మఖానాను ఎలా పండిస్తారు? ఇది ఎలా ‘సూపర్‌ఫుడ్’ అయింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రీతి గుప్తా
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
తన తండ్రి, తాతల్లాగే, ఒకప్పుడు ఫూల్ దేవ్ షాహ్ని జీవనోపాధి కోసం రోజూ చెరువులోకి దిగాల్సి వచ్చేది.
"నేను రోజూ 7 నుంచి 8 అడుగుల లోతు నీళ్లలో మునిగేవాడిని. తొమ్మిది, పది నిమిషాల తర్వాత ఊపిరి పీల్చుకోవడానికి నీళ్ల పైకి వచ్చేవాడిని" అని బిహార్‌కు చెందిన షాహ్ని వివరించారు.
ఆయన ఆ మురికి నీళ్లలోంచి తామర గింజలను బయటికి తీసుకొచ్చేవారు.
ఈ గింజలను మఖానా లేదా ఫాక్స్ నట్స్ అని పిలుస్తారు. వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. విటమిన్ బి, ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. కొందరు వీటిని ‘సూపర్ ఫుడ్’గా పేర్కొంటారు.
మఖానాను ఎక్కువగా స్నాక్‌లా తింటుంటారు. పలు రకాల వంటకాలలోనూ ఉపయోగిస్తారు.


ఫొటో సోర్స్, Dhirendra Kumar
ప్రపంచంలోని 90% మఖానా బిహార్ రాష్ట్రంలోనే సాగవుతోంది.
పెద్దగా, గుండ్రంగా ఉండే ఈ మొక్క ఆకులు నీటిపై తేలుతుంటాయి. కానీ గింజలు నీటి అడుగున కాయలలో ఏర్పడతాయి. వాటిని సేకరించడం చాలా శ్రమతో కూడుకున్న పని.
"నీటిలో అడుగుకు వెళ్లినప్పుడు చెవులు, కళ్లు, ముక్కు, నోటిలోకి బురద వెళుతుంది. దీని వల్ల చాలామందికి చర్మ సమస్యలు వస్తాయి. అలాగే ఈ మొక్క అంతటా ముల్లులు ఉంటాయి. ఆ గింజలను తీసే సమయంలో ఒళ్లంతా కోసుకుపోతుంది” అని షాహ్ని చెప్పారు.
అయితే, ఇటీవలి కాలంలో రైతులు మఖానా సాగు విధానాన్ని మార్చారు. ఈ మొక్కలను ఇప్పుడు పొలాల్లో, లోతు తక్కువ ఉండే నీటి కుంటల్లో పెంచుతున్నారు. అడుగు లోతు ఉండే నీటిలోనూ సాగు చేస్తున్నారు.
"ఇది ఇప్పటికీ చాలా కష్టమైన పనే. కానీ ఇది మాకు సంప్రదాయ వృత్తి. అందుకు నేను గర్వపడతాను. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మా అబ్బాయిలలో ఒకరు ఈ పొలంలో పని చేసే వారసత్వాన్ని కొనసాగించేలా చూస్తాను’’ అని షాహ్ని అన్నారు.

ఫొటో సోర్స్, Madhubani Makhana
తామర గింజల సాగు విధానంలో వచ్చిన మార్పుల వెనుక ఉన్న ప్రముఖుల్లో డాక్టర్ మనోజ్ కుమార్ ఒకరు.
లోతైన చెరువుల్లో వీటి సాగును విస్తరించడం కష్టమని ఆయన పదేళ్ల క్రితమే గ్రహించారు.
ప్రస్తుతం నేషనల్ రీసర్చ్ సెంటర్ ఫర్ మఖానా (ఎన్‌ఆర్‌సీఎమ్)లో సీనియర్ సైంటిస్ట్‌గా ఉన్న మనోజ్ కుమార్, నీరు తక్కువ లోతు ఉండే పొలాల్లోనూ ఈ పంటను సాగు చేసే విధానాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
గత నాలుగైదు సంవత్సరాలుగా ఆ టెక్నిక్‌ను చాలా మంది అమలు చేస్తున్నారు.
"మా ఆవిష్కరణలతో తామర గింజల సాగు ఇప్పుడు మామూలు భూమిలో పండించే పంటలలాగే చాలా సులువైంది. ఈ పంటకు ఇప్పుడు ఒక అడుగు లోతు నీరు ఉంటే చాలు. దీని వల్ల రైతులు లోతైన నీళ్లలో గంటల తరబడి పని చేయాల్సిన అవసరం ఉండదు" అని మనోజ్ కుమార్ వివరించారు.
ఆయన పని చేస్తున్న సంస్థ తామర విత్తనాలపై చాలా ప్రయోగాలు చేసింది. మరింత మెరుగైన, అధిక దిగుబడి ఇచ్చే వంగడాన్ని అభివృద్ధి చేసింది. ఇది రైతుల ఆదాయాన్ని మూడు రెట్లు పెంచిందని మనోజ్ కుమార్ చెప్పారు.
బిహార్‌లో వరదలు, అనిశ్చిత వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడంలో కొంతమంది రైతులకు మఖానా సాగు ఉపయోగపడిందని ఆయన తెలిపారు.
ఇప్పుడు మఖానా సాగును మరింత సులభతరం చేసే యంత్రాలను అభివృద్ధి చేయడంపై ఎన్‌ఆర్‌సీఎం పని చేస్తోంది. ఈ సంస్థ ఆవిష్కరణలు చాలా మంది రైతులను ఆకర్షిస్తున్నాయి.
2022లో 35,224 హెక్టార్లలో (87,000 ఎకరాలు) మఖానా సాగు చేశారు. అంతకు ముందు 10 ఏళ్ల కిందటితో పోలిస్తే ఈ సాగు విస్తీర్ణం దాదాపు మూడింతలు పెరిగింది.

ఫొటో సోర్స్, Phool dev Shahni
ఇటీవల ఇతర పంటల నుంచి మఖానా సాగు వైపు మళ్లిన రైతులలో ధీరేంద్ర కుమార్ ఒకరు.
"గతంలో మేం ఎప్పుడూ గోధుమలు, కందులు, ఆవాలు పండించే వాళ్లం. చాలా నష్టపోయాం. చాలాసార్లు వరదలు మా పంటలను నాశనం చేస్తుండేవి" అని ఆయన చెప్పారు.
ధీరేంద్ర పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు, ఆయనకు మఖానా సాగులో పనిచేస్తున్న శాస్త్రవేత్తతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో తన పొలంలో మఖానా పంటతో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
"దిగుబడి బాగా వచ్చింది. మొదటి ఏడాదే మాకు దాదాపు 36 వేల రూపాయల లాభం వచ్చింది" అని ఆయన చెప్పారు.
ఇప్పుడు ఆయన 17 ఎకరాల భూమిలో మఖానా సాగు చేస్తున్నారు.
"ఈ మఖానా సాగు చేస్తానని నేను కలలోనూ అనుకోలేదు. ఎందుకంటే ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. దీనిని ఎక్కువగా మత్స్యకారులు చేస్తారు" అని ఆయన చెప్పారు.
ఈ మార్పు మహిళలకు కూడా ఉపాధి అవకాశాలను సృష్టించింది.
"వ్యవసాయంలో అనిశ్చితి కారణంగా ఈ పనిని వదిలిపెట్టకుండా, వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించడమే నా లక్ష్యం" అని ధీరేంద్ర కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
విదేశాలకు ఎగుమతి
మధుబని మఖానా సంస్థ మఖానా సాగులో అగ్రగామిగా నిలవడంతో పాటు, మఖానాను ప్రాసెస్ చేసి, అనేక దేశాలకు ఎగుమతి చేస్తోంది.
మఖానా ప్రాసెసింగ్ కూడా చాలా శ్రమతో కూడుకున్న పని.
"ఇది మొరటు పద్ధతి. అపరిశుభ్రమైనది. ప్రమాదకరమైది కూడా. ఇందులో చాలా శ్రమ ఉంది. ఇది చాలా సమయం తీసుకుంటుంది. అనేక సార్లు గాయాలవుతుంటాయి" అని మధుబని మఖానా సంస్థ వ్యవస్థాపకుడు శంభు ప్రసాద్ చెప్పారు.
ఎన్‌ఆర్‌సీఎమ్ భాగస్వామ్యంతో, ఆయన కంపెనీ తామర గింజలను కాల్చి, వాటిని వేయించే యంత్రాన్ని అభివృద్ధి చేసింది.
"ఈ యంత్రం మఖానా నాణ్యతను పెంచడంలో మాకు సాయపడింది" అని శంభు ప్రసాద్ చెప్పారు.
బిహార్‌లోని మధుబనిలో వారి ప్లాంట్ ఉంది.

ఫొటో సోర్స్, Madhubani Makhana
"మఖానాకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ధరలు తగ్గాలంటే ఉత్పత్తి భారీగా పెరగాల్సిన అవసరం ఉంది’’ అని శంభు ప్రసాద్ చెప్పారు.
తన పొలంలో పని చేస్తున్న ధీరేంద్ర కుమార్, మఖానా సాగులో విప్లవాత్మక మార్పు వస్తుందని భావిస్తున్నారు.
"తామర గింజల సాగు బిహార్ ముఖచిత్రాన్ని మారుస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














