జీఎస్టీతో సామాన్యులపై భారం తగ్గిందా? నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై నిపుణులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శారద. వి
- హోదా, బీబీసీ ప్రతినిధి
జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలపై భారం తగ్గిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యానించారు.
రెవెన్యూ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో సీతారామన్.. ‘‘జీఎస్టీ సామాన్యులకు భారంగా మారిందనేది అవాస్తవం. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత పన్ను వసూలు చేస్తున్నాయో స్పష్టంగా చెప్పలేదు, అందుకే అప్పుడు మీకు భారంగా కనిపించలేదు" అని అన్నారు.
ఆర్థిక మంత్రి ఒక అధ్యయనాన్ని ఉదహరిస్తూ "60 శాతం వస్తువులు 5 శాతం జీఎస్టీ కేటగిరీ కిందకు వస్తాయి. కేవలం 3 శాతం వస్తువులపై మాత్రమే 28 శాతం పన్ను విధిస్తున్నాం" అని చెప్పారు.
అయితే, తమ వ్యాపారాలపై జీఎస్టీ ప్రతికూల ప్రభావం చూపుతోందని తిరుప్పూర్‌లోని వస్త్ర తయారీదారులు అంటున్నారు.
"పెద్ద కంపెనీ అయితే నూలు నుంచి క్లాత్ వరకు ప్రతిదీ ఒక్క దగ్గరే ఉత్పత్తి చేస్తుంది. కానీ మేం ప్రతి వస్తువూ విడిగా చేయాలి, కొంత పనిని బయటకు ఇవ్వాల్సి వస్తుంది. ఏం కొనాలన్నా ప్రతిసారీ జీఎస్టీ చెల్లించాలి. మాకు ఒక వస్తువు ఉత్పత్తికి అయ్యే ఖర్చు.. పెద్ద కంపెనీల ఖర్చు కంటే ఎక్కువ. దీంతో మా ఉత్పత్తులను అధిక ధరకు విక్రయించాల్సి వస్తోంది’’ అని పవర్ టేబుల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నందగోపాల్ చెప్పారు.


ఫొటో సోర్స్, Nandagopal
'పరోక్ష పన్నులను తగ్గించాలి'
"ప్రత్యక్ష పన్నులు ప్రగతిశీలమైనవి, ప్రత్యక్ష పన్ను వ్యక్తి ఎంత సంపాదిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ పరోక్ష పన్నులు ప్రతి ఒక్కరూ వారి ఆదాయంతో సంబంధం లేకుండా చెల్లించవలసి ఉంటుంది. పరోక్ష పన్నులను వీలైనంత తగ్గించుకోవాలి. కొన్ని నిత్యావసర వస్తువులకు పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలి’’ అని ఆర్థిక నిపుణుడు వి.నాగప్పన్ బీబీసీతో అన్నారు.
"అత్యవసర వైద్య ఖర్చుల కోసం ప్రజలు ఆరోగ్య బీమా తీసుకుంటారు. ఆ బీమాపై 18 శాతం జీఎస్టీ వసూలు చేయడం, ఎవరైనా మరణించిన తర్వాత కుటుంబాన్ని ఆదుకునే జీవిత బీమాపై కూడా పన్ను విధించడం సరైంది కాదు. అవసరమైన సేవలకు పన్ను మినహాయింపు ఉండాలి" అని అన్నారు.

ఫొటో సోర్స్, Nagappan
పారదర్శకత వచ్చింది
అయితే, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్నుల వసూళ్లు మరింత పారదర్శకంగా మారాయని నాగప్పన్ అభిప్రాయపడ్డారు.
"గతంలో రూ. 100 విలువైన వస్తువు బిల్లుపై రాష్ట్ర పన్ను మాత్రమే కనిపించేది. ఇప్పుడు, కేంద్ర, రాష్ట్ర పన్నులు విడివిడిగా పొందుపరిచారు. అందుకే, ఎక్కువ పన్ను ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు పన్నులు ఎగ్గొట్టడం ఎవరికైనా కష్టమే" అని ఆయన అన్నారు.
‘‘జీఎస్టీ అమల్లోకి వచ్చాక మనం ఎంత పన్ను చెల్లిస్తున్నామో చూస్తున్నాం. శానిటరీ నాప్‌కిన్‌లు, పాలు, పంచదార వంటి నిత్యావసర వస్తువులపై కూడా జీఎస్టీ విధిస్తున్నారు’’ అని చెన్నైకి చెందిన 34 ఏళ్ల ఎస్.వైష్ణవి అసంతృప్తి వ్యక్తంచేశారు.
కాగా, సంక్లిష్టమైన జీఎస్టీ ప్రక్రియ వల్ల పెద్ద కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తమిళనాడు చెన్నై హోటల్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరాజు అంటున్నారు.
"వేర్వేరు వస్తువులకు వేర్వేరు పన్ను రేట్లు ఉన్నాయి, ఇది గందరగోళం సృష్టిస్తుంది. ఉదాహరణకు చాక్లెట్ బర్ఫీని విక్రయిస్తే చాక్లెట్‌పై 18 శాతం, స్వీట్‌పై 5 శాతం పన్ను ఉంటుంది. ప్రతిదానికీ ప్రత్యేక డాక్యుమెంట్స్ రూపొందించాలి. ఏ చిన్న పొరపాటు ఉన్నా జరిమానా చెల్లించాల్సిందే. ట్యాక్స్ అకౌంట్ల నిర్వహణకు అదనపు సిబ్బందిని నియమించాల్సి వస్తోంది. పన్నులను జీఎస్టీ సులభతరం చేస్తుందని చెప్పారు. కానీ అది మరింత క్లిష్టతరం చేసింది. ఇవన్నీ కలసి చివరికి కస్టమర్‌పై భారం పడుతుంది’’ అని శ్రీనివాసరాజు అన్నారు.

ఫొటో సోర్స్, Muthurathinam
‘పరిశ్రమలు కుదేలు’
ఉత్పత్తి ప్రక్రియలో ప్రతి దశలోనూ జీఎస్టీ చెల్లించడం వ్యాపారాల నగదు ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందని తిరుప్పూర్ ఎగుమతి, తయారీదారుల అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.పి. ముత్తురత్నం అన్నారు.
"ముడి సరకుపై చెల్లించిన జీఎస్టీని తర్వాత క్లెయిమ్ చేసుకుంటున్నాం. కానీ, ఇది వ్యాపారానికి అంతరాయం కలిగిస్తుంది. కొన్ని పరిశ్రమలు ఉదయం వస్తువులను సరఫరా చేస్తాయి. సాయంత్రం వరకు చెల్లింపులు అందుకుంటాయి, కానీ, ఆ నగదు ప్రవాహం ఇపుడు తగ్గింది. మేం పెట్టుబడి పెట్టాల్సిన డబ్బులను జీఎస్టీ కోసం చెల్లిస్తున్నాం" అని ఆయన వివరించారు.
"జీఎస్టీ అమలులోకి రాకముందు మా అసోసియేషన్‌లో 1,500 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు, కేవలం 500 మంది మాత్రమే ఉన్నారు. చిన్న వ్యాపారాలు కూడా క్రెడిట్ స్కోర్లు సరిగా లేనందున బ్యాంకు రుణాలు పొందడానికి ఇబ్బందులు పడుతున్నాయి" అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
జీఎస్టీని సరళీకృతం చేయలేరా?
ఏడేళ్ల తర్వాత కూడా జీఎస్టీని ఎందుకు సరళీకృతం చేయలేదన్నదే కీలక ప్రశ్నగా మారిందని చెన్నై ఐఐటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ సురేష్ బాబు అన్నారు.
"జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు మొదట దానిని 'గుడ్ అండ్ సింపుల్ టాక్స్'గా ప్రచారం చేశారు. కానీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అది సాధ్యం కాలేదు. ఆర్థిక విషయాల్లో తమ పాత్ర తగ్గిపోతోందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్న మాట వాస్తవమే” అని ఆయన తెలిపారు.
రాష్ట్రాలు, ఉత్పత్తుల వారీగా జీఎస్టీకి సంబంధించిన డేటాను స్పష్టంగా అందుబాటులో ఉంచాలని సురేష్ బాబు సూచించారు. జీఎస్టీ ప్రభావంపై వివిధ అధ్యయనాలు నిర్వహించేందుకు ఈ పారదర్శకత అవసరమని ఆయన అన్నారు.
జీఎస్టీ సామాన్య ప్రజలపై భారాన్ని తగ్గించిందా? అని సురేష్ బాబును అడిగినప్పుడు "జీఎస్టీ అనేది కొన్ని వస్తువులపై తయారీదారులకు, మరికొన్ని వస్తువులపై వినియోగదారులకు అనుకూలంగా ఉంది. అయితే, వినియోగదారులకు అనుకూలంగా ఉండే వస్తువుల సంఖ్య పరిమితంగా ఉంది" అని బదులిచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














