సైంటిస్ట్ అశ్విని: ‘ఒక కొత్తమొక్కను సృష్టించాలనుకుంది, కానీ...’

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
‘‘ఇద్దరూ ఫ్రెండ్స్‌లా ఉండేవారు. డాడీ అంటే ఆమెకు ఇష్టం. కూతురంటే ఆయనకు ఇష్టం. భగవంతుడు ఇద్దరినీ తీసుకుపోయాడు.”
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తాండాలో తన కొత్త ఇంటి పునాదుల పక్కనే వేసిన టెంట్‌లో కూతురు అశ్విని, భర్త మోతీలాల్ ఫోటోల ముందు కూర్చుని కన్నీరుపెట్టుకుంటూ అన్నారు నూనావత్ నేజా.
‘అందరినీ ఆదరించే మంచి మనసు. అలాంటి బిడ్డ మళ్లీ దొరకదు’ అంటూ నిర్వేదంలోకి వెళ్లిపోయారు నేజా. అప్పుడే పొరుగూరు నుంచి వచ్చిన బంధువులను చూసి ఒక్కసారిగా దుఃఖంలో మునిగిపోవడంతో బంధువులు ఆమెను ఓదార్చారు.
‘వారితోపాటు నేను కూడా పోతే బాగుండేది’ అన్నారు నేజా.


ఫొటో సోర్స్, BBC
ఆకేరు ప్రవాహంలో చిక్కుకుని...
సెప్టెంబర్ 1న తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెం బ్రిడ్జి కొంత భాగం ఆకేరు వాగు ప్రవాహానికి కొట్టుకుపోయింది.
అశ్వినీ, మోతీలాల్ ప్రయాణిస్తున్న కారు ఆ వంతెన మీద నుంచి వెళుతూ నీటి ఉధృతిలో గల్లంతయింది. తండ్రీ కూతుళ్లిద్దరూ మరణించారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్) అనుబంధంగా ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌లో నూనావత్ అశ్విని (26) ఏడాదిన్నర నుంచి శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.
చిన్నప్పటి నుంచి అశ్విని చదువుల్లో ప్రతిభ కనబరిచేవారు. అనేక బంగారు పతకాలు కూడా సాధించారు.
ఆమె స్ఫూర్తితో గంగారం తాండాలో చదువుకునే బాలికల సంఖ్య పెరిగిందని కుటుంబసభ్యులు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, BBC
నిశ్చితార్థం కోసం వచ్చి..
అన్న అశోక్ కుమార్ నిశ్చితార్థానికి అశ్విని రాయపూర్ నుంచి వారం రోజులు సెలవుపై వచ్చారు. సెప్టెంబర్ 2న తిరిగి విధులకు హాజరయ్యేందుకు ముందు రోజు (ఆదివారం, సెప్టెంబర్ 1 న) కారులో తండ్రి మోతీలాల్ తో కలిసి హైదరాబాద్ విమానాశ్రయానికి బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో పురుషోత్తమాయగూడెం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది.
“నా ఎంగేజ్‌మెంట్ కోసం ఇంటికొచ్చింది. ఆదివారం (సెప్టెంబర్1) ఉదయం 9.30 కు ఫ్లైట్ టిక్కెట్ బుక్ అయింది. తెల్లవారుజామున మూడు గంటలకు ఇంటినుంచి బయలుదేరారు. గంట తర్వాత బ్రిడ్జి వద్ద వరదనీటిలో కారు ఇరుక్కుపోయిందని వారి నుంచి ఫోన్ వచ్చింది. మరికొద్ది సేపటికే ప్రవాహం మెడ వరకు వచ్చేసినట్టు రెండోసారి కాల్ చేశారు. తర్వాత మేం వెళ్లి చూస్తే కారు కనబడలేదు. వారి ఫోన్లు కూడా పనిచేయలేదు’’ అని ఆరోజు ఘటనను బీబీసీకి వివరించారు అశోక్.
“మీరు వచ్చే వరకు ప్రాణాలతో మిగలం. ఇక్కడికి వచ్చి మా మృతదేహాల కోసం వెతకండి’’ అని ఫోన్‌లో తమకు చెప్పారని అశ్విని దగ్గరి బంధువు భావ్‌సింగ్ చెప్పారు.

‘కొత్త మొక్కను సృష్టించాలనుకుంది’
చిన్నతనం నుంచి అశ్విని చదువుల్లో ప్రతిభ కనబరిచారు. వ్యవసాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు.
“ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో బీఎస్సీ(అగ్రికల్చర్) కోర్సులో ఆరు గోల్డ్ మెడల్స్ సాధించింది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, దిల్లీలో గోల్డ్ మెడల్‌తో పీజీ పూర్తిచేసింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలోనే ఓపెన్ కేటగిరిలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్‌తో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో ఆమె ఫస్ట్ పోస్టింగ్’’ అని అశోక్ వివరించారు.
‘‘టెన్త్, ఇంటర్, యూజీ, పీజీ, పీహెచ్‌డీలో ఫస్ట్ ర్యాంక్, అన్నింటిలో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అంతగా వసతులు లేని మా మారుమూల గిరిజన తాండా నుంచి తను పెద్దస్థాయికి వెళ్లింది’’ అని అశోక్ అన్నారు.
మొక్కల జన్యుశాస్త్రం పై అశ్విని పరిశోధనలు చేశారు. పలు సైన్స్ జర్నల్స్‌లో ఆమె పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి.
జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ తనకు ఇష్టమైన సబ్జెక్ట్. శనగ, వేరు శనగ రెండింటినీ కలిపి ఒక కొత్త మొక్క సృష్టి కోసం ప్రయోగాలు చేస్తున్నానని, అది ఎక్కువ పోషకాలతో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తన చెల్లి చెప్పేదని అశోక్ బీబీసీతో చెప్పారు.
‘’అగ్రికల్చరల్ స్టడీస్‌లో అశ్విని గోల్డ్ మెడల్స్ తెస్తుంటే మాకు ఎం.ఎస్. స్వామినాథన్ గుర్తొచ్చేవారు. ఆమె బతికుంటే గొప్ప శాస్త్రవేత్త అయ్యేది’’ అని కారేపల్లి గ్రామానికి చెందిన ఐలయ్య అన్నారు.

ఫొటో సోర్స్, BBC
‘ఒకేసారి 20 చీరలు తెచ్చింది’
‘‘మేము కూలినాలి చేశాం. నా పిల్లలు బాగా చదువుకుని పైకిరావాలన్నది నా కోరిక. ఏ పరీక్షలో అయినా నా బిడ్డ ఫస్ట్ క్లాస్ వచ్చేది. తనకు పెద్ద ఉద్యోగం వస్తుందని చెప్పేది. చెప్పినట్టే రాసిన ఒకే ఒక పరీక్షతో పెద్ద జాబ్ తెచ్చుకుంది.’’ అని చెప్పారు నేజా.
కుటుంబం గురించి అశ్విని ఎంతో శ్రద్ద వహించేదని తల్లి నేజా అన్నారు. ‘మంచి జాబ్ వచ్చింది. ఇక కష్టాలన్నీ తీరిపోయినట్టే’ అని తన కూతురు చెప్పిన మాటలను ఆమె గుర్తు చేసుకున్నారు.
‘‘అమ్మా, బ్యాంకు లోన్ తీసుకుంటా. మంచి ఇల్లు కట్టుకోండి. ఇక నుండి మీరు కష్టపడవద్దు అనేది. నాకోసం ఒకేసారి 20 చీరలు కొనితెచ్చింది. ఈ చీర నీకు బాగుందమ్మా, ఈ డ్రెస్ నీకు బాగుంది నాన్నా అంటూ ఇద్దరిని కలిపి ఫోటోలు తీసి మురిసిపోయేది. రోడ్లు బాగున్నాయి కదా, కారులో తడవకుండా పోతుందని అనుకున్నా. ఇలా వరదలో కొట్టుకుపోతుందని ఊహించలేదు’’ అంటూ కొత్త ఇల్లు కోసం తీసిన పునాదుల దగ్గర కూర్చుని కూతురు, భర్త జ్ఞాపకాలతో కన్నీరు పెట్టుకున్నారు నేజా.

‘అశ్విని బాల్య వివాహాలను వ్యతిరేకించింది. మహిళలు కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని, తమకాళ్లపై నిలబడేలా వారు చదువుకోవాలన్న ఆలోచనలతో ఉండేది’ అని ఆమె అన్న అశోక్ చెప్పారు.
పెద్దగా చదువుకోని తన తండ్రికి ఉన్నత చదువుల పట్ల గౌరవభావం ఉండేదని, చదువులు జీవితాలను మారుస్తాయని చెప్పేవారని అశోక్ కుమార్ అన్నారు.
‘ఆడపిల్లలను చదివించాలన్నది మా నాన్న ఆలోచన. బాల్య వివాహాలు చేయద్దని చెప్పేవారు. చదువుల్లో మా చెల్లి ప్రతిభ తరచూ వార్తాపత్రికల్లో రావడం, ఆ తర్వాత శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించడం మా గ్రామస్తులపై ప్రభావం చూపింది. ఇప్పుడు మా గ్రామంలో ఆడపిల్లలను ఉన్నత చదువులవైపు ప్రోత్సహిస్తున్నారు’’ అని అశోక్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















