అఫ్గానిస్తాన్ : ‘ఇప్పుడు కాన్పుకు వెళితే నేను, నా బిడ్డ బతుకుతామో లేదో తెలియదు’

ఫొటో సోర్స్, Dr Najmussama Shefajo
- రచయిత, సయ్యద్ అన్వర్, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
అఫ్గానిస్తాన్‌లో అనేక ఆసుపత్రులు తమ ప్రసూతి వార్డులను మూసివేస్తుండటంతో ఈ మధ్యే గర్భవతులైన మహిళలు ఆందోళన చెందుతున్నారు.
ఆరోగ్య సేవలు తగినంతగా అందుబాటులో లేకపోవడంతో గర్భవతులైన అనేకమంది మహిళలకు కనీసం నాలుగుసార్లు వైద్యులను సంప్రదించేందుకు ఉన్న అవకాశం కూడా ఇప్పుడు లేకుండా పోయింది.
“నా రెండో బిడ్డకు జన్మనివ్వాలంటే భయంగా ఉంది. ఎందుకంటే అది నా ప్రాణం లేదా నా బిడ్డ ప్రాణం తియ్యవచ్చు” అని దక్షిణ బదక్షాన్ ప్రావిన్స్‌కు చెందిన ఆరు నెలల గర్భిణి ఫర్కుందా చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తున్న 60 పడకల మెటర్నిటీ ఆసుపత్రిలో ఆమె తన బిడ్డకు జన్మనివ్వాలని అనుకున్నారు. అయితే ఈ ఆసుపత్రిలో ప్రసూతి వార్డును జులైలో మూసేశారు.
“మొదటి బిడ్డను కన్నప్పుడు సిజేరియన్ విభాగం సాయం చేసింది. ఈసారి ఏం జరుగుతుందో నాకు తెలియదు. చాలా భయంగా ఉంది” అని ఫర్కుందా అన్నారు.
ఫర్కుందా లాంటి యువతులు బీబీసీకి చెబుతున్న దాన్నిబట్టి అఫ్గానిస్తాన్‌లో మెటర్నిటీ కేర్ మీద ఒత్తిడి పరిమితిని దాటి పెరిగింది.


క్రిటికల్ మెటర్నిటీ కేర్ సౌకర్యాలు ఎక్కడ?
‘ప్రసవించడానికి ప్రమాదకరమైన ప్రాంతం’గా బదక్షాన్‌కు స్థానికంగా గుర్తింపు ఉంది. పర్వత ప్రాంతాల్లోని మహిళలకు అవసరమైన వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇక్కడకు చేరుకోవడం చాలా కష్టం.
తగినన్ని నిధులు లేకపోవడంతో అక్కడున్న హాస్పిటల్‌లో మెటర్నిటీ వార్డును మూసేయడం తప్ప, వేరే దారి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ బీబీసీతో చెప్పింది.
ఈ ఆసుపత్రిని మూసివేయడానికి ముందు “ఇందులో ప్రతీ రోజూ 15 సిజేరియన్ ఆపరేషన్లు జరిగేవి” అని ఈ మెటర్నిటీ యూనిట్‌లోని పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు బీబీసీతో చెప్పారు.
ఈ ఆసుపత్రిలో ఎప్పుడూ పరిమితికి మించి మహిళలు వస్తుంటారు. ఇందులో ఒక్కో మంచం మీద నలుగురు మహిళలు ఉంటారు. తమకు వైద్యుల నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు.
“ఈ ఆసుపత్రిలో హిస్టరెక్టమీ, సిస్టెక్టమీ లాంటి ఇతర ఆపరేషన్లు కూడా చేస్తారు” అని అధికారి ఒకరు చెప్పారు.
బదక్షాన్‌లో ఇప్పుడు నడుస్తున్న ఏకైక మెటర్నిటీ ఆసుపత్రికి అగాఖాన్ స్వచ్ఛంద సంస్థ నిధులు అందిస్తోంది. ఇద్దరు స్పెషలిస్టులు, నలుగురు డాక్టర్లు ఉన్న ఈ 30 పడకల ఆసుపత్రి, ఇక్కడికి వచ్చే గర్భవతుల సంఖ్య పెరగడంతో ఇబ్బందులు పడుతోంది.
కుందుజ్ ప్రాంత ప్రజలు హాస్పిటల్‌కు వెళ్లాలంటే ఐదు గంటలు ప్రయాణించాలి. ఫర్కుందా మాదిరిగా అందరూ అద్దె కారులో వెళ్లలేరు. ఎందుకంటే వాళ్లంతా పేదలు. ఆమె వద్ద డబ్బు ఉన్నప్పటికీ కుందుజ్‌లోని ఆసుపత్రిలో ఆమెకు అడ్మిషన్ దొరికి వైద్యం అందుతుందనే గ్యారంటీ లేదు. ఈ ఆసుపత్రిలో ఇప్పటికే పరిమితికి మించి ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న మరణాల సంఖ్య
అఫ్గానిస్తాన్‌లో 2020లో ప్రసూతి మరణాల సంఖ్య లక్షకు 620 అని యూనిసెఫ్ రిపోర్టు చెబుతోంది. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇది మూడురెట్లు ఎక్కువ.
“ప్రపంచంలో ఒక శిశువు, బిడ్డ, లేదా తల్లికి అఫ్గానిస్తాన్ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. ఆసుపత్రి లేదా ఆరోగ్య కేంద్రం సదుపాయం వారికి అందుబాటులో ఉండదు” అని యూనిసెఫ్ రిపోర్ట్ చెబుతోంది.
2023లో ప్రతి వెయ్యి శిశువుల్లో 34 మరణాలు నమోదయ్యాయి.
ప్రసూతి మరణాలతో పోలిస్తే శిశు మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోందని అఫ్గానిస్తాన్‌లోని ఐదో పెద్ద నగరమైన జలాలాబాద్‌కు చెందిన డాక్టర్ ఒకరు చెప్పారు.
“నెలలు నిండక ముందే పుట్టిన శిశువులను ఉంచేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో సదుపాయాలు లేవు. ప్రసవ సమయంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి మా వద్ద సరిపడా సౌకర్యాలు లేవు” అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నర్సుల కొరత
అఫ్గానిస్తాన్‌లో ప్రతీ మూడో మహిళ ఆరోగ్య కేంద్రాల బయట బిడ్డకు జన్మనిస్తోందని యూనిసెఫ్ తాజా రిపోర్ట్ వెల్లడించింది. తాలిబాన్లు విధించిన సామాజిక ఆంక్షల వల్ల హెల్త్ వర్కర్లు ప్రయాణించడం కష్టంగా మారింది. దీంతో అనేకమంది మహిళలు ప్రసవ సమయంలో తమ బంధువుల్లోని మహిళలు, చుట్టు పక్కల ఉన్న వారి మీద ఆధారపడుతున్నారు.
“ఈ ప్రాంతంలో ప్రసూతి సేవలు లేకపోవడం వల్ల కొంతమంది మహిళలు ఇంటివద్దనే ప్రసవిస్తున్నారు. వైద్యపరమైన సహకారం లేకుండా పిల్లల్ని ఇలా కనడం ఆరోగ్య ప్రమాణాలకు వ్యతిరేకం” అని కాందహార్ ప్రాంతంలోని ఒక నర్సు చెప్పారు.
“గ్రామస్తులు ఒక మహిళను తీసుకొచ్చారు. ఆమె రాత్రి రెండు గంటలకు బిడ్డను కన్నారు. అయితే ఆమె నుంచి ప్లాసెంటా(మాయ) బయటకు రాలేదు” అని ఆమె చెప్పారు.
ఆ కుటుంబం ఉదయం వరకు వేచి చూసి, తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
“అప్పటికే ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఆ నొప్పి నుంచి విముక్తి కల్పించేదుకు మా శాయశక్తులా ప్రయత్నించాం” అని ఆమె చెప్పారు.
ఈ కేసులో కాస్త ఆలస్యమైనా ఆమెకది ప్రాణాంతకంగా మారేదని ఆ నర్సు చెప్పారు.
శారీరక, మానసిక హింస...

ఫొటో సోర్స్, Dr Najmussama Shefajo
అఫ్గానిస్తాన్‌లో కేవలం కొద్దిమంది మహిళలు మాత్రమే ఆసుపత్రి ఫీజుల్ని భరించగలిగే స్థాయిలో ఉన్నారు.
కాబూల్‌లోని షెఫజో ప్రైవేట్ క్లినిక్‌లోని వెయిటింగ్ రూమ్‌లో 35 ఏళ్ల ముస్ర్‌సల్‌ను కలిసింది బీబీసీ. ఆమెకు ఏడుసార్లు గర్భస్రావమైంది. 20 ఏళ్ల హమిదాకు నాలుగుసార్లు గర్భస్రావమైంది. వాళ్లింకా భయపడుతూనే ఉన్నారు.
“బిడ్డను కోల్పోయిన ప్రతీసారి, నాకు నా జ్ఞాపక శక్తిలో సగం పోగొట్టుకున్నట్లు అనిపించేది. నా జుట్టులో సగం ఊడిపోయేది. బిడ్డను కోల్పోయినప్పడల్లా మానసిక సమస్యలు ఎదురయ్యేవి” అంటూ శారీరకంగా అలసిపోయి, భావోద్వేగంతో ఉన్న ముస్ర్‌సల్ కన్నీటిపర్యంతం అయ్యారు.
“మంచి పౌష్టికాహారం లేకపోవడం, బరువులు ఎత్తడం వల్ల గర్భస్రావమైనట్లు వైద్యులు చెప్పారు” అని ముస్ర్‌సల్ వెల్లడించారు.
అనేక మంది అఫ్గాన్ మహిళల మాదిరిగా కాకుండా ముస్ర్‌సల్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు.
‘‘పౌష్టికాహారం తీసుకుంటాను. పైగా శారీరకంగా కష్టమైన పనులేమీ ఉండవు” అని ఆమె చెప్పారు.
హమిదా పొడవాటి సిల్కు గౌను ధరించి క్లినిక్‌లోకి వచ్చారు. ఆమె గోళ్లకు ఎర్రటి నెయిల్ పాలిష్ వేసుకున్నారు. మొహానికి ఎలాంటి వస్త్రాలు కప్పుకోలేదు.
“నాకు ఆరు నెలల కిందట గర్భస్రావమైంది. ఆ తర్వాత నేను కాందహార్, క్వెట్టా, చమన్‌లోని వైద్యులను కలిశాను” అని హమిదా వెల్లడించారు.
క్వెట్టా, చమన్ నగరాలు పాకిస్తాన్‌లో ఉన్నాయి. కాందహార్‌లో డాక్టర్లు ఆమెకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించి ఒక టీకా వేసుకోవాలని సూచించారు. ముస్ర్‌సల్ మాదిరిగానే హమిదా కూడా గర్భం దాల్చాలనే తపనతో ఉన్నారు.
హమిదా 16 ఏళ్ల వయసులోనే బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ పిల్లలు లేకపోవడంతో చాలామంది ఆమెను కించపరుస్తూ మాట్లాడుతుంటారు.
“పిల్లలు ఇంకా ఎందుకు పుట్టలేదని అడుగుతూ కొంతమంది నన్ను ఏడిపిస్తారు. ఇలాంటి మాటలు భరించడం నాకు చాలాకష్టంగా ఉంటుంది” అని ఆమె చెప్పారు.
ముస్ర్‌సల్, హమిదా రకరకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

ఫొటో సోర్స్, Dr Najmussama Shefajo
షెఫజో హాస్పిటల్ వ్యవస్థాపకురాలు, గైనకాలజిస్టు డాక్టర్ నజ్ముస్సమా షెఫజో పేషెంట్లే ముస్ర్‌సల్, హమిదాలు.
దేశంలో ఆరోగ్య సేవలు వేగంగా తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని డాక్టర్ షెఫజో చెప్పారు.
“మహిళా డాక్టర్లు, నర్సులు లేకపోవడం, ప్రత్యేక ఆసుపత్రులు, మందులు లేకపోవడం ప్రధాన కారణాలు. నిరక్షరాస్యత, ప్రజల్లో అవగాహన లేకపోవడం సమస్యకు కారణాలు” అని షెఫజో అన్నారు.
2021లో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత అనుభవజ్ఞులైన అనేక మంది మహిళా డాక్టర్లు విదేశాలకు వెళ్లిపోయారు. ఇటీవల క్వాలిఫై అయిన మహిళా గ్రాడ్యుయేట్లకు మెడికల్ లైసెన్స్ ఇవ్వడాన్ని కొత్త ప్రభుత్వం తిరస్కరించింది.
“మహిళా వైద్యుల కొరత పెరగడం వల్లే ఇలాంటి దారుణమైన పరిస్థితి వచ్చింది” అని షెఫజో చెప్పారు.
పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్లుగా ప్రభుత్వ ఆసుపత్రులు సేవలు అందించలేక పోతున్నాయని, అత్యవసర వైద్య సేవలు కూడా అందడం లేదని ఆమె అన్నారు.
“రక్తస్రావం అవుతున్న ముగ్గురు, నలుగురు మహిళలు ఒక బెడ్ మీద ఉండటాన్ని నేను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చూశాను. మరో ఆసుపత్రిలో ఐదుగురు శిశువుల్ని ఒకే ఇంక్యుబేటర్‌లో ఉంచారు” అని డాక్టర్ షెఫజో చెప్పారు.

ఫొటో సోర్స్, Dr Najmussama Shefajo
ఒకరి మీద ఒకరు ఆరోపణలు
గత పాలకుల వల్లనే ప్రసూతి వైద్య సౌకర్యాలు సరిగ్గా పని చెయ్యడం లేదని తాలిబాన్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి డాక్టర్ షరాఫత్ జమన్ అమర్ చెప్పారు.
“అఫ్గానిస్తాన్‌లో సుస్థిర వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు మాకు మద్దతు ఇచ్చేలా దాతలను ఒప్పించేందుకు మేము ప్రయత్నిస్తున్నాం” అని జమన్ అన్నారు.
అఫ్గాన్ ప్రజలకు దీర్ఘకాలంలో ఉత్తమ వైద్య సేవలు అందించగలిగే ప్రాజెక్టుల ఏర్పాటే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
ఆరోగ్య సేవల్ని మెరుగుపరిచేందుకు అంతర్జాతీయ నిధులతో పాటు దేశీయ బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించేలా తాము కృషి చేస్తున్నామని డాక్టర్ జమన్ అన్నారు. ఇది ఫలితాలనివ్వడానికి చాలా ఏళ్లు పడుతుందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Dr Sharafat Zaman Amar
ఇక్కడ బదక్షాన్‌లో ఫర్కుందా చాలా ఆందోళనలో ఉన్నారు. ఆమె అక్టోబర్‌లో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. ఆమె నిస్సహాయంగా భయంతో ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న 30 పడకల ఆసుపత్రిలో పేషెంట్లు పరిమితికి మించి ఉండటంతో వస్తున్న వారిని వెనక్కి పంపిస్తున్నారు.
ఆసుపత్రిలో అడ్మిషన్ దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఫర్కుందా చెప్పారు.
“ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లేందుకు నా దగ్గర కావలసినంత డబ్బు (సుమారు రూ. 30 వేలు) లేదు” అని ఆమె చెప్పారు.
తాలిబాన్లు విధించిన ఆంక్షల వల్ల ఇంట్లో ప్రసవం చేయించుకోవాల్సి వస్తే ఒక నర్సుని సాయంగా పెట్టుకోవడం అసాధ్యమని ఫర్కుందాకు తెలుసు.
“మహిళలు ఆసుపత్రుల్లోకి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. ప్రభుత్వం పట్టించుకోదు” అని ఫర్కుందా ఆందోళనతో కూడిన అసహనాన్ని వ్యక్తం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














