ఐఎన్ఎస్ అరిఘాత్: ఈ అణు జలాంతర్గామితో భారత్ చైనాతో పోటీపడగలదా?

ఫొటో సోర్స్, Getty Images
భారత రెండో అణు జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిఘాత్’ ఆగస్టు 29న నౌకాదళంలో చేరింది.
భారత మొదటి అణు జలాంతర్గామి పేరు ఐఎన్‌ఎస్ అరిహంత్. అది 2009లో నౌకాదళంలో చేరింది.
ఈ రెండింటి నుంచి దీర్ఘశ్రేణి న్యూక్లియర్ మిస్సైళ్లను భారత నౌకాదళం ఇప్పటికే పరీక్షించింది.
మూడో అణు జలాంతర్గామిని కూడా త్వరలో నౌకాదళంలో ప్రవేశపెట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది. తర్వాత మరో రెండింటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది.

భారత నౌకాదళ బలం ఎంత పెరిగింది?
భారత్‌లో న్యూక్లియర్ లాంగ్-రేంజ్ బాలిస్టిక్ సబ్‌మెరైన్లకు ‘అరిహంత్ క్లాస్’ అనే పేరు పెట్టారు.
అరిహంత్ అంటే సంసృతంలో ‘శత్రువులను నాశనం చేయడం’ అని అర్థం.
నౌకాదళంలో ఐఎన్ఎస్ అరిఘాత్‌ను ప్రవేశపెట్టడం చాలా ముఖ్యమని రక్షణ నిపుణులు రాహుల్ బేడీ బీబీసీతో చెప్పారు.
‘‘మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలోనే దీని కోసం ప్రణాళికలు రచించారు. చివరికి రష్యా సాయంతో దీన్ని సిద్ధం చేశారు. ఎందుకంటే, ఇందులో 83 మెగావాట్ల రియాక్టర్ ఉంటుంది. ఇంత చిన్న రియాక్టర్‌ను తయారు చేయడం అంత తేలిక కాదు’’ అని చెప్పారు.
అయితే, భారత నౌకాదళంలో ఈ క్లాస్‌లో రెండో జలాంతర్గామిని ప్రవేశపెట్టేందుకు చాలాకాలం పట్టిందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా, అణు, సంప్రదాయ జలాంతర్గాములను అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని ఆంగ్ల వార్తాపత్రిక ‘ది హిందూ’ తన కథనంలో పేర్కొంది.
మూడు దశల్లో అణు జలాంతర్గాములను తయారు చేసేందుకు భారత్ ప్లాన్ చేస్తోంది.
మరోవైపు, ఆరు కల్వరి క్లాస్ జలాంతర్గాములు కూడా ఇప్పటికే భారత నౌకాదళంలో చేరాయి.
ప్రాజెక్ట్-75 ఇండియా, ప్రాజెక్టు-76, ప్రాజెక్టు-75 ఆల్ఫా కింద మరో 15 కొత్త జలాంతర్గాములను భారత నేవీ పొందనుంది.
చైనాతో పోటీ..
గత కొన్నేళ్లుగా చైనా, పాకిస్తాన్‌లతో భారత్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
భారత్, చైనా సరిహద్దు వెంట పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు సాగుతున్నాయి. పాకిస్తాన్‌తో కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
2022 డిసెంబర్‌లో ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా బలగాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి.
అంతకుముందు 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులు ఘర్షణపడిన తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
‘‘భారత సైనిక సామర్థ్యాల ఆధునీకరణ అనేది సరిహద్దు దేశాలతో ఉండే ఘర్షణపూర్వక పరిస్థితులతో ముడిపడి ఉంది. అణ్వాయుధాలనేవి విమానం, క్షిపణి లేదా జలాంతర్గామి రూపంలో ఉండొచ్చు. అయితే, వీటిలో జలాంతర్గాములు చాలా ముఖ్యమైనవి. ఇవి సముద్రగర్భంలో కదులుతుంటాయి. వీటిని శత్రువులు కనుగొనడం చాలా కష్టం. ఇవి చాలా గోప్యంగా ఉంటాయి’’ అని రాహుల్ బేడీ వివరించారు.
అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లలో కూడా ఇలాంటి అణు జలాంతర్గాములు ఉన్నాయని ఆయన చెప్పారు.
ఈ విషయంలో భారత్ కంటే చైనా చాలా ముందంజలో ఉన్నప్పటికీ, భారత శక్తిని ఈ జలాంతర్గామి మరింత పెంచుతుందని అన్నారు.

ఫొటో సోర్స్, INDIAN NAVY
పెరుగుతున్న సామర్థ్యం
2012 నుంచి 2022 మధ్యకాలంలో చైనా తన నౌకాదళ సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంది.
అమెరికా నౌకాదళాన్ని సైతం చైనా అధిగమించింది.
2022 డిసెంబర్‌లో భారత నౌకాదళంలో పీ15బీ క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక చేరింది.
‘‘మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ఈ యుద్ధ నౌకను నిర్మించింది. రక్షణ పరికరాల తయారీలో దేశ సామర్థ్యానికి ఇది గొప్ప ఉదాహరణ. రాబోయే రోజుల్లో, కేవలం మన అవసరాలకు మాత్రమే కాక, ప్రపంచ అవసరాలకు కూడా యుద్ధ నౌకలను అభివృద్ధి చేస్తామనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
‘‘హిందూ మహాసముద్రంతో అనుసంధానమైన దేశాల్లో భారత్ ఒకటి. ఈ ప్రాంతంలో అతిముఖ్యమైన దేశం కావడంతో, భారత నౌకాదళ పాత్ర చాలా కీలకంగా మారింది’’ అని తెలిపారు.
2022 సెప్టెంబర్‌లో భారత్ అతిపెద్ద యుద్ధ నౌక ‘విక్రాంత్’ను తన ఫ్లీట్‌లో చేర్చుకుంది.
భారత్ వద్ద మరికొన్ని శక్తిమంతమైన జలాంతర్గాములు కూడా ఉన్నాయి. తన సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














