వర్షాలు, వరదల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మురారి రవికృష్ణ
- హోదా, బీబీసీ కోసం
తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.
విజయవాడ, ఖమ్మం, పలు ఇతర పట్టణాలు, గ్రామాలలో తీవ్ర నష్టం మిగిల్చిన వరదలు ఇంకా పూర్తిగా తగ్గక ముందే మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఈ పరిస్థితుల్లో ప్రజలు సురక్షితంగా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యలు, వర్షాలు కురుస్తున్నప్పుడు, ఆ తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షాకాలంలో వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలి.
చుట్టుపక్కల కాలువలు, చెరువులు ఉంటే వాటిలోని నీటి మట్టాన్ని గమనించడం, ఇంట్లో అవసరమైన వస్తువులను సిద్ధంగా ఉంచుకోవడం వంటి చర్యలతో తమకు సహాయం అందేవరకు జాగ్రత్తగా ఉండవచ్చు.
ఇటీవలి వర్షాలకు పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను, ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి సందర్భంలో వర్షాకాలంలో, వరదల సమయంలో మీరు చేయాల్సిన, చేయకూడని పనులేమిటో చూద్దాం..


ఫొటో సోర్స్, Getty Images
ఈ జాగ్రత్తలు పాటించండి
- అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసి ఉంచుకోండి.
- వాతావరణ అప్‌డేట్స్ కోసం రేడియో వినండి, టీవీ చూడండి, వార్తాపత్రికలను చదవండి, అధికారిక వాతావరణ బులెటిన్స్ చూడండి.
- కొన్ని రోజుల వరకు సరిపడేలా అత్యవసరమైన మందులను తెచ్చి ఇంట్లో ఉంచుకోండి
- మీ పత్రాలు, సర్టిఫికేట్లు, విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ బ్యాగ్‌లలో ఉంచండి
- కనీసం ఒక వారానికి సరిపడేలా తగినన్ని ఆహారపదార్థాలను, నీటిని నిల్వ చేసుకోండి
- వర్షాలు తగ్గినా కొద్ది రోజుల పాటు వేడిచేసిన/క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగండి
- మీ సమీపంలోని కాలువలు, చెరువులు, డ్రైనేజీ ఛానల్స్ లాంటి వరద వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల గురించి తెలుసుకోండి
- ఏదైనా బహిరంగ కాలువలు లేదా మ్యాన్‌హోల్‌ల వద్ద స్పష్టంగా కనిపించేలా ఏవైనా సంకేతాలు ఉంచండి (ఉదా: ఎరుపు జెండాలు లేదా బారికేడ్లు)
- నీళ్లలో వెళ్లాల్సి వస్తే, ఒక కర్రను తీసుకుని, నీటి లోతు చూసిన తర్వాతే అక్కడ అడుగు పెట్టండి
- మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి క్రిమిసంహారకాలను ఉపయోగించండి.
- వరదలకు ఇంట్లో నీరు చేరితే మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేయండి, విద్యుత్ ఉపకరణాలను అన్‌ప్లగ్ చేయండి, గ్యాస్ కనెక్షన్‌ను ఆఫ్ చేయండి
- పశువులు/జంతువులను షెడ్‌లో ఉంచండి, వాటిని తాళ్లతో కట్టేయకండి
- మీకు సమయం ఉంటే, విలువైన వస్తువులను పైఅంతస్తుకు తరలించండి
- మీ ప్రాంతంలోని హెల్ప్ లైన్ నెంబర్లను ఫోన్‌లో సేవ్ చేసుకోండి. అది మీకు అవసరం లేకున్నా, అవసరమైన వాళ్లకు ఉపయోగపడవచ్చు
- అత్యవసర సమయంలో సంప్రదించడానికి మీకు దగ్గరలో ఉన్న ఆసుపత్రి నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోండి
- వరద ముప్పు ఉన్న ప్రాంతాలలో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్/ఎమర్జెన్సీ కిట్‌ను సిద్ధంగా ఉంచుకోండి
- వర్షాలు తగ్గిన తర్వాత మలేరియా వంటి వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి తప్పనిసరిగా దోమతెరలను ఉపయోగించండి

ఈ పనులు అస్సలు చేయొద్దు
- వరద నీళ్లలోకి వెళ్లొద్దు. ముఖ్యంగా పిల్లలను ప్రవహించే నీళ్లకు దూరంగా ఉంచండి
- వరద నీటిలో నడవకండి లేదా డ్రైవ్ చేయకండి. రెండు అడుగుల లోతున్న వరద నీటి ప్రవాహానికి పెద్ద కార్లు కూడా కొట్టుకుపోతాయి.
- వరదల సమయంలో, విద్యుత్తు అంతరాయాలకు అవకాశం ఉంటుంది కాబట్టి లిఫ్ట్‌కు బదులు మెట్లను ఉపయోగించండి. సుదీర్ఘ విద్యుత్ అంతరాయాలు ఏర్పడినా, చుట్టూ నీళ్లు వచ్చేసినా లిఫ్ట్‌లలో చిక్కుకుని బయటకు రాలేని పరిస్థితి ఏర్పడొచ్చు.
- మీరు తడిగా లేదా నీళ్లలో నిలబడి ఉంటే విద్యుత్ పరికరాలను తాకవద్దు
- మురుగు కాలువలు, కల్వర్టులు మొదలైన వాటికి దగ్గరగా వెళ్లవద్దు
- నీటి లైన్లు / మురుగు నీటి పైపులు దెబ్బ తిని ఉంటే టాయిలెట్ లేదా పంపు నీటిని ఉపయోగించవద్దు
- సోషల్ మీడియాలో వచ్చే వార్తలను వెంటనే నమ్మేయవద్దు, వాటిని నిర్ధరించుకున్న తర్వాతే ఏం చేయాలో నిర్ణయించుకోండి.
- అలాగే సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్‌లను వెంటనే ఫార్వర్డ్ చేయకండి. అవి నిజం కాని పక్షంలో వాటి వల్ల ఇతరులు అనవసరంగా ఆందోళనకు గురవుతారు.
- వర్షాలు పూర్తిగా తగ్గేవరకు పిల్లలను స్కూళ్లకు పంపకండి.
‘వీళ్లంతా మరింత అప్రమత్తంగా ఉండాలి’
కాగా తుపాన్లు, వర్షాలు, వరదల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సింది ఎవరనేది విశాఖపట్నం తుపాన్ హెచ్చరిక కేంద్రం ఎండీ కేవీఎస్ శ్రీనివాస్ ‘బీబీసీ’కి వివరించారు.
భారీ వర్షాలు, వరదల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అందరికంటే ఎక్కువ ముందుజాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
పాత భవనాలలో ఉండేవాళ్లు వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు.
కుంగే స్వభావం ఉన్న నేల, ప్రదేశంలో ఆవాసాలు ఉన్నవారు.. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలలో నివసించేవారు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
తుపాన్లు వచ్చే సమయంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికలు ఫాలో కావడం వల్ల చాలావరకు ప్రమాదాలు తప్పుతాయని అన్నారు.
(ఆధారం: నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, భారత వాతావరణ శాఖ, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














