బంగారం: భారత్ సహా పలుదేశాలు భారీగా కొనుగోళ్లు చేస్తున్నాయి, ఏంటి కథ...

ఫొటో సోర్స్, Getty Images
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి.
ఒక్క జులై నెలలోనే సెంట్రల్ బ్యాంకులు 37 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక తెలిపింది.
పోలండ్, తుర్కియే, ఉజ్బెకిస్తాన్, చెక్ రిపబ్లిక్ దేశాలు కూడా బంగారాన్ని కొనుగోలు చేశాయి.
కొన్ని దేశాలు భారీగా పుత్తడిని కొంటుంటే, మరికొన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు విక్రయిస్తున్నాయి.
రష్యా – యుక్రెయిన్, గాజా-ఇజ్రాయెల్ యుద్ధాలు, పర్యావరణ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు పెరుగుతున్న వేళ ఈ పరిణామం జరుగుతోంది.


బంగారాన్ని అమ్మే దేశాలు ఇవే
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ( ఏప్రిల్-జూన్) భారత్ బంగారం కొనుగోళ్లలో రెండోస్థానంలో నిలిచినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.
ఈ జాబితాలో 18.68 టన్నుల పసిడిని కొనుగోలు చేసి పోలండ్ సెంట్రల్ బ్యాంక్ అగ్రస్థానంలో నిలవగా, భారత రిజర్వ్ బ్యాంకు జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 18.67 టన్నులు కొనుగోలు చేసింది. తుర్కియే 14.63 టన్నులు, ఉజ్బెకిస్తాన్ 7.46 టన్నులు, చెక్ రిపబ్లిక్ 5.91 టన్నుల పసిడిని కొన్నాయి.
ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికం అంటే ఏప్రిల్ జూన్ మధ్యన కజకిస్తాన్ 11.83 బంగారాన్ని విక్రయించింది. సింగపూర్ 7.7టన్నులు, జర్మనీ 780 కేజీల బంగారాన్ని అమ్మాయి.
బంగారం నిల్వలు ఏ దేశానికైనా ఓ ముఖ్యమైన ఆస్తిగా పరిగణించడం ఎప్పటి నుంచో కొనసాగుతోంది.
సెంట్రల్ బ్యాంకులు 2023లో 1,037 టన్నుల బంగారాన్ని డిపాజిట్ చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. ఈ మొత్తం 2022లో 1,082 టన్నులు. రిజర్వు ఆస్తులుగా బంగారానికి సెంట్రల్ బ్యాంకులు ఎంత ప్రాముఖ్యమిస్తున్నాయో ఈ గణాంకాలు చెబుతున్నాయి.
బంగారం కేంద్ర బ్యాంకులకు స్థిరాస్తిగా పనిచేస్తుంది. ఇది ఆర్థిక సంక్షోభాల సమయంలో ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి సహాయపడుతుంది. అమెరికా డాలర్‌కు 'రిజర్వ్ కరెన్సీ' హోదా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక బ్యాంకులు డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకు బంగారం ముఖ్యమైన సాధనంగా మారింది.

ఇదీ కొనుగోళ్ల వెనుక కథ
‘‘డాలర్ పతనమవుతున్న తీరుతో సెంట్రల్ బ్యాంకులు తమ పోర్ట్‌ఫోలియోలో బంగారాన్ని చేర్చుకుంటున్నాయి. అమెరికా వడ్డీరేట్లు తగ్గిస్తుందని, దీంతో డాలర్ విలువ తగ్గుతుందని అందరూ భావిస్తున్నారు. ఫలితంగా అందరూ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ (కమోడిటీస్, కరెన్సీస్) ప్రొడక్ట్ హెడ్ అంజు గుప్తా చెప్పారు.
‘‘అమెరికా ఆర్థిక వ్యవస్థ అప్పుల్లో నడుస్తుండటంతో రానున్న రోజుల్లో డాలర్ విలువ బలహీనపడుతుందనే భయం అంతటా ఉంది’’ అని గుప్తా అన్నారు.
‘‘భారత్ కూడా తన రిజర్వులను మరింత భద్రం చేసుకోవడానికి ఇలా చేస్తోంది. భారత్ తన విదేశీ నిల్వలను పెంచుకోవాలి. భారత్ డాలర్‌కు బదులుగా బంగారాన్ని కొనుగోలు చేస్తే మరిన్ని నోట్లను ముద్రించవచ్చు. భారత్ బంగారం కొనడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.’’ అని ఆమె అన్నారు.
దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీనివల్ల ఏదైనా అలజడి జరిగితే కరెన్సీ విలువ పడిపోయి బంగారం ధర పెరుగుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














