గోల్డ్ రిఫైనరీలో భారత్ ప్రపంచ హబ్‌గా మారుతోందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రీతి గుప్తా
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశ వ్యాప్తంగా ఉన్న చిన్నపాటి బంగారు శుద్ధి కార్ఖానాలు పెద్ద సంస్థల నుంచి సరికొత్త పోటీని ఎదుర్కొంటున్నాయి.
ప్రతాప్ సాలుంఖే కుటుంబానికి బంగారాన్ని శుద్ధి చేసే ప్రక్రియలో సుదీర్ఘ చరిత్ర ఉంది. తన తాత, తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ఆయన బంగారు వ్యాపారులనుంచి పాత నగలను తీసుకుని వాటిని కరిగించి బంగారు కడ్డీలుగా తయారుచేసి అందిస్తుంటారు.
దెబ్బతిన్న నగలు, బంగారుపూత పూసిన ఆభరణాలు, పాత నగలను తీసుకోవడాన్నే గోల్డ్ స్క్రాప్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ గోల్డ్‌స్క్రాప్ ను తీసుకుని వాటిని శుద్ధిచేసి తిరిగి బంగారు కడ్డీలుగా మార్చి వ్యాపారులకు అందించే శుద్ధి కార్ఖానాలు దేశవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి.
ఈ గోల్డ్‌స్క్రాప్ వ్యాపారంలో ఉన్న ప్రతాప్ సాలుంఖేకు దక్షిణభారతదేశంలోని కేరళలోనూ, తమిళనాడులోని తిరుచారాపల్లిలోనూ చిన్నపాటి శుద్ధి కార్ఖానాలు ఉన్నాయి.
ఈయన బంధువులకు కూడా దక్షిణ భారతదేశంలో అక్కడక్కడా ఈ బంగారుశుద్ధి కార్ఖానాలు ఉన్నాయి.
‘‘ప్రతి రోజూ మా కార్ఖానాలలో రెండు మూడు కిలోల బంగారాన్ని శుద్ధి చేస్తాం’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, World Gold Council
భారత్‌లో 25 వేల టన్నుల బంగారం
సాలుంఖే నడిపే కార్ఖానా తరహాలాంటివి భారతదేశంలోని ప్రతి పట్టణంలో కనీసం ఒకటైనా ఉంటుంది. దీనిని అసంఘటిత శుద్ధి రంగంగా పిలుస్తున్నారు.
మొత్తం మీద భారతీయ కుటుంబాల వద్ద 25 వేల టన్నుల పసిడి ఉందని అంచనా . వీటిల్లో కొంత భాగం ఎప్పుడూ విక్రయానికి సిద్ధంగా ఉంటుంది.
బంగారం ధరలు పెరిగి, ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారినప్పుడు ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మడం అక్కరకు వస్తుందని భావిస్తుంటారు.
నగల వ్యాపారులు తమవద్దకు వచ్చే పాత బంగారాన్ని వారే శుద్ధి చేయగలరు గానీ, తరచుగా వారు చిన్నపాటి కార్ఖానాలను ఈ పనికి ఎంచుకుంటారు. ఈ కార్ఖానాలు వాటిని శుద్ధి చేసి, బంగారుకడ్డీలుగా మార్చి అందిస్తాయి.
త్వరగా పని పూర్తి చేయడం, నగదును కూడా అంగీకరిస్తాం కాబట్టే నగల వ్యాపారులు మా లాంటి చిన్న కార్ఖానాలను ఎంచుకుంటారని సలుంఖే చెప్పారు.
‘‘మేం ప్రతి చిన్నపట్టణంలో చిన్న చిన్న యూనిట్లుగా విస్తరించి ఉండటం వల్ల చాలామంది నగల వ్యాపారులు మా వద్ద నుంచి బంగారం కొనడానికి ప్రాధాన్యమిస్తారు. మావద్ద ఓ నగల వ్యాపారి కొన్ని గంటల్లోనే తన నగలను శుద్ధి చేయించుకోగలుగుతారు. కానీ పెద్ద పెద్ద రిఫైనరీలు ఈ పనికి రోజులు తీసుకుంటాయి’’ అని సలుంఖే వివరించారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరాల మేరకు 2023లో భారత్‌లో 9000 టన్నుల బంగారాన్ని శుద్ధి చేస్తే ఇందులో 117 టన్నుల రీసైకిల్ వనరుల నుంచే వచ్చాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పెద్ద కంపెనీల రాక
రీ సైక్లింగ్ మార్కెట్ పై ఇప్పుడు ఇండియాలోని బడా పారిశ్రామిక గోల్డ్ రిఫైనరీలు కన్నేశాయి.
ఈ బడా కంపెనీలు ఇటీవల కాలంలో బాగా విస్తరించాయి. తాము దిగుమతి చేసుకునే శుద్ధి చేయని బంగారంపై దిగుమతి సుంకాల అనుకూలత కారణంగా వీటి విస్తరణ పెరుగుతోంది.
2013 – 2021 మధ్య కాలంలో భారతదేశంలోని భారీ బంగారం రిఫైనరీలు తమ సామర్థ్యాన్ని ఏడాదికి 300 నుంచి 1,800 టన్నులకు పెంచుకున్నాయి.
కానీ వీరు తమ రిఫైనరీలు నడపడానికి కావాల్సినంత శుద్ధి చేయని బంగారాన్ని దిగుమతి చేసుకోవడం కష్టసాధ్యంగా ఉంది. నిజానికి ఈ రిఫైనరీల సామర్థ్యం 50 శాతం కన్నా తక్కువగా ఉపయోగిస్తున్నామని అసోసియేషన్ ఆప్ గోల్డ్ రిఫైనరీస్ అండ్ మింట్స్ కార్యదర్శి హర్షద్ అజ్మీరా చెప్పారు.
దీంతో పెద్ద పెద్ద రిఫైనరీలు నగరాలలో స్క్రాప్ కలెక్షన్ కేంద్రాలను తెరిచి, తాము సేకరించే స్క్రాప్ గోల్డ్ ను నాణ్యమైన బంగారు కడ్డీలుగా మార్చాలని చూస్తున్నాయి.
‘‘ప్రస్తుతానికి గోల్డ్ రీసైక్లింగ్ అసంఘటిత రంగంలో ఎక్కువగా జరుగుతోంది. ఈ పరిస్థితి మారాలి’’ అని అజ్మీరా చెప్పారు.

ఫొటో సోర్స్, World Gold Counci
బంగారు శుద్ధికి ఇండియా ప్రపంచ కేంద్రంగా మారాలని ఆయన ఆశిస్తున్నారు. అంటే శుద్ధి చేయని బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకోవాలని, పెద్ద సంస్థలు బంగారం రీసైక్లింగ్ చేపట్టాలని అజ్మీరా కోరుకుంటున్నారు.
‘‘బంగారం రిఫైనరీ, రవాణాలో స్విజ్జర్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా ఉంది. ఇండియా కూడా అదే స్థాయులో ఉండాలని మేం కోరుకుంటున్నాం’’ అని అజ్మీరా చెప్పారు.
భారతదేశంలో బంగారు శుద్ధిలో సీజీఆర్ మెటాల్లోయస్ ముందుంది. ఏటా ఈ కంపెనీ 150 టన్నుల బంగారాన్ని శుద్ధి చేస్తోంది.
ఇతర పెద్ద సంస్థల్లానే ఇది బంగారాన్ని కరిగించి శుద్ధి చేసే ఆధునిక యంత్రాలను కలిగి ఉంది. ఇది అత్యున్నతస్థాయి నాణ్యమైన బంగారాన్ని ఇవ్వడమే కాదు పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది.
‘శుద్ధి చేసిన బంగారం అత్యున్నత కచ్చితత్త్వాన్ని, బంగారాన్ని లెక్కించే వివిధ పద్ధతుల ద్వారా విశ్లేషిస్తారు’’ అని జేమ్స్ జోస్ చెప్పారు. ఆయన సీజీఆర్ మేనేజింగ్ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
కేరళలో ఈ కంపెనీ మూడు రీసైక్లింగ్ కేంద్రాలను తెరిచింది. ‘‘ఇండియాలోని శుద్ధి కర్మగారాలకు భారీ సామర్థ్యాలు ఉన్నాయి. అందువల్ల కలెక్షన్ కేంద్రాలను నెలకొల్పడం వల్ల వీటి ఉత్పత్తి సామర్థ్యం 30 నుంచి 40 శాతానికి పెరుగుతుంది’’ అని జోస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Satish Salunke
ఇటీవల కాలంలో బంగారు శుద్ధి పరిశ్రమపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2020లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) గోల్డ్ బార్స్ కు వాటి స్వచ్ఛత, బరువు, వాటి కొలతల విషయంలో సరికొత్త ప్రమాణాలను ప్రవేశపెట్టింది. బీఐఎస్ ఆమోదించిన రిఫైనరీలు తమ బంగారు కడ్డీలను మార్కెట్లో విక్రయించుకోవచ్చు.
బీఐఎస్ లైసెన్స్ లు పొందిన రిఫైనరీలు క్రమంగా ఈ పరిశ్రమను సమర్థత దిశగా నడిపిస్తున్నాయి. బీఐఎస్ శుద్ధి చేసిన బంగారానికి ప్రమాణాలు నిర్దేశించడం వల్ల ఇండియా ఈ రంగంలో ప్రపంచ కేంద్రంగా మారనుంది’’ అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ పీఆర్ సోమసుందరం చెప్పారు.
చిన్నపాటి బంగారు శుద్ధి కర్మాగారాలు తమ పట్టు కోల్పోతున్నట్టు కొన్ని లెక్కలు చెబుతున్నాయి. మెటల్ ఫోకస్ కన్సల్టెన్సీ ప్రకారం 2015లో 70 నుంచి 75 శాతం రీసైక్లింగ్ పరిశ్రమ అసంఘటితంగా ఉంటే 2021 నాటికల్లా ఈ సంఖ్య 60 నుంచి 65 శాతానికి తగ్గింది.
అయితే పెద్ద సంస్థల విస్తరణ తమకేమీ ఆందోళన కలిగించడం లేదంటారు సలుఖే. తమ కస్టమర్లు ఎవరో తమకు తెలుసంటారు ఆయన.
‘‘ స్థానిక నగల వర్తకులు పెద్ద కంపెనీలు వసూలు చేసే రీసైక్లింగ్ చార్జీలు చెల్లించడానికి ఇష్టపడటం లేదు. ఈ చార్జీలు మేం వసూలు చేసే వాటికంటే చాలా ఎక్కువగా ఉంటున్నాయి’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














