ఏపీ, తెలంగాణ వరదలు: సహాయక చర్యల కోసం రెండు ఎయిర్‌ఫోర్స్ విమానాలు, వాటిలో ఏమున్నాయంటే..

విజయవాడకు భారత వాయుసేన విమానాలు

ఫొటో సోర్స్, X/ Indian Air Force

వరద ప్రభావిత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సహాయక చర్యల కోసం భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) రెండు విమానాలను పంపిందని వార్తా సంస్థ ఏఎన్‌ఐ వెల్లడించింది.

హల్వారా, భటిండాల నుంచి రెండు విమానాలను విజయవాడ, శంషాబాద్‌లకు పంపించారు.

వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ చేస్తోన్న ప్రయత్నాలకు మద్దతుగా ఈ విమానాల్లో 200 మందికి పైగా ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు టన్నుల కొద్దీ సహాయక సామగ్రిని పంపించినట్లు ఎయిర్ ఫోర్స్ మీడియా కో ఆర్డినేషన్ సెంటర్ వెల్లడించింది.

Indian Air Force

ఫొటో సోర్స్, Indian Air Force

242 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు, 30 టన్నుల సహాయక సామాగ్రిని రెండు విమానాల్లో పంపినట్లు భారత వాయుసేన ‘ఎక్స్‌’లో తెలిపింది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం పలు హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, TDP

ఫొటో క్యాప్షన్, విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు

పడవలో పర్యటించిన సీఎం చంద్రబాబు

సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలోని వేర్వేరు ప్రదేశాలకు పడవలో వెళ్లి బాధితులను పరామర్శించారు.

‘‘పరిస్థితులను చక్కదిద్దుతున్నాం. ప్రస్తుతం 110 పడవల ద్వారా ఆహార సరఫరా, వైద్య సహాయం వంటి సేవలు అందిస్తున్నాం. వరదలను నిరంతరం పర్యవేక్షిస్తున్నా.

క్షేత్ర స్థాయిలో అధికారులు చురుగ్గా పనిచేస్తున్నారు. అనేక వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి పర్యటిస్తున్నా. ప్రజలంతా ధైర్యంగా ఉండాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో కమాండ్, కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం’’ అని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

విజయవాడతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల జనజీవనానికి కలుగుతున్న ఇబ్బందుల పట్ల ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వ అధికారుల సహాయంతో బయటకు రావాలని కోరారు.

‘‘ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నవారు సమాచారాన్ని ప్రభుత్వ అధికారులకు అందించాలి. అప్పుడే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వారిని కాపాడగలుగుతాయి’’ అని అన్నారు.

రెడ్‌క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇతర ఎన్జీవోలు ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ సహాయక కార్యక్రమాల్లో, ఆహారం- ఔషధాల పంపిణీ వంటి అత్యవసర సేవల్లో చురుకుగా పాల్గొనాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం వరదలు
ఫొటో క్యాప్షన్, ఖమ్మంలోని ప్రకాశ్ నగర్‌లో వరదలు

ఖమ్మం అతలాకుతలం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాలతో ఖమ్మం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇంతటి వరదల్ని ఎప్పుడూ చూడలేదని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గత 30 ఏళ్లలో ఇలాంటి వరదలు ఎప్పుడూ రాలేదని అన్నారు.

‘‘జిల్లాలో 200 మి.మీ వర్షం కురవడంతో గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంత భారీ వరదల్ని ఎదుర్కొంటున్నాం. గత రెండు రోజులుగా ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇతరులు తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాం. ఈ చర్యల కారణంగానే చాలా మంది ప్రాణాలను కాపాడగలిగాం’’ అని ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

‘‘పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, వరద బాధితులకు అవసరమైన చర్యలన్నీ తీసుకునే దిశగా పనిచేస్తున్నాం. ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, ఆహార ధాన్యాలు, వృద్దులు, వికలాంగులపై దృష్టి సారించాం. ప్రజలు ఆందోళన చెందవద్దు. ఈ భారీ వరదల కారణంగా చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం తరపున ప్రజలకు కావాల్సిన అన్ని సేవలు అందేలా చూస్తాం’’ అని ముజమ్మిల్ ఖాన్ చెప్పారు.

భారీ వర్షాల కారణంగా ప్రకాశ్ నగర్, ఖమ్మంలలో మున్నేరు నది ఉప్పొంగింది. నివాస ప్రాంతాలను వరద ముంచెత్తింది.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, FB/revanthofficial

ఫొటో క్యాప్షన్, ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు

వరద బాధిత జిల్లాలకు తక్షణ సాయం కింద రూ. 5 కోట్లు

వరద ప్రభావిత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యపేట జిల్లాలకు తక్షణ సాయం కింద రూ. 5 కోట్ల చొప్పున ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

వరదల్లో పశువులు, మేకలు, గొర్రెలను కోల్పోయినవారికి కూడా పరిహారాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో వరదలు

11 జిల్లాలకు భారీ వర్ష సూచన

రేపు (సెప్టెంబర్ 3) కూడా తెలంగాణలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు.

రానున్న 24 గంటలలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరం భీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపెల్లి, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి, పునరావాస, సహాయక చర్యలను సమీక్షించారు.

భారీ వర్షాలు కురిసే అవకాశమున్న ఈ జిల్లాల కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ఏవిధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.

స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం జిల్లా కలెక్టర్లే నిర్ణయించుకోవాలన్నారు.

స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్‌ను ఆదేశించారు. నిర్మల్‌కు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపుతున్నామని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)