మొత్తం దేశానికి బాధాకరమైన విషయమని మావోరి కింగ్ మూవ్‌మెంట్ ప్రతినిధి రహుయి ఆవేదన వ్యక్తంచేశారు.
‘పరిధులు దాటిన ప్రేమను పంచిన ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.’ అని ఆయన అన్నారు.
‘దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది’ అని న్యూజీలాండ్ ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత క్రిస్ హిప్‌కిన్స్ అన్నారు.
రాజు మావోరి తెగతో పాటు, న్యూజీలాండ్ ప్రజలందరి కోసం అంకితభావంతో పనిచేశారని ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లగ్జన్ ప్రశంసించారు.
అయితే, లగ్జన్ ప్రభుత్వ విధానాలు మావోరి తెగకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. దక్షిణకొరియా అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని లగ్జన్, రాజు అంత్యక్రియలకు హాజరు కాలేదు.
కియింగి తుహీటియా మృతికి మూడు రోజులు అధికారిక సంతాప దినాలుగా ప్రకటించింది ప్రభుత్వం. అయితే నివాళులర్పించడానికి పెద్దసంఖ్యలో ప్రతినిధులు తరలి వస్తుండడంతో సంతాప దినాలను ఏడురోజులకు పెంచారు.
‘ ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు’ అని మావోరి జర్నలిస్టు మెరియానా హోండ్ బీబీసీతో చెప్పారు.
కియింగి తుహీటియా 1955లో జన్మించారు. తల్లి అరికినుయి డేమ్ మరణం తర్వాత 2006లో రాజుగా బాధ్యతలు చేపట్టారు. తల్లిలానే ఆయన ప్రజల్లో విశేష గుర్తింపు, గౌరవం సాధించారు.
మావోరిలను లక్ష్యంగా చేసుకుని న్యూజీలాండ్ ప్రభుత్వం రూపొందించిన విధానాలకు వ్యతిరేకంగా తెగ ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు సాగేలా చేయగలిగారు.
మావోరి రాచరికం 19వ శతాబ్దానికి చెందింది. న్యూజీలాండ్‌లో బ్రిటిష్ కాలనీలు భారీ స్థాయిలో భూమిని ఆక్రమించుకోకుండా అడ్డుకునేందుకు, మావోరి సంస్కృతిని పరిరక్షించేందుకు ఈ తెగలోని అనేక వర్గాలు కలిసి యూరోపియన్ రాజకుటుంబాల తరహాలో మోనార్క్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. న్యూజీలాండ్‌లో మావోరి రాజకుటుంబం పాత్ర చాలా ప్రభావవంతమైనది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














