యాపిల్ ఐఫోన్ 16: ప్రత్యేకతలు ఏమిటి, కంపెనీ ఏం చెబుతోంది?

Iphone 16

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లివ్ మెక్‌మహోన్, లిల్లీ జమాలీ
    • హోదా, బీబీసీ న్యూస్

టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సరికొత్త ఐఫోన్ 16 స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది.

ఇటీవల యాపిల్ ఐఫోన్‌ల అమ్మకాలు పడిపోతుండటంతో సరికొత్త ఫీచర్లు, ఐడియాలతో ముందుకు రావాల్సిన ఒత్తిడిని కంపెనీ ఎదుర్కొంటోంది.

యాపిల్ తన తాజా స్మార్ట్‌‌ఫోన్‌‌‌ ఐఫోన్ 16కు కెమెరా బటన్‌ను డివైస్ బయట అమర్చింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో అత్యాధునిక సాంకేతికతను అందించే క్రమంలో ఈ మార్పు చేసినట్లు సంస్థ చెప్పింది.

యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ మాట్లాడుతూ ఈ తాజా నవీనకరణలు "స్మార్ట్‌ఫోన్ చేయగలిగే పనులకు ఉన్న హద్దులను చెరిపేస్తాయి’ అని చెప్పారు.

కానీ ఇతర బ్రాండ్లు ఇప్పటికే తమ హ్యాండ్‌సెట్‌‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ప్రవేశపెట్టడం వల్ల యాపిల్ గట్టిపోటీ ఎదుర్కొంటోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఐఫోన్ 16

యాపిల్ ఐఫోన్ 16తో పాటు ఇతర ఉత్పత్తులను ‘గ్లోటైమ్’ ఈవెంట్‌లో ఆవిష్కరించింది.

3 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ. 25,19,25,97,41,00,000 ) విలువైన ఈ కంపెనీ ఏఐ రంగంలో తన పట్టు జారిపోతుందేమోననే ఆందోళనను ఎదుర్కొంటోంది.

ఐఫోన్ విక్రయాలు యాపిల్ మొత్తం అమ్మకాలలో సుమారు సగం ఉంటాయి. కానీ ఇటీవల నెలల్లో వీటి విక్రయాలు మందగించాయి. అంతకుముందు ఏడాదితో పోల్చినప్పుడు.. జూన్ 29తో ముగిసిన గత 9 నెలల కాలంలో వీటి అమ్మకాలు 1 శాతం పడిపోయాయి.

ప్రత్యేకంగా ఏఐ, ‘యాపిల్ ఇంటెలిజెన్స్ టూల్స్’తో పనిచేసేలా తయారుచేసిన ఈ కొత్త ఫోన్లలో ఎక్కువకాలం మన్నే బ్యాటరీలు, పవర్‌ఫుల్ చిప్స్, మెరుగుపరిచిన ప్రైవసీ ఫీచర్లు ఉన్నాయని యాపిల్ చెప్పింది.

వాటిలో కొత్త ఎమోజీలను సృష్టించే సాధనాలు ఉన్నాయి. వినియోగదారులకు సహాయపడటానికి ఓపెన్ ఏఐ చాట్‌బాట్ చాట్‌ జీపీటీని ‘సిరి’లో పొందుపరిచింది.

యాపిల్ ఎయిర్‌పాడ్స్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, యాపిల్ కొత్త ఎయిర్‌పాడ్స్

యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్ హెడ్‌ఫోన్స్‌‌కు అప్‌డేట్స్‌ను యాపిల్ ప్రకటించింది.

ఇతరులతో నేరుగా మాట్లాడుతున్నప్పుడు హెడ్‌ఫోన్స్‌లో వాల్యూమ్ దానంతట అదే తగ్గిపోవడం.. తలను ఊపడం ద్వారా ఫోన్‌కాల్స్‌ను తిరస్కరించడం వంటి కొత్త ఫీచర్స్ తీసుకొచ్చారు.

తమ ఎయిర్‌ పాడ్స్ ప్రో వెర్షన్.. కొద్దిపాటి వినికిడి లోపం ఉన్నవారు స్పష్టంగా వినగలిగేలా ‘పర్సనల్ హియరింగ్ ఎయిడ్’లా పనిచేస్తుందని సంస్థ చెప్తోంది.

త్వరలోనే ఈ క్లినికల్ గ్రేడ్ డివైస్‌కు మార్కెటింగ్ అప్రూవల్ వస్తుందని ఆశిస్తున్నామని.. కొద్ది నెలల్లో అమెరికా, జర్మనీ, జపాన్ సహా 100కు పైగా దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది.

ఐఫోన్ 16 ప్లస్

ధర ఎంతంటే..

ఐఫోన్ 16 కొత్తశ్రేణి అమ్మకాలు ఈ నెలలోనే ప్రారంభమవుతాయి, ఐఫోన్ 16 ధరలు 799 అమెరికన్ డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి. భారత్‌లో రూ. 79,990 నుంచి ధరలు ప్రారంభమవుతాయి.

కానీ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అక్టోబర్ వరకు ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో అందుబాటులో ఉండవు, ఇది మొదట యూఎస్‌లో అందుబాటులోకి వచ్చిన తరువాత, ఇతర దేశాల్లో అందుబాటులోకి వస్తుంది.

మార్కెట్ రీసర్చ్ సంస్థ సీసీఎస్ ఇన్‌సైట్ చీఫ్ అనలిస్ట్ బెన్‌వుడ్ మాట్లాడుతూ కంపెనీ కొత్త కెమెరా కంట్రోల్‌ను చాలా మంది ఫ్యాన్సీ షట్టర్ బటన్ అనుకునే అవకాశం ఉందన్నారు.

అయితే ఇది విజువల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెర్చ్ సహా చాలా ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లను అందించిందని, యాపిల్ వినియోగదారుల మనసు గెలుచుకుంటుందని ఆయన చెప్పారు.

ఐఫోన్ 16 ప్రో

‘ఐఫోన్ 16లో యాపిల్ ఇంటెలిజెన్స్, కెమెరా ఫీచర్స్ వంటివి యాపిల్ లాయల్ కస్టమర్లను ఆకట్టుకుంటాయి, వారు కొత్త డివైస్‌లకు అప్‌గ్రేడ్‌ కావడానికి తోడ్పడతాయి. ఇప్పుడు ఈ ఫోన్ కొనడం యాపిల్ ఫోన్లను అభిమానించేవారికి పెట్టుబడిలాంటిదేనని, ఎందుకంటే రానున్న కాలంలో ఇది మరింత మెరుగుపడుతూనే ఉంటుంది’’ అని చెప్పారు.

తన డివైస్‌లలో ఫోటో ఎడిటింగ్, ట్రాన్స్‌లేషన్, వెబ్ బ్రౌజింగ్ కోసం జనరేటివ్ ఏఐ ఫీచర్లను తయారు చేయడంలో శాంసంగ్, గూగుల్ లాంటి ప్రత్యర్థుల కంటే యాపిల్ వెనుకబడి ఉంది.

ప్రత్యర్థుల కంటే యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫోన్లను ఆలస్యంగా విడుదల చేయడంపై గార్ట్‌నర్ విశ్లేకురాలు అన్నెట్ జిమ్మెర్‌మాన్ మాట్లాడుతూ, ఇది కంపెనీకి చాలా కీలకమని చెప్పారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్ల విషయంలో పూర్తిగా సిద్ధం కాకుండానే ఫోన్లను విడుదల చేస్తే అది యాపిల్ కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీయడంతోపాటు అమ్మకాలు పడిపోయేలా చేస్తుందని ఆమె హెచ్చరించారు.

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్

17 ఏళ్లలో 25 ఫోన్లు

ఇప్పటిదాకా యాపిల్ కంపెనీ ఐఫోన్లలో 25 రకాల వెర్షన్లను విడుదలచేసింది.

  • 2007లో మొదటి ఐఫోన్ విడుదలైంది
  • ఐఫోన్ 3జీ - 2008
  • ఐఫోన్ 3జీఎస్-2009
  • ఐఫోన్ 4 -2010
  • ఐఫోన్ 4ఎస్-2011
  • ఐఫోన్ 5 -2012
  • ఐఫోన్ 5ఎస్-2013
  • ఐఫోన్ 5సి-2013
  • ఐఫోన్స్ 6, 6+ -2014
  • ఐఫోన్స్ 6ఎస్, 6ఎస్+-2015
  • ఐఫోన్ ఎస్ఇ - 2016
  • ఐఫోన్స్ 7, 7+ - 2016
  • ఐపోన్స్ 8,8+ - 2017
  • ఐఫోన్ ఎక్స్- 2017
  • ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఎక్స్‌ఎస్ మాక్స్ -2018
  • ఐఫోన్ ఎక్స్‌ఆర్ - 2018
  • ఐఫోన్ 11 సిరీస్ - 2019
  • ఐఫోన్ ఎస్ఇ -2020
  • ఐఫోన్ 12 మిని - 2020
  • ఐఫోన్ 12 సిరీస్ - 2020
  • ఐఫోన్ 13 సిరీస్ -2021
  • ఐఫోన్ ఎస్ఇ (థర్డ్ జనరేషన్) - 2022
  • ఐఫోన్ 14 సిరీస్ - 2022
  • ఐఫోన్ 15 సిరీస్ -2023
  • ఐఫోన్ 16 సిరీస్ - 2024

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)